భవిష్య మహా పురాణము
126 - 129 - మరణాసన్న ప్రాణికర్తవ్యాలు - ధ్యానంలో చతుర్విధ భేదాలు
“పరంధామా! పుట్టిన ప్రతి ప్రాణికీ మరణము తప్పదు కదా! అందరి మరణమూ అకస్మాత్తుగా రాకపోవచ్చు. చాలామందికి మరణం ఎప్పుడో తెలియకపోయినా దగ్గర పడిందని తెలుస్తుంది. జ్యోతిశ్శాస్త్రం ద్వారా కూడా ఇంచుమించుగా తెలుసుకోవచ్చు. అలాటివారు అంటే నాలాంటివారు చేయవలసిన విధులను వినిపించండి” అని అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడిలా బోధించాడు.
“ధర్మరాజా! అలాంటివారు గరుడ ధ్వజుడూ భగవానుడూనైన విష్ణుదేవుని వీలైనపుడల్లా కాకుండా వీలు చేసుకొని మరీ స్మరిస్తుండాలి. స్నానం చేసి పవిత్రులై శుద్ధ శ్వేత వస్త్రాన్ని ధరించి అనేక ప్రకారాలు పుష్పాది ఉపచారాలతో నారాయణుని పూజించాలి, వివిధ స్తోత్రాలద్వారా స్తుతించాలి. శక్తిమేరకు గో, భూ, సువర్ణ, వస్త్రాది దానాలు చేస్తుండాలి. బంధు, పుత్ర, మిత్ర, స్త్రీ, క్షేత్ర, ధన, పశు, ధాన్యాదుల నుండి చిత్తము వైదొలగునట్లు చేసుకొని, మమత్వ పరిత్యాగాన్ని ప్రారంభించి కొనసాగించాలి. మిత్రులు, శత్రువులు అనే భావాన్ని విడనాడుకోవాలి. తనకు ఇతరులు చేసిన అపకారాలను, తాను ఇతరులకు చేసిన ఉపకారాలను మరచిపోయి చిత్తశాంతిని అలవఱచుకోవాలి. శుభాశుభ కర్మలను పరిత్యజించి ‘నాకు దశదిశలా, శరీరంలోపలా విష్ణువే విరాజమానుడగు చున్నాడు’ అని పదే పదే ఈ శ్లోకాల ద్వారా స్మరణ, ఆత్మసమర్పణ చేయాలి.
పరిత్యజ్యామ్యహం భోగాంస్త్యజామి సుహృదోఽఖిలాన్।
భోజనం హి మయోత్సృష్టముత్సృష్టమనులేపనం॥
స్రగ్భూషణాదికం గేయం దాన మాసన మేవచ ।
హోమదాయః పదార్ధాయేయేచ నిత్యక్రమాగతాః॥
నైమిత్తికాస్తథా కామ్యాః శ్రద్ధధర్మాదయోజ్ఞితాః
త్యక్తాశ్చశ్రమికా ధర్మా వర్ణధర్మాస్తతోజ్ఘితా॥
పద్‌భ్యాం కరాభ్యాం విహరన్ కుర్వాణః కర్మచోద్వహన్ః
నపాపం కస్య చిత్‌న్యాయ్యాః ప్రాణినః సంతు నిర్భయాః॥
నభసి ప్రాణినోయేచయే జలేయేచ భూతలే।
క్షితోర్వివరగా యే చయేచ పాషాణ సంపుటే॥
ధాన్యాదిషు చవస్త్రేషు శయనేష్వాసనేషు చ।
తే స్వయంతు విబుధ్యంతే దత్తం తేభ్యోఽభయంమయా॥
నమేఽస్తి బాంధవః కశ్చిద్విష్టుం ముక్త్వా జగద్గురుం॥
మిత్రపక్షే చమే విష్ణురధశ్చోర్ధ్వం తథా పునః
పార్శ్వతో మూర్ధ్ని హృదయే బాహుభ్యాం చైవ చక్షుషోః॥
శ్రోత్రాదిషు చ సర్వేషు మమ విష్ణుః ప్రతిష్ఠితః॥ (ఉత్తరపర్వం 126/9 -16)
ఈ విధంగా అన్నీ వదిలేసి సర్వేశుడు, భగవానుడు నగు అచ్యుతుని మనసులో నిడుకొని నిరంతరం వాసుదేవ నామ సంకీర్తనాన్నే చేస్తుండాలి. మృత్యువు మరీ సమీపానికి వచ్చినపుడు దక్షిణాగ్రంలో కుశదర్భలు పఱచి తూర్పు లేదా ఉత్తరంవైపు తలను పెట్టుకొని శయనించి జగత్పతీ భగవంతుడునగు విష్ణువును ఇలా తలవాలి.
విష్ణుం జిష్ణుం హృషీకేశం కేశవం మధుసూదనం।
నారాయణం నరం శౌరిం వాసుదేవం జనార్దనం॥
వారాహం యజ్ఞ పురుషం పుండరీకాక్ష మచ్యుతం।
వామనం శ్రీధరం కృష్ణం నృసింహపరాజితం॥
పద్మనాభ మజం శ్రీశం దామోదర మధోక్షజం।
సర్వేశ్వరేశ్వరం శుద్ధ మనంతం విశ్వరూపిణం।
చక్రిణం గదినం శాంతం శంఖినం గరుడధ్వజం।
కిరిట కౌస్తుభ ధరం ప్రణమామ్య హమవ్యయం।
అహమస్మి జగన్నాథ మయి వాసం కురుద్రుతం।
ఆవయోరంతరం మాస్తు సమీరాకాశయోరివ॥
అయం విష్ణురయం శౌరిరయం కృష్ణః పురోమమః
నీలోత్పల దళశ్యామః పద్మపత్రాయ తేక్షణః॥
ఏషపశ్యతుమామీశః పశ్యామ్యహమధోక్షజం।
ఇత్థం జపేదేకమనాః స్మరన్ సర్వేశ్వరం హరిం॥ (ఉత్తరపర్వం 126/19-25)
పై మంత్రంలో చివరి పాదాలకు అర్థమేమనగా ‘నేను నీలకమల సమాన శ్యామల వర్ణుడును, కమలనయనుడునైన శౌరి, విష్ణువు లేదా శ్రీకృష్ణుడవైన నిన్ను చూస్తున్నాను. నీవు కూడా నన్ను చూడవలసింది’ అని.
అపుడు చివరగా ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపిస్తూ వుంటే కొంతసేపటికి ఏ వ్యక్తికైతే ప్రసన్నముఖంతో, శంఖచక్రగదా పద్మాలను ధరించిన చేతులతో, కేయూర కటక కుండల శ్రీవత్సాదులతో, పీతాంబరధారియై, నవీన మేఘ సమాన శ్యామల వర్ణుడైన విష్ణుభగవానుని ధ్యానిస్తూ మనోనేత్రంతో దర్శిస్తూ వుండగా ప్రాణం పోయి, పాప విముక్తి జరుగుతుందో అతని లేక ఆమె ఆత్మయే అప్పటికప్పుడు పరమాత్మలో లీనమైపోతుంది.”
“భగవన్! మీరు సెలవిచ్చిన ఈ విధి అంత్య సమయంలో కూడా స్వస్థచిత్తతతో నుండే వారికే సంభవమౌతుంది. అంత్య సమయంలో రోగం లేకుండా వివేక బుద్ధితో వుండడం సులభం కాదు. చిత్త వృత్తి మోహగ్రస్తమై పోతుంది. అతివృద్ధులకూ, రోగులకూ ఈ కుశాసన, ధ్యానములు కష్టమే అవుతాయి. కాబట్టి ఓ కరుణామయా! కృష్ణదేవా! ఏదైనా సులభమైన ఉపాయాన్ని ఆదేశించండి.”
“ధర్మరాజా! ఆసన గ్రహణం, శయనం సంభవం కానపుడు శరీరం ఎలా వున్నా, మనసును నలువైపుల నుండీ వెనుకకు తెచ్చుకొని దానిని గోవిందుని మీద లగ్నం చేసి ఆయన స్మరణాన్నే చేస్తూ ప్రాణం వదలాలి.
తిష్ఠన్ భుంజన్ స్వపన్ గచ్ఛంస్తథా ధావన్నితస్తతః।
ఉత్క్రాంతికాలే గోవిందం సంస్మరంస్తన్మయో భవేత్॥
యంయంచాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం।
తం తమే వైతి కౌంతేయ సదాతద్భావ భావితః॥ (ఉత్తరపర్వం-126/39,40)
ఎందుకంటే ఆ సమయంలో ఇతరేతర భావాలేవీ మదిలో కదిలినా అవే ప్రాప్తించి మరో జన్మ వచ్చి వేస్తుంది కాబట్టి అన్ని భావాలనూ త్యజించి భగవంతునే భావించాలి.
ఒకప్పుడు మార్కండేయ మహర్షి నాతో ఒక మాట చెప్పాడు. రాజ్యం, భోగాలు, శయనం, భోజనం, వాహనం, మణి, స్త్రీ, గంధం, మాల్యం, వస్త్రం, ఆభూషణం - వీటిపై అత్యంత మోహం వుంటే అది రాగజనిత ‘ఆద్య’ ధ్యానమన్నాడు.
జ్వలింపజేయుట, చంపుట, ఎవరిపైననో పగ తీర్చుకొనుట, ద్వేషం ఇలాటివన్నీ క్రోధజనిత ‘రౌద్ర’ ధ్యానమని చెప్పాడు.
వేదార్థ చింతన, ఇంద్రియోప శమనం మోక్ష చింత, లోక కల్యాణ భావన వంటి ధర్మపూర్ణ ఆలోచనలే ఆ సమయంలో హృదయంలో కదలాడుతుంటే అది ‘ధర్మం’ ధ్యానం అవుతుందన్నాడు. సమస్త ఇంద్రియాలూ వాటి వాటి విషయ వాంఛల నుండి నివృత్తాలై పోయి హృదయం నుండి ఇష్టానిష్టాలు నిష్క్రమించి ఆత్మ స్థిరంగా నుండి, ఏకమాత్ర పరమాత్మ చింతననే చేస్తూ వుంటే ఆ ధ్యానాన్ని ‘శుక్లధ్యాన’ మంటారని మార్కండేయ మహర్షి బోధన.
ఓ పాండవాగ్రజా! మరణ సమయంలో ‘ఆద్య’ ధ్యానం వుంటే పశుజన్మ, ‘రౌద్ర’ ధ్యానానికి నరకప్రాప్తి, ‘ధర్మ’ ధ్యానానికి స్వర్గప్రాప్తి, ‘శుక్ల’ ధ్యానానికి మోక్షప్రాప్తి వుంటాయని మార్కండేయ మహర్షి చెప్పాడు.
పశు.జన్మలోనే మానవ జన్మ కూడా అంతర్గతము. మోక్షప్రాప్తి అనగా భగవంతునిలో లీనము. కాబట్టి ‘శుక్ల’ ధ్యానంలోనే జీవితాన్ని అంత్యకాలాన్నీ గడపాలి.”
(ఇష్టాపూర్త మహిమ అనే అధ్యాయములోని విషయం - వాపీకూపతటాక ఉద్యానాది ప్రతిష్ఠ - మధ్యమ పర్వ తృతీయ భాగంలో చెప్పబడింది.)