“భగవాన్! హరకాళీదేవి అనే గొప్పదేవత పేరు విన్నాను. గొప్ప మహిమగల దేవతయట. నాకామహాదేవిని గూర్చి తెలుసుకోవాలని వుంది. మీరు సర్వజ్ఞులు కాబట్టి మీరే చెప్పాలి” అని చేతులు జోడించి అడిగాడు ధర్మరాజు.
శ్రీకృష్ణుడిలా చెప్పసాగాడు.
“మహారాజా! కాళీదేవి దక్షప్రజాపతి కూతరు. ఆమె శరీర వర్ణం నల్లకలువతో సమానంగా కాంతులీనుతుంటుంది. ఆమెకు శంకరభగవానులతో వివాహమైంది. వారిద్దరూ ఆనందంగా విహరిస్తూ ఒకరోజు విష్ణువు విహారంచేస్తూ విరాజమానుడై వున్న ఒక సురమ్యమండపం చూశారు. శంకరుడు ముందుగా పోయి విష్ణుదేవునికి నమస్కరించి నవ్వుతూ ‘ఓనా ప్రియా! గౌరీ! ఇటు రమ్ము’ అని కాళిని పిలిచాడు గౌరి అంటే మెరుపుతీగవలె ఎఱ్ఱని, పచ్చని శరీరవర్ణం కలదని అర్థము. నల్లని కాళి ఉడుక్కుంది. క్రోధం శోకం కలిసిన గొంతుతో, ‘శివదేవుడు - నా పతి దేవుడు - నేను కాఱునలుపని నన్నీ విధంగా పరిహసిస్తున్నాడు. ఈ నల్లని దేహాన్ని అగ్నిలో కలిపేస్తాను. అప్పటికైనా తెల్లగా అవుతానేమో’ అని రోదిస్తూ శివుడెంత ఆపడానికి ప్రయత్నించినా ఆగకుండా హరితవర్ణంలో నున్న గడ్డీని, దూర్వనూ చేతబట్టి పూజించి అగ్నిని సృష్టించి దానిలో తనను తానే హవనం చేసుకొంది. విష్ణువు మాట్లాడలేదు. శివుడు రోదించ లేదు. వారికి తెలుసు ఏం జరగబోతోందో! ఆమె మరుజన్మలో హిమవంతుని పుత్రి ‘గౌరి’గా జనించి అదే శివదేవుని సగర్వంగా పతిగా స్వీకరించి ఆయన శరీరంలో అర్ధభాగాన్నాక్రమించింది. ఆకుపచ్చని వస్తువులతో అగ్నిని పూజించి అందులో ఆమె కలిసిపోయింది కాబట్టి శ్రీ భగవతీదేవికి హరకాలీ (ళీ) అనే పేరు అన్వర్థమైంది.
మహారాజా! భాద్రపద శుద్ధతదియనాడు అన్ని ప్రకారాల కొత్త ధాన్యాలనూ ఒకచోట చేర్చి నీరు పోసి వాటిపై అంకురితమైన ఆకుపచ్చని గడ్డితో భగవతి హరకాలీదేవి యొక్క మూర్తిని స్థాపించాలి. గంధ, పుష్ప, ధూప, దీప మోదక నైవేద్యాదులతో రకరకాల ఉపచారాలతో దేవిని పూజించాలి. రాత్రి గీత నృత్యాదులతో ఉత్సవం చేసి జాగరం చేసి ఆయమ్మను ఈ మంత్రంతో ప్రార్థించి ప్రణామంచేయాలి.
హరకర్మ సముత్పన్నే హరకాయే హరిప్రియే।
మాంత్రాహీశస్యమూర్తిస్థే ప్రణతోఽస్మినమోనమః॥ (ఉత్తరపర్వం 20/20)
మరునాడు తెల్లవారగానే సువాసినీ స్త్రీలందరూ ఒక పెద్ద ఉత్సవంగా హరకాలీమూర్తిని ఒక పవిత్ర జలాశయానికి గొంపోయి ఈ క్రింది మంత్రాన్ని పఠిస్తూ నిమజ్జనం చేయాలి.
అర్చితాసి మయాభక్త్యా గచ్ఛదేవి సురాలయం।
హరకాలే శివే గౌరి పునరాగమనాయచ॥ (ఉత్తరపర్వం 20/22)
ఈవిధంగా ప్రతియేడూ ఈ వ్రతాన్ని చేసే స్త్రీ పురుషులకు ఆరోగ్యము, దీర్ఘాయువు సౌభాగ్యం, పుత్ర, పౌత్ర, ధన, బల, ఐశ్వర్యాదులు ప్రాప్తిస్తాయి. నూరేళ్ళపాటు ఇహంలో సర్వసుఖాలనూ అనుభవించాక అంతంలో శివలోకాన్ని చేరుకుంటారు. వీరభద్రుడు, మహాకాలుడు, నందీశ్వరుడు, వినాయకుడు ఈ వ్రతం చేసిన వారిపట్ల నిత్యప్రసన్నులై వుంటారు. ముఖ్యంగా భక్తి పూర్వకంగా ఈ హరకాలీ వ్రతాన్ని చేసి రాత్రి నృత్య గీతాలతో ఉత్సవం చేయించి జాగరణ చేసే స్త్రీకి ఆమె భర్త అత్యంత అనుకూలుడై వుంటాడు.