భవిష్య పురాణము

1 - మధ్యమపర్వ 3వ భాగం - ఉద్యాన ప్రతిష్ఠావిధి

సూతమహర్షి ప్రవచనం ఇంకా ఇలా కొనసాగుతోంది. “బ్రాహ్మణులారా! ఉద్యానాది ప్రతిష్ఠలో కొన్ని ప్రత్యేక విశేష విధులున్నాయి. ముందుగా ఒక నలుపలకల మండలాన్ని నిర్మించి దానిపై అష్టదళపద్మాన్నేర్పాటు చేయాలి. మండలానికి ఈశాన్యకోణంలో కలశను స్థాపించి దానిపై గణేశునికీ, వరుణదేవునికీ పూజలు చేయాలి. జలపూరిత కలశలోకి వరుణభగవానుని ఆవాహన చేస్తూ ఇలా ప్రార్థించాలి. ‘వరుణదేవా! నేను మిమ్ము ఆవాహన చేస్తున్నాను. విభో! మీరు మాకు స్వర్గాన్ని ప్రసాదించండి.’ ఆ తరువాత తూర్పువైపు మందరగిరిని స్ధాపించి తోరణంపై విష్వక్సేనుని పూజించి, కర్ణికా ప్రదేశంలో వాసుదేవ భగవానుని పూజించాలి. వాసుదేవుడు శుద్ధస్ఫటిక సమానుడై వుండాలి. ఆయన తన నాలుగు చేతులలో శంఖ చక్రగదాపద్మాలను ధరించి వుండాలి. ఆయన వక్షఃస్థలముపై శ్రీవత్సచిహ్నము, కౌస్తుభమణి సుశోభితములై వుండాలి. మస్తకం సుందరమైన కిరీటముచే అలంకృతమై వుండాలి. ఆయన దక్షిణభాగంలో కమలాదేవి, వామభాగంలో పుష్టిదేవీ వుండాలి. సుర, అసుర, సిద్ధ, కిన్నర, యక్షాదులాయనను స్తుతిస్తుంటారు. విష్ణోరగటం.. (యజు. 5/21) అనే మంత్రంలో విష్ణు భగవానుని పూజించాలి. సంకర్షణాది వ్యూహాలను, విమలాది శక్తులను కూడా ధూప దీపాది ఉపచారాలతో అర్చించి ప్రార్థించాలి. వారికెదురుగా నేతి దీపమును వెలిగించి పెట్టి గుగ్గిల ధూపాన్ని వేయాలి. నేతితో చేసిన భీరును నైవేద్యం పెట్టాలి. ఆ తరువాత కర్ణికకు దక్షిణంవైపు కమలం పైకి వున్న సోముని ధ్యానించాలి. వరదాభయ ముద్రలతో, కేయూరాదులను ధరించి, శుక్లవర్ణంలో, శాంతస్వరూపం తో కొలువైన చంద్రుని కొలిచేవారు చల్లగా హాయిగా జీవించగలరు. ఇమందేవా.. (యజు 9/40) అనే మంత్రం ద్వారా సోముని పూజించి నేతితో చేసిన వంటకాన్ని నైవేద్యంగా పెట్టాలి. తూర్పు మున్నగు దిక్కుల్లో ఇంద్ర, జయంత, ఆకాశ, వరుణ, అగ్ని, ఈశాన తత్పురుష, వాయువులను సంకల్పించుకొని పూజించాలి. కర్ణికకు ఎడమవైపు శుక్లవర్ణుడైన పరమశివుని త్ర్యంబకం (యజు. 3/60) అనే మంత్రంతోపూజించి నైవేద్యాదులను సమర్పించాలి. భగవంతుడైన వాసుదేవునికి హవిష్యంలో ఎనిమిది, సోమునికి ఇరవై యెనిమిది, శివునికి రెండు క్షీరాహుతులనివ్వాలి. గణేశునికి నేతితో ఒక ఆహుతినివ్వాలి. బ్రహ్మ, వరుణ, దిక్పాలక గ్రహాదులకును విహిత సమిధలతో ఒక్కొక్క ఆహుతినివ్వాలి.

కరాలీ, ధూమలీ, శ్వేతా, లోహితా, స్వర్ణప్రభా, అతిరిక్తా, పద్మరాగాలను అగ్నిదేవుని సప్తజిహ్వలకూ మంత్ర సహితంగా నేతినీ, తేనెనూ కలిపిన హవిష్యం ద్వారా నొక్కొక్క ఆహుతినివ్వాలి. ఈ విధంగానే అగ్ని సోమ, ఇంద్ర, పృథ్వి, అంతరిక్షాలకు తేనె, పాలు, యవలు కలిపి ఒక్కొక్క ఆహుతినివ్వాలి. మరల వీరందరినీ ప్రత్యేకంగా గంధ పుష్పాదులచే పూజించి రుద్రసూక్త, సౌరసూక్తాలను జపించాలి. తరువాత యూప స్తంభాన్ని బాగా నీటితో తడిమి తడిమి తడిపి దానిని ఉద్యాన మధ్యభాగంలో పాతాలి. ఆ ప్రాంతంలోనే సోమ, వనస్పతులకు ధ్వజాలను పెట్టించాలి. కోఽదాత్కస్మా.. (యజు. 7/48) అనే మంత్రంతో వృక్షాలకు కర్ణవేద సంస్కారం చేయించాలి. ఒక వాడియైన సూదితో వృక్షానికి కుడి, ఎడమభాగాల్లో రెండేసి ఆకులకు రంధ్రాలను పొడవాలి. నవగ్రహాల తృప్తికోసం లడ్లు మున్నగు వాటితో భోగం చేసి చిన్నపిల్లలకు బాలబాలికలకు వాటిని పెట్టాలి. ఉద్యానవనంలోని వృక్షాలను రంగు రంగుల దారాలతో అలంకరించి వాటికి నీరుపోస్తూ ఈ ప్రార్థనా మంత్రాన్ని పఠించాలి.

వృక్షాగ్రాత్పతిత స్యాపి ఆరోహోత్పతి తస్యచ

మరణే వాస్థి భంగేవా కర్తా పాపైర్నలిప్యతే (మధ్యమ 3/1/31)

అనగా విధిపూర్వకంగా ఉద్యానప్రతిష్ఠ చేసి పెంచబడుతున్న ఈ చెట్లపై నెక్కి క్రిందపడి ఎవరైనా మరణించినా, ఎముకలు విరగ్గొట్టుకున్నా ఆ పాపంలో ఈ చెట్లను పెంచిన వానికి భాగముండదుగాక!

ఉద్యాన నిమిత్తం పూజాదికర్మలను చేయించిన ఆచార్యదేవునికి స్వర్ణమును, ధాన్యాలను, వెండినీ దక్షిణరూపంలోనివ్వాలి. ఇతర బ్రాహ్మణులను కూడా తగిన దక్షిణలతో తృప్తి పఱచాలి. యాగంలో పాల్గొన్న సదస్యులను కూడా ప్రసన్నం చేసుకోవాలి. తరువాత యజమాని తనచే స్థాపితమైన అధికలశజలంతో స్నానం చేయాలి. సూర్యాస్తమయానికి ముందే పూర్ణాహుతి జరిగేలాగ చూసుకోవాలి. సంపూర్ణంగా ఈ కార్యాన్ని నిర్వర్తించిన పిమ్మట యజమాని తన యింటికి వెళ్ళి అక్కడ మరల విప్రుల ద్వారా బల, కామ హయగ్రీవ, మాధవ, పురుషోత్తమ, వాసుదేవ, ధనాధ్యక్ష, నారాయణులకు విధి విధానంగా పూజలు స్మరణలు చేయించాలి, పంచగవ్యమిశ్రితమైన పాలతో పిండి వంటకాన్ని చేయించి నైవేద్యం పెట్టాలి.

బలాది దేవతలను పూజించిన పిమ్మట దక్షిణం వైపు తిరిగి స్యోనాపృథివీ.. (యజు. 35/12) అనే మంత్రంతో భూదేవిని పూజించి తేనె కలిపిన పాయసాన్నమునామెకు నివేదించాలి. పృథ్వీదేవి శుద్ధకాంచన వర్ణపు కాంతులతో శోభిల్లుతుంటుంది. వరదాభయ ముద్రలలో చేతులనుంచి మనని ఎల్లపుడూ ఓపికగా క్షమిస్తూ కాపాడుతుంటుంది.

ఇంటికి ఎడమ భాగంలో విశ్వకర్మ యాగం చేయాలి. విశ్వకర్మన్... (ఋ. 10/81/6) అనే మంత్రమును వినియోగించాలి. ఆయన శుద్ధ స్ఫటిక వర్ణుడు, ఉలినీ, శూలాన్నీ చేతులందు ధరించి నిరంతరం శాంతస్వరూపుడై వుంటాడు. ఈయనకు తేనెనూ పిష్టకాన్నీ బలియిచ్చి కౌష్మాండ సూక్తాన్నీ పురుషసూక్తాన్ని పఠించాలి. ఈ పృథ్వీ హోమంలో తేనె - పాయస యుక్త హవిష్యంతో ఎనిమిది ఆహుతులిచ్చి మిగిలిన దేవతలందరికీ ఒక్కొక్క ఆహుతిని సమర్పించాలి.

తోటలో మధ్యమధ్యలో దాని రక్షణ నిమిత్తమై చిన్న చిన్న కట్ట (గనిమ) లను నిర్మించాలి. వీటిని ధర్మసేతువులంటారు. వాటిని నిర్మించి ఇలా ప్రార్థించాలి.

పిచ్ఛితే పతితానాం చఉచ్ఛ్రి తేనాంగ సగంతః

ప్రతిష్ఠితే ధర్మసేతౌ ధర్మమే స్యాన్న పాతకం

యేచాత్ర ప్రాణినః సంతి రక్షాం కుర్వంతి సేతవః

వేదాగమేనయత్పుణ్యం యథైవహి సమర్పితం (మధ్యమ 3/1/44 - 46)

దీని తాత్పర్యమేమనగా ఎవరైనా ఈ ధర్మసేతువునుండి కావాలని పడినా, జారిపడినా ధర్మసేతు నిర్మాతకు పాపమంటదు. ఎందుకంటే ఇది ధర్మకార్యము. వేదాధ్యయనాదులవల్ల ఎంత పుణ్యం వస్తుందో దీని వల్లకూడా అంతే ప్రాప్తిస్తుంది.