భవిష్య మహా పురాణము
154 -157 - ఇతర ధేను దానాలు
ఘృతధేను దానంలో ఆవు నెయ్యి నింపిన కలశలను ఆవు ఆకారంలో పేర్చాలి. పాదాలుండే చోట చెఱకుగడలనూ, గిట్టలపై వెండినీ, కన్నుల వద్ద బంగారాన్నీ, కొమ్ముల చోటులో అగరు కర్రలనీ, పార్శ్వాలలో సప్తధాన్యాలనూ, గంగడోలు వద్ద ఉన్ని బట్టలనూ, ముక్కు వద్ద తురుష్క దేశీయ కర్పూరాన్నీ, పొదుగుండే చోట పండ్లనూ, తోకకి బదులు పట్టువస్త్రాన్నీ, నాలుక వద్ద చక్కెరనూ, ముఖంపై బెల్లాన్నీ, మూపుపై తామ్రపాత్రనూ స్థాపించాలి. ఈ క్రింది శ్లోకాన్ని చదవాలి:
ఆజ్యం తేజః సముద్దిష్టమాజ్యం పాపహరం పరం
ఆజ్యం సురాణామాహారః సర్వమాజ్యే ప్రతిష్ఠితం॥
త్వం చైవాజ్యమయీ దేవి కల్పితాసి మయాకిల
సర్వపాపాపనోదాయ సుఖాయ భవభామిని॥ (ఉత్తరపర్వం 154/8,9)
ఆ రోజు నేతినే ఆహారంగా తీసుకోవాలి ఇలాగే నవనీత ధేను దానాన్ని కూడా చేయవచ్చు అన్ని ధేను దానాలకూ పద్ధతి ఒకటే.
శ్లోకాలూ ఫలాలూ వస్తువులూ మారతాయి. నిష్కామ భావనతో ఘృతధేను దానమిచ్చిన వారికి నిష్కల్మష జీవనం, అనంతరం పరమపదం ప్రాప్తిస్తాయి. నెయ్యిపై అందరు దేవతలకూ మక్కువ ఎక్కువే కాబట్టి ఈ వ్రతం చేసినవారి పట్ల దేవతలంతా ప్రసన్ను లౌతారు.
లవణధేను దానం సర్వోత్తమంగా పరిగణింపబడుతున్నది. ఇది సర్వమహాపాప సంహారకం. దీర్ఘాయు ప్రదాయకం. శివలోక ప్రాప్తిదం. ఇందులో నాలుగు శేర్ల లవణాన్ని ధేను రూపానికి వాడాలి. సువర్ణ మండిత చందన కాష్ఠం కొమ్ములకు, వెండి గిట్టలకు, ఫలాలను పొదుగుకు, చెఱకుగడలను పాదాలకు, చందనాన్ని నాసికకు, ముత్తెపు చిప్పలను చెవులకు, ముత్యాలను కన్నులకు, సక్తు పిండాన్ని కపోలాలకు, చక్కెరను నాలుకకు, యవలను ముఖానికి, తిలలనూ గోధుమలనూ రెండు పార్శ్వాలకూ అమర్చాలి. తోకవద్ద కంబళిని పెట్టాలి.
ఈ క్రింది శ్లోకాన్ని చదివి బ్రాహ్మణునికి దానమిచ్చి వేసి దక్షిణ నివ్వాలి.
లవణే వైరసాః సర్వే లవణే సర్వదేవతాః।
సర్వదేవమయే దేవి లవణాఖ్యే నమోఽస్తుతే॥ (ఉత్తరపర్వం 155/18)
సువర్ణధేను దానంలో యాభైపలాలు (అంటే మూడు కిలోలు) గాని పాతిక పలాలుగాని లేదా శక్తిమేరకు ఎంతైనా గాని బంగారంతో రత్నజటితమైన ధేనువును తయారుచేయాలి. దానిలో నాల్గవవంతు సువర్ణ, రత్నాలతో దూడను నిర్మించాలి. మెడలో వెండిగంటనూ, పైన పట్టు వస్త్రాన్నీ, వజ్రాలతో దంతాలనూ, వైడూర్యాలతో గంగిడోలునూ, రాగితో కొమ్ములనూ, ముత్యాలతో కన్నులనూ అలంకరించి పండ్లతో నింపిన ఎనిమిది కలశలనూ పద్ధెనిమిది రకాల ధాన్యాలనూ భోజన సామగ్రి, లవణ, శర్కరాదులతో గోవు ప్రక్కనే స్థాపించి స్నానం చేసి వచ్చి ప్రదక్షిణ చేసి మొత్తము సామగ్రినంతటినీ ధేనువుతో సహా బ్రాహ్మణునికి దానమివ్వాలి. (గోవులో ఎక్కడెక్కడ ఏయే దేవతలుంటారో ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇదే విషయం ఉత్తరపర్వం 69వ అధ్యాయములో చెప్పబడింది.)
ధర్మరాజా ఈ దానాన్ని చేస్తే అన్ని దానాలూ చేసినట్టే.
రత్నధేను దానం చేస్తే అన్ని లోకాలకుపైన, రాధాకృష్ణులు నిత్యమూ కొలువుండే గోలోక నివాస ప్రాప్తి కలుగుతుంది. ఇందులో రత్నమయమైన ధేనువుని నిర్మించాలి. గోవు ముఖాన్ని వేయడానికి ఎనుబదియొక్క పద్మరాగమణులను వాడాలి. ఆవు పాదాలకు పుష్పరాగాలను స్థాపించాలి. మిగతావన్నీ తిలధేను దానంలోలాగే వుండాలి. తలవద్ద వజ్రాలనూ, నేత్రాలకు గోమేధికాలను, పృష్ఠ భాగానికి ఇంద్రనీలాలను, ఇరుప్రక్కలా వైడూర్యాలను, గిట్టలకు బంగారాన్నీ, ముక్కుకి సూర్య, చంద్రకాంత మణులనూ అదనంగా వాడాలి.
దానవేళ గోస్తుతిని క్రిందటి ధేను దానంలో చేసినట్లే చేయాలి.