భవిష్య పురాణము

21 - లలితా తృతీయ వ్రతవిధి

ఆ తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజు అభ్యర్ధన మేరకు ద్వాదశ మాస వ్రతాలను చెప్పసాగాడు. ఇలా:

“పాండవాగ్రజా! ఒకప్పుడు భగవంతుడైన సదాశివుడు కైలాస పర్వతంపై దేవతలు, గంధర్వ, యక్ష, కిన్నర, తపోధన, నాగాదులచే ప్రత్యక్ష పూజలనందుకుంటూ పరివేష్టించబడి యుండగా జగన్మాత పార్వతి వినయపూర్వకంగా ఆస్వామిని ఇలా ప్రార్థించింది:

‘నారీజనులకు సౌభాగ్య, ధన, సుఖ, పుత్ర, రూప, లక్ష్మీ, ఆరోగ్య, దీర్ఘాయువులను ప్రాప్తింప జేయు తృతీయ తిథి వ్రతమొకటున్నదని విన్నాను. కాని, వివరాలు తెలియలేదు. మీరు సర్వజ్ఞులు. నాకా వ్రతవిధిని వినిపించండి.’

పార్వతి అడుగుతున్నది తనకోసం కాదనీ, ఆమెకు లేనివేవీ లేవనీ, ఐనా లోక కల్యాణార్థమై అడుగుతున్నదనీ శివునికి తెలుసు ఇలా చెప్పసాగాడు:

‘ఉమా! వ్రతం చేయదలచుకున్న స్త్రీ ముందు మనస్సును ద్వేషరహితంగా వుంచుకొని మాఘ శుద్ధ తదియనాడు తెల్లవారుజామునే లేచి స్నానాదులను పూర్తి చేసుకొని వ్రతనియమాలను పాటిస్తానని సంకల్పించుకోవాలి. మధ్యాహ్నం బిల్వ, ఉసిరికలను కలిపిన పవిత్ర జలంతో స్నానంచేసి శుద్ధ వస్త్రాలను ధరించి గంధ, దీప, కర్పూర, కుంకుమలతో నిన్ను అంటే పార్వతీ దేవిని పూజించి వివిధ నైవేద్యాలను సమర్పించాలి. తరువాత నీ ఈశానీ నామాన్ని ధ్యానిస్తూ రాగిచెంబులో వీలైనంత బంగారాన్నీ, అక్షతల్నీ, నీటినీ వుంచి తనకు సౌభాగ్యాదులు కలగాలి గాక అని పదేపదే కోరుకుంటూ ఆ చెంబుని బ్రాహ్మణునికి దానమివ్వాలి. బ్రాహ్మణుడు ఆ చెంబులోని నీళ్ళను మంత్రించి ఆ తలపై అభిషేకిస్తున్నట్లుగా పోసి ఆశీర్వదించాలి. అనంతరం ఆమె కుశోదకంతో ఆచమనం చేసి రాత్రి ఉమాదేవినే ధ్యానిస్తూ నేలపై కుశదర్భలను పఱచుకొని పడుకోవాలి. రెండవరోజు పెందలకడనే లేచి స్నానాదులను గానిచ్చి విధిపూర్వకంగా భగవతిని పూజించి యథాశక్తి బ్రాహ్మణులకు భోజనాలను పెట్టించి తాను కూడా మౌనంగా భోంచేయాలి.

ఈ విధంగా భగవతి పార్వతీదేవిని ప్రథమమాసంలో ఈశానీ నామంతో, ద్వితీయ మాసంలో పార్వతీనామంతో, తృతీయ మాసంలో శంకర ప్రియానామంతో, చతుర్థమాసంలో భవానీ నామంతో, పంచమ మాసంలో స్కంద మాతానామంతో, ఆరవనెలలో దక్ష దుహితానామంతో, ఏడవమాసంలో మైనాకీ నామంతో, ఎనిమిదవ మాసంలో కాత్యాయనీ నామంతో, తొమ్మిదవ మాసంలో హిమాద్రిజా నామంతో, పదవనెలలో సౌభాగ్యదాయినీ నామంతో, పదకొండవ నెలలో ఉమానామంతో, చివరి నెలలో గౌరీనామంతో పూజించాలి. పన్నెండు మాసాలలోనూ పూజానంతరం క్రమంగా కుశోదకం, పాలు, నెయ్యి, గోమూత్రం, గోమయం, పండు, వేపాకు, కంటకారీ గోశృంగోదకం, పెరుగు, పంచగవ్యం, కూరముక్కలను నోట్లో వేసుకోవాలి.

ఈవిధంగా పన్నెండు మాసాలలోనూ పూజ చేస్తూ బ్రాహ్మణులకు శక్తి కొలది దానాలిస్తుండాలి. వ్రత సమాప్తిలో ఒక వేదపాఠియైన బ్రాహ్మణుని సతీసమేతంగా ఆహ్వానించి వారిలో శివపార్వతులను ఆరోపించుకొని గంధ పుష్పాదులతో పూజించి, వారికెంతో భక్తి భావనతో భోజనాలను పెట్టాలి. ఆ తరువాత ఆ విప్రదంపతులను ఆ భూషణ, వస్త్రాలంకారాలతో సంతుష్టిపఱచాలి. బ్రాహ్మణునికి రెండు తెల్లటి వస్త్రాలనూ, ఆతని పత్నికి రెండు ఎఱ్ఱచీరలను ఇవ్వాలి. ఈ రకంగా నియమ నిష్ఠలతో భక్తితో ఈ వ్రతాన్ని చేసే స్త్రీ తన పతితో సహా దివ్యలోకాలకు చేరుకొని అక్కడ పతితోబాటు పదివేల సంవత్సరాలపాటు ఉత్తమ భోగాలననుభవిస్తుంది. మరల మానవలోకంలో పుట్టవలసి వచ్చినప్పుడు ఆ దంపతులు విడిపోరు. పైగా ఆరోగ్యం, ధనం, సంతానం వంటి ఉత్తమ భాగ్యాలన్నీ వారికి అబ్బుతాయి. ఈ వ్రతాన్నాచరించే స్త్రీకి తన పతి సదా ఆధీనుడై వుంటాడు. తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తుంటాడు. మరుజన్మలో వారు రాణిగా రాజుగా పుడతారు.”