భవిష్య పురాణము

9,10 - అశోక, కరవీర వ్రత మహాత్మ్యాలు

యుధిష్ఠిరమహారాజా! ఆశ్వయుజశుక్ల పాడ్యమి నాడు గంధ, పుష్ప, ధూప, దీప, సప్త ధాన్యాలతో, ఫలాలు, కొబ్బరికాయలు, లడ్లు మున్నగు నైవేద్యాలతో - అందమైన చిగురుటాకులతో శోభించు అశోకవృక్షాన్ని పూజించేవారు అక్షరాలా అశోకులే (దుఃఖమన్నది లేనివారే) కాగలరు. ఈ క్రింది మంత్రాన్ని చదివి అశోకవృక్షానికి అర్ఘ్య మిచ్చి ప్రార్థించాలి.

పితృభ్రాతృపతి శ్వశ్రూశ్వశురాణాంతథైవచ

అశోకశోకశమనోభవ సర్వత్ర నఃకులే (ఉత్తరపర్వం - 9/4)  

వస్త్రంతో అశోకాన్ని చుట్టి పతాకలతో అలంకరించాలి. ఈ వ్రతాన్ని భక్తి పూర్వకంగా కావించే స్త్రీ దమయంతి, స్వాహా, వేదవతి, సతీదేవి లవలె పతికి అతిప్రియపత్ని అవుతుంది. వనగమనంలో సీతాదేవి అశోకవృక్షానికి భక్తిపూర్వకంగా గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్య, తిల, అక్షతాదులతో పూజను గావించి, ప్రదక్షిణ చేసి వనవాసాన్ని మొదలెట్టింది.

తిలలు, అక్షతలు, గోధుమలు, ఆవాలు మున్నగు వాటితో అశోకవృక్షాన్ని పూజించి, మంత్ర సహిత వందనాలు చేసి, ప్రదక్షిణానంతరం బ్రాహ్మణులకు దక్షిణలిచ్చే స్త్రీలు శోకముక్తులై చిరకాలం పతితో సంసారసుఖాలననుభవించి దేహాంతంలో గౌరీలోక ప్రాప్తిని పొందుతారు. ఈ అశోక వ్రతం అన్ని ప్రకారాల శోకాల్నీ రోగాల్ని రూపుమాపుతుంది.

మహారాజా! ఇదే విధంగా జ్యేష్ఠ శుక్ల పాడ్యమినాడు సూర్యోదయ సమయంలో అత్యంత మనోహర ఉద్యానంలో వేయబడిన కరవీర (గన్నేరు) వృక్షాన్ని పూజించాలి. ఎఱ్ఱటి దారాన్ని చెట్టు చుట్టూ చుట్టి గంధ, పుష్ప, ధూప, దీప సప్త ధాన్య, నారికేళ, నారింజ ఫలాలతో ఇతర నైవేద్యాలతో పూజనము చేసి ఈ క్రింది మంత్రంతో ప్రార్థన చేయాలి.

కరవీర విషావాస నమస్తే భానువల్లభా

మౌలిమండన సద్రత్న నమస్తే కేశవేశయోః

ఆ తరువాత (ఉత్తరపర్వం - 10/4)

ఆకృష్ణేనరజసావర్తమానోనివేశయన్నమృతం మర్త్యంచ

హిరణ్యయేన సవితారథేనా దేవో యాతి భువనాని పశ్యన్ (యజుం 33/43)

అనే వేదమంత్రంతో కూడా ప్రార్థన చేసి బ్రాహ్మణుని దక్షిణలతో సంతృప్తిపఱచి వృక్షానికి ప్రదక్షిణచేసి ఇంటికి వెళ్ళాలి. అరుంధతి, సావిత్రి, సరస్వతి, గంగ, దమయంతి, అనసూయ, సత్యభామాది సర్వ సౌభాగ్యములబ్బిన పతివ్రతలు కూడ సూర్యదేవుని ప్రసన్నతకోసం సూర్యలోక ప్రాప్తి కోసం ఈ వ్రతాన్ని చేసి కృతకృత్యులైనారు.”