భవిష్య పురాణము

117 - భద్రా చరిత్ర - వ్రత విధి

భద్రావిష్టి నామంతో ప్రసిద్ధి చెంది పూజలందుకొనుచున్న ఒక దేవీ స్వరూపమును గూర్చి ధర్మజుడడుగగా శ్రీకృష్ణుడిలా చెప్పాడు.

“ధర్మరాజా! సూర్యభగవానుని కూతురి పేరు భద్ర. ఛాయ ద్వారా పుట్టిన ఈమె శనిదేవుని స్వంత చెల్లెలు. నల్లగా, పొడవైన కేశాలతో, పెద్ద పెద్ద దంతాలతో కనుపించు మిక్కిలి భయంకరాకారం భద్రది. పుట్టీ పుట్టగానే ఆమె విశ్వాన్ని సంక్షోభంలోకి నెట్టే ఉద్దేశ్యంతో పరుగులు పెట్టింది. యజ్ఞలను భగ్నంచేసి, ధర్మ కార్యాలకు విఘ్నం తలపెట్టి జయించి, ఉత్సవాలనూ మంగళయాత్రలనూ ఉపద్రవాలు సృష్టించి వాటి ద్వారా ఆపించి మొత్తం జగత్తునే అన్ని విధాలా పీడించింది. ఈమె విశృంఖలత్వాన్ని చూసి సూర్య భగవానుడే చింతితుడయ్యాడు. పోనీ వివాహం చేస్తే ఆమె భర్త ఆమెనేమైనా అదుపులో పెడతాడనుకుంటే ఆమెను పెండ్లాడటానికి ఎవరూ సాహసించలేదు.

ఒకనాడు బ్రహ్మదేవుడు సూర్యుని వద్దకు వచ్చాడు. ఆయనే భద్రావిష్టి ప్రసక్తిని తీసుకురాగా సూర్యుడిలా అన్నాడు.

‘బ్రహ్మదేవా! మీరే అందరినీ సృష్టించారు. ఆమెనీ సృష్టించారు. ఆమె విషయంలో ఏం చేస్తే బాగుంటుందో, అసలు ఏం చేయగలమో మీకే బాగా తెలుస్తుంది కాబట్టి ఆదేశించండి.’

బ్రహ్మ భద్రను పిలిపించి ఆమెతో ఇలా చెప్పాడు, ‘భద్రమ్మా! నిన్ను దేవతను చేస్తాను. జనులు నిన్ను పూజిస్తారు. నిన్ను ఆదరించని వారిని నువ్వు పీడించు. దేవ మానవులతో సహా జంతు జాలాన్ని కొన్ని ప్రత్యేక సమయాల్లో నీవు ఆవహించు. నిన్ను పూజించి నీ వ్రతం చేసిన వారిని కరుణించు.’

ఆయన మాటను గౌరవించి భద్ర కొంత కాలావధిని తీసుకొని ఆ కాలంలో మాత్రమే జగత్తును హింసించేది. తరువాత దేవతా లక్షణాలను పెంచుకొని జనులను కాపాడసాగింది.

ధర్మరాజా! భద్రకి పన్నెండు నామాలున్నాయి. అవి ధన్య, దధిముఖి, భద్ర, మహామారి, ఖరానన, కాళరాత్రి, మహారుద్ర, విష్టి, కులపుత్రిక, భైరవి, మహాకాళి, అసుర క్షయకరి.

ప్రాతఃకాలం లేచి ఈ పన్నెండు నామాలనూ స్మరించినవారికి ఏ వ్యాధీ కలుగదు. అప్పటికే రోగులై యున్నవారు రోగముక్తులవుతారు. ఆమెను పూజించినవారి పట్ల అన్ని గ్రహాలూ అనుకూల దృష్టులు ప్రసరిస్తాయి. ఏ విఘ్నాలూ ఉండవు. ఏ సమరంలోనైనా విజయం లభిస్తుంది. ఆమె నామాంకిత మంత్రం ఇలా వుంటుంది:

ధన్యాదధీముఖీ భద్రా మహామారీఖరాననా

కాలరాత్రిర్మహారుద్రా విష్టిశ్చ కులపుత్రికా

భైరవీచ మహాకాలీ అసురాణాం క్షయంకరీ

ద్వాదశైవతు నామాని ప్రాతరుత్థాయయః పఠేత్

 న చవ్యాధిర్భవేత్ తస్య రోగీ రోగాత్ప్రముచ్యతే

గ్రహాః సర్వేఽను కూలాః స్యుర్నచ విఘ్నాదిజాయతే (ఉత్తరపర్వం 117/27-29)

భద్రావ్రత విధానమేమనగా ఆమెకు బ్రహ్మ ఇచ్చిన దినాలలో (వవ, బాలవ, కైలవ) ఏదో ఒకరోజు ఉపవాసం చెయ్యాలి. రాత్రి సమయం ఆమెదైనట్లయితే రెండు రోజులు నక్తవ్రతం చేయాలి. ఒక జాము వఱకూ ఆమె కాలముంటే మూడు జాముల మిగతా సమయమంతా ఉపవాసం చేయాలి. ఉపవాసం చేయలేనివారు ఏకభుక్తం చేయవచ్చు. స్త్రీ పురుషులెవరైనా ఈ వ్రతాన్ని చేపట్టినరోజు సుగంధామలకమును, సర్వౌషధి యుక్తమునునగు జలముతో స్నానం చేసి దేవతలకు పితరులకు తర్పణాలు వదలాలి. కుశదర్భలతో భద్రయొక్క మూర్తిని తయారుచేసి దానిని గంధ పుష్ప ధూపదీప నైవేద్యాదులతో పూజించాలి. భద్ర పన్నెండు నామాలనే మరల మరల ఉచ్చరిస్తూ నూటయెనిమిది మార్లు హవనం చేసి తిలలతో పాయసంతో బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి వ్రతి తాను స్వయంగా, మౌనంగా కృశరాన్న (తిలలు, బియ్యం కలిపి వండిన అన్నం)ముతో భోజనమును చేయాలి. పూజాంతంలో ఇలా ప్రార్థించాలి.

ఛాయాసూర్య సుతేదేవి విష్టిరిష్టార్థదాయిని

పూజితాసియథాశక్త్యా భద్రే భద్ర ప్రదాభవః (ఉత్తరపర్వం - 117/39)

ఇలా పదిహేడురోజులు చేయాలి.

ఉద్యాపనకు ఇనుప పీఠంపై భద్రమూర్తిని స్థాపించి నల్లబట్టలను కట్టి గంధపుష్పాదులతో పూజ చేసి ప్రార్థించాలి. ఇనుప వస్తువు, నూనె, తిలలు, దూడతోడి నల్లావు, నల్లకంబళిలతో సహా ప్రతిమనూ పీఠాన్నీ బ్రాహ్మణునికి దానం చేసి యథాశక్తి దక్షిణను సమర్పించాలి. ఇలా వ్రతం చేసినవారికి ఏ విఘ్నమూ వుండదు. ప్రేత, పిశాచ, డాకినీ, శాకినీ గ్రహాదులు బాధించవు. ఇష్టజన వియోగముండదు. దేహాంతంలో సూర్యలోక ప్రాప్తి వుంటుంది(భద్రాపూజను ఏయే తిథులలో చెయ్యాలనేది ముహూర్త చింతామణియను జ్యోతిష గ్రంథానికి చేయబడ్డ పీయూష ధారా వ్యాఖ్యలో చెప్పబడింది. ప్రతి విదియ, తదియ, సప్తమి, అష్టమి, ద్వాదశి, త్రయోదశిలలో ఈ వ్రతాన్ని చెయ్యవచ్చని సూచింపబడింది.).