ఇన్ని దానాలనూ, వ్రతాలనూ వినిపించినా ధర్మరాజులో ఇంకా తెలుసుకోవాలనే ఉత్కంఠ తగ్గలేదు. దీనిని గమనించి, శ్రీకృష్ణుడు ముచ్చటపడి ఇలా అన్నాడు:
“యుధిష్ఠిర మహారాజా! నీవు ఇంకా ఏదో వినాలనే కోరికతోనేవున్నావు. ముందుగా ఒక పది మహాదానాలను క్లుప్తంగా వినిపిస్తాను.
ఈ దశ మహాదానాలలో మొదటిది కాల పురుషదానం. మనం ఏ దానం చేసినా త్రికరణశుద్ధిగా చేయాలి. దాత తన శ్రద్ధ వల్ల పలుకుబడి వల్ల మరో పది మంది ధనికులను దాతలుగా మార్చగలగాలి. దానాన్ని మించిన సమాజ సేవ, సత్కార్యం, పుణ్యకర్మ మరొకటి లేదని చెప్పాలి. దాత ధనం దానం చేస్తున్న కొద్దీ పుణ్యంతో బాటు పెరుగుతుందని తెలుసుకొని నిరూపించి చూపాలి.
కాలపురుషుని ప్రతిమ నొక దానిని తయారు చేయించాలి. చవితి, చతుర్దశి, విష్టిలలో నేదో ఒకరోజు సమతలభూమిపై నల్ల తిలలతో పురుషాకారంలో దీనిని తీర్చిదిద్దాలి. ప్రతిమకు వెండిదంతాలనూ బంగారు కన్నులనూ అమర్చాలి. చేతిలో భయంకరమైన కత్తి, జపాకుసుమ కాంతులను వెదజల్లు చెవికుండలాలు, వక్షంపై నలుపు తెలుపు రంగుల పూలమాలలు, శంఖమాల వుండాలి. చెప్పులు కూడా వేసి, పక్కనే నల్ల కంబళిని పెట్టి ఈ విధంగా నిర్మింపబడిన కాలపురుష ప్రతిమను గంధపుష్ప నైవేద్యాదులతో అర్చించి త్ర్యంబకం (యజుం 3/60) మహా మంత్రంతో స్వగృహ్యోక్త విధానంలో నేతితో, నువ్వులతో, నూటయెనిమిది ఆహుతులనివ్వాలి. తరువాత యజమాని ప్రసన్నహృదయుడై ఈ మంత్రాన్నుచ్చరించాలి.
సర్వం కలయసే యస్మాత్ కాలస్త్వం తేన భణ్యసే ।
బ్రహ్మ విష్ణు శివాదీనాం త్వమ సాధ్యాఽసి సువ్రత ॥
పూజతస్త్వం మయాభక్త్యా
ప్రార్థితస్య తథా సుఖం ।
యదుచ్యతే తవ విభో
తత్ కురుష్వ నమోనమః ॥ (ఉత్తర పర్వం -181/21,22)
ఈ ప్రకారంగా పూజ చేసి ఆ ప్రతిమను బ్రాహ్మణునికి దానమివ్వాలి. వస్త్రాలనూ అలంకారాలనూ దక్షిణనూ యథాశక్తి ఆయనకు సమర్పించుకోవాలి. ఈ పద్ధతిలో కాల పురుష దానం చేసినవారు మృత్యుభయం వ్యాధి బాధలేకుండా అపార సంపత్తితో పెద్ద కాలం జీవించి అంతంలో సూర్య లోకాన్ని భేదించుకొనిపోయి పరమపదం చేరుకుంటారు. మరల పుడమిపై పుట్టినపుడు సకల సంపదలున్న రాజులుగా జన్మిస్తారు.
రెండవది సప్త సాగరదానం యుగాదులు దినాలలో గాని, గ్రహణాలలోగాని బంగారు కుండాలను (కుండలను కాదు) యేడింటిని విడివిడిగా నిర్మించాలి. ఒక్కొక్కటీ పిడికిట్లో బిగుతుగా పట్టేటంత పరిమాణంలో వుండాలి. కృష్ణమృగ చర్మంపై తిలలను పోసి వాటిపై ఈ కుండాలను స్థాపించాలి. అన్నిటినీ నలువైపులా రత్నాలతో అలంకరించాలి.
ఈ శుభ ముహూర్తంలో యజమని స్నానం చేసి శ్వేత వస్త్రధారియై వచ్చి ఈ కుండాలలో భావించుకున్న సప్త సాగరాలకు ప్రదక్షిణం చేయాలి. ఏడుకుండాలలో వరుసగా లవణం, పాలు, నెయ్యి, బెల్లం, పెరుగు, పంచదార, తీర్థ జలాలను నింపి మూడుమార్లు ప్రదక్షిణ చేసి ఈ మంత్రాలనుచ్ఛరించాలి.
నమో వః సర్వ సింధూ నామాధారేభ్యః సనాతనాః।
జంతూనాం ప్రాణదేభ్యశ్చ సముద్రేభ్యో నమోనమః
పూర్ణాః సర్వే భవంతో వై క్షార క్షీర ఘృతై క్షవైః ॥
దధ్నాశర్కర యాతద్వత్ తీర్థవారి భిరేవచ ।
తస్మాదఘౌఘ విధ్వంసం కురుధ్వం మమ మానదాః ॥
అలక్ష్మీః ప్రశమం యాతు లక్ష్మీశ్చాతు గృహేమమ। (ఉత్తరపర్వం 182/10-13)
ఇలా అని ఆ సప్త సాగరాలనూ బ్రాహ్మణులకు సమర్పించాలి. ఈ దాత వంశంలో ఎనిమిదితరాల దాకా లక్ష్మి తాండవిస్తునేవుంటుంది. దాత దేహాంతంలో దేవలోకం చేరి అక్కడ ఏడు మన్వంతరాలు సుఖనివాసముండి బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు.
మూడవది మహాభూతఘట దానం. ఒక పుణ్యదినం నాడు రత్నసమన్వితమైన సువర్ణకుంభాన్ని నిర్మించాలి. దీనిని శక్త్యనుసారమూ అయిదు పలంల నుండి వంద పలంల దాకా సువర్ణాన్ని వెచ్చించి చేయించవచ్చు. ఈ ఘటాన్ని పాలతో నేతితో నింపి దాని సమీపంలోనే కల్పవృక్షాన్ని స్థాపించాలి. అక్కడే పద్మాసనస్థితులైన త్రిమూర్తులును కూడా స్థాపించాలి. దిక్పాలురనూ వుంచాలి. అక్షసూత్రంతో ఋగ్వేద మూర్తినీ, కమలంతో యజుర్వేదాన్నీ, వీణ పట్టుకున్న సామవేదాకృతినీ, స్రుక్కుని ధరించిన అథర్వవేద ఆకారాన్నీ కూడా స్థాపించాలి. యజమాని ఈ క్రింది మంత్రం చదువుతూ అంతటినీ దానం చేయాలి:
యస్మాన్న కించి దప్యస్తి మహాభూతైర్వినాకృతం।
మహాభూతమయ శ్చాయంత సాచ్ఛాంతిం దదాతుమే ॥
అత్రసంనిహితా దేవాః స్థాపితా విశ్వకర్మణా ।
తేమే శాంతిం ప్రయచ్ఛంతు భక్తి భావేన పూజితాః ॥ (ఉత్తరపర్వం-183/10,11)
ప్రదక్షిణ చేసి అంతటినీ బ్రాహ్మణునకు వస్త్ర అలంకారాలతో దానం చేయాలి. ఈ దాతయొక్క ఇరవైయొక్క తరాలు శివలోకప్రాప్తి నొందుతాయి. అతడు పుడమిపై పడినపుడు శ్రేష్ఠ మహారాజుగా జన్మిస్తాడు.
నాలుగవది శయ్యాదానం. ఈ జీవనం అనిత్యమని తెలుసుకొన్న ప్రతి ధనికుడూ ఈ దానాన్ని చేసి ఇహ పర సుఖములను పొందవచ్చును. బతికున్నన్నాళ్ళూ బంధుమిత్రుల బలంతో విఱ్ఱవీగినవాడు పోగానే కొంత, పదవరోజున ధర్మోదకాలతో మిగతా బంధాన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి ‘నా ఆత్మయే నాకు నిజమైన బంధువు; సన్మిత్రము’ అనే నిర్ణయానికి వచ్చి దాని ఇహ పర సుఖం కోసం అన్ని రకాల దానాలూ చేసి పోవడం, దీపముండగనే ఇల్లు చక్కబెట్టుకొనుట వలె తెలివైన పని, ఆత్మ అనే దీపం ఈ శరీరంలో వెలుగుతున్నంత కాలమే మన విలాసాలూ, విన్యాసాలూనూ. కాబట్టి బతికుండగానే, బతుకు మిగిలియున్నపుడే దానాలు చేయాలి. ఆ తరువాత ఎవరికి యెవరు? చివరికి యెవరు? ఆత్మయేగా! ఈ ఆత్మను సంతుష్టపఱచాలంటే దానాలు చేయాలి.
శయ్యాదానంలో మంచి కర్రతోనొక మంచం చేయించాలి. ఏనుగు దంతాలతో హేమపత్రాలతో దాని నలంకరించాలి. పరుపులు తలగడలు అన్నీ సిద్ధం చేసి గంధ ధూపాలతో పవిత్రం చేయాలి. దానిపై లక్ష్మీసమేత నారాయణ ప్రతిమను స్థాపించి వారు నిద్రిస్తున్నట్లు భావించుకొని పక్కనే కుంకుమ చర్చ, అగరు, కర్పూరం, చందనం, తాంబూలం, దీపం, చెప్పులు, గొడుగు, చామరం, ఆసనం, బట్టలు భోజనం సిద్ధంగా వుంచి బ్రాహ్మణ దంపతులను పిలిచి వారిని పూజించి శయ్యను దానం చేస్తూ ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి.
నమస్తే సర్వదేవేశ శయ్యాదానం కృతం మయా ।
దేహితస్మాచ్ఛాంతి ఫలం నమస్తే పురుషోత్తమ ॥
యథాన కృష్ణ శయనం శూన్యం సాగరజాతయా।
శయ్యామమాప్యశూన్యాస్తు తథా జన్మని జన్మని॥ (ఉత్తరపర్వం 184/13,14) మృతశయ్యాదానం ఎవరైన వ్యక్తి మరణించిన పదకొండవ రోజున చేయాలి. ఇదే పద్ధతిలో ఇదే మంత్రశ్లోకంతో దానంచెయ్యాలి. మృతవ్యక్తి యొక్క స్వర్ణ ప్రతిమను, (అతని లేదా ఆమె) అతని శయ్యను, వస్త్రాలనూ, ఇష్ట వస్తువులనూ, వాహనమునూ దానం చేసి వేయాలి. ఈ దానం వల్ల మృత వ్యక్తులు యమకింకరులను చూడనక్కర లేకుండా యమధర్మరాజునే దర్శించి పాపలేశము అమితబాధాకరం కాకుండా అనుభవించి స్వర్గంలో ప్రళయ పర్యంతమూ నివసించగలరు.
అయిదవది ఆత్మప్రతికృతి దానం. దీనివల్ల మాన - సమ్మానాలు వృద్ధి చెందుతాయి. దీన్నెప్పుడైనా చేయవచ్చును. (దాని అనగా దాత) దాని తన ప్రతిమనే ఇనుముతో చేయించి తనకిష్టమైన తన వాహనంపై స్థాపించాలి. ఆ మూర్తిని రత్నాలతో వస్త్రాలతో అలంకరించి కుంకుమను, కర్పూరమును, అగరును పూయాలి. స్త్రీ ఈ దానం చేయాలంటే తన స్వరూపం వున్న ప్రతిమనే శయ్యపై నిద్రిస్తున్న భంగిమలో నిర్మింపజేయాలి. తనకిష్టమైన వస్తువులన్నిటినీ ఆ ప్రతిమచుట్టూ పెట్టి స్నానంచేసి తెల్లబట్టలు కట్టుకొని వచ్చి లోకపాలురనూ, గ్రహాలనూ, గౌరీదేవినీ, వినాయకునీ పూజించి చేతిలో పూలనుపట్టుకొని అంజలిచేసి బ్రాహ్మణుని సమ్ముఖంలో ఈ మంత్రాన్నుచ్చరించాలి:
ఆత్మనః ప్రతిమా చేయం సర్వోపకరణైర్యుతా॥
సర్వ రత్న సమాయుక్తా తవ విప్ర నివేదితా ।
ఆత్మా శంభుః శివః శౌరిః శక్రః సురగణైర్వృతః ॥
తస్మాదాత్మప్రదానేన మమాత్మా సుప్రసీదతు । (ఉత్తరపర్వం 175/9-11)
బ్రాహ్మణుడు కోఽదాత్కస్మాం అనే యజుర్వేదం (7/48) మంత్రాన్ని పూర్తిగా పఠిస్తూ ప్రతిమాదానాన్ని స్వీకరిస్తాడు. యజమాని బ్రాహ్మణునికి కూడా నమస్కరించి ప్రదక్షిణ చేసి వీడ్కొల్పాలి. మహారాజా! ఈ విధంగా ఆత్మప్రతికృతి దానాన్నిచ్చిన వారు దేవతలచే పరివేష్టితులై వంద దివ్యసంవత్సరాలు స్వర్గలోకంలో ప్రతిష్ఠితులౌతారు. పుడమిపై పుట్టి రాజులై జీవిస్తారు.
ఆరవది హిరణ్యాశ్వదానం. ఇది అనంత ఫలాలనిచ్చే సువర్ణదానం. ఏ పుణ్యతిథిలోనైనా శక్తికొలదీ మూడు పలంల నుండి వందపలంల దాకా బంగారమును వెచ్చించి గుఱ్ఱమును నిర్మింపజేయాలి. దానిని పట్టు వస్త్రంతో ఆచ్ఛాదించి కుంకుమనలది వేదిపై మృగచర్మంపై నెఱపిన నువ్వుల రాశిపై స్థాపించాలి. తెల్లపూలతో దానిని పూజించి వేరుసెనగపలుకులను భోగంగా నైవేద్యరూపంలో పెట్టాలి. తరువాత శుభ ముహూర్తంలో పుష్పాంజలి కైసేసి ఈ పురాణోక్త మంత్రాన్నుచ్చరించాలి:
నమస్తే సర్వ దేవేశ వేదాహరణలంపట ॥
వాజిరూపేణ మామస్మాత్ పాహి సంసారసాగరాత్ ।
త్వమేవ సప్తధా భూత్వాఛందోరూపేణ భాస్కరం ॥
య స్మాత్‌ధారయ సేలోకానతః పాహిసనాతన। (ఉత్తరపర్వం 186/6-8)
ప్రదక్షిణ చేసి బ్రాహ్మణునికి దానమిచ్చెయ్యాలి. ధర్మరాజా! ఈ దానమిచ్చిన నవదాన్యులకు సూర్యభగవానుని అక్షయలోక నివాసంప్రాప్తిస్తుంది.
దానమిచ్చిన తరువాత తైలరహిత భోజనం చేసిన పురాణ శ్రవణం చేయాలి. ఈ దాన విధానాన్ని చదివినవారు అన్ని పాపాల నుండీ విముక్తులై మరుజన్మలో అశ్వసైన్యం అసంఖ్యాకంగా గల రాజులై పుడతారు. దీనిని అభినందించి ప్రచారం చేసేవారు కూడా పాపముక్తులై ఇంద్ర, మహేశ్వర లోకాలలో సేవలందుకుంటారు.
ఏడవది హిరణ్యాశ్వరథ దానం. ఒక పుణ్య లేదా పర్వదినాన వాకిలిని పేడతో అలికి వేదిని పెట్టి దానిపై మృగచర్మము నుంచి దానిపై తిలలను పోసి వాటిపై బంగారు రథాన్ని స్థాపించాలి. దానికి నాలుగు బంగారు, గుఱ్ఱాలుండాలి. ఇంద్రనీలమయకలశనీ, ధ్వజాన్నీ పెట్టి రథాగ్రభాగంలో బ్రహ్మప్రతిమనూ, ఆయనకు కాస్త క్రిందుగా పద్మరాగమణి దళయుక్తులైన లోకపాలకుల మూర్తులు, పట్టు వస్త్ర శోభితులై వుండాలి. నీటితో నింపిన నాలుగు కలశలను పదునెనిమిది ధాన్యాలను ఒక పక్కనుంచాలి. దాత ఏ దేవుని భక్తుడో ఆ నామాలనుచ్చరిస్తూ ఆ కలశలను పుష్పమాలలతో చెఱకురసంతో నింపి అధివాసన చేయించాలి. అశ్వినీ కుమారులను చక్రరక్షకులుగా స్థాపించాలి. ఇదివఱకటి దానాల్లోలాగే దానానికి ముందు ఈ మంత్ర శ్లోకం ఉచ్చరించాలి.
నమోనమః పాపవినాశనాయ
విశ్వాత్మనే దేవ తురంగ మాయ ।
ధామ్నామధీశాయ భవాభవాయ
రథస్యదానాన్మమ దేహి శాంతిం ॥
వస్వష్టకాదిత్య మరుద్గణానాం
త్వమేవ ధాతా పరమం నిధానం ।
యతస్తతోమే హృదయం ప్రయాతు
ధర్మైకతా నత్వమ ఘౌఘ నాశాత్ ॥ (ఉత్తర పర్వం 187/10,11)
ఈ ప్రకారం భవభయనాశకమైన ఈ దానాన్ని చేసిన వారి శరీరం పాపసమూహ విముక్తం కాగా ఆత్మ శివ సాయుజ్యాన్ని పొందుతుంది.
ఎనిమిదవది కృష్ణాజినదానం. యుగాదితిథుల్లో, సూర్యచంద్ర గ్రహణాల్లో, సంక్రాంతులు, తిథిక్షయాలు, మాఘపూర్ణిమల్లో ఏదో ఒకనాడుగాని పీడకల వచ్చిన మరునాడుగాని ఈ దానాన్నివ్వాలి. అగ్నిహోత్రి, వేదవేదాంగ పారంగతుడు, పురాణ `జ్ఞాతయగు యోగ్యబ్రాహ్మణునకు చేయవలసిన మహాదానమిది.
పవిత్ర స్థానాన్కొక్కదాన్ని పేడతో అలికి దానిపై ఉన్ని వస్త్రాన్ని పఱచి నల్ల తిలలతో దానిపై మృగాకృతిని వేయాలి. కొమ్ముల జాగాలో బంగారాన్నీ, దంతాలకు బదులు వెండిని, తోకచోటులో ముత్యాల మాలనీ వుంచాలి. తల భాగమును కూడా బంగారంతో అలంకరించి దాన్ని పట్టు వస్త్రాలతో కప్పి పుష్పగంధ ఫల రత్న నైవేద్యాదులతో పూజించి దానికి నలుదిక్కులలో నాలుగు కంచుపాత్రలను క్రమంగా నెయ్యి, పాలు, పెరుగు, తేనెలతో నింపివుంచాలి. పుణ్యకాలం రాగానే ఈ క్రింది మంత్రాన్నుచ్ఛరిస్తూ పలుమార్లు ప్రదక్షిణ చేయాలి.
కృష్ణః కృష్ణామలో దేవ కృష్ణాజినవరస్తథా ॥
త్వద్దానాపాస్త పాపస్య ప్రీయతాం మే నమోనమః॥
త్రయస్త్రిం శత్సురాణాం చ ఆధారేత్వం వ్యవస్థితః ॥
కృష్ణోఽసి మూర్తిమాన్ సాక్షాత్ కృష్ణాజిన నమోఽస్తుతే । (ఉత్తర పర్వం188/10-12)
కృష్ణాజినాన్ని తోకపట్టుకొని దానం చేయాలని బ్రహ్మాదేశం. ఈ దానం వల్ల భూమి దానంయొక్క సమగ్రఫలం ప్రాప్తిస్తుంది. పాపాలన్నీ నశిస్తాయి.
తొమ్మిదవది హేమహస్తి రథదానం. ధర్మజా! ఈ మంగళమయమైన సువర్ణయుత దానం దాతను విష్ణులోక నివాసిని చేస్తుంది. సంక్రాంతి, గ్రహణం లేదా ఏ ఇతర పుణ్యదినం నాడైనా మణిశోభితమైన, నాలుగు ఊచల చక్రాలు రెండున్న విచిత్ర తోరణయుక్తమైన బంగారు రథాన్ని నిర్మింపజేయాలి. అందులో నాలుగు బంగారు ఏనుగుల బొమ్మలను పెట్టాలి. ఈ రథాన్ని కృష్ణమృగచర్మంపై పెట్టి అందులో ఒక ద్రోణం తిలలపై స్థాపించాలి. రథంలో ఎనమండుగురు దిక్పాలకుల, బ్రహ్మ, సూర్య, శివదేవుల ప్రతిమలనుంచాలి. మధ్యభాగంలో లక్ష్మీసహిత విష్ణు భగవానుని మూర్తిని పెట్టాలి. ధ్వజంపై గరుడునీ పతాక కర్రపై (జుఆ) వినాయకునీ స్థాపించాలి. మిగతా నియమాలన్నీ ఇదివఱకటి దానంలాగే పాటించాలి. యజమానుడు దేవతలకు పితరులకు అభ్యర్చనలు చేసి, రథానికి ప్రదక్షిణ ముమ్మారు చేసి ఈ సంపూర్ణ సుఖప్రదమైన శ్లోకాన్ని చదవాలి.
నమోనమః శంకర పద్మజార్క -
లోకేశ విద్యాధర వాసుదేవైః ।
త్వం సేవ్యసే వేదపురాణ యజ్ఞె -
స్తేజోమయ స్యందన పాహి తస్మాత్ ॥
యత్తత్పదం పరమగుహ్యతమం మురారే -
రానందహేతుగుణ రూప విముక్త వంతం ।
యోగైక మానసదృశో మునయః సమాధౌ
పశ్యంతి తత్త్వమసి నాధ రధాథిరూఢ ॥
యస్మాత్ త్వమేవ భవసాగర సంప్లుతాండ
మానంద భారమృత మధ్వరపానపాత్రం
తస్మాదఘౌఘ శమనేన కురుప్రసాదం
చామీకరే భరథ మాధవ సంప్రదానాత్ ॥ (ఉత్తరపర్వం - 189 19-11)
ఈ విధానంలో స్వర్ణమయ హస్తిరథ దానాన్ని చేసిన వారు పాపముక్తులై విద్యాధర, దేవగణ, మునీంద్ర బృందాలద్వారా ఆదరింపబడుతూ ఇంద్రియాతీతుడైన భగవంతుడు శివుని లోకం చేరుకుంటారు.
ధర్మజా! ఈ దశమహాదానాలలో పదవది విశ్వచక్రదానం. సర్వపాపనాశకము, అత్యంత శ్రేష్ఠమునైన ఈ దానానికి తప్తకాంచనాన్నిగానీ, అంతశక్తి లేకపోతే వెండి లేదా రాగిని గానీ వాడాలి. వేయిపలంల సువర్ణ చక్రముత్తమం. కాకుంటే అయిదు వందల లేదా అందులో సగం పలంలను వాడవచ్చు. పేదవారు ఇరవై పలంల బరువుండే చక్రాన్ని కూడా చేయించవచ్చు. ఈ చక్రానికి పదహారు కర్రలు (ఊచలు) ఎనిమిది నేమిలు ఉండాలి. అది తిరిగే చక్రమే అయివుండాలి. దాని నాభికమలంపై యోగారూఢ చతుర్భుజ విష్ణు భగవానుని స్థాపించాలి. శంఖ చక్రాలుండాలి. అర్రలపై ఎనమండుగురు దేవీ స్వరూపాలు గీయబడాలి. రెండవ ఆవరణలో దశావతారాలు, అత్రి భృగు వసిష్ఠ మునులూ బ్రహ్మదేవుడూ, మూడవ ఆవరణలో మనువులూ, వసువులూ, గౌరీ మహాదేవీ, నాల్గవ ఆవరణలో పన్నెండుగురాదిత్యులూ, నాలుగు వేదాలూ, అయిదవ ఆవరణలో పంచమహా భూతాలూ, ఏకాదశ రుద్రులూ, ఆరవ ఆవరణలో అష్ట దిక్పాలకులూ, దిగ్గజాలూ, ఏడవ ఆవరణలో మంగళమయములైన అన్ని అస్త్రాలూ, ఎనిమిదవ ఆవరణలో సర్వదేవతా మూర్తులూ స్థాపింపబడాలి. పది హస్తాల ప్రమాణంలో ఒక మండపాన్ని నిర్మించి దానిని వస్త్ర, పతాక, తోరణాదులతో అలంకరించాలి. అందులోనే హవనానికొక కుండాన్ని నిర్మించాలి. నాలుగు హస్తాల ఒక వేదిని నిర్మించి దానిపై కృష్ణమృగ చర్మాన్ని పఱచి తిలలను పోసి వాటిపై విశ్వచక్రాన్ని స్థాపించాలి.
తరువాత పదహారు ప్రకారాల అన్నాలు, లవణాది సర్వరసాలు, నీటితో నింపిన ఎనిమిది మాంగలిక కలశలు, వివిధ ప్రకారాలు వస్త్రాలు, పుష్పమాలలు, ఫలాలు, వీటన్నిటినీ యధాస్థానాల్లో వుంచాలి. రత్నాలు, అయిదురంగుల వితానాలు హవనానికి శ్రేష్ఠ చారణిక బ్రాహ్మణులను నలుగురిని నియమించాలి. ఏ దేవతని ప్రతిష్ఠిస్తున్నపుడు ఆ దేవతకు హవనాలివ్వాలి. తరువాత ఇతర దానాలలోలాగే చేసి ఈ మంత్రాన్నుచ్చరించాలి:
నమో విశ్వంభరాయేతి విశ్వచక్రాత్మనే నమః
పరమానందరూపీత్వం పాహినః పాపకర్దమాత్ ॥
తేజోమయమిదం యస్మాత్ సదాపశ్యంతి సూరయః ।
హృదితత్వం గుణాతీతం విశ్వచక్రం నమామ్యహం ॥
వాసుదేవే స్థితం చక్రం తస్యమధ్యేతు మాధవః।
అన్యోన్యాధార రూపేణ ప్రణమామి స్థితావిహ ॥
విశ్వచక్ర మిదం యస్మాత్ సర్వపాప హరంహరేః ।
ఆయుధంచాధి వాసశ్చ తస్మాచ్ఛాంతిం దదాతుమే ॥ (ఉత్తరపర్వం190/18-21)
ఈ ప్రకారంగా విశ్వచక్రదానాన్ని గావించిన వారు సర్వపాప విముక్తులై విష్ణు లోకాన్ని చేరుకొని అక్కడ కూడా సేవితులై చతుర్భుజయుక్తులై అవినాశులై అప్సరలచే పూజింపబడుతూ మూడు వందల కల్పాలదాకా అక్కడే వుంటారు. సిద్ధగణాలు ఇతర దేవగణాలు ఈ చక్రదాతకు శిరస్సు వంచి నమస్కరిస్తారు. విశ్వచక్రాన్ని తయారు చేయించి ఇంట్లో పెట్టుకొని రోజూ దానికి నమస్కరిస్తూ వుంటే ఆయువు పెరుగుతుంది.
“ధర్మజా! ఇవీ దశవిధ మహాదానాలు. వాటి పద్ధతులు. ఫలాలు” అని ఉపదేశించాడు శ్రీకృష్ణుడు.