భవిష్య పురాణము

13-15 - కుండనిర్మాణం - గ్రహశాంతి

            (కుండమనగా నీటిని నిలువ చేసి రక్షించి, ఓషధులు వేసి ఆరోగ్యమును పెంచుటకు ప్రాచీనులు కనిపెట్టిన నిర్మాణం. దీనిని సామాన్యులు మాట్లాడుకొనే, తెలుగులో గుండం అనీ గుండాం అనీ వ్యవహరిస్తారు. కాని ఇపుడు సూతుడు చెప్పుచున్నది యజ్ఞకుండం గూర్చి. దీనిని కూడా గుండం, హోమగుండంలని వ్యవహరిస్తుంటాము.)

ద్విజశ్రేష్ఠులారా! యజ్ఞకుండాలు పది రకాలుగా వుంటాయి: అవి చౌకోర (నాలుగు కోణాల) వృత్త, పద్మ, అర్ధచంద్ర, యోన్యాకార, చంద్రాకార, పంచకోణ, సప్తకోణ, అష్టకోణ, నవకోణ సంయుక్తాలు.

ముందుగా భూమిని బాగా సంశోధించి దానిపైనున్న గడ్డిపరకలను, తలవెండ్రుకలను తొలగించాలి. తరువాత భూమిపై భస్మములను, అంగారాలను తిప్పి శుద్ధి చేయాలి. తరువాత భూమిపై నీటిని చిలకరించి విత్తనాలను పూడ్చాలి. వారం తరువాత కుండ నిర్మాణానికి తవ్వకాలు జరపాలి. తరువాత పైన చెప్పిన పది రకాలలో మనకు కావలసిన దానిని కట్టుకోవాలి. కొలతల కోసం పవిత్రీకరింపబడిన సూత్రాన్ని (దారాన్ని) వాడాలి. కామనాభేధంతో కుండాలలో రకాలుంటాయి. కుండానికి తగినట్లుగానే మేఖలనుంచాలి. యజ్ఞాహుతుల సంఖ్యలు కూడా భిన్నంగా వుంటాయి. విధి, ప్రమాణాలనుసరించియే ఆహుతుల నివ్వాలి. కొలతలను తప్పి ఏం చేసినా లాభముండదు.

యాభై ఆహుతులు సామాన్యం. యజ్ఞాన్ని బట్టి వంద, వెయ్యి, అసంఖ్యాకం, లక్ష, కోటి లెక్కలో కూడా హోమాల్లో వేయవచ్చు. పెద్దపెద్ద సంఖ్యల్లో రాజులు, మహారాజులే ఆహుతులను వేయగలరు.

ఇక శాంతి విషయానికొస్తే. మనుష్యులు తమ పూర్వకర్మల అనుసారమే సుఖ దుఃఖాలను అనుభవిస్తుంటారు కదా! ఐతే శుభాశుభ ఫలితాలు గ్రహచారాన్ని బట్టి కూడా వస్తుంటాయి. కాబట్టి ప్రయత్న పూర్వకంగా, శాంతి - పుష్టి కర్మల ద్వారా ఈ గ్రహాలను శాంతింపజేయవచ్చు. దీనికి పరమభక్తి విశ్వాసాలు కూడా అవసరం. ఉత్పాతాలు. అద్భుతాలు దేవలోకంలో, అంతరిక్షంలో, భూలోకంలో ఎక్కడ జరిగినా గ్రహాలవల్లనే జరుగుతాయి. కాబట్టి అద్భుతమో, ఉత్పాతమో జరిగిన వెంటనే లోకకల్యాణం కోసం శుభా శుభగ్రహాలకు శాంతిపూజలను నిర్వర్తించాలి. భక్తి పూర్వకంగా గ్రహాలకు నిత్యం హవన పూజలు చేయడం చాలా మంచిది.

కుండాలను తగిన సంస్కారాలను గావించిన తరువాతనే ఉపయోగించాలి. శాస్త్రానుసార సంస్కారం లేకుండానే కుండాన్ని వాడడం హానికరం.

కొన్ని పదాలకి అర్థాలు

1) జితేంద్రుడు - ఇంద్రుని కూడా గెలిచిన వాడు

2) శుకరవృత్తి - మధ్యశాలవంటివాటిని శుభ్రపఱచుట

3) రాజమాగీ (అర్థం దొరకలేదు)

4) పథప్రదర్శకులు - సరైన దారిని చూపి నడిపించేవారు.

5) సూత్రాన్ని దారాన్ని

6) ఖదిర - మడుగుదామన, చండ్ర చెట్టు

7) చరు - పక్వమ చేయబడి, హోమయోగ్యమైన అన్నం

8) శ్రీఫల - మారేడు

9) బీజపుర - జామి

10) దాడిమ - దానిమ్మ

11) ధాత్రి - ఉసిరిక

12) జంబు - నేరేడు.

ఓంకారపూర్వకంగా నీటిబొట్లను రాల్చి కుశజలంతో ప్రోక్షించి, సూత్రాలతో కట్టి, త్రిశూలీకరణ, అగ్ని జిహ్వను భావించుట, అగ్నిఆహరణాది పదునెనిమిది సంస్కారాలు గావించి కుండాన్ని స్థాపించాలి. శూద్రుని యింటి నుండి అగ్నిని తెప్పించరాదు. స్త్రీ చేత అగ్ని తెప్పించరాదు. శుద్దుడు పవిత్రుడునైన వ్యక్తి ద్వారా మాత్రమే అగ్నిని రావించాలి. ఆ తరువాత అగ్నికీ సంస్కారం చేసి మనకెదురుగా పెట్టుకోవాలి. అగ్నిబీజం (రం) మరియు శివబీజం (శం) తో ప్రోక్షణం చేసి శివ, శక్తిద్వయాన్ని ధ్యానించాలి. దీనివల్ల అభీష్టసిద్ధి ప్రాప్తిస్తుంది. ఆ తరువాత వాయు సహాయంతో అగ్నిని ప్రజ్వలింపచేయాలి. భగవతీ భగవానులకు అర్ఘ్య, పాద్య, ఆచమనీయాదులతో పూజలు చేయాలి. అగ్నిపూజనంలో ఈ మంత్రన్నుపయోగించాలి.

పితృ పింగళ దహ దహ పచ పచ

సర్వజ్ఞా జ్ఞాపయ స్వాహా ।

యజ్ఞదత్తముని హిరణ్యా, కనకా, కృష్ణా అను మూడు అగ్నిజిహ్వలను పేర్కొన్నాడు. అగ్నికున్నవి సప్తజిహ్వలని తరువాత చెప్పబడింది అవి: విశ్వమూర్తి, స్ఫులింగిని, ధూమ్రవర్ణా, మనోజవా, లోహితాస్యా, కరాలాస్యా, కాలీ. (మొత్తం పది అవుతాయి.) ఏ జిహ్వకు ఏ సమిధను వాడాలో కూడా చెప్పబడింది. యోగకర్మలో బహురూపా, అతిరూపా, సాత్త్వికా కర్మల వినియోగముండాలి. ఆజ్యహోమంలో బంగారాన్నీ, త్రిమధు అనగా పాలు, పంచదార, తేనెలనూ హవనం చేస్తే కర్ణికాయను అగ్ని జిహ్వ ఉద్భవిస్తుంది. అదేవిధంగా పాల హవనం వల్ల రక్తాయను జిహ్వ; నైతిక కర్మద్వారా ప్రభా; పుష్పహోమంలో బహురూపా; అన్న, పాయసాలతో కృష్ణా; చెఱకురసంతోనైతే పద్మరాగా; పద్మహోమసంజాతంగా సువర్ణలోహితాలు; బిల్వపత్రహవనం నుండి శ్వేతా; తిలహోమాన ధూమినీ; కాష్ఠహోమం ద్వారా కరాలికా; పితృహోమం నుండి లోహితాస్యా, దేవహోమం నుండి మనోజవా అను అగ్నిజిహ్వలుత్పన్నమవుతాయి. ఇక ఏ యాగంలోనైనా సమిధలను హవనం చేసేటప్పుడు సమిధలో ‘వైశ్వానర’ నామంతో అగ్నిదేవుడు వసిస్తుంటాడు.

మంత్రోచ్చారణపూర్వకంగా అగ్నిదేవునికి ఆహుతులిస్తే ఆయన అన్నిప్రకారాల అభ్యుదయాన్ని కలిగిస్తాడు. అయితే ఈ ఆహుతులివ్వడంలో ఏ మాత్రం పద్ధతి తప్పినా ప్రమాదమే! కుండమునకు మధ్యలో ఆహుతులు పడాలి. వేడి సెగ తగులుతోందని మూలల్లో పడవేయకూడదు. అగ్నిజిహ్వలలో విశేషరూపంలో గణనా, వక్రా, కృష్ణాభా, సుప్రభా, బహురూపా, అతిరూపా అనే ప్రసిద్ధనామాలు కలిగినవి కూడా ఉన్నాయి. ఇక యాగాగ్ని నుండి వచ్చే ధూమాలు సకల కల్యాణకారకాలు. (ఒకనాటి పర్యావరణాన్ని అవే కాపాడుతుండేవి. వాటి దయవల్లనే ఈ భూదేవి ఇన్నివేల యేళ్ళుగా నిలచివుంది. ఈనాడు ఆ ధూమాలు లేకనే అనారోగ్యాలు పెల్లుబుకుతున్నాయి. ప్రతిచోటా ప్రతినోటా పర్యావరణ కాలుష్యం మీద గోలే వినిపిస్తుంది.)

అగ్నిజ్వాలలు ఛిన్నవృత్త రూపాలలో లేవడం మంచిదికాదు. అది ప్రాణ, ధన నష్టాలను సూచిస్తుంది. వెంటనే పద్ధతిని సరిచూసుకోవాలి. అగ్ని ఆరిపోయినా, ధూమం విపరీతమైనా అరిష్టమే. వెంటనే ప్రాయశ్చిత్త మార్గం పట్టాలి. ముందు పదునెనిమిది ఆహుతులనిచ్చి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. తరువాత నేతితోనే మూలమంత్రం ద్వారా యాభై ఆహుతులివ్వాలి. మూడుకాలాల్లోనూ మహాస్నానాలు చేసి శ్రద్ధాభక్తులతో మహావిష్ణువును పూజించాలి.