భవిష్య పురాణము

207 - ఉపసంహారం

శ్రీకృష్ణుడు చివరగా ఇలా ఉపదేశించాడు, “మహారాజా! వ్రత, దాన, ధర్మ విషయాలు బాగానే విన్నావు కదా! ఈ సంపూర్ణ విశ్వానికి మూలం ధర్మమే. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ ధర్మపరాయణులు కావాలి. ధర్మాన్నే గాని అర్థకామాల్ని పెద్దగా ఉపదేశించవలసిన పని లేదు. అవి అందరికీ తెలిసినవే. సదాచార సంపన్నులై పురుషులు చేయవలసిన దాన సమూహాలన్నిటినీ వర్ణించాను. ఇతిహాసాల్లో, పురాణాల్లో, వేదవేదాంగాలలో నేను చూసిన ధర్మాలన్నిటినీ చెప్పాను. వేదవిరుద్ధంగా గానీ లోక విరుద్ధంగా గానీ ఎప్పుడూ వెళ్ళకూడదు. నీ పట్ల నాకున్న స్నేహం వల్ల గోపనీయ వ్రతాలెన్నో చెప్పాను. దాంభికులకూ శఠులకూ వీటిని చెప్పరాదు. సదాచారీ, జితేంద్రియుడూ, సత్యరతుడూ, పవిత్రుడూ ఐన వ్యక్తి వద్దనే వీటిని చెప్పాలి. నీవు సాక్షాత్ ధర్మస్వరూపుడవు, తత్త్వమర్శజ్ఞుడువు, భూత భవిష్యద్ జ్ఞాతవు. నా నుండి తెలుసుకోవాలనే కోరికను ప్రకటించావు గనుక చెప్పాను గానీ నీకు తెలియనివి తక్కువ. ధర్మం ఎవరు చెప్పినా వినాలి. అది నిత్య నూతనం. అంతా కాలాధీనం కాబట్టి దేనికీ బాధపడకుండా, అందరూ ఉన్నంతలోనే ఆనందంగా వుండాలి. ఇక నేను ద్వారకకు వెళ్ళి వస్తాను.”

పాండవులంతా వచ్చి ఆయనకు పాదాభివందనం చేశారు. శ్రీ కృష్ణుడు బ్రాహ్మణులందరికీ నమస్కారం చేసి అలాగే చేతులు జోడించివుంచి వెళ్ళి రథారూఢుడై నిష్క్రమించాడు.”

ఇంతవఱకు చెప్పి ఇలా అన్నాడు. వ్యాస శిష్యుడు సుమంతుడు, “శతానీక మహారాజా! యాజ్ఞవల్క్య మహాముని వసిష్ఠ మహర్షిని అడిగి పొందిన జ్ఞానాన్నీ, యుధిష్ఠిర మహారాజు శ్రీ కృష్ణ పరమాత్మ ద్వారా అందుకొన్న అనుగ్రహ భాషణాన్నీ మా గురువుగారు వేదవ్యాస మహర్షి మాకు బోధించినట్లే నీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. మా గురువుగారికి నమస్కారము.

ఉత్తర పర్వం సంపూర్ణం

శ్రీ భవిష్య మహాపురాణం సంపూర్ణం.