భవిష్య మహా పురాణము
47 - సప్తమీ కల్పం - సూర్యపరివారం శాక సప్తమి
మహారాజా! సప్తమీ తిథిని గూర్చి చెపుతున్నాను. సూర్యభగవానుడు సప్తమినాడే ఆవిర్భవించాడు. ఆయన అండంలోంచి వచ్చాడు. అండములో చాలాకాలం పాటు వృద్ధినొందడం వల్ల ఆయనను మార్తండ నామంతో పిలుస్తారు. అండంలోనున్న కాలంలోనే దక్షప్రజాపతి తన కూతురైన ‘రూప’ అనే రూపవతి నాయన కిచ్చి వివాహం చేశాడు. (రూప యొక్క మరో పేరు సంజ్ఞ మిగతా పురాణాల్లో ఈమె విశ్వకర్మ కూతురని చెప్పబడింది.) దక్షుని యాజ్ఞచే విశ్వకర్మ సూర్యుని శరీరాన్ని సంస్కరించాడు. దానివల్ల సూర్యుడు అతిశయతేజస్వి అయ్యాడు. రూపకు సూర్యునివల్ల యముడు, యమి అను పిల్లలు పుట్టారు. సూర్యుని తేజస్సును సహించలేక రూపాదేవి తన ఛాయనుండి ఒక స్త్రీ మూర్తిని సృజించి సూర్యపత్ని స్థానంలో వుంచి తపస్సు కొరకై ఉత్తర కురు దేశానికి పోయి అక్కడ ఆడుగుఱ్ఱం రూపంలో తపస్సు చేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ కొన్నేళ్ళు ఉండిపోయింది.
ఇక్కడ సూర్యుడు ఛాయ ద్వారా శనైశ్చర, తపతి అనే ఇద్దరికి తండ్రియైనాడు. సహజంగానే ఛాయ తన పిల్లలనే ఎక్కువచేసి చూసుకోసాగింది. ఒకరోజు ఆడపిల్లలిద్దరి మధ్యనా ఏదో వాగ్వాదం జనించి ఒకరినొకరు శపించుకొని ఇద్దరూ నదులై పోయినారు. అవియే నేటి పవిత్ర నదులు యమున, తపతి. ఒకరోజు ఛాయ యముడిని కొట్టింది. అప్పటికే క్రుద్ధుడైయున్న యముడామెను తంతానంటూ కాలెత్తాడు. ఆమె కోపించి “మూఢుడా! నాపై కాలెత్తుతావా. నీవు ప్రాణుల హింసించడమే ప్రధానకర్మగా జీవిస్తావు గాక! ఈ కలుషితమైన పాదాన్ని నేలపై పెడితే పురుగులు తినెయ్యాలి గాక” అని శపించింది. సరిగ్గా అప్పుడే అక్కడికి సూర్య భగవానుడేతెంచాడు. యముడాయనతో “ఓ తండ్రీ! ఈమె మా తల్లి ఏమాత్రమూ కాదు. ఇంకెవరో స్త్రీ మా అమ్మ రూపంలో వచ్చివుంది. నన్నూ యముననూ తన పిల్లలతో సమానంగా ఏనాడూ చూడలేదు. మాపట్ల మిక్కిలి క్రూరంగా ప్రవర్తిస్తోంది. అని విన్నవించాడు. సూర్యుడు వెంటనే కుపితుడై నీ నలుగురు సంతానంలోనే ఇద్దరిని తేడాగా చూడడం ఉచితంగా లేదు. కన్నతల్లికి బిడ్డలందరూ ఒకటేకదా! నీకీ విషమ దృష్టి ఎలా సంభవించింది? అని అడిగాడు.
ఆమె బదులు పలకలేదు. యముడే మళ్ళా ఇలా చెప్పాడు. “ఈమె నా కన్నతల్లి కాదు. అందుచేతనే నన్ను శపించింది. ఈమె నా తల్లి కానే కాదు. ఆమె యొక్క ఛాయ” అనంతరం మొత్తం వ్యవహారాన్నంతటినీ యముడు తండ్రికి విన్నవించాడు.
సూర్యభగవానుడంతా తెలుసుకున్నవాడై ఇలా అభయమిచ్చాడు. నాయనా! బాధపడకు. నీ కాలినుండి వెలువడే క్రిములు మాంస రక్తాలను పొంది భూలోకానికేగి అక్కడ మేలు చేస్తాయి. బ్రహ్మదేవుని ఆజ్ఞతో నీవు లోకపాలుడవై దిక్పాలక పదవిని చేపడతావు. నీ సోదరి యమున నదీ జలాలు గంగానది జలాలతో సమానంగా పవిత్రతను సంతరించుకుంటాయి. తపతి కూడా పవిత్ర నర్మదకు సమానంగా వర్ధిల్లుతుంది. ఇక ఈ ఛాయకు విముక్తిలేదు. అందరి శరీరాలనూ అంటుకొనివుంటుంది.
ఈ విధంగా యమునికి అభయమిచ్చి ఛాయను శపించిన సూర్యుడు దక్ష ప్రజాపతి వద్దకు పోయి మొత్తం కథను చెప్పాడు. ఆయన “హే భగవాన్! తమ యొక్క అతి ప్రచండ తేజస్సును తట్టుకోలేక తమ భార్య ఉత్తర కురుదేశానికి పోయి తపస్సు చేసుకుంటోంది. తమ రూపాన్ని సాధారణ స్త్రీలు తట్టుకొనగలిగే స్థాయికి తెస్తూ పరమ సుందరంగా తయారుచేస్తూ తమ తేజస్సు తగ్గకుండా వుండేలాగా, తమరు అనుమతిస్తే విశ్వకర్మను నియమిస్తాను.” అని విన్నవించాడు.
విశ్వకర్మ సూర్యుని రూపాన్ని ఆయన ఆలోచనలకు అనుగుణంగానే తయారు చేయగలిగాడు. అయితే ఈ మారు సూర్యుని తేజస్సు ఆయననే ఉష్ణపీడితుని చేయసాగింది. అపుడు విశ్వకర్మ రక్తచందన, కరవీర పుష్పాలను శరీరంపై సంపూర్ణంగా పెట్టుకొమ్మన్నాడు. వాటి ద్వారా బాధనుండి విముక్తి పొందిన సూర్యుదేవునికి నేటికీ ఆ రక్త చందన, కరవీర (గన్నేరు) పుష్పాలంటే చాలా ప్రీతి. అవే ఆయన పూజలో ప్రయుక్తాలవుతాయి. ఆ సమయంలో సూర్యుని నుండి వెలువడిన తేజస్సు వజ్రాయుధం తయారీలో ఇంద్రునికుపయోగపడింది.
అపుడు సూర్యుడు ఉత్తర కురుదేశం వాయు వేగంతో చేరుకుని అక్కడ అశ్వనిగా నున్న తన భార్యను చూసి తాను కూడా అశ్వరూపాన్ని ధరించి ఆమె వద్దకు పోయాడు. అప్పుడు జన్మించిన అశ్వనీపుత్రులు సూర్యతేజస్సు మహత్తువలన దేవ వైద్యులయ్యారు. ఆ తరువాత సూర్యపుత్రునిగా రేవంతుడుదయించాడు. సూర్యుడు పుట్టినదీ, ఆయన భార్య మరల లభించినదీ, మంచిరూపు వచ్చినదీ, సంతానం కలిగినదీ, అన్నీ సప్తమి నాళ్ళలోనే. అందుచేతనే ఆయనకు సప్తమి అంటే ఇష్టం.
(సూర్యాహార వ్రతం ఒకటుంది) ఎవరైతే పంచమినాడు ఒక్కమారే భోజనం చేసి, షష్ఠినాడు ఉపవాసం చేసి, సప్తమినాడు దినమంతా నిరాహారంగా వుండి మంచి మంచి భక్ష్య భోజ్యాలను వివిధ శ్రేష్ఠశాకాలతో సూర్యునికర్పించి బ్రాహ్మణులకిచ్చివేసి తాము రాత్రి మౌనంగా భోజనం చేస్తారో వారికి అనేకములైన సుఖాలు, సర్వత్ర విజయాలు ప్రాప్తిస్తాయి. అంత్యకాలంలో విమానారూఢులై సూర్యలోకం చేరి అక్కడ ఎన్నో మన్వతరాలుండి మరల భూలోకంలో పుట్టినపుడు వారు పుత్ర పౌత్రాభివృద్ధి, దీర్ఘాయువు గల చక్రవర్తులుగా జన్మిస్తారు. ఎన్నోయేళ్ళు భూమిని పరిపాలిస్తారు.
కురురాజు ఈ వ్రతాన్ని చాలాకాలం అనుష్ఠించాడు. కేవలం శాకాహారాన్నే భుజించాడు. ఆయన పేరిటనే కురుక్షేత్రమేర్పడింది. అదే ధర్మక్షేత్రమై పుణ్యక్షేత్రమై నిలబడింది చరిత్రలో. సప్తమి, నవమి, షష్ఠి, తదియ, పంచమి ఉత్తమ తిథులు. అవి స్త్రీ పురుషుల మనోవాంఛితాలను నెరవేర్చే శక్తి గలవి. మాఘసప్తమి, ఆశ్వయుజ నవమి, భాద్రపద షష్ఠి, వైశాఖ తదియ, భాద్రపదంలోనే పంచమి గొప్ప ప్రశస్తమైన తిథులుగా పేరు గాంచాయి. అయితే, కార్తిక శుద్ధ సప్తమినాడే ఈ వ్రతాన్ని ప్రారంభించడం మంచిది. ఉత్తమ శాకమును సిద్ధం చేసి బ్రాహ్మణులకు దానమిచ్చి ప్రతి కూడా ఆ రాత్రి అదే కూరను తినాలి. ఇలా నాలుగు మాసాలపాటు చెయ్యాలి. చివరిరోజు పంచగవ్యములతో సూర్యభగవానునికి స్నానం చేయించి తాను కూడా వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. తరువాత కేసర చందనాలు, అగస్త్య పుష్పాలు, అపరాజితమను పేరుగల ధూపములనిచ్చి, పాయస నైవేద్యాన్ని సూర్యనారాయణస్వామికి సమర్పించాలి. బ్రాహ్మణులకు పాయసంతో భోజనం పెట్టాలి. రెండవ పారణంలో కుశజలంతో స్వామికి స్నానం చేయించి తాను గోమయాన్ని స్వీకరించాలి. ఆ తరువాత శ్వేతచందనం, సుగంధితపుష్పాలు, అగరు ధూపములనిచ్చి బెల్లంతో చేసిన మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి. ఇక ఏడాది చివర్లో మూడవ పారణ చెయ్యాలి. ఎఱ్ఱని(సర్షపం అంటే ఆవాలు. మరి ఇక్కడ ఆవనూనె అనుకోవాలేమో) సర్షపంతో స్వామికి అభ్యంగనం చేయించితే పాపాలన్నీ సంపూర్ణంగా నశిస్తాయి. మరల రక్తచందనం, గన్నేరుపూలు, గుగ్గిల ధూపము కైసేసి అనేక భక్ష్యభోజ్య సహితమైన పెరుగన్నమును సూర్య దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. దీనినే బ్రాహ్మణులకు భోజనంగా వడ్డించాలి. సూర్యనారాయణుని ప్రతిమ నెదురుగా బెట్టుకుని బ్రాహ్మణునిచే పురాణ శ్రవణం చేయించుకోవాలి. వ్రతికి వస్తే స్వయంగానే ఆ పుణ్యకార్యాన్ని చేయవచ్చు. మరల బ్రాహ్మణులకు భోజనాలుపెట్టి, పురాణ శ్రవణం చేసిన పంతులు గారికి బట్టలు భూషణాలు, దక్షిణలను సమర్పించి ప్రసన్నుని చేసుకోవాలి. ఆయన సంతుష్టుడైతే సూర్యనారాయణ మూర్తి కూడా సంతసిస్తాడు. ఈ శాక సప్తమీ వ్రతమంటే సూర్యునికి ప్రీతి. దీన్ని చేసిన పురుషుని ఆయనే భాగ్యశాలిగా అనుగ్రహిస్తాడు.”
Summary of chapter 29 of the Bhavishya Mahā Purana is as follows:
The Gaṇapati Kalpa presents the esoteric or tantric dimension of Gaṇeśa worship alongside the more exoteric pūjā procedures. The mūla mantras of Gaṇeśa — the seed syllables by which his presence is invoked — are given, and their powers described: mantras for śānti, for vaśīkaraṇa (attracting others to oneself), for uccāṭana (removing an enemy's influence), for eliminating disease, and for obtaining success in examinations and competitions. The materials to be used for each purpose — specific woods, flowers, incense, and food offerings — are specified. The chapter represents the integration of the Āgamic-Tantric tradition of Gaṇeśa worship into the Purāṇic framework of the Bhaviṣya, making available to the householder the powerful ritual technology developed by the tantric schools.