“శ్రీకృష్ణా! మీ ద్వారా అన్నదానమహిను విన్న తరువాత నాకొక విషయం స్మరణకి వస్తోంది. నేను స్వయంగా చూసినదే నీకు విన్నవిస్తున్నాను. మేము అరణ్యవాసానికి పోయినపుడు మాపట్ల ప్రగాఢ స్నేహానురాగాలున్న నగరవాసులు, బ్రాహ్మణులు కొందరు మాతో వచ్చేశారు. వీరినెలా పోషించాలో తెలియక నేను ఖిన్నుడనైనాను. బ్రాహ్మణ, మిత్ర, భృత్యాదులను పోషించువాని జన్మమే సఫలము. తనపొట్ట తాను నింపుకోవడం పెద్ద విషయమేం కాదు. పక్షులు, జంతువులు, క్షుద్రప్రాణులు అన్నీ ఆ పనిని చేయగలవు. అందరినీ కాదని కుటుంబానికి కూడా పెట్టకుండా తన తిండి గోలేదో తాను చూసుకొనే వాడు బతికున్నా చచ్చినట్టే. అందుకని నేను బాధ పడుతుంటే మైత్రేయ ముని నా పక్కకు వచ్చి నాతో నడుస్తూ ఇలా చెప్పాడు:
‘ధర్మావతారా! ఒకప్పుడొక తపోవనంలో దుర్భాగ, దరిద్ర, బ్రహ్మచారిణియగు బ్రాహ్మణ స్త్రీ ఒకామె వుండేది. అట్టి పేదరికంలో కూడా బ్రాహ్మణులనూ, మునులనూ పూజిస్తూ వుండేది. శమదమ పరిపూర్ణమైన ఆమె శ్రద్ధాభక్తులకు ప్రసన్నులై ఒకనాడు బ్రాహ్మణులంతా ఆమెతో ‘ఓ సువ్రతా! మాకు నీ పట్ల కరుణ జనించింది. నీ చిత్తానికి వచ్చిన వరాన్ని కోరుకో” అన్నారు. ఆమె వెంటనే ‘మహానుభావులారా; భూదేవులారా! శ్రమ లేకుండా వచ్చే వరం కంటే వ్రతం ద్వారా వచ్చే భాగ్యమే మిన్న. పతిప్రేమను పుష్కలంగా పొందుతూ, పుత్రవతినై, సౌభాగ్యవతినై, ధనాడ్యనై, లోకంలో అందరి ప్రశంసలకూ పాత్రురాలనై ఒక జన్మంతా గడపాలంటే ఏం చెయ్యాలో చెప్పి సఫలీకృత మనోరథనగునట్లు దీవించండి” అంది.
వారిలో వసిష్ఠ గోత్రికుడొకాయన ‘ఓ పవిత్రగుణ బ్రాహ్మణీ! నీవు కోరుకొనే జన్మ రావడానికి, నిజానికి, నీవిప్పటిదాకా చేసిందే చాలు. అయినా అప్పుడు కూడా నువ్వు చాలామందిని కొన్నేళ్ళపాటు పోషించాలి కాబట్టి నీకొక దానవిధి నుపదేశిస్తాను. ఇది స్థాలి అనగా అన్నంగిన్నె లేదా అన్నపు కుండ దానం.
అయిదువందల లేదా రెండువందల యాభై లేదా నూట పాతిక పలంల బరువున్న రాగి లేదా మట్టిపాత్రను తయారుచెయ్యి. అది లోతుగా దృఢంగా వుండాలి. దానిలో పెసలతోనూ, బియ్యంతోనూ చేసిన పదార్థాలను వేసి, నింపి చందన చర్చితమైన ఒక మండప మధ్యంలో స్థాపితం చెయ్యి. దానికి సమీపంలోనే అన్ని రకాల శాకాలనూ, జల పాత్రనూ, నేతిపాత్రనూ వుంచు. అప్పుడు స్థాలిని పుష్ప, ధూప, దీప, వస్త్ర, నైవేద్యాదులతో పూజించి ఇలా ప్రార్థించు:
జ్వలజ్జ్వలన పార్శ్వస్థ్తస్తందులైః సజలైరపి।
న భవేద్భోజ్య సంసిద్ధిర్భూతానాం పిఠరీం వినా॥
త్వం సిద్ధిః సిద్ధికామానాం త్వం పుష్టిః పుష్టిమిచ్ఛతాం।
అతస్త్వాం ప్రణమామ్యాశు సత్యం కురువచోమమ॥
జ్ఞాతిబంధు సుహృద్వర్గే విప్రే ప్రేష్యజనే తథా!
అభుక్తవతి నశ్నీయాత్ తథాభవ వరప్రదా॥ (ఉత్తరపర్వం 170/22-24)
ఇలా ‘నావాళ్ళందరి కడుపూనిండేదాకా నువ్వు ఖాళీ కాకూడదు’ అని మంత్రం ద్వారా ఆ స్థాలిని ప్రార్ధించి ఒక ద్విజశ్రేష్ఠునికి దానం చెయ్యి. ఈ దానాన్ని రవివారం, సంక్రాంతి, చతుర్దశి, అష్టమి, ఏకాదశి, తదియ రోజుల్లో ఎప్పుడైనా చేయవచ్చును’ అని ఉపదేశించగా ఆ బ్రాహ్మణి ఒకటి కాదు రెండు కాదు తనకి వీలైనపుడల్లా ఆ జన్మంతా స్థాలీదానాన్ని చేస్తునే జీవించింది.’
ఇంతవఱకు చెప్పి మైత్రేయ ముని ఆ బ్రాహ్మణియే ద్రౌపదిగా అవతరించిందని చెప్పాడు. అంతే కాదు సతీ, శచీ, స్వాహా, సావిత్రీ, భూ, అరుంధతీ, లక్ష్మీదేవతల అంశలన్నీ రూపుగాంచిన మానవరూపమే ద్రౌపది అని కూడా చెప్పాడు. వాసుదేవా! మీరు అన్నదానం గూర్చి చెప్పగానే నాకు అన్నంగిన్నె దానం గుర్తొచ్చి చెప్పేశాను. నన్ను సభాసదులంతా క్షమించాలి. ఎందుకంటే చెప్పవలసింది మీరు; వినవలసింది నేను” అని నమస్కరించాడు ధర్మరాజు.
“నిజమే మహారాజా! సుందర తామ్రలిని బియ్యంతో పెసలతో నింపి పర్వదినాల్లో శ్రేష్ఠ బ్రాహ్మణులకు దానం చేసేవాని ఇల్లు సర్వసంపదలతో, స్నేహితులతో, బంధు, భృత్య, మిత్ర, అతిథి బృందాలతో కళకళలాడుతుంటుంది’ అన్నాడు శ్రీకృష్ణుడు.