భవిష్య పురాణము

10 - 15 - పతివ్రతల కర్తవ్యాలు - ధర్మము యొక్క ఉత్తమ వ్యవహారం - అవశ్య కర్తవ్యం

సుమంతుడు బ్రహ్మ ఉపదేశాల్ని ఇంకా ఇలా వివరిస్తున్నాడు. “మునీశ్వరులారా! గృహస్థ ధర్మానికి మూలం పతివ్రతయగు గృహిణి. ఆమె పతిని ఈ విధంగా ఆరాధిస్తుంది.

ఆరాధ్యానాంహి సర్వేషాం

   అయమారాధనే విధిః

   చిత్త జ్ఞానానువృత్తి శ్చ

   హితైషిత్వంచ సర్వదా (బ్రహ్మ 10/1)

పతి చిత్తవృత్తిని కూలంకషంగా తెలుసుకుంటుంది. అతడు ఎపుడేది కోరుకుంటాడో దానిని అతడు అడగడానికి ముందే సమకూర్చి పెడుతుంది. సర్వకాల సర్వావస్థలలోనూ అతని మేలునే కోరుతూ తన ప్రతిపనీ అటువైపే మళ్ళేటట్టు చూస్తుంది. చేస్తుంది.

భర్త యొక్క తల్లిదండ్రులనూ, అక్క చెల్లెళ్ళనూ, అన్ననూ, పినతండ్రినీ, గురువునీ, అతని తరపు వృద్ధస్త్రీలను గౌరవించడం, ఆదరించడం పత్నియొక్క ధర్మం. తన కన్న చిన్నవారైన భర్తృ వర్గీయులతో స్నేహంగా వుంటూనే పనులు చేయించుకోవాలి. లేకుంటే వారు సోమరులౌతారు. పతి యొక్క బంధువుల మధ్యలో అతడు కూర్చుని యున్నపుడు పత్నియొక్క మాటలు, చేతలు అన్నీ అతనికి అనుకూలంగానే సాగాలి. ఈ సంగతి అందరికి తెలియాలి. ఈ శీలమే ప్రశస్తమని జనశ్రుతి. వరసైన వారితో ముఖ్యంగా పురుషులతో ఏకాంతంలో హాస్యాలాడకూడదు. పరపురుషునితో ఏకాంతంగా అసలు ఉండనే కూడదు. పరపురుషుల చేతిలో ఏ వస్తువునూ ఉంచరాదు. వారి చేతినుండి చేతితో అందుకొనరాదు. తలుపులు తెరచి వాకిట నిలబడుట గాని, కూర్చొనుట గాని, రాజమార్గం వైపు తదేకంగా చూచుట కాని నిషిద్ధములు. అపరిచితుల ఇళ్ళలోనికి గాని, ఉద్యాన వనాలలోకి గాని వెళ్ళరాదు. భర్త అక్కడే వున్నా కూడా పరపురుషుల మధ్య కూర్చొనరాదు. లోనికి పోయి గట్టిగా నవ్వుట, మాట్లాడుట వంటివి చేయరాదు. దుష్టస్త్రీ, భిక్షుకి, మంత్రగత్తె, తంత్రగత్తె - ఇలాంటి వారితో మాట్లాడాలనే కోరిక, వారి మండలిలో ఉండాలనే ఇచ్ఛలను పూర్తిగా త్యజించాలి. తన సుఖం కన్న భర్త వంశగౌరవము, అత్తవారింటి ప్రతిష్ఠయే పతివ్రతకి ముఖ్యము. అందుకే ఆమె చాలా త్యాగాలు చేయవలసి వుంటుంది. తన కులమర్యాద కోసం చిన్ననాటి స్నేహాలను కూడా వదులు కోవలసి యుంటుంది.

ఉత్తమ స్త్రీ తన యొక్క భర్తను మనసా, వాచా, కర్మణా దైవంగా చూసుకుంటుంది. అతడు చేసే దైవ, పితృకార్యాలలోనూ, అతిథి - అభ్యాగత స్వాగత సత్కారాలలోనూ ఎవరినీ నియోగించకుండా తానే స్వయంగా పనిచేసేది పతివ్రత. ఆమెకు పతి మిత్రులే మిత్రులు. పతి శత్రువులే శత్రువులు కావాలి. అయితే మిత్రులలో అధర్మపరులు, అనర్థకారకులు వుంటే జాగ్రత్తగా ముళ్ళపొద మీద పడ్డ చీరను చిరగకుండా లాగినట్టుగా భర్తను వారి నుండి రక్షించుకోవాలి. తానున్న ఇల్లు, తన శరీరం ఎల్లపుడూ ప్రసన్నంగా పరిశుభ్రంగా మంచుకడిగిన మల్లె పూవులాగుండే లాగ సర్దుకోవడం పతివ్రత లక్షణం.

రోజులోని మూడు కాలాల్లోనూ పూజకు కావలసిన సామగ్రిని సిద్ధంగా, శుభ్రంగా వుంచాలి. ఇంటిని మూడుపూటలా తుడిపించి, అవసరమైనచో కడిగించి వుంచాలి. ఉద్యానంలో మొక్కలకీ, పెరట్లో కూరలకీ, పొలంలో పంటకీ అవసరమైన విత్తనాలనీ ఎరువునీ తన అధీనంలో వుంచుకొని అవసరం మేరకు పనివారికిస్తుండాలి. లోహపాత్రలనుండి చెక్క వస్తువులదాకా అన్నిటినీ అవసరం మేరకు తెప్పించి గుర్తుగా ఇంటిలో సర్ది వుంచాలి. సంసారానికి కావలసిన వస్తువులన్నీ ఇంట్లో వుండేలా చూసుకోవాలి కాని ఏదీ కుళ్ళుట, పాడగుట, బూజుపట్టుట జరుగరాదు. ఏ వస్తువు, వంటసరుకు, ఎక్కడుందో చిటెకె వేసేలోగా గుర్తు రావాలి. అంతేకాని వెతుకులాట సరికాదు.

పశుసంపదను మరీ జాగ్రత్తగా చూసుకోవాలి. జంతువులన్నీ ఆమె కనిపించగానే పలకరించే లాగుండాలి. గోశాలలోనూ, పొలాలలోను, ఇంటిలోనూ, పనిచేసేవారు తన భర్తపట్ల భక్తి కలిగియుండేలాగా ఇల్లాలు ప్రవర్తించాలి. వారికి అన్న వస్త్రాలకు ఎటువంటి లోపమూ రానీయరాదు. ఆత్మీయంగా చూస్తునే తగినంత దూరంలో వుంచాలి.

ఇంటికి మూలం స్త్రీ అయితే గృహస్థాశ్రమానికే మూలం అన్నం. దానిని వృథా చేయడం పాపంతో సమానం. స్త్రీ మితవ్యయి అయివుండాలి. అన్నాన్ని గౌరవంగా చూడాలి. అనాదరణ పాపమే. ఇంటిలోని ప్రతి కార్యంపై స్త్రీ పురుషులు ఒకే మాటమీద వుండాలి. ముందుగా చర్చించుకొని ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి దానినే అమలు చెయ్యాలి.

ప్రతి గృహస్థుకీ వేల కొద్దీ కార్యాలలో స్త్రీ యొక్క అవసరం తప్పనిసరి. ఆమె బుద్ధిమతీ, సుశీలా ఐతే ఆతని గృహం, స్వర్గమే అవుతుంది. అతడూ మహాపురుషుడవుతాడు. స్త్రీ సరైనది కాకపోతే ఆ పురుషుని దుఃఖానికీ, కష్టాలకూ అంతముండదు. కాబట్టి పురుషుడు స్త్రీ యొక్క యోగ్యతాయోగ్యతలను క్షుణ్ణంగా పరిశీలించి ఆమెను గృహకార్యాలలో వినియోగించాలి.

పతివ్రతా ధర్మమంటే ఇరవై నాలుగు గంటలూ పతితోనే కూర్చోవాలనీ, ఆయన పనులు మాత్రమే చేయాలనీ కాదు. గృహాన్ని చూసుకోవాలి. ఆ విధానంలో సమాజం ఉద్ధరించబడుతుంది. విజయవంతమైన సమాజానికి వెన్నెముక స్త్రీ. అందుకే పతివ్రత దినచర్య ఈ విధంగా నిర్దేశించబడింది. ఆమె ఇంటిలో అందరి కన్న ముందే ప్రాతఃకాలమే మేల్కోవాలి. తన పనులన్నిటిలో ఇష్టపూర్వకంగా నిమగ్నం కావాలి. రాత్రి అందరి భోజనాలూ అయిన తరువాత అంతా నిద్రించాక నిద్రపోవాలి. భర్త, మామగారు, ఇంటిలో లేనపుడామె వెలుపలి వాకిలివైపు రారాదు. భర్త సమక్షంలోనే నౌకర్లందరినీ పనిలోకి పంపడం కాని, విధించడం గానీ, మందలించడం గానీ, నెరవేర్చాలి. రాత్రి మంచి వస్త్రాలంకారణ చేసుకొనియున్ననూ, తెల్లవారి భర్త లేవకముందే సామాన్య వస్త్రాలతో అలంకారాలతో సిద్ధమై ఇంటిపనులలోకి వెళ్ళాలి. అతడు లేచిన వెంటనే ముందుగా అతనికి కావలసిన పనులన్నీ చూడాలి. గృహంలోని నిత్య, దైవకార్యాలన్నీ సమయాను సారంగా సిద్ధం చెయ్యాలి. పొయ్యినీ వంటింటినీ ఎల్లవేళలా శుభ్రంగా వుంచాలి. పాత్రలన్నీ ఎప్పటికప్పుడు తోమబడి, కడుగబడి, తుడవబడి ఉండేలా చూసుకోవాలి. వంటగది మరీ గుప్తంగా వుండరాదు. అలాగని బాహాటంగానూ వుండకూడదు. పాలు, పెరుగు, వెన్న మున్నగు వాటిని కడిగిన పాత్రలలో ఉంచి, తలకి తగలకుండా చేతికి అందేటట్లు ఉన్న ఉట్టిలలో నుంచి తెలివిగా వున్నంతకాలమూ ఓకంట కనిపెడుతూనే వుండాలి.

భర్తకి భోజనం పూర్తిగా భార్య అధీనం. అతనికి ఏ రుచులు ఎక్కువగా కావాలో, ఏ పదార్థాలపై మక్కువ ఎక్కువో, ఆరోగ్యానికి ఏవి అవసరమో, వాటిని వండడం, పెట్టడం, వడ్డించడం భార్యయే తప్పనిసరిగా చేయాలి. అదీ ప్రీతిపూర్వకంగా నిర్వర్తించాలి. వంట వారెంతమంది వున్నా వంట జరుగుతున్నంత కాలమూ ఇల్లాలు వంటగదిలో వుండాలి. వంటగదిలోకి ఎవరు పడితే వారు ప్రవేశించకూడదనే శాసనాన్ని చేసి పాటింపజేయాలి. వంట పూర్తయినాక అన్ని పాత్రలపై మూతలు పెట్టి తాను బయటకు వచ్చి చెమటను దుమ్మును బాగా కడుగుకొని తగుమాత్రము అలంకృతయై సరియైన సమయంలో భర్తకు స్వయంగా వడ్డించాలి.

(సవతులతో ఎలా ప్రవర్తించాలో కూడా భవిష్యపురాణకారులు చెప్పారు కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దానిని పరిహరించవలసి వస్తోంది.)

ఈ విధంగా స్త్రీ తన పతియొక్క వాంఛితాలన్నిటినీ తీర్చాలి. అవసరమైన చోట తన సుఖాలను ఇష్టాలనూ కూడా వదలుకోవాలి. అప్పుడే స్త్రీకి స్వర్గప్రాప్తి వుంటుంది. ఎందుకంటే స్వర్గాన్నో మోక్షాన్నో ఇచ్చేది దైవం. పతివ్రతకు పతియే దైవం. అన్ని వర్ణాలకూ దైవం బ్రాహ్మణత్వమైతే, అందరు ప్రజలకూ దైవం రాజు.

అందానికీ దాంపత్యానికీ సంబంధం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. భర్త మనసును గెలుచుకోలేని అందగత్తెలూ వున్నారు. పతిని తమ ప్రేమలో తలమునకలుగా పడేసుకోగలిగిన సామాన్యరూపిణులూ, కురూపిగణమూ వున్నారు. పతియొక్క మనసెరిగి ప్రవర్తించిన స్త్రీకి అపజయముండదు.

భర్త సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి ఇల్లంతా పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా వుండేలా చూడడం భార్య ధర్మం. అతనికోసం తాను కూడా తేటగా వుండి, రాగానే కూర్చోవడానికి చక్కని ఆసనాన్ని ఏర్పాటుచేసి, అతడు రాగానే స్వయంగా అతని కాళ్ళు కడిగి ఆసనంలో కూర్చుండజేసి విసనకర్రతో మెల్లగా వీస్తూ అతనికేం కావాలో ఆజ్ఞ ఇచ్చేదాకా వేచి వుండాలి. ఈ పనుల్లో ఏ ఒక్కదానినీ దాసి చేత చేయించరాదు.

తన బంధువులు, పతి బంధువులు వచ్చినపుడు స్వాగత సత్కారాలు బాగానే చేయాలి గాని వారిలో తన పతికి నచ్చనివారిని ఎక్కువగా పట్టుకు పడరాదు. స్త్రీకి వివాహం తరువాత తన బంధువుల కంటే పతియొక్క బంధువులే దగ్గరివారవుతారు. ఎందుకంటే స్త్రీ నుండి గాని ఆమె బంధువులనుండి గాని ఆమె పతి ఏమీ ఆశించడు. వారిచ్చినా ఆమె పుచ్చుకోవడం అతని కిష్టముండదు. కాబట్టి ఆమె ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వుండాలి. అత్తవారి వైపు నుండి నిత్యమూ ఏదో ఒకటి ఆశించే వారుంటారు కాని అది పద్ధతి కాదు. కూతురి అత్తవారివైపు నుండి విత్తాదులను ఆశించడం పరమ నీచంగా భావించబడుతుంది. కాబట్టి స్త్రీ యొక్క బంధువులు మిత్రతను, ప్రీతిని పెంచుకోవడానికే తమ బంధుత్వాన్ని ఉపయోగించుకోవాలి. పత్ని కూడా భర్త వింటుండగా తన పుట్టింటివారిని పదే పదే పొగడకూడదు. కానీ తన పుట్టింటి పురుషులకు తన భర్తతో స్నేహం వర్ధిల్లడానికి వీలైనంత వరకూ దోహదపడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు గాని తనవారికి గాని లేనివి ఉన్నట్టు చెప్పరాదు. మిథ్యాప్రశంస తప్పు.

ఏ స్త్రీ ఈ విధమైన సద్వృత్తాన్ని బాగా తెలుసుకుని వ్యవహరిస్తుందో ఆమె పతికీ, ఆతని బంధు, బాంధవులకూ మాన్యురాలవుతుంది. ఇంతగా అత్యంత మాన్యురాలైన స్త్రీ కూడా లోకాపవాద భీతితో జాగ్రత్తగా ప్రవర్తించాలి. సీతా చరితాన్ని సదా గుర్తుంచు - అనేది కోవాలి. పరేంగితజ్ఞానం - అనగా ఇతరుల మనసులో నున్నది తెలుసుకోవడం - స్త్రీకి సహజంగా పుట్టుకతోనే వస్తుంది. ఆ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ పోతే కష్టాలుండవు. కళంకం ఆపాదించబడే అవకాశమూ ఉండదు. ఉత్తమాచరణ గల స్త్రీ కూడా దుస్సాంగత్యం చేసినా, యథేచ్ఛగా అమ్మలక్కల ఇళ్ళకే ఎక్కువ మార్లు వెళ్ళి వస్తున్నా, కళంకితురాలయ్యే అవకాశముంది. ఈ కళంకం ఇక్కడితో ఆగదు. ఇటు పతినీ, అతని కుటుంబాన్నీ అటు తండ్రినీ, అతని కుటుంబాన్నీ కూడా బాధపెడుతుంది. కాబట్టి స్త్రీ జాగ్రత్తగా వుండాలి. ధర్మార్థకామాలనే త్రివర్గాలు పురుషునికి స్త్రీ ద్వారానే ప్రాప్తిస్తాయి. పురుషునికి ఆ ప్రాప్తిని కలిగించే ఆడది స్వయంగా పునీతురాలై అంతంలో మోక్షాన్ని పొందుతుంది. అలాకాకుండా విపరీత దుష్కర్మాచరణలో జీవించే స్త్రీ నరకంలో కూలుతుంది. ఇంకొక గొప్ప విశేషమేమంటే శీలమునే ప్రాణంగా భావించి త్రివర్గాలను పతికి దక్కించిన ఇల్లాలు అంతకుముందు నరకంలో కూల్చబడియున్న తమ రెండు వంశాల పితృగణాలను కూడా ఉద్ధరించగలదు.

పత్యనుకూలత, లోకాచారము స్త్రీకి రత్నం కంటే శాశ్వత శ్రేష్ఠతా ప్రకాశాల నీయగలవు.

భర్తృ చిత్తానుకూలత్వం యాసాం శీలమవిచ్యుతం ।

తాసాం రత్న సువర్ణాది భార ఏవ న మండనం

లోకజ్ఞానే పరాకోటిః పత్యైభక్తిశ్చ శాశ్వతీ

శుద్ధాన్వయానాం నారీణాం విద్యాదేతత్కులవ్రతం (బ్రహ్మ. 13/64 - 65)

పతి పరదేశం పనివశాన యేగినపుడు పత్ని తనకు అతనికి మంగళప్రదమైన సౌభాగ్య సూత్రము, ఇంకో రెండు మూడు స్వల్పభరణాలు మాత్రమే ధరించి వీలైనంత తక్కువ అలంకారాలతో వుండాలి. పతి ప్రారంభించిన పనులను ఇంట్లో కొనసాగిస్తుండాలి. అత్తగారి వద్దనే నిద్రించాలి. ఎక్కువ ఖర్చులు పెట్టివేయకుండా, వ్రతాలు, ఉపవాసాలు చేస్తుండాలి. దైవజ్ఞుల ద్వారా ఇతర శ్రేష్ఠజనుల ద్వారా పతి క్షేమాన్ని వింటూ వుండాలి. అతడు పరదేశంలో క్షేమంగా ఉండాలనీ, అనుకున్న సమయం కంటే ముందే పని పూర్తిచేసుకుని వేగంగా ఆనందంగా ఇంటికి రావాలని అభిలషిస్తూ నిత్యమూ దేవతలను పూజిస్తుండాలి. తన బంధువుల గృహాలకు ఆ సమయంలో పోరాదు. మరీ తప్పనిసరిగా పోవలసిన సందర్భమేర్పడితే అత్తవారింట్లోని పెద్దలందరి ఆజ్ఞనూ తీసుకొని, పతికి అత్యంత విశ్వాసపాత్రులైన వారిని తోడుగా గైకొని వెళ్ళాలి. వీలైనంత వేగంగా వెనక్కి వచ్చెయ్యాలి. ప్రవాసం నుండి మరలివచ్చిన పతికి ప్రసన్నత నిండిన మనస్సుతో, సుందర వస్త్రభూషణాలంకృతయై స్వాగతం చెప్పి ఆత్మకింపైన భోజనాన్ని వడ్డించాలి. పతిని క్షేమంగా వెనక్కి రప్పించిన దేవతలందరికీ కృతజ్ఞతాపూర్వకంగా పూజలు చెయ్యాలి. దీనివల్ల పతిదేవుడు కూడా సంప్రీతుడవుతాడు.

ఈ విధంగా స్త్రీ మనస్సుచే వాక్కుతో కర్మల ద్వారా, నిరంతరం పతిహితాన్నే కోరుతూ అతనికి అనుకూలవతిగా మనుటయే జీవితాశయంగా ప్రవర్తించాలి. భర్త తన పిడికిటిలో ధనమైనా, ఆస్తి తన అంకమందలి మందసమైనా అహంకరించరాదు. వినమ్రంగానే వుండాలి. పతికి సేవచేస్తూ, అతని పనులన్నిటినీ, యథాశక్తి సానుకూల పరుస్తూ, పూజ్యజనులను నిత్యం ఆదరిస్తూ, అభివృద్ధికై అన్నివిధాల ప్రయత్నిస్తూ, సర్వవేళలా తన శీలసౌభాగ్యాలను కాపాడుకుంటూ వుండే స్త్రీకి ఈ లోకంలో, పరలోకంలో ఉత్తమ సుఖాలూ, ఉత్తమ కీర్తి లభిస్తాయి.

దుర్భాగ - అనగా అతి క్రోధనుడై, తనను నిరాదరణ చేయు పతిగల అతివ - వ్రత ఉపవాసాది క్రియలతో దైవ సహాయాన్ని పొందుతూ, మానవ ప్రయత్నంగా అత్తవారింటిలోని కర్తవ్యాలనూ, పతిదేవుని పనులతో సహా, చాకచక్యంగా నైపుణ్యంతో నెరవేరుస్తూ వుంటే కొన్నాళ్ళకు ఇంటిలో అంతా, చివరికి పతీ ఆమెను గుర్తిస్తారు. ప్రేమిస్తారు. గౌరవిస్తారు.

ఈ విధంగా బ్రహ్మదేవుడు పతివ్రతా ధర్మాలను మునీశ్వరులకు వివరించాడు. అని సుమంతుడు శతానీకునికి బోధించాడు.