భవిష్య పురాణము

196, 197 - లవణాచల దాన విధి - గుడపర్వత మహిమ సులభ యొక్క ఆఖ్యానం

లవణాచలదానం శివలోక ప్రాప్తినిస్తుంది. పదహారు ద్రోణాల ఉప్పుతో లవణాచలాన్ని తయారు చేయాలి. ఇది ఉత్తమం. ఎనిమిది ద్రోణాలూ, శక్తి లేకుంటే ఒక ద్రోణమూ కూడా వాడవచ్చును. విష్కంభక పర్వతాలను నాలుగింటిని ఇందులో నాల్గవ వంతు పరిమాణాలలో నిర్మించాలి. బ్రహ్మాది దేవతలను పూజించుట, స్వర్ణమయ వృక్షాదులు, దిక్పాలకులు, మన్మధుడు మున్నగు వారి స్థాపన ధాన్య శైల దానంలో వలెనే చేయాలి. సరోవరాదులు జాగరణ ఉపవాస నియమాలు కూడ సమానమే. దానమంత్రాలు ఇలా వుంటాయి:

సౌభాగ్యరస సంభూతో యతోఽయం లవణో రసః

దానాత్మకత్వేన చమాం పాహి పాపాన్న గోత్తమ

తస్మాదన్నరసాః సర్వే నోత్కృష్టా లవణం వినా

ప్రియంచ శివయోర్నిత్యం తస్మాచ్ఛాంతి ప్రదోభవ

విష్ణుదేహ సముద్భూతం యస్మాదారోగ్య వర్ధనం

తస్మాత్ పర్వత రూపేణ పాహి సంసార సాగరాత్ (ఉత్తరపర్వం 196/6-8)

 ఈ విధంగా ఈ దానాన్ని చేసినవారు పార్వతీ దేవికి ప్రీతిపాత్రులై ఒక కల్పందాకా ఆమె ఆశ్రయంలో ఆమె లోకంలో నివసించి అంతంలో మోక్షాన్నందుకుంటారు.

లవణాచల దానమహిమ:

ధర్మజా! లవణాచలదాన మహిమకి సంబంధించి ఒక సంఘటన జరిగింది. మొదట్లో బ్రహ్మ కల్పంలో ధర్మమూర్తి అని ఒక రాజుండేవాడు. ఆయన తేజస్సు చంద్రసూర్యుల కంటె నెక్కువ. ఆయన దేవేంద్రుని మిత్రుడు. కొన్ని వందలమంది దైత్యులను సంహరించి మిత్రునికి సాయపడుతుండేవాడు. ఆ పుణ్యం, తపోబలం కలిసి రావడంతో తనకిష్టమైన రూపాన్ని ధరించి సమరాలనూ, విహారాలనూ కూడా కానిస్తుండేవాడు. అపజయమన్నది ఎరుగని ఈ అసహాయశూరుని భార్య కూడా అందంలో దేవకాంతలను, ఐశ్వర్యంలో లక్ష్మీదేవిని తప్ప ఇతరులను గెలువగలిగిన సౌభాగ్యవతీ లలామ. ఆమె పేరు భానుమతి. ధర్మమూర్తికి తన వైభవాన్ని చూసుకొని అహంకారమైతే కలుగలేదు గానీ ఒక విధమైన ఉత్సుకత మాత్రం కలిగింది. తన వైభవం ఎంతో పుణ్యం చేసుకుంటేగాని రాదు. తాను పూర్వజన్మలో అత్యుత్తమ కర్మలేవో చేయడం వల్లే ఈ జన్మలో ఇలా వెలిగిపోతున్నాడనేది, నిస్సందేహంగా తెలుస్తోంది. మరి ఆ కర్మలేవో తెలిస్తే’...... అనుకున్నాడు. ఒకనాడు తన కులగురువైన వశిష్ఠ మహర్షిని ఈ మాటే అడిగి ప్రార్థించాడు.

సర్వజ్ఞుడై విశిష్ట జాతిస్మరుడై అన్ని లోకాలలోనూ గౌరవింపబడుతున్న వశిష్ఠ మహర్షి ఇలా చెప్పాడు. ‘మహారాజా! పూర్వ కాలంలో ఒక వేశ్య వుండేది. ఆమె పేరు లీలావతి. ఆమె గొప్ప శివభక్తురాలు. ఆమె చతుర్దశి తిథినాడు లవణాచలదానాన్ని శాస్త్రోక్తంగా చేసింది. గురువుగారికీ ఇతర బ్రాహ్మణులకూ స్వర్ణమయ వృక్షాదులను చేతికి ఎముక లేనట్లుగా దానం చేసింది. ఆమె వద్ద శౌండుడని ఒక సేవకుడుండేవాడు. అతడు కంసాలి. ఈమె దానాలకు కావలసిన సర్వదేవతామూర్తులనూ ప్రతిమలనూ మిక్కిలి శ్రద్ధాభక్తులతో తనకున్న నేర్పునంతటినీ వినియోగించి దేవనామాన్నే జపించుకుంటూ నిర్మించాడు. ఇది ధర్మకార్యమని చెప్పి లీలావతి ఎంత కూలి ఇచ్చినా సున్నితంగా తిరస్కరించాడే గాని ఏమీ పుచ్చుకోలేదు. అతని చేతిలో దేవతలు తళతళలాడిపోయారు. మిలమిల మెరిసి మురిసిపోయారు. అతని పత్ని కూడా మిక్కిలి భక్తి భావంతో నిష్కపటంగా ఏమీ ఆశించకుండా అటు లీలావతికి ఇటు తన భర్తకీ సర్వ సహాయ సహకారాలనూ అందించింది. లీలావతి దేహాంతంలో శివలోకప్రాప్తినొందగా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసి దరిద్రులై వుండి కూడా ప్రతిఫలం పుచ్చుకోకుండా దేవతలనే మురిపించిన కంసాలి దంపతులే ఈ జన్మలో రాజ దంపతులుగా జన్మించారు. మహారాజా! మీరే ఆ రాజ దంపతులు. ఈ జన్మలో కూడా మీరు భగవద్భక్తులై ధర్మవర్తులై జీవిస్తున్నారు. ఇప్పుడు మీకు సిరిసంపదలకు లోటు లేదు. ధాన్యశైలాది మహాదానాలన్నిటినీ సులభంగా చేయగలరు.”

‘తప్పకుండా చేస్తాన’న్నాడు మహారాజు ధర్మమూర్తి. ఆయన అన్ని దానాలనూ చేసి పత్నితో సహా మురారి లోకప్రాప్తి నొందినాడు.

మహారాజా! బెల్లం ఒక పది భారాల పరిమాణంతో కొండవలె చేసి చేయు గుడపర్వత దానముత్తమం. అంత శక్తి లేనివారు అందులో లేదా అందులో సగంబెల్లంతో చేయవచ్చు. ధాన్య పర్వత దానంలాగే మిగతా అన్నిటినీ చేయించి దాన సమయంలో ఈ క్రింది మంత్రాన్నుచ్ఛరించాలి :

యథాదేవేషు విశ్వాత్మా ప్రవరోఽయం జనార్దనః

సామవేదస్తు వేదానాం మహాదేవస్తు యోగినాం

ప్రణవః సర్వమంత్రాణాం నారీణాం పార్వతీ యధా

తథా రసానాం ప్రవరః సదా చేక్షుర సో మతః

మమ తస్మాత్ పరాం లక్ష్మీం ప్రయచ్ఛ గుడ పర్వత

సురాసురాణాం సర్వేషాం నాగయక్షర్ క్షయంత్రిణాం

నివాసశ్చాపి పార్వత్యాస్త స్మాన్మాం పాహి సర్వదా (ఉత్తరపర్వం 197/5-8)

విధ్యనుసారము ఈ దానాన్ని చేసినవారు గంధర్వపూజితులై గౌరీలోకంలో ప్రతిష్ఠితులవుతారు. వంద కల్పాల తరువాత భూలోకంలో ఆయురారోగ్య సంపన్నులై సప్తద్వీపాల ఏలికగా భూలోకంలో జన్మిస్తారు. ధర్మరాజా! దీనికి సంబంధించి ఒక కథ వుంది విను.

మహాభాగ్యశాలిని, వ్రత పరాయణియునగు ఒక రాణి వుండేది. ఆమె పేరు సులభ. ఆమె మరుత్తు అను మహారాజు ప్రియపత్ని; రూప, నిత్యయౌవన సంపన్న, ఇతర రాణులా, మహారాజూ కూడ ఆమె మాటను జవదాటే వారు కారు. ఒక్కొక్కప్పుడు తన వైభవాన్ని చూసుకొని ఆమెకే అశ్చర్యం కలిగేది. ఒకనాడు సర్వజ్ఞుడూ, మహాతపోనిధీయగు దుర్వాస మహర్షి ఆ రాజు వద్దకు వచ్చాడు. రాజదంపతులా మహర్షిని వినయసంభ్రమ భక్తిప్రపత్తులతో పూజించుకున్నారు. సులభ ఆ ఋషిసత్తముని ఇలా అడిగింది. ‘భగవన్! నా అదృష్టభాగ్యం తమ వంటి తపోనిధుల దీవెనల ఫలితమేనని నాకు తెలుసు. ఐనా నేను ఇంత యశోవంతమైన, వైభవోపేతమైన, అధికార సమన్వితమైన జీవితాన్ననుభవిస్తున్నానంటే ఇది ఈ జన్మలో చేసుకున్న పుణ్యమైవుండదు. ఎప్పటిదో అయివుంటుంది. నేను ఏ పుణ్య కర్మలు చేశానో మీలాంటి సర్వజ్ఞులకే తెలుస్తుంది. దయచేసి ఆనతివ్వండి. మరల చేసి, చేయిస్తాను.’

‘అమ్మా! నీవు సరిగానే ఊహించావు. ఇదంతా నీ పూర్వపుణ్యఫలమే. క్రిందటి జన్మలో నీవు గిరివ్రజ పురవాసియైన వైశ్యపత్నివి. మీ దంపతులిరువురూ ధార్మికులు, సత్యశీలురు, ఆదర్శవంతులు, మీరు బ్రాహ్మణుల ద్వారా గుడ పర్వతదాన విధిని వినగా ముఖ్యంగా నీవు శీఘ్రంగా పూనుకొని ఆ దానాన్ని శ్రద్ధగా చేశావు. ఇదంతా దాని మాహాత్మ్యమే’ అని విశదీకరించాడు దుర్వాసమహర్షి.

ధర్మజా! సులభ మరల ఈ దానాన్ని చేసి సద్గతిని పొందింది. స్త్రీలకిది విశేషఫల సిద్ధినిస్తుంది.