యుధిష్ఠిర మహారాజా! భాద్రపద ఏకాదశి శ్రవణ నక్షత్రంతో యోగిస్తే దానిని విజయతిథి అంటారు. ఈ తిథి భక్తులకు వ్రతులకు విజయాన్ని చేకూర్చే తిథి. ఒకమారు దేవతలంతా బలిచక్రవర్తి చేతిలో పరాజయం పాలై విష్ణువు వద్దకు పోయి ఇలా మొఱ పెట్టుకున్నారు.
‘ప్రభో! దేవతలందరికీ శరణు, అభయమునిచ్చే ఆశ్రయం మీరే. ఆ దైత్యరాజు బలిని పారద్రోలి ఈ మహాపద నుండి మమ్మల్ని ఉద్ధరించండి. మాకు మరో దిక్కులేదు!
విష్ణువు ఇలా అన్నాడు:
‘దేవతలారా! మహానుభావుడైన బలి తపస్సు ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాడు. అతడు శాంతుడు, జితేంద్రియుడు, విశేషించినా భక్తుడు, పైగా సత్యప్రతిజ్ఞుడు. అయితే ఇప్పుడిప్పుడే అతనిలో అహంకారం పెరుగుతున్నది. దైత్యసాంగత్యం వల్ల లోకకంటకుడై పోతాడు. దానివల్ల అతని పుణ్యం నశిస్తుంది. దేవమాత అదితి నన్ను పుత్రునిగా పొందాలని తపస్సు ద్వారా నన్ను కోరింది. నేనామె కడుపున పుట్టి బలిని పదవినుండి పంపి వేసి అసుర సంహారం చేసి మీ రాజ్యాన్ని మీకిప్పిస్తాను. ప్రతీక్షించండి.’
దేవతలు విష్ణుదేవునికి జయజయజయ ధ్వానాలు చేస్తూ నిష్క్రమించారు. కొంత కాలానికి దేవమాత అదితి కడుపు పంటగా వామన రూపంలో విష్ణువతరించాడు. విష్ణువు భూమిపై పడగానే భూదేవి ఆనందంతో కదిలిపోయింది. ఆ కదలికలనూ, పై నుండి కురిసిన పుష్పవృష్టినీ గమనించి దైత్యులు భయపడ్డారు. దేవతలు ఆనందించారు. ఆరోజు శ్రవణ నక్షత్రయుక్త భాద్రపద ఏకాదశి. కశ్యపమహర్షి తన పుత్రుడైన వామనునికి జాతకర్మాది సంస్కారాలను స్వయంగా కావించాడు. తగిన వయసు రాగానే ఉపనయనం కూడా చేశాడు.
భగవంతుడైన వామనుడు దండము, మేఖల, యజ్ఞోపవీతం, కమండలువు, ఛత్రము ధరించి బలియొక్క యజ్ఞ స్థలానికి వెళ్ళాడు. బలి ఈ వటువును చూసి ముచ్చటపడి ‘బ్రాహ్మణోత్తమా! నీకేం కావాలి? నువ్వడగాలే గాని నారాజ్య ప్రాణాలతో సహా ఏదైనా దానమిచ్చేస్తా’ నన్నాడు. వామనుడు వినయంగా మూడడుగుల నేల చాలన్నాడు. బలి వెంటనే ‘అలాగే తీసుకో” అన్నాడు ఆశ్చర్యపోతూనే. అతని ఆశ్చర్యాన్ని మరింత ప్రగాఢం చేస్తూ పెరిగిపోసాగాడు వామనుడు. అలా పెరిగి పెరిగి ముల్లోకాలనూ ఆక్రమించి త్రివిక్రముడయ్యాడు. ఒక పాదంతో భూమి మొత్తాన్ని కొలిచాడు. రెండవ పాదాన్ని పైకెత్తగా అది నింగిని కొలుచుకుంటూ బ్రహ్మలోకాన్ని దాటిపోయింది. (బ్రహ్మ తన తండ్రి పాదాన్ని కడిగి ఆ నీటిని నెత్తిపై జల్లుకున్నాడు. ఆనాటి నుండే అది బ్రహ్మ కడిగిన పాదమైంది) మూడవ పాదాన్ని పెట్టడానికి బలిరాజ్యంలో చోటు మిగలలేదు. దేవతలాదిగా ఖేచరులంతా వామనమూర్తిని వేనోళ్ళకొనియాడారు. భగవత్ స్తుతిని పరవశించి మరీ చేశారు. భగవంతుడు బలితో ‘నీలోకాలన్నీ నాకిచ్చి ధన్యుడవై నావు. వదాన్యులలో నీ స్థానం సమున్నతం నీవు నీ అనుచరులతో సుతల లోకానికి పోయి ఆలోకాన్ని యథేచ్ఛగా పరిపాలించు. ఇప్పుడున్న ఇంద్రుని పదవీ కాలం అయిపోగానే నీవే దేవేంద్రుడవై ముల్లోకాలనూ పాలించగలవు’ అని ప్రసన్నత మీరగా చెప్పి త్రివిక్రముడు మరల వామనుడై చిన్నపిల్ల వానివలె అమ్మవద్దకు పోయాడు.
ఈ క్రియలన్నీ ఏకాదశినాడే జరిగాయి. అందుకే దేవతల కాతిథియందత్యంత ప్రీతి. వామనుడు పుట్టినరోజు ఒక విజయ ఏకాదశైతే, ఫాల్గున మాసంలో పుష్య నక్షత్ర యుక్తమైన ఏకాదశి మరొక విజయ ఏకాదశి. రెండిటికీ వ్రత విధానమొకటే. ఏకాదశి రోజున ఉపవాసము చేసి రాత్రి వామనదేవుని ప్రతిమను నిర్మింపజేసి పూజించాలి. ప్రతిమ సమీపంలోనే కుండిక, ఛత్రం, చరణపాదుక, కఱ్ఱ, యజ్ఞోపవీతం, కమండలువు, మృగచర్మాలను స్థాపించాలి. తరువాత విధ్యుక్తంగా వాటినీ పూజించాలి. క్రింది మంత్రాలతో విష్ణుదేవుని ఇలా ప్రార్థించాలి.
అనేక కర్మనిర్బంధ ధ్వంసినం జలశాయినం।
నతోఽస్మిమథురావాసం మాధవం మధుసూదనం॥
నమోవామనరూపాయ నమస్తేఽస్తు త్రివిక్రమః
నమస్తే మణిబంధాయ వాసుదేవనమోఽస్తుతే॥
నమోనమస్తే గోవింద వామనేశ త్రివిక్రమ।
అఘౌఘ సంక్షయం కృత్వా సర్వకామ ప్రదోభవ॥ (ఉత్తరపర్వం 76/48-51)
అనంతరం భగవానుని శయనింపజేసి వ్రతి మాత్రం జాగారం చేయాలి. గీత వాద్యస్తుత్యాదులు నేర్పాటు చేయాలి. ప్రాతర్వేళనే ఆ ప్రతిమను పూజించి మంత్ర పూర్వకంగా దానిని బ్రాహ్మణులకు నివేదించాలి. వారికి భోజనాలు పెట్టి ప్రతి మౌనంగా భోంచెయ్యాలి. ఈ వ్రతాన్ని శ్రద్ధా భక్తులతో చేసినవారు ఒక మన్వంతర పర్యంతం విష్ణులోకంలో వసిస్తారు. మరల భూమిపై చక్రవర్తి, మహాదానియగు రాజుగా జన్మిస్తారు. దీర్ఘాయువులు, నిరోగులు, పుత్రవంతులై జీవిస్తారు.