భవిష్య పురాణము

26 - అనంత తదియ - రసకల్యా ణినీ తృతీయ

            (కళ్యాణినీ)

“హే సర్వజ్ఞా! సౌభాగ్యాన్నీ ఆరోగ్యాన్నీ ప్రసాదించేదీ, శత్రునాశకం కూడా ఐన ఒక వ్రతాన్ని సెలవీయండి” అని కోరాడు ధర్మరాజు. శ్రీకృష్ణుడిలా చెప్పాడు.

“మహారాజా! చాలాకాలం క్రిందట శంకరభగవానులు నాతో మాటల సందర్భంలో శ్రీ లలితాదేవికి సంబంధించి ఒక ఆరాధనావిధిని అనుగ్రహించారు. మీరడిగిన లక్షణాలు దానిలో వున్నాయి. స్త్రీలకిది విశేషఫలప్రదము.

ప్రతి ముందుగా వైశాఖ, భాద్రపద లేదా మార్గశిర శుద్ధ తదియనాడు తెల్ల ఆవాలతో అభ్యంగన స్నానంచెయ్యాలి. గోరోచనం, తుంగ, గోమూత్రం, పెరుగు, గోమయం, చందనం - వీటన్నిటినీ కలిపి నుదుట ధరించాలి. ఈ తిలకం సౌభాగ్యాన్నీ ఆరోగ్యాన్నీ ఇస్తుంది. లలితాదేవికి ఇదంటే చాలా ఇష్టం. ప్రతిమాసం శుద్ధతదియనాడు ముత్తయిదువ ఎఱ్ఱవస్త్రాలనూ, వితంతువు ఎఱ్ఱమన్ను రంగు బట్టలను, కుమారి తెల్ల వస్త్రాలను ధరించి పూజచేయాలి. లలితాదేవి ప్రతిమకు పంచగవ్యాలతో గాని పాలతోగాని స్నానంచేయించి తేనె, చందనం, పుష్పమిశ్రిత జలాలతో మరల స్నానంచేయించాలి. తరువాత తెల్లపూలు, అనేక ప్రకారాల పండ్లు, దనియాలు, తెల్లజీలకఱ్ఱ, ఉప్పు, బెల్లం, పాలు, నెయ్యిలను

నైవేద్యంగా అర్పించి తెల్ల అక్షతలతో తిలలతో దేవిని అర్చించాలి. ఇలా ప్రతి శుద్ధ తదియనాడూ చేయాలి.

ఆరోజు అమ్మవారిని ఆపాదమస్తకమూ మంత్రాలతో అర్చించాలి.

ఓం వరదాయైనమః               అంటూ చరణాలనూ

శ్రియై నమః                            అంటూ చీలమండలనూ

అశోకాయై నమః                  అంటూ పిండలినీ

భవాన్యై నమః             అంటూ మోకాళ్ళనూ

మంగళకారిణ్యై నమః            అంటూ ఊరువులనూ

కామదేవ్యై నమః                   అంటూ కటినీ

పద్మోద్భవాయై నమః              అంటూ పొట్టనూ

కామశ్రియై నమః                   అంటూ వక్షఃస్థలాన్నీ

సౌభాగ్యవాసిన్యై నమః           అంటూ చేతులనీ

శశిముఖ శ్రియై నమః            అంటూ బాహువులనూ

కందర్పవాసిన్యై నమః            అంటూ ముఖాన్నీ

పార్వత్యై నమః                        అంటూ పెదవులనూ పూజించి

గౌర్యై నమః                            అంటూ ఈ క్రింది మంత్రాలను కూడా

సృష్టై నమః, కాన్త్యై నమః, శ్రియై నమః, రంభాయై నమః, లలితాయై నమః, వాసుదేవ్యై నమః

జపిస్తూ పార్వతీదేవి పాదాలపై పూలను వేసి పూజించాలి. ఆమె పాదాలకు పదే పదే నమస్కరిస్తూనే వుండాలి.

ఈ ప్రకారం విధి విధానానుసారం పూజ గావించి ఆ ప్రతిమకు ముందు ఒక కర్ణికా సహితమైన పన్నెండు రేకుల కమలాన్ని కుంకుమతో నిర్మించి పెట్టాలి దానికి తూర్పున గౌరినీ, అగ్నికోణంలో అపర్ణనీ, దక్షిణంలో భవానినీ, నైరృతిలో రుద్రాణినీ, పశ్చిమంలో సౌమ్యాదేవినీ, వాయవ్యంలో మదనవాసినినీ, ఉత్తరంలో పాటలాదేవినీ, ఈశాన్యంలో ఉమనీ స్థాపించాలి. మధ్యంలో లక్ష్మీ, స్వాహా, స్వధా, తుష్టి, మంగళ, కుముద, సతి, రుద్రాణిలను స్థాపించి కర్ణికకు పైన లలితాదేవిని స్థాపనం చేయాలి తరువాత గీతాలతో మంగళవాద్యాలతో తెల్లపూలతో అక్షతలతో ఈ దేవీమ తల్లులను అర్చించాలి.

తరువాత ముత్తయిదువులను ఎఱ్ఱబట్టలతో, ఎఱ్ఱపూలతో, అదే రంగు అలంకారాలతో సత్కరించి పూజించి వారి నుదుట భక్తితో సిందూరాన్ని పెట్టాలి.

భాద్రపదంలో నీలకమలాలతో, ఆశ్వయుజంలో బంధు జీవపుష్పాలతో, కార్తికంలో కమలాలతో, మార్గశిరంలో కుందాలతో, పుష్యంలో కుంకుమతో, మాఘంలో సిందు వారపుపూలతో, ఫాల్గునంలో మాలతితో, చైత్రంలో మల్లికలతో అశోకాలతో, వైశాఖంలో గంధపాటలము (గులాబీ)లతో, జ్యేష్ఠంలో కమలాలతో మందారాలతో, ఆషాఢంలో కమలాలతో, చంపకాలతో, శ్రావణంలో కదంబాలతో, మాలతీపుష్పాలతో, ఉమాదేవిని పూజించాలి. భాద్రపదం నుండి శ్రావణం దాకా పన్నెండు నెలల్లో క్రమంగా నైవేద్యాలుగా గోమూత్రం, గోమయం, పాలు, పెరుగు, నెయ్యి, కుశోదకం, బిల్వపత్రం, మందార పుష్పం, గోశృంగోదకం, పంచగవ్యం, మారేడులను సమర్పించాలి. నెలలో వచ్చే రెండు తదియ రోజుల్లోనూ బ్రాహ్మణ దంపతులు నాహ్వానించి వారిలో శివపార్వతులను మనసారా ఊహించుకొని భావించుకొని వారికి ఆత్మకింపయిన భోజనం పెట్టి వస్త్ర, మాలా, చందనాదులతో పూజించాలి. పురుషునికి పచ్చని పట్టు పంచెనూ స్త్రీకి పచ్చటి చీరనూ సమర్పించి పాదాభివందనం చేయాలి. ఆ తరువాత ఆమెకు సౌభాగ్యాష్టకమునూ, పురుషునికి స్వర్ణ నిర్మిత కమలాన్నీ ఇచ్చివేసి ఇలా ప్రార్థించాలి.

యథానదేవి దేవేశస్త్వాం పరిత్యజ్య గచ్ఛతి

తథామాం సంపరిత్యజ్య పతిర్నాన్యత్ర గచ్ఛతు (ఉత్తరపర్వం - 26/30)

మరల భాద్రపద మాసం మొదలుకొని మాసాల పేర్లు చదువుతూ ఆయా మాసాలలో ఈ యీ నామాలతో దేవి మనకు ప్రసన్నం కావాలని ఉచ్చరిస్తూ ప్రార్థించాలి. ఆ నామాలు క్రమంగా కుముదా, విమలా, అనంతా, భవానీ, సుధా, శివా, లలితా, కమలా, గౌరీ, సతీ, రంభా, పార్వతీ అనునవి.

వ్రత సమాప్తినాడు ఆచార్యదేవునికి సువర్ణ నిర్మిత కమల సహిత శయ్యనుదానం చేయాలి. తరువాత ఇరవైనాలుగు లేదా పన్నెండు ద్విజులను పత్నీ సమేతంగా (బ్రాహ్మణ దంపతులు పన్నెండు లేదా ఇరవై నాలుగు జతలు) పూజించి యథాశక్తి దక్షిణలివ్వాలి. ప్రతి మాసాంతంలోనూ బ్రాహ్మణ దంపతులను పూజ్యగురుదేవుని పూజిస్తుండాలి.

ఈ అనంతతదియను భక్తి శ్రద్ధలతో విజయవంతంగా చేసినవారు నూరుకల్పాల కాలం శివలోకంలో నివసించగలరు. నిర్ధనులు కేవలం మంత్రాల, పుష్పాల సాహాయ్యంతో ఈ వ్రతాన్ని మూడేళ్ళపాటు చేయగలిగితే ఇదే ఫలం సిద్ధిస్తుంది. ఉపవాసం, శక్తి కొద్దీ దానం ముఖ్యం. ముత్తయిదువ, వితంతువులు, బ్రహ్మచారిణీ - ఎవరైనా సరే - ఈ వ్రతాన్ని చేస్తే గౌరీ దేవి వారికి ఇదే ఫలితాన్నీ ఇష్ట కామ్యార్థ సిద్ధినీ ఇస్తుంది. ఈ వ్రతాన్ని దీని మాహాత్మ్యాన్నీ విన్నవారూ, చదివిన వారూ ఉత్తమలోకాలను పొందగలరు.

మహారాజా! ఇపుడు సర్వపాప వినాశకరమైన రసకల్యాణినీ, తదియ వ్రత విశేషాన్నీ ఆలకించు. దీన్ని మాఘ శుద్ధ తదియనాడు చేయాలి. ఆ రోజు పెందలకడనే ఆవుపాలు, నువ్వులు కలిపిన నీటితో స్నానంచేయాలి. తరువాత లలితాదేవి ప్రతిమకు తేనెతో చెఱకురసంతో స్నానంచేయించాలి. జాతిపుష్పాలతో కుంకుమతో ఆ దేవిని అర్చించాలి. ముందు ఆమె దక్షిణాంగాలనూ తరువాత వామాంగాలనూ ఈ మంత్రాలనుచ్చరిస్తూ పూజించాలి.

ఓం లలితాయై నమః తో పాదాలనూ చీలమండలనూ,

సత్యై నమః                              తో పిక్కలనూ మోకాళ్ళనూ

శ్రియై నమః                            తో ఊరువులనూ

మదాలసాయై నమః             తో కటి ప్రదేశాన్నీ

మదనాయై నమః                   తో ఉదరాన్నీ

మదనవాసిన్యై నమః              తో వక్షస్సునీ

కుముదాయై నమః                తో మెడనీ

మాధవ్యై నమః                        తో భుజాలనూ భుజాగ్రాలనూ

కమలాయై నమః                  తో ఉపస్థనూ

రుద్రాణ్యై నమః                       తో లలాటాన్నీ

శంకరాయై నమః                 తో కనురెప్పలను

విశ్వవాసిన్యై నమః                  తో కిరీటాన్నీ

(కాంత్యై నమః) కాన్త్యై నమః   తో కేశపాశాన్నీ

చక్రావధారిణ్యై నమః             తో కన్నులనూ

పుష్ట్యై నమః                           తో ముఖాన్నీ

ఉత్కంఠిన్యై నమః                   తో కంఠాన్నీ

అనంతాయై నమః                 తో రెండు కంధాలనూ

రంభాయై నమః                   తో వామబాహువునూ

విశోకాయై నమః                  తో దక్షిణ బాహువునూ

మన్మథాదిత్యై నమః               తో హృదయాన్నీ పూజించి

పాటలాయై నమః              అనే మంత్రంతో అనేక పర్యాయాలు

చేతులు జోడించి, సాష్టాంగపడి నమస్కారాలు చేయాలి.

ఈ రకంగా మంత్రయుక్తమైన సర్వాంగ పూజనుగావించి బ్రాహ్మణ దంపతులను రావించి వారిని గంధ మాల్యాదులతో సత్కరించి స్వర్ణకమల సహిత జలపూర్ణ ఘటాన్ని దానంచేయాలి. ఇలా ప్రతి శుద్ధతదియనాడూ చేయాలి. అంతేకాక మాఘమాసంతో మొదలుపెట్టి క్రమంగా నెలకొక వస్తువుగా కొన్ని పదార్థాలను ఆ నెలలో తినడం లేదా తాగడం మానేయాలి. అవి, క్రమంగా ఉప్పు, బెల్లం, నూనె, తేనె, తమలపాకు, జీలకఱ్ఱ, పాలు, పెరుగు, నెయ్యి, కూర, ధనియాలు, పంచదార, ప్రతి ఒక్క మాసంలోనూ వ్రత సమాప్తి అనంతరం పళ్ళెంలో అరిటాకుల్లో బియ్యం, తేనె, గోధుమలు, పూరీ, ఘేవరాలు, పిష్టకాలు, పాలు, కూరలు, పెరుగు, ఆరురకాల అన్నాలు, భిండి, శాకవర్తికాలను వుంచి బ్రాహ్మణునికి దానం చెయ్యాలి.

మాఘమాసంలో పూజాంతంలో కుముదా ప్రీయతాం అనాలి. అలాగే మిగతా మాసాల్లో క్రమంగా మాధవీ, గౌరీ, రంభా, భద్రా, జయా, శివా, ఉమా, శచీ, సతీ, మంగళా, రతిలాలసా అనే దేవీ నామానికి ‘ప్రియతాం’ను జోడించిపలకాలి. ఈ వ్రతం చేస్తున్న రోజు ఉపవాసముండి పంచగవ్యాలను మాత్రమే ఒకేసారి స్వీకరించాలి. మరల మాఘమాసం రాగానే ఒక కమండలువుపై పంచరత్నాలు పొదిగిన, చిటికెనవ్రేలంత, పార్వతీ ప్రతిమను స్థాపించి వస్త్రభూషణాలంకారాలతో దానిని సుశోభితం చేసి ఒక ఎద్దు, ఆవులతో సహా ఒక బ్రాహ్మణునికి పరమాదరంగా భవానీప్రీయతాం అంటూ దానమిచ్చెయ్యాలి.

ఈ విధంగా శ్రద్ధాభక్తులు నిండారగా ఈ వ్రతాన్ని చేసిన వారి పాపాలన్నీ ఆ క్షణంలోనే నశిస్తాయి. వారికి వెయ్యేళ్ళదాకా ఏ దుఃఖమూ కలుగదు. వేలకొద్దీ అగ్నిష్టోమ యజ్ఞాలను చేసిన ఫలం దక్కుతుంది. కుమారి, సధవ, విధవ, దుర్భాగ - ఎవరైనా సరే ఈ వ్రతాన్ని చేస్తే దేహాంతంలో గౌరీ లోకాన్ని చేరి అక్కడ పూజలందుకొంటుంది. ఈ వ్రత విషయాన్ని విన్నవారికీ ఇతరులకు ఉపదేశించిన వారికీ వ్రతాన్ని చేయించినవారికీ కార్యసమాప్తినాడే అన్ని పాపాలూ నశిస్తాయి. పార్వతీలోక నివాసమూ ప్రాప్తిస్తుంది.