మహారాజా! ఫాల్గున పూర్ణిమతో మొదలుపెట్టి ఏడాదిపాటు చేయవలసిన వ్రత మొకటుంది. ఇది అన్ని మనోరథాలనూ సిద్ధింపజేస్తుంది. వ్రతి ఆరోజు స్నానం చేసి లక్ష్మీ సహిత జనార్దన భగవానుని పూజ చేయాలి. ఆ రోజంతా ఏం చేస్తున్నా జనార్దనునే స్మరిస్తూ వుండాలి. పాఖండులతో, పతితులతో, నాస్తికులతో, చండాలురతో సంభాషించరాదు. జితేంద్రియుడై వుండాలి. రాత్రి చంద్రునిలోనే లక్ష్మీ నారాయణులను ఆరోపించుకొని ఆయనకి అర్ఘ్యమివ్వాలి. ఈ రకంగా చైత్ర వైశాఖ జ్యేష్ఠ - ఈ మూడు నెలల్లో పూజ, అర్ఘ్య ప్రదానాలను చేసి తొలిపారణం చేయాలి. ఆషాడ శ్రావణ భాద్రపద ఆశ్వయుజ ఈ నాలుగు పున్నములలో శ్రీ సహిత శ్రీధర దేవుని పూజించాలి. అర్ఘ్య ప్రదానం చేసి రెండవ పారణను చేయాలి. కార్తిక, మార్గశిర, పుష్య, మాఘ ఈ నాలుగు పున్నములకూ భూతీ సహిత కేశవ భగవానుని పూజించాలి. మూడవ పారణం సంపన్నం చేయాలి. ప్రతి పారణాంతమున బ్రాహ్మణులకు దక్షిణలివ్వాలి. ప్రథమ పారణ నాలుగు నెలల్లో పంచగవ్యాలనూ, ద్వితీయ పారణ నాలుగు నెలల్లోనూ కుశోదకాన్నీ, చివరి నాలుగు నెలల్లో సూర్యకిరణాలచే వేడి చేయబడిన నీటినీ ప్రాశ్నం చేయాలి. ప్రతినెలా జలకుంభం, చెప్పులు, గొడుగు, బంగారం, బట్టలు, భోజన దక్షిణలు బ్రాహ్మణులకివ్వాలి. సర్వదేవతాధీశుడగు భగవానుని మృగశిరాది పన్నెండు మాసాల్లో కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర - ఈ నామాలతో కీర్తించే వ్యక్తి దుర్గతి నుండి ఉద్ధరింపబడతాడు. ప్రతి నెలలోనూ దానమిచ్చే సామర్ధ్యం లేకపోతే సంవత్సరాంతంలో యథాశక్తి సువర్ణంతో చంద్ర బింబాన్ని తయారుచేయించి ఫల, వస్త్రాదులతో దానిని పూజించి బ్రాహ్మణునికి సమర్పించుకోవచ్చును. ఈ రకంగా వ్రతం చేసే పురుషునికి అనేక జన్మాలదాకా ఇష్టమైనదేదీ దూరంకాదు. అతని మనోరథాలన్నీ పూర్తికాగా బహుకాలం జీవించి నారాయణ స్మరణ చేస్తూ దివ్యలోకాలకి పోయే భాగ్యమబ్బుతుంది.
అశోక పూర్ణిమా వ్రతమును ఆచరించినవారికి ఎప్పటికీ శోకం కలుగదు. ఫాల్గున పూర్ణిమనాడు అన్ని అంగాలకూ మట్టిని రాసుకొని నదిలోగాని జలాశయంలోగాని స్నానం చేయాలి. మట్టితో నొక వేదిని తయారుచేసి దానిపై భూధరుడైన విష్ణువునీ అశోకా నామధారిణియైన భూదేవినీ స్థాపించి పుష్పనైవేద్యాది సకలోపచారాలతోనూ పూజించాలి. అనంతరం చేతులు జోడించి ఇలా ప్రార్థించాలి. ‘హే ధరణీ దేవీ! నీవు సంపూర్ణ చరాచర జగత్తునే ధరించి భరిస్తున్నావు. ఎలాగైతే నిన్ను శ్రీ మహావిష్ణువు రసాతలం నుండి ఉద్ధరించి తీసుకువచ్చి శోకవిరహితను చేశాడో అలాగే నీవు నన్ను దుఃఖ సాగరం నుండి ఉద్ధరించి అన్ని శోకాలనుండీ విముక్తుని చేసి నా కోరికలన్నీ నెరవేరునట్లు చేయవలసింది.’
అని విన్నవించి ఆ రాత్రి చంద్రునికి అర్ఘ్య ప్రదానం చెయ్యాలి. ఆ రోజు ఉపవాసం చెయ్యాలి లేదా రాత్రి నూనె, ఉప్పు లేకుండా భోజనం చెయ్యాలి. ఫాల్గునం నుండి నాలుగేసి మాసాలకొక పారణం చొప్పున చెయ్యాలి. ప్రతి పారణానికీ విశేష పూజలు చేసి రాత్రి జాగరముండాలి. ప్రథమ పారణలో ధరణీ నామంతో, ద్వితీయ పారణంలో మేదినీ నామంతో తృతీయంలో వసుంధరా నామంతో భూదేవిని పూజించాలి. సంవత్సరాంతంలో సవత్సగోవునూ, భూమినీ, వస్త్రాలనూ, భూషణాలనూ బ్రాహ్మణులకు దానం చేయాలి. ఈ వ్రతాన్ని పాతాళంలో వుండగా భూదేవి చేయగా విష్ణువు వరాహ రూపంలో వచ్చి ఆమెనుద్ధరించి ప్రసన్నతా పూర్వకంగా ఇలా వరమిచ్చాడు. ‘ఓ ధరణీ దేవీ! నీ ఈ వ్రతం వల్ల నేను సంతుష్టుడనయినాను. లోకంలో పురుషులుగాని స్త్రీలుగాని ఈ వ్రతం చేసి నాతోబాటు నిన్ను కూడా పూజించి యథావిధిగా పారణ చేస్తే వారికి ఏ జన్మలోనూ ఏ శోకమూ కలగకుండా చూస్తాను. నిన్ను కాపాడినట్లే వారిని కూడా రక్షిస్తాను.”
ఓ ధర్మరాజా! అశోకవ్రతం నిస్సందేహంగా భూదేవి దయవల్ల అన్ని శోకాలనూ నశింపజేస్తుంది.”