భవిష్య మహా పురాణము
85 - విభూతి ద్వాదశి - పుష్పవాహనుని కథ
మహారాజా! ఇపుడు విష్ణు ప్రీతికారకమైన విభూతిద్వాదశియను సర్వోత్తమ వ్రతాన్నుపదేశిస్తాను, విను. ఇది సంపూర్ణ దేవగణాభివందితము. బుద్ధిమంతుడైన మనుష్యుడు కార్తిక వైశాఖ మార్గశిర ఫాల్గున ఆషాఢాలలో ఏదో ఒక నెల శుద్ధ దశమినాడు స్వల్పంగా ఆహారాన్ని స్వీకరించి సాయం సంధ్యను వార్చుకొని నియమగ్రహణం చేయాలి, ఇలా: ‘ప్రభో! నేను ఏకాదశినాడు ఏమీ తినకుండా జనార్దనార్చన పెద్ద యెత్తున చేస్తాను. ద్వాదశినాడు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేస్తాను. కేశవా! నా ఈ నియమం నిర్విఘ్నంగా కొనసాగేలా కరుణించు.’ ఓం నమోనారాయణాయ మంత్రాన్ని జపిస్తూ ఆ రాత్రి శయనించాలి. ప్రాతర్వేళనే లేచి జపాదులచే పవిత్రులై తెల్లపూమాలలతో చందనాదులతో పుండరీకాక్షుని పూజించాలి.
ఒక యేడాదిపాటు ప్రతిమాసం. క్రమంగా భగవానుని దశావతారాల స్వర్ణ ప్రతిమలనూ, ఆ తరువాత దత్తాత్రేయ, వ్యాసభగవానుల స్వర్ణ ప్రతిమలనూ కమలాల మధ్య నుంచి దానంచేయాలి. మోసగాళ్ళు, దుష్టులు, పాఖండులు ఇలాటి వారికి ఈ రోజులలో దూరంగా వుండాలి. మహారాజా! ఈ విధంగా యథాశక్తి పన్నెండు ద్వాదశులలోనూ పూజలను గావించి వర్షాంతంలో గురువుగారికి ఒక శయ్యనూ గోవునూ దానం చేయాలి. వ్రతి సంపన్నుడైతే గురువుగారికి ఈ సందర్భంలో వస్త్రాలను, శృంగార సామగ్రిని, భూషణాలను ఆయనను పూజించడంలో వినియోగించి వాటితోబాటు గ్రామాన్నిగాని ఇంటినీ, భూమినీగాని దానం చెయ్యాలి. ప్రతి సామాన్య సంసారియైతే బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి వస్త్రాలతోనూ, వ్రతి సంపన్నుడైతే గో, రత్న సమూహ, ధనరాశి దానాలతోనూ వారిని సంతుష్టపఱచాలి. వ్రతి పరమ నిర్ధనుడై మాధవుని పట్ల ప్రగాఢ నిష్ఠగలవాడైతే ఈ దానాలివ్వలేని పక్షంలో, మూడేళ్ళపాటు పుష్పార్చన విధితో ఈ వ్రతపాలనము చెయ్యవచ్చును. ఈవిధంగా శాస్త్రోక్తంగా విభూతి ద్వాదశిని అనుష్ఠించిన వారికి పాపాల నుండి ముక్తి లభిస్తుంది. అతని నూరు తరాల పితరులు తరిస్తారు. ఒక లక్షజన్మల దాకా వానికి శోకము, దారిద్ర్యము, వ్యాధి, నిర్బంధాలు ఉండవు. ప్రతి జన్మలో శివ లేదా కేశవ భక్తుడవుతాడు. లక్ష జన్మల తరువాత ఎనిమిది వేల యుగాలు గడిచేదాకా స్వర్గంలో వుంటాడు. మరల భూలోకంలో పుట్టవలసి వచ్చినపుడు మహారాజుగా పుడతాడు.
మహారాజా! చాలాకాలం క్రిందట రథం తర కల్పంలో పుష్పవాహనుడని ఒక మహారాజుండేవాడు. ఆయన లోకవిఖ్యాతుడు, తేజంలో సూర్యసమానుడు. ఆయన అఖండ తపస్సుకి మెచ్చి బ్రహ్మ ఒక కమల రూపవిమానాన్నీ, త్రైలోక్య గౌరవ ప్రతిష్ఠలనూ వరంగా ఇచ్చాడు. మూడు లోకాలలో ఆయన చేరలేని చోటుగానీ గౌరవింపబడని ప్రదేశంగానీ లేదు. ఆయన పత్ని పేరు లావణ్యవతి. ఆమె అసమాన సౌందర్యవతి. ఆమె సచ్ఛీలత వల్ల ప్రపంచంలో అందరు స్త్రీలూ గౌరవిస్తారు. శంకరునికి పార్వతీదేవి వలెనే పుష్పవాహనునికి ఈమె మిక్కిలి ప్రీతిపాత్రురాలు. వారికి పదివేలమంది పుత్రులు కలిగారు. వీరంతా ధార్మికులు, ధనుర్ధారులలో అగ్రగణ్యులు. తన సిరిసంపదలనూ, కీర్తి ప్రతిష్ఠలనూ, సుఖసంతోషాలనూ చూసుకొని ఆయనే అప్పుడప్పుడాశ్చర్య పోతుండేవాడు.
ఒకనాడు వాల్మీకి మహర్షిరాగా, రాజు ఆయనను ఇలా అడిగాడు. ‘మునీంద్రా! నాకింత అదృష్టం ఎలా పట్టింది? దేవతల ద్వారా మునుల ద్వారా కూడా పూజనీయమైన నిర్మల విభూతి, దేవాంగనల కంటె అందమైన భార్య నాకెలా ప్రాప్తించాయి? నా కొంచెపు తపస్సుకే బ్రహ్మముగ్ధుడైపోయి నా అమాత్యులతో, వందలకొద్దీ ప్రజలతో సహా ఆనందంగా, అన్ని లోకాలలోనూ పర్యటించడానికి సమర్థమైన, దేవతలకు కూడా అలభ్యమైన విమానాన్ని వరప్రసాదంగా దయచేశాడంటే నమ్మబుద్ధియ్యడం లేదు. ఇది తప్పనిసరిగా నా పూర్వజన్మ సుకృతమే అయివుండాలి. మహర్షీ! మీరు సర్వజ్ఞులు. మేము పూర్వజన్మలో ఏ పుణ్య కర్మలు గావించామో సెలవివ్వండి.’
వాల్మీకి నిమీలిత నేత్రుడై ధ్యానంలోకి పోయి రాజుగారి ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకొని కనులుతెఱచి ఇలా చెప్పాడు. ‘మహారాజా! మీరు పూర్వజన్మలో అత్యంత భీషణుడైన వ్యాధుని ఇంట పుట్టారు. సహజంగానే రాత్రింబవళ్ళు పాపకర్మలోనే గడిపారు. కఠోరమైన శరీరంతో దుర్గంధపూరిత చర్మంతో భయంకరమైన బలం గలిగి వుండేవారు. మీరు పెరిగి పెద్దయ్యేసరికి మీ వారెవరూ మిగలలేదు. తల్లిగాని తండ్రిగాని మిత్రులుగాని బంధు బాంధవులుగాని - ఎవరూ లేరు. కేవలం ఈ మీ ప్రియతమ భార్యయే ఉండేది అప్పుడు కూడ అభీష్ట పరమానుకూల సంగినిగా మీతోనే వుండేది. ఒకప్పుడు భయంకర అనావృష్టి కారణంగా దారుణమైన కరవు యేర్పడింది. మీరు ఆకలిబాధనుండి బయటపడడానికై వేటకు బయలుదేరారు. ఎక్కడా ఏమీ దొరకలేదు. కనీసం వనాలలో నిత్యమూ వుండే కందమూలాలు కూడా కనిపించలేదు. నిరాశ కన్నను ఆకలే గొప్పది కాబట్టి మీరింకా ముందుకు పోగా అక్కడ మీకొక చక్కటి సరోవరం గోచరించింది. దానినిండా బ్రహ్మాండమైన కమల పుష్పాలున్నాయి. మీరు వెంటనే అందులో దిగి మోయ గలిగినన్ని పూలను కోసుకొని వాటిని అమ్ముకోడానికి మీకు దగ్గరలో నున్న వైదిశ నామక నగరంలోకి(ఇదే ప్రఖ్యాత విదిశా నదీ తీరాన వున్నర విదిశా నగరం. ప్రస్తుతం భేల్‌సానగర్ అని పిలువబడుతోంది. మధ్యప్రదేశ్ లో వుంది) వెళ్ళారు. ఊరంతా తిరిగారు కాని అదేమి చిత్రమో ఒక్క పూవు కూడా అమ్ముడుపోలేదు. ఆకలితో వ్యాకులత చెంది మీరు మీ పత్నితో సహా అలసి, నీరసించి, అతిశయక్లాంతులై ఒక భవన ప్రాంగణంలో కూలబడ్డారు. రాత్రి లోపల నుండి శ్రావ్యంగా అమోఘంగా మంగళ వాద్యాలు వినిపించడంతో మీరులోనికి వెళ్ళారు. ఈ మహామంగళ శబ్దాలు భవన మధ్యం నుండి వెలువడుతున్నవి. అక్కడొక సుందర మండప మధ్యభాగంలో మహావిష్ణు పూజ జరుగుతోంది. అనంగవతి అనుపేరుగల వేశ్య ఆ పూజలను చేయిస్తోంది. ఆమె మాఘమాస విభూతి ద్వాదశి వ్రతాన్ని ముగించి తన గురువుగారిలోనే హృషీకేశుని చూసుకుంటూ ఆయనకు సాదరపూజ నొనర్చి స్వర్ణమయ కల్పవృక్షాన్నీ, శ్రేష్ఠలవణాచల సహిత సంపూర్ణ శయ్యనీ దానమిస్తుండగా మ్రోగిన మంగళ ధ్వనులు అవి. ఈ పూజనూ ఆ విష్ణుదేవుని దివ్య మంగళ విగ్రహాన్నీ చూసిన మీకు అకస్మాత్ గా ఒకేసారి అద్భుతమైన భక్తి భావం కలిగింది. వెంటనే మీ వద్దనున్న అసంఖ్యాక పుష్పాలతో భగవంతుని విగ్రహాన్నీ, పూజా మందిరాన్నీ, లవణా చలాన్నీ, భగవత్ స్వరూపుడైన ఆ గురువుగారి శయ్యనీ కూడా, నిజంగా దేవుడినే స్వయంగా పూజిస్తున్న భావాన్ని అనుభవిస్తూ అలంకరించారు.
అనంగవతి మీపట్ల మిక్కిలి ప్రసన్నురాలయింది. మీకు నూరు అశర్ఫి (గొప్ప ధనరాశి)లనిమ్మని దాసీలనాదేశించింది కాని మీరాధనరాశిని సున్నితంగానైనా దృఢంగానే తిరస్కరించారు. ఆ తరువాత ఆమెయే స్వయంగా నాలుగురకాల (భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య) అన్నాలనూ తెచ్చి మీ ముందు పెట్టి ‘కనీసం భోజనమైనా చేయండి’ అంది. అపుడు మీరు మిక్కిలి వినమ్రులై ‘ఓ వరాననా! మేము భోజనం రేపుచేస్తాం. ఓ దృఢవ్రతా! మేము జన్మసిద్ధంగానే పాపపరాయణులం, కుకర్మచారులం. నిజం చెప్పాలంటే తిండి కోసమే ఇన్నాళ్ళూ ఇన్నేళ్లూ బతికాం. కాని ఈ రోజు నీ ఉపవాస దీక్షను చూశాక మాకు అందులోని ఆనందం అవగతమైంది.’ అని చెప్పారు.
హే పుష్పవాహన మహారాజా! తత్ క్షణమే ఆ జన్మలో మీకు ధర్మ, పుణ్య అంశాలు లేశమాత్రం కలిగాయి. ఆరోజు రాత్రి మీరిద్దరూ దైవసన్నిధానంలో జాగరణ కూడా చేశారు. ప్రాతర్వేళనే అనంగవతి భక్తి పూర్వకంగా తన గురుదేవునికి లవణాచల సహితంగా శయ్యా ప్రదానం చేయడం, పన్నెండుగురు బ్రాహ్మాణులకు సువర్ణ, వస్త్రాలంకారాలతోబాటు పన్నెండు గోవులను దానం చేయడం, దరిద్రులకు, దీనులకు, వికలాంగులకు భోజనాలు పెట్టడం మీరెంతో అబ్బురపడి తిలకించారు. మీరు కూడ అప్పుడే భోజనం చేశారు. మీరు చేసిన గొప్ప పుణ్యమేమిటంటే మీకు తెలియకుండానే విభూతి ద్వాదశినాడు కమలనాథుని కమలాలతో విస్తృతంగా అలంకరించి ఉపవసించి భక్తులను గౌరవించడం. ఆపుణ్యం వల్లనే మీరిప్పుడు రాజదంపతులైనారు. ఆ తరువాత మీరు ఆ జన్మలో త్యాగధనులై, నిర్లోభులై, తపస్సు చేస్తూనే జీవించారు. మీపై బ్రహ్మ విష్ణు లిరువురూ కరుణను కురిపించారు. అందుచేత నీకు ప్రాప్తించిన కమలరూప విమానం పుష్పక మందిర విమానమంత ఆధిక్యాన్ని సంతరించుకుంది. వేశ్యయైన అనంగవతి మరుజన్మలో మన్మథుని భార్య అయింది. ఇప్పుడీమె పేరు ప్రీతి. ఈమె రతీదేవికి సవతి. ఓ రాజా నీవు గంగా తటంపై నివాసముండి విభూతి ద్వాదశి వ్రతాన్ని చేయి. ఈమారు నిశ్చయంగా మీ దంపతులకు మోక్షం లభిస్తుంది’ అని చెప్పి వాల్మీకి నిష్క్రమించాడు.
ధర్మనందనా! పుష్పవాహన మహారాజు వాల్మీకి ఆదేశాన్ని పాటించి మోక్ష ప్రాప్తి నొందాడు. ఈ వ్రతాన్ని ఎవరి శక్తిమేరకు వారు చెయ్యాలి. పీనాసితనం పనికిరాదు. పాప విదీర్ణకరమైన ఈ వ్రతాన్ని చదివేవారు, విన్నవారు, వ్రతాన్ని చేసేవారికి సహాయపడేవారు వందకోట్ల సంవత్సరాలు దేవలోకంలో నివసిస్తారు.