భవిష్య పురాణము

83 - 92 - ఇతర వార వ్రత విధులు

భాద్రపదషష్ఠి (శుక్ల) నాడు వచ్చేది భద్రవారము. ఈ రోజు నక్త వ్రతోప వాసములు చేసినవారు దేహాంతమున హంసవాహనారూఢులై సూర్యలోకం చేరుకుంటారు. ఆ రోజు శ్వేతచందన, మాలతీ పుష్ప, విజయధూప ఖీరనైవేద్యాదులతో మధ్యాహ్న కాలమందు సూర్యనారాయణుని పూజించి బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణనివ్వాలి.

రోహిణీ నక్షత్రయుక్త ఆదిత్యవారాన్ని సౌమ్యవారమంటారు. ఆరోజు చేసే పూజలన్నీ అక్షయ ఫలదాయకాలవుతాయి.

మార్గశిర శుక్లషష్ఠినాడు వచ్చేది కామదవారం. ఇది సూర్యభగవానుని కత్యంత ప్రియమైనది. ఈ రోజు పూజ చేసినవారికి సర్వపాప ప్రణాశనం, సూర్యలోక నివాసప్రాప్తి కలుగుతాయి. ఏ కోరికతో చేసిన వారికి ఆ కోరిక ఫలిస్తుంది. అందుకే ఇది కామదం.

హస్త నక్షత్రంలో వచ్చేది ఆదిత్యపుత్రదవారం. ఈ రోజు ఉపవాసం చేసి శ్రాద్ధ కర్మను ఆచరించి మధ్యమ పిండాన్ని తినాలి. ధూపమాల్యదివ్యగంధాది నానా ప్రకారోపచారాలతో సూర్యనారాయణ పూజనం చేసి మహాశ్వేతమంత్రాన్ని జపిస్తూ సూర్యప్రతిమ సమక్షంలోనే శయనించాలి. పొద్దున్నే లేచి స్నానాదులు చేసి సూర్యదేవునికి అర్ఘ్యమివ్వాలి. రక్తచందన, కరవీరపుష్పాలతో పూజ చెయ్యాలి. ఈ తరువాత ఐదుగురు బ్రాహ్మణులను రావించి వారిలో ఇద్దరిని మగసంజ్ఞికంగా ముగ్గురిని భీమ సంజ్ఞకంగా (మగులు, భీములు సూర్యపుత్రులు) భావించి విధి పూర్వకంగా పార్వణ శ్రాద్ధం పెట్టి మధ్యమ పిండాన్ని సూర్యదేవునికెదురుగా నుంచి ఈ మంత్రాన్ని చదువుతూ తినాలి.

స ఏషపిండో దేవేశయోఽభీష్టస్తవసర్వదా

అశ్నామి పశ్యతే తుభ్యం తేనమే సంతిర్భవేత్ (బ్రాహ్మ 86/10)

ఇలా పూజిస్తే సూర్యభగవానుడు సాధకునికి నిస్సదేహంగా పుత్రుని ప్రసాదిస్తాడు. దక్షిణాయన దినమున వచ్చే ఆదిత్యవారం జయవారం. ఆ రోజున చేసే ఉపవాసం. నక్షవ్రతం, స్నానదానజపాలను సూర్యభగవానుడు నూరింతల ప్రీతితో స్వీకరిస్తాడు.

ఉత్తరాయణదినం రవివారమైతే దానిని జయంతవారమంటారు. ఈ రోజు సాధకుడు చేసే స్నాన, పూజ, జప, దానాదులకు సూర్యభగవానుడు వెయ్యింతల ఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈ రోజు ఉపవాసం చేసి నెయ్యి, పాలు, చెఱకురసాలతో స్వామికి స్నానం చేయించి కుంకుమ లేపనము చేసి గుగ్గులధూపమిచ్చి మోదకాలు, నువ్వుల వంటకాలు, శష్కులీ (పూరీలు) లతో భోజనం పెట్టాలి.

భవిష్య పురాణం ఏ నెలలోనైనా శుక్ల పక్షంలో రోహిణీ నక్షత్రయుక్త సప్తమిని విజయసంజ్ఞక ఆదిత్య వారమంటారు. ఇది సంపూర్ణంగా పాపాలనూ భయాలనూ నశింపజేసేవారము. ఈ దినం చేసే పుణ్యకర్మలకు కోటిరెట్ల ఫలం లభిస్తుంది.

మాఘకృష్ణ సప్తమిని ఆదిత్యాభిముఖ సప్తమి అంటారు. ఆ రోజు ఉదయమే స్నానం చేసి గంధ పుష్పాది ఉపచారాలతో సూర్యనారాయణుని పూజించాలి. ఆ తరువాత రక్తచందనపు కర్రతో చేయబడిన స్తంభానికి ఆనుకొని సూర్యునికి అభిముఖంగా వుండి మహాశ్వేతామంత్రాన్ని చదువుతూ సాయంకాలందాకా నిలబడే వుండాలి. తరువాత బ్రాహ్మణునికి భోజనము పెట్టి దక్షిణ నిచ్చి తాను మౌనంగా భోజనం చెయ్యాలి. ఈ వ్రతం చేసినవారికి సూర్యనారాయణస్వామివారి అనుగ్రహం లభిస్తుంది.

సంక్రాంతి రోజు ఆదివారంనాడు పడితే దానిని హృదయవారమంటారు. అది ఆదిత్యుని హృదయానికి దగ్గరగా సాధకుని చేర్చేవారము. ఈ రోజు నక్తవ్రతం చేసి మందిరంలో సూర్యనారాయణునికెదురుగా నుండి నూట యెనిమిది మార్లు ఆదిత్యహృదయాన్ని పఠించాలి. సాయంకాలం దాకా మనస్సుతో సూర్యధ్యానం చేస్తూనే వుండాలి. సూర్యాస్తమయమైనాక ఇంటికి వచ్చి యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను కూడా మౌనంగా ఖీర్‌తో భోంచెయ్యాలి. ఆ తరువాత సూర్యదేవుని స్మరించుకుంటూ నేలపైనే శయనించాలి. ఈ వ్రతాన్ని నిష్ఠగా శ్రద్ధాభక్తి పురస్సరంగా చేసినవానికి సమస్త అభీష్టాలూ సిద్ధిస్తాయి. సూర్యనారాయణుని వలెనే తేజము, కాంతి, యశము ప్రాప్తిస్తాయి.’