భవిష్య పురాణము

160 - సూర్యదేవుని విరాడ్రూపవర్ణనం

            ఈ విషయమై శతానీకుడడుగగా సుమంతుడిలా చెప్పసాగాడు.

            “రాజేంద్రా! ఒకమారు విష్ణువూ, బ్రహ్మా హిమాచలంపైకి వెళ్ళారు. అక్కడి వారికి శివుడు అర్ధచంద్రుని తలపైనిడుకొని భగవంతుడైన వివస్వంతుని పూజ చేస్తూ కనిపించాడు. ఆయన వీరిద్దరినీ చూచి వినయ సంభ్రమములుట్టిపడగా లేచి ఆతిథ్యమిచ్చి ఇలా అడిగాడు.

            ‘దేవదేవులారా! మీరు భగవానుడైన సూర్యదేవుని ఆరాధన చేశారు కదా! ఆయన యొక్క ఏ రూపాన్ని దర్శించారు? నాకు ఆయన పరమరూపాన్ని తెలుసుకోవాలనే అభిలాష కలిగింది. దయచేసి నాకా విజ్ఞానాన్ని కలిగించండి.

            ఆయన విరాట్ స్వరూపాన్ని వారు కూడా ఇంకా దర్శించకపోవడంతో ముగ్గురూ కలిసి సువర్ణ సమానోజ్జ్వలము, పవిత్రమునైన ఉదయగిరికి పోయారు. దానిపై నిలచి సూర్యనారాయణునికై తీవ్ర తపస్సును ప్రారంభించారు. పద్మాసనం వేసి నిశ్చలంగా వుండిపోయి బ్రహ్మ, నిటారుగా నిలబడి ఒక చేతిని పైకెత్తి శివుడు, పంచాగ్నుల మధ్య తలవంచి నిలబడి, విష్ణువు వేయి దివ్య సంవత్సరాలు స్థిరంగా తీవ్రంగా తపమాచరించారు. త్రిమూర్తులు చేసిన ఉత్తమోత్తమ తపానికి ప్రసన్నుడై సూర్యదేవుడు సాక్షాత్కరించాడు.

            ‘త్రిమూర్తులారా! మీ తపస్సుతో నన్ను సంతుష్టుని చేశారు. ఏం వరం కావాలో కోరుకోండి’ అని చెప్పాడు.

            ‘మహాప్రభో! మీ దర్శనం కోసం తపించి మేము కృతకృత్యులమైనాము. ఇతఃపూర్వమే మిమ్మారాధించి గొప్పవరాలు పొందియున్నాము. మీ కృపవల్ల సృష్టి స్థితి లయకారకుల మయినాము. కాని, దేవదేవేశా! మేము మీ యొక్క పరమదుర్లభమైన విరాట్ స్వరూపాన్ని వీక్షించే భాగ్యాన్ని ఇప్పటికీ పొందలేకపోయాము’ అన్న త్రిమూర్తుల వచనాలాలకించి పరమ దుర్లభమైన దుర్నిరీక్ష్యమైన విరాట్ రూపాన్ని దర్శించే అవకాశాన్ని ప్రసాదించాడు సూర్యభగవానుడు.

            కొన్ని వందల శిరస్సులతో, కరాలతో, పాదాలతో, ముఖాలతో వెలుగుతున్న ఆ రూపంలో అన్ని లోకాలూ గోచరించాయి. అందరు దేవతలూ కనిపించారు. ఆయన పాదమే పృథ్వి, శిరమే స్వర్గము, నేత్రాలు అగ్ని, కాలివేళ్ళు పిశాచగణం, చేతి వేళ్ళు గుహ్యకులు, విశ్వేదేవులు జంఘలుగా కనిపించాయి.

            యజ్ఞమే ఆయనకు కుక్షి. అప్పరగణాలు కేశాలు, తారలు రోమాలు, పది దిశలు ఆయన చెవులు, దిక్పాలక గణాలాయన భుజాలు, వాయువు నాసికగా, ధర్మం మనస్సుగా, సత్యం వాణిగా, సరస్వతీదేవి నాలుకగా, మహాదేవి అదితి గ్రీవంగా, వీర్యవంతుడైన రుద్రుడు తాలువుగా ఆయనలో ఇమిడియున్నారు. నాభి స్వర్గద్వారమై, అగ్నితోబాటు వైశ్వానరులు ముఖమై, బ్రహ్మదేవుడాయన హృదయమై, కశ్యప మహర్షి ఉదరమై అష్టవసువులు పీఠమై, మరుద్గణాలు సంధులై ప్రకాశిస్తున్నారు. సమస్త ఛందాలూ ఆయన దంతాల్లో వున్నాయి. ఉదరంలో గంధర్వులున్నారు, నాగులున్నారు. లక్ష్మి, మేధ, ధృతి, కాంతి, సర్వవిద్యలు ఆయన కటిలో నెలవై వున్నవి. ఆయన వక్షంపై వేదాలు, యజ్ఞాలు, కొలువై యుండగా ఆయన లలాటమే పరమపదమైన పరమాత్మ.

            ఈ రూపాన్ని కనులారా వీక్షించిన త్రిమూర్తులు విస్మితులై మిక్కిలి భక్తి శ్రద్ధలతో ప్రణామం చేశారు.

            ‘ఓ పరదైవతములారా! మీ కఠిన తపస్సుకి ప్రసన్నుడనై మీ అందరి శక్తులను కొన్ని రెట్లు పెంచి మిమ్మల్ని మరింత కళ్యాణకారకులనుగా చేయడానికే ఈ రూపాన్ని ప్రదర్శించాను. సమాధిస్థితులైన యోగులు దీనిని దర్శించగలరు.’ అని సెలవిచ్చి సూర్యభగవానుడంతర్ధానం చెందాడు.”