భవిష్య పురాణము

94, 95 వఱకు - ఒక వైశ్య, బ్రాహ్మణ కథ

దిండీ! ఈ సందర్భంలో నొకప్పుడు పితామహుడైన పరమాత్మ కార్తికేయునకు చెప్పిన మాటలు వినిపిస్తాను.

కార్తికేయుడిలా అన్నాడు. “పితామహా! ఇవాళ నేను సూర్యదేవుని దర్శనానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి పూజచేసి పరమభక్తి శ్రద్ధలతో తలవంచి ప్రణామం చేసి అక్కడే చాలాసేపు కూర్చున్నాను. అప్పుడక్కడొక విచిత్రము చూశాను. స్వర్ణ నిర్మితమై చిన్న చిన్న గంటలతో శ్రేష్ఠ వైఢూర్యాది మణులతో, ముత్యాలతో పొదగబడిన విచిత్రవిమానంలో వస్తున్న ఒక పురుషుని చూడగానే దివాకర దేవుడు సంభ్రమంగా ఆసనం నుండి లేచి నిలబడి పోయారు. ఎదురుగా వచ్చిన ఆ పురుషుని తన కుడిచేతితో చుట్టి శిరస్సును మూర్కొని సమీపంలో కూర్చోబెట్టుకొని ఇలా అన్నారు.

‘మీకు నా స్వాగతము. మీరు నాకెంతో ఆనందాన్నిచ్చారు. మీకు అందరిపై విశేషమైన ప్రేమ. మళ్ళా మహాప్రళయం వచ్చేదాకా మీరు నాతోనే వుంటారు. ఆ తరువాత బ్రహ్మస్థానాన్ని పొందగలరు. ‘ ఈలోగా మరొక శ్రేష్ఠవిమానంలో మరొక పురుషుడు దిగాడు. అతనిని కూడా భగవానులు తొలిపురుషుని ఆదరించినట్లే గొప్పగా ఆదరించారు. ఇంత ఆశ్చర్యకరమైన దృశాన్ని చూసి తట్టుకోలేనంత కుతూహలం కలిగిన నేను భగవానుని ఇలా అడిగేశాను. వీరిద్దరూ మహాపురుషులే కావొచ్చుకాని మానవుల వలె గోచరిస్తున్నారు. బ్రహ్మ విష్ణు మహేశుల చేతనే పూజలందెడు మీరు వీరి నింతగా సంభావించి సంపూజించుట నన్ను గొప్ప ఆశ్చర్యంలో ముంచేస్తున్నది. మీరు వీరిని పూజించుటయేమి? ఆ రహస్యమును నాకు ప్రసాదించండి భగవాన్.”

సూర్య భగవానులిట్లనిరి. “ఓ మహామతిమంతా ! వీరి సత్కర్మవిషయమై మంచి ప్రశ్నే సంధించావు. చెప్తాను విను. అయోధ్యయను సుప్రసిద్ధ నగరి భూలోకంలో వుందనీ, అక్కడి రాజులు నా అంశ నుండే ఉద్భవిస్తారనీ నాకు తెలియును కదా. ఆ నగరిలో ధనపాలుడను పేరుగల వైశ్యుడొకాయన వుండేవాడు. ఆయన అక్కడ ఒక దివ్యమైన మందిరాన్ని నిర్మింపజేసి చాలామంది బ్రాహ్మణులనాహ్వానించి వారిని పూజించాడు.

ఇతిహాసాలనూ పురాణాలనూ ప్రవచించ గలిగిన వారిని మరింత విశేషముగా పూజించి ఒకరిని ప్రవచనం చేయవలసినదిగా అభ్యర్థిస్తూ ఇలా అన్నాడు - ‘ద్విజశ్రేష్ఠా! ఈ మందిరంలో ప్రస్తుతం నాలుగు వర్ణాలకు చెందిన భక్తులున్నారు. వారంతా పురాణశ్రవణం చేయాలనే ఇచ్ఛతో నున్నారు. కాబట్టి మీరు పురాణం చెప్పండి. దానివలన నేను ఏడు జన్మలదాకా తరిస్తాను. మీకు ఒక సంవత్సరం పాటు ఏ లోటూ లేకుండా మాత్రమే కాదు, అన్నిభోగాలు అమరేలా చేస్తాను.’

ఒక ఏడాది పాటు ఆ మందిరంలో పురాణం చెప్పడానికి ద్విజుడంగీకరించాడు. కానీ ఆరునెలలు గడిచే సరికి ధనపాలుడు మరణించాడు. అతడే ఇతడు. నేను ఇతనికోసం విమానాన్ని పంపించాను. పురాణం చెప్పడం, వినడం గొప్ప క్రియలు. గంధపుష్పాదులతో నాపూజను చేసినవానిపట్ల కంటే పురాణ ప్రవచనం, శ్రవణం, చేయించినవారు, చేసేవారు - వీరి పట్ల నేను ఎక్కువగా ప్రసన్నుడనౌతాను. అలాగే గో, సువర్ణ, స్వర్ణజటిత వస్త్ర, గ్రామ, నగరాదులను దానం చేసిన వారికన్న పురాణశ్రవణం చేసినవారు, చేయించినవారే నాకెక్కువగా ప్రసన్నతను కలిగిస్తారు. నైవేద్యాల విషయంలో కూడా అంతే. ఈ రహస్య యుక్త పవిత్ర అఖ్యానవాచనము కన్న నాకు ప్రియమైనది లేదు.

కుమారా! ఈ రెండవవిమానంలో వచ్చిన పురుషుడు అయోధ్యలోనొక ఉత్తమ వంశానికి చెందిన బ్రాహ్మణుడు. ఒకనాడాయన ధర్మసంబంధమైన ఉత్తమ కథను వినడానికి వెళ్ళాడు. ఆ కథను విన్న తరువాత ఆ పౌరాణికునికి భక్తి పూర్వకంగా ప్రదక్షిణ చేశాడు. ఆయనకు ఒక మాశ (అయిదు గురివింద గింజల ఎత్తు) సువర్ణాన్ని దానం చేసి ఆయన స్వీకరించినందుకు పరమానందాన్ననుభవించాడు. ఇదీ ఈయన పుణ్యము. ఇందుకే నేనీయనను ఇక్కడికి రప్పించాను. ఎవరైతే శ్రద్ధాభక్తులతో పురాణ ప్రవాచకుని పూజిస్తారో వారు నన్నే పూజిస్తున్నట్టు భావిస్తాను. నా ప్రియసంతానమైన యముడు, యమి, శని, మను, తపతిల కంటే కూడా నాకు ఈ ప్రవాచకులపైననూ వారిని పూజించే వారి పట్లనే ఎక్కువ ఇష్టం. వాచకుడు సంతృప్తి చెందితే అందరు దేవతలు సంతోషించినట్టే. ఎందుకంటే ఓ దేవసేనాపతీ ! అన్నిటికన్నా ఈ విశ్వం ద్వారా పూజింపబడే నా ముఖము నుండే జగత్కళ్యాణ కారములైన ఇతిహాస పురాణాదులు వెలువడినవి. ఈ గ్రంథాలన్నిటిలో నాకు మిక్కుటంగా నచ్చినవి పురాణాలు. ఈ పురాణాలను శ్రద్ధాసక్తులతో వింటూ ప్రవాచకులకు పనికల్పిస్తూ గౌరవించి పూజించేవారికి పరమపద ప్రాప్తి కలుగుతుంది. ధర్మాది పురుషార్థ చతుష్టయానికి ఉత్తమ వ్యాఖ్యలుగా ఇతిహాస, పురాణాలను తయారు చేయించాను. వేదాలను అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి ‘వాటి’ పరమార్థమంతా ‘వీటి’ లో వుండేలా చూశాను. దేవతలలో అగ్ని, జలా శయాలలో సాగరుడు వలెనే బ్రాహ్మణులలో ఇతిహాస, పురాణప్రవచనం చేసేవారు శ్రేష్ఠులు. అను సూర్యవాక్కులను నాకు వినిపించాడు కార్తికేయుడు.’

(ఇక్కడ బ్రహ్మ చెప్పిన మరికొన్ని పుణ్య పాపకార్యలు, ఫలాలు ఇదివఱకు శతానీకుడు వినియున్నవే)