“శ్రీ కృష్ణ చంద్రా! ఏ కర్మవల్ల సకల కష్టాలూ దూరమై సంతాపం అంతరించి పోతుంది?” “ధర్మజా! ఈ విషయమై ఒక కథ వుంది, ఆలకించు. పూర్వకాలంలో విదిశా నగరంలో సీరభద్రుడని ఒక వైశ్యుండుండేవాడు. ఆయన కుటుంబ పోషణ గూర్చి పుత్ర, పౌత్రాదుల గూర్చి పనిచేస్తూ సంపాదిస్తూ, ఆలోచిస్తూనే బతికేవాడు గానీ ఏనాడూ కలలోనైనా పరలోక చింతన చేయలేదు. అధర్మంగా కొంత ధర్మంగా కొంత ధనాన్నైతే బాగా సంపాదించాడే గానీ దాన, హవన, పూజనాదుల పేర్లను కూడా తలచలేదు. నిత్య, నైమితిక కర్మలనైనా కనీసం పట్టించుకోలేదు. కొన్నేళ్ళకి చనిపోయి వింధ్యారణ్యంలో యాతనా దేహంతో ప్రేతరూపంలో ఉండసాగాడు.
ఒకమారు మంచి గ్రీష్మర్తువులో నొకనాడు విపీతుడను దేవజ్ఞుడు, వేదవేత్తయగు బ్రాహ్మణ ముని అటుగా పోతూ నదీతీరంలో వేడి ఇసుకలో యాతనా శరీరమంతా బొబ్బలెక్కి యమయాతన ననుభవిస్తూ పడియున్న సీరభద్ర పేతాన్ని చూశాడు. గొంతెండిపోయి గొంతపెగలక ఎగశ్వాస తీస్తూ యాతన పడిపోతున్న సీరభద్రునిపై జాలి కలిగి గొంతులో కాసిని నీళ్ళుపోసి ఎందుకిలా అయిపోయావని అడిగాడు విపీతముని చెప్పసాగాడు సీరభద్ర ప్రేతము.
‘బ్రాహ్మణోత్తమా! నేను బతికినంత కాలం బతుకు కోసమే బతికేశానుగాని పరలోకాన్ని గూర్చి ఎన్నడూ ఏ మాత్రమూ ఆలోచించలేదు. నిరంతరం ధనం, ఇల్లు, పొలము, కొడుకు, భార్య - అనే అంశాలే మనసులో వుండేవి. దేవుని పూజను ఏనాడూ మనసులోకి రానివ్వలేదు. ధర్మంగానో అధర్మంగానో ధన సంపాదన ఒక్కటే జీవిత లక్ష్యంగా, కుటుంబ పోషణే పరమధర్మంగా జీవించి, కాలంతీరి కాలధర్మం చెంది ఇదిగో ఇలా అయిపోయాను. దేవతలకు గాని, పితరులకుగాని, అతిథికి గాని ఎప్పుడూ పిడికెడు అన్నమైనా పెట్టలేదు. నేను అడ్డమైన గడ్డీ కఱచి సంపాదించినదంతా అక్కడే ఆ యింట్లోనే వుండిపోతుంది కదా, దాన్ని వారసులు అనుభవిస్తున్నారు. నేను ప్రేతాన్నయి, యాతనా దేహం ప్రాప్తించగా బాధ లనుభవిస్తున్నాను. బ్రాహ్మణోత్తమా నన్నీ దుర్గతి నుండి ఉద్ధరించే ఉపాయమేదైనా చూపి నన్ను దాటించండి.’
‘సీరభద్రా! ఏడుజన్మల క్రితం నువ్వు అచ్యుత భగవానుని ఆరాధనేచ్ఛతో సుకృత ద్వాదశీ ఉపవాసాన్ని చేసియున్నావు. దానివల్ల నీ పాపాలు చాలా వఱకూ నశించాయి. ఆ నీ శిక్షాకాలం గడచిపోయింది. అల్పకాలంలోనే విముక్తి లభిస్తుంది. ఆనాడు ఆ ద్వాదశ వ్రతమే గనక చేసి వుండకపోతే ప్రళయం దాకా ఇక్కడే ఇలాగే పడి వుండేవాడివి’ అని చెప్పాడు ముని.
మరునాడే సీరభద్రునికి ముక్తి లభించింది. కాబట్టి ధర్మజా! మనిషి పుణ్యాన్ని సంపాదించే యత్నంలోనే వుండాలి. ధనాన్ని కాదు. ఇక సుకృత ద్వాదశి వ్రత విధానాన్నుపదేశిస్తాను విను. ఫాల్గున శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం చేసి కామ, క్రోధ, లోభ, మోహ, దంభాదులను త్యజించి సంసారంలో నిజమైన సారం ఈ మంత్రమేనని గట్టిగా మనసుకి చెప్పుకుంటూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వీలైనన్నిమార్లు జపించాలి. ద్వాదశినాడు మధుసూదనుని పూజించి పారణచేయాలి. (భోజనం చేయాలి) మొదటి నాలుగు అనగా ఫాల్గునం నుండి జ్యేష్ఠందాకా పారణకు ముందు వెండి, రాగి లేదా మట్టి పాత్రలలో యవలను నింపి బ్రాహ్మణులకు దానం చేయాలి. ఆషాఢాది ద్వితీయ చాతుర్మాస్య పారణలలో నేతిపాత్రలను, కార్తికాది నాలుగు మాసాలలో నువ్వు నింపిన పాత్రలను బ్రాహ్మణులకు అర్పించాలి. సంవత్సరాంతంలో బంగారంతో విష్ణు ప్రతిమను తయారుచేయించి దానిని సర్వోపచారములతో పూజించి వస్త్ర, స్వర్ణ, దక్షిణలతో బ్రాహ్మణునికివ్వాలి. ఒక సవత్సగోవును కూడా దానం చేయాలి. ఈ విధంగా సుకృత ద్వాదశి వ్రతాన్ని చేయు స్త్రీ పురుషులకు నరక బాధవుండదు.
వాసుదేవ నారాయణ మంత్రాలమహిమ చెప్పనలవి కాదు. ఇవి సుఖ జీవనాన్నీ అనాయాస మరణాన్నీ ప్రసాదిస్తాయి. విష్ణుభక్తుడు యముని ముఖాన్నే చూడనవసర ముండదు. నిత్యం నారాయణ నామాన్ని ఉచ్చరిస్తూనే వుంటే నరకబాధ దాకా ఎందుకు, ఏ బాధా వుండదు.