భవిష్య పురాణము

16,17 - మధూక, మేఘపాలీ తృతీయ వ్రతాలు

“భగవాన్! మధూక వృక్షాన్నాశ్రయించి ఒకప్పుడు శంకర పత్ని పార్వతి వుండగా ఆ దేవిని లక్ష్మి సరస్వతీ పూజించారని విన్నాను. ఆ ఉదంతాన్ని సర్వజ్ఞులైన మీరే వివరించగలరు దయచేసి నాకు తద్విషయిక జ్ఞానాన్ని ప్రసాదించండి.”

“యుధిష్ఠిర మహారాజా! ప్రాచీనకాలంలో సముద్ర మథన సమయంలో ఈ వృక్షం ఉద్భవించింది స్త్రీలకు అఖండ సౌభాగ్యాన్నీ సకల జనులకూ ఆధివ్యాధుల నుండి విముక్తినీ ప్రసాదించే ఈ వృక్షాన్ని భూలోకవాసులు దేవతానుగ్రహం ద్వారా సంపాదించి తెచ్చి భూలోకంలో స్థాపించారు. పార్వతీదేవి జయవిజయాది సఖీమణులతో దిగి వచ్చి ఆ ప్రఫుల్లిత సుందరవృక్షం నీడలోవసించి తపస్సుచేసింది. ఆమెనక్కడ చూసి దేవతలు తమ కోరికలను తీర్చుకోవడం కోసం అక్కడికి చేరి ఆమె పాదాల నాశ్రయించి పూజించారు. లక్ష్మీ, సరస్వతీ, అరుంధతీ, రోహిణీ, సావిత్రీ, గంగాది తల్లులు కూడా అక్కడికి వచ్చి గౌరీదేవిని పూజించారు. గౌరమ్మ ప్రసన్నురాలై అక్కడికి వచ్చి తనను పూజించిన వారందరికీ అభీష్ట వరప్రదానం చేసింది. ఈ గౌరీ దేవ్యుపాసన ఫాల్గున శుద్ధ తదియనాడు జరిగింది. కాబట్టి ఆ తిథినాడు మనంచేసే గౌరీ పూజను మధూక తృతీయ వ్రతమంటారు.

ఇక వ్రత విధానమేమనగా వ్రతులు ఆరోజు ఉపవాసం చేసి మధువనంలోకి పోయి అక్కడ మధూకవృక్షం క్రింద నిష్ఠగా బ్రహ్మచారిణి, జటాముకుట శోభిత, తపస్యారత, రుద్రధ్యాన పరాయణ, తేజోముఖియైన పార్వతి ప్రతిమను గోధారథంపై ప్రతిష్ఠించి తెచ్చివుంచి దానిని గంధ, పుష్ప, దీప, రక్తచందన, కేసర, మధురద్రవ్య, స్వర్ణ, మాణిక్యాదులతో పూజించి అఖండ సౌభాగ్యాలను ప్రసాదించుమని కోరుతూ దేవినిలా ప్రార్థించాలి.

ఓం భూషితాదేవభూషాచ భూషికా లలితా ఉమా

తపోవనరతాగౌరీ సౌభాగ్యం మేప్రయచ్ఛతు

దౌర్భాగ్యం మేశమయతు సుప్రసన్న మనాః సదా

అవైధవ్యం కులేజన్మ దదాత్వ పరజన్మని (ఉత్తరపర్వం - 26/3,4)

తరువాత పూలు, జీలకఱ్ఱ, ఉప్పు, బెల్లం, నెయ్యి, పూలమాలలు, కుంకుమ, గంధం, అగరు, చందనం, సిందూరం, వస్త్రాలు, దేశీయ అంజనాలు, తిలలు, తండులాలు, నెయ్యికూరిన కుడుములు ఇత్యాది నైవేద్యాలు తీసుకువచ్చి మధూక వృక్షానికి నియమ నిష్ఠలతో పూజచేయాలి. ఆ తరువాత దానికి ప్రదక్షిణలు చేసి బ్రాహ్మణులకు దక్షిణలివ్వాలి. ఈ ఉత్తమ తృతీయ వ్రతాన్ని చేసే కన్యకు మూడు లోకాల్లోనూ ఉత్తముడైన, విష్ణువులాంటి భర్త లభిస్తాడు. రాజా! ఈ వ్రతం చిరకాలం దాకా ప్రసిద్ధమైవుంటుంది. ఈ వ్రతాన్ని మొట్టమొదట రుక్మిణి కన్యగా వుండగా ఆమెచేత కశ్యపమహర్షి చేయించాడు. ఈ వ్రతాన్ని చేసే స్త్రీ ఏ రోగమూ లేకుండా, సుందరంగా, దృష్టి సంపన్నయై, ప్రత్యంగ శోభ తగ్గకుండా చిరకాలం జీవించి దేహాంతంలో రుద్రలోకం చేరుకొని అక్కడ పతితోపాటు దివ్యభోగా లనుభవించి అష్టసిద్ధులనూ పొందుతుంది.

ఆ తరువాత ధర్మరాజు అభ్యర్థన మేరకు శ్రీకృష్ణుడు మేఘపాలీ వ్రతాన్ని ఇలా ఉపదేశించాడు:

“ధర్మజా! ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలుగాని పురుషులుగాని భక్తిపూర్వకంగా సద్ధర్మ ప్రాప్తికై సప్తధాన్యాలతోనూ గోధుమ అంకురాలు లేదా తిల తండుల పిండాలు కలిపి అర్ఘ్య ప్రదానం చెయ్యాలి. మేఘపాలి అనేది తమలపాకుతో సమానమైన ఆకులతో, మంజరీయుక్తమైన ఎఱ్ఱని రంగులో వుండే ఒక తీగ. ఇది వాటి కలలోనూ గ్రామాలకు పోయే దారుల్లోనూ పెరుగుతుంది. పర్వతాలపై బాగా పెరుగుతుంది. వ్యాపార జీవనులైన వైశ్యులు, ధాన్య, తైల, కుంకుమ,(పదాదులనగా చెప్పులు, గొడుగు, గుడ్డ, ఉంగరం, కమండలం, ఆసనం, కుండ, భోజ్యవస్తువులు) స్వర్ణ, అసిత శర్కర, కుంకుమ పదాదులతో దీనిని పూజిస్తారు.

మేఘపాలికి అర్ఘ్యమీయడం వల్ల మనం తెలిసి, తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. శ్రేష్ఠ స్త్రీలు శుభదేశంలో గాని ప్రదేశంలోగాని పుట్టిన మేఘపాలి తీగకు ఫల, గంధ, పుష్ప, అక్షత, నారికేళ, ఖజూర, కనేర, ధూప, దీప, దధ్యాదులతోనూ అప్పుడే అంకురించిన ధాన్య సమూహాలతోనూ పూజలుచేయాలి దానిని ఎఱ్ఱటి వస్త్రంతో కప్పి పుప్పొడితో అలంకరించి అర్ఘ్యమివ్వాలి. ఆ అర్ఘ్యాన్ని విద్వాంసులైన బ్రాహ్మణులకు సమర్పించాలి. ఈ విధంగా మేఘపాలిని పూజించేవారికి సకలైశ్వర్యాలూ ప్రాప్తించి సుఖ సౌభాగ్యాలు లభించగా నూరేళ్ళు జీవిస్తారు. మరణానంతరంవారు విమానారూఢులై విష్ణు లోకాన్ని చేరుకుంటారు. అంతేగాక తమ పూర్వీకులలో ఏడు తరాల వారిని తరింపజేసి నరకంలో నున్నవారినైనా సరే స్వర్గానికి పంపిస్తారు. ఈ వ్రతం(ఇక్కడ వనస్పతుల పూజకు విశేష మహత్త్వ ప్రదానం చేయబడింది. ముఖ్యంగా అథర్వ వేదంలో ఎన్నో ప్రకరణాలలో ఇటువంటి విశేషాలు వర్ణింపబడ్డాయి. నిజానికి ఔషధాలూ దేవతలే వాటిని పూజించి సేవించడం వల్ల మానవులు ఆరోగ్యవంతులై ధర్మార్థ సాధకులుగా కాగలరు.) వల్ల దుఃఖాలన్నీ సూర్యకాంతికి చీకట్లవలె పటాపంచలై పోతాయి.”