భవిష్య మహా పురాణము
183 -184 - శ్రాద్ధ భేదాలు, వైశ్వదేవం
సూర్యభగవానుడు అరుణునకు ఇంకా ఇలా ఉపదేశించసాగాడు. ‘అరుణా! భూత, పితృ, బ్రహ్మ, దైవ, మనుష్యయజ్ఞాలను పంచమహాయజ్ఞాలంటారు. ఇవి ద్విజులకు మాత్రమే కర్తవ్యాలు. బలి వైశ్వదేవమును నిర్వహించుట భూతయజ్ఞమనీ, తర్పణలిచ్చుట పితృయజ్ఞమనీ, వేదం చదవడం, చెప్పడం బ్రహ్మయజ్ఞమనీ, హవనము చేయుట దేవయజ్ఞమనీ, ఇంటికి వచ్చిన అతిథులను సత్కరించి, భోజనం పెట్టి సంతుష్టులను గావించుట మనుష్యయజ్ఞమనీ చెప్పబడుతున్నాయి.
శ్రాద్ధములు పన్నెండు రకాలుగా విభజింపబడి వున్నాయి. అవి నిత్య, నైమిత్తిక కామ్య, వృద్ధి, సపిండన, పార్వణ, గోష్ఠ, శుద్ధి, కర్మాంగ, దైవిక, ఔపచారిక, సాంవత్సరిక శ్రాద్ధాలు. తిల, ధ్యాన, క్షీర, జల, ఫల, మూల, శాకాదులతో పితృదేవతలను సంతుష్టి పరచుటకై ప్రతిరోజూ చేయబడేది నిత్య శ్రాద్ధకర్మము. ఏకోద్దిష్ట శ్రాద్ధకర్మనే నైమిత్తికమంటారు. ఎవరినో ఉద్దేశించి ఒకమారే దీనిని చేస్తారు. విధిపూర్వకంగా దీనిని నిర్వర్తించి బేసిసంఖ్యలో బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఏదో ఒక కోరికతో చేసేది కామ్యశ్రాద్ధ కర్మ. దీనిని పార్వణ శ్రాద్ధకర్మ పద్ధతిలోనే చేసి కోరికనే సంకల్పంగా చెప్పుకోవాలి. ఏదో ఒక విషయమై వృద్ధి కోసం చేసేది వృద్ధి శ్రాద్ధకర్మ. ఈ కర్మలన్నిటినీ పూర్వాహ కాలంలోనే ‘ఉపవీతి’గా వుండి చేయాలి. సపిండనశ్రాద్ధంలో నాలుగు పాత్రలు తయారు చేయాలి. వాటిలో గంధ, జల, తిలలను వదిలి వేయాలి. ప్రేతపాత్ర జలాలను పితృపాత్రలో వదలాలి. దీనికి ‘యే సమానాః’ (యజు. 19/45-46) తోడి మంత్రాలను చదవాలి. స్త్రీకి కూడా ఏకోద్దిష్ట శ్రాద్ధమును పెట్టవచ్చును. అమావాస్య లేదా ఏదైనా పర్వదినాన పెట్టబడు శ్రాద్ధమును పార్వణ శ్రాద్ధమంటారు. ఆవులకోసం చేసే శ్రాద్ధకర్మను గోష్ఠ శ్రాద్ధమంటారు. పితరుల తృప్తికోసం, సంపద, సుఖప్రాప్తి కోసం, విద్వాంసుల సంతుష్టి కోసం బ్రాహ్మణులకి భోజనాలు పెట్టి నిర్వహించే శ్రాద్ధం శుద్ధి ప్రకారమనబడుతుంది. గర్భాదాన, సీమంతోన్నయన, పుంసవన సంస్కార సమయాల్లో చేసేది కర్మాంగశ్రాద్ధ మనబడుతుంది. యాత్రాది దినాల్లో దేవతలనుద్దేశించి నేతి ద్వారా హవనాది కార్యాలు చేయడం దైవిక శ్రాద్ధము. శరీరపుష్టి, వృద్ధి, అశ్వవృద్ధిలకై చేయునది ఔపచారిక శ్రాద్ధము. అన్నిటిలోకీ శ్రేష్ఠమైనది సాంవత్సరిక శ్రాద్ధము. చనిపోయిన వ్యక్తికి ఆ మరణ తిథినాడు ప్రతియేడూ తప్పనిసరిగా వారి వారసులు పెట్టవలసినది సాంవత్సరిక శ్రాద్ధము. ఈ కర్మమును చేయని వారి పూజలను ఏ దేవతలూ, నాతో సహా స్వీకరింపరు. పైగా ఆ వారసులు ఘోరతమిస్ర నామక నరకంలో పడిపోవడమే కాక మరుజన్మలో పందులై పుడతారు. ‘
‘భగవాన్! మాతాపితల మృత్యు తిథి, పక్ష, మాసాలు తెలియని వారు ఏం చేయాలి? వారిని ఈ నరకం నుండి తప్పించడం ఎలా?’
‘అరుణా! వారు ఏదో ఒక అమావాస్యను ఎంచుకొని ప్రతి సంవత్సరమూ అదే రోజున ఈ కర్మను నిర్వహించాలి. విశేషించి మృగశిర, మాఘాలలో పితరులనుద్దేశించి విశిష్ట పూజన భోజనాదుల ద్వారా కర్మ చేసి నన్ను తలచుకొంటే నేను ప్రసన్నుడనవుతాను. పితరులు, గోవులు, బ్రాహ్మణులు నాకు పరమ ఇష్టులు.
వేదాలద్వారా గాని స్త్రీద్వారా గాని వచ్చిన సొమ్ముతో పితృ, దైవకార్యాలు చేయరాదు. వైశ్వదేవ కర్మను చేయని బ్రాహ్మణుడు వేదవేత్తయైనా నింద్యుడే. వైశ్వదేవం చేయకుండా భోజనం చేసేవాడు మూర్ఖుడు. వానికి నరకప్రాప్తి తప్పదు. వాడు చేసే మిగతా పూజలూ, అన్నపాకాలూ వ్యర్థములే. ప్రియుడైనా అప్రియుడైనా, మూర్ఖుడైనా విద్వాంసుడైనా నీవు వైశ్వదేవం చేస్తున్నపుడు వచ్చే అతిథి స్వర్గానికి సోపానం కాగలడు. వానికి భోజనం పెట్టి సాక్షాత్తు విశ్వేదేవరూపాన్నే అర్చించినట్టు భావించాలి.
Summary of chapter 97 of the Bhavishya Mahā Purana is as follows:
The Jayantī vrata — which, while typically associated with Devī, here appears in its solar dimension — is presented in its connection with Sūrya's grace. The chapter traces the philosophical and mythological links between victory (jaya), time (kāla, of which Sūrya is the measurer), and Sūrya's unique capacity as the divine witness to confirm the righteousness of the victorious. The procedure combines elements of Devī and Sūrya worship, reflecting the syncretic tendency of the Bhaviṣya Purāṇa to identify Sūrya's grace operating through all the great vratas of the Purāṇic tradition. The fruits of the Jayantī vrata as given here include longevity, health, victory in all undertakings, and liberation at the time of death.