ధర్మరాజా! నవోదిత చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలో వివరిస్తాను, విను. ప్రతి మాసంలో శుక్ల విదియనాడు ప్రదోష కాలంలో భూమిపై పేడతో అలికి ఒక మండలాన్ని తయారుచేసి దానిలో రోహిణీ సహిత చంద్రదేవుని ప్రతిమను స్థాపించి శ్వేతచందన, శ్వేతపుష్ప, అక్షత, ధూప, దీప, అనేక ప్రకార ఫల, ఘృత, నైవేద్య, దధి, శ్వేతవస్త్ర, దూర్వాంకురాదులతో పూజ చేసి ఈ క్రింది మంత్రం ద్వారా చంద్రునికర్ఘ్య మివ్వాలి.
నవోనవోఽసిమాసాంతే జాయమానః పునః పునః ।
ఆప్యాయస్య సమేత్వేవం సోమరాజ నమో నమః ॥ (ఉత్తరపర్వం-119/6)
ఈ పద్ధతిలో ప్రతి నెలా చంద్రుని కర్ఘ్యమిచ్చు వారికి పుత్ర, పౌత్ర, ధన, పశు, ఆరోగ్యాదులు ప్రాప్తిస్తాయి. నూరేళ్ళపాటు ఈ లోకంలో సుఖంగా జీవించి దేహాంతంలో చంద్రలోకాన్నీ అక్కడ కొన్నాళ్ళున్న తరువాత మోక్షాన్నీ పొందుతారు.
మహారాజా! శుక్రదోష నివృత్తికై యాత్ర ఆరంభంలోగానీ, గమనకాలంలోగానీ, శుక్రోదయ సమయంలో ఆయన పూజను తప్పక చేయాలి. ఈ పూజకై బంగారం, వెండి, లేగా కంచు పాత్రలో ముత్యాలు పొదిగిన వెండి శుక్ర విగ్రహాన్ని (అంటే మూర్తినే) తెల్లబియ్యంపై స్థాపించి దానిని తెల్లబట్టలతో పూలతో అలంకరించాలి. షోడశ లేదా పంచ ఉపచారాలతో ఆయనను పూజించి ఈ క్రింది మంత్రంతో అర్ఘ్యమివ్వాలి:
నమస్తే సర్వదేవేశ నమస్తే భృగునందన ।
కవే సర్వార్థ సిద్ధ్యర్థం గృహాణార్ఘ్యం నమోఽస్తుతే ॥ (ఉత్తరపర్వం - 120/4)
తరువాత సవత్సగోవుతో సహా ఆ ప్రతిమనూ ఇతర పూజా సామగ్రినీ బ్రాహ్మణునికిచ్చి వేయాలి. ఈ విధంగా శుక్రదేవుని పూజించిన వాని మనఃకామనలన్నీ ఈడేరుతాయి. ధాన్యాలన్నీ సమృద్ధిగా పండుతాయి.
ఇలాగే బృహస్పతి మూర్తిని కూడా స్థాపించి దానికి ఆవాలతో కూడిన నీటితోగాని పంచగవ్యాలతో స్నానం చేయించి పచ్చటి పుష్పాలతో పీత వస్త్రాలతో అలంకరించాలి. పూజ, అర్ఘ్య ప్రదానాల అనంతరం నేతితో హవనం చేయాలి. బృహస్పతి మూర్తిని సవత్స గోవుతో, దక్షిణతో సహా బ్రాహ్మణునికి దానమిచ్చి వేయాలి. యాత్రాకాలంలోనూ, బృహస్పతి సంక్రాంతులలోనూ ఆయన ఉదయించే సమయంలోనూ ఆయనను పూజించిన వారికి అన్ని మనోరథాలూ సిద్ధిస్తాయి. జాతక చక్రంలో గురు శుక్ర గ్రహదోషాలున్న వారు ఈ అర్ఘ్యాలనిస్తే ఆ దోషాలు పోతాయి.