భవిష్య పురాణము

112, 113 - వృంతాకత్యాగ - గ్రహ నక్షత్ర వ్రత విధి

మహారాజా! నేనిపుడు వృంతాక (వంకాయ) త్యాగ వ్రతాన్ని వివరిస్తాను.

వ్రతి ఒక యేడాదిగాని ఆరునెలలుగాని కనీసం మూడు మాసాలుగాని వంకాయను తినడం మానేసి ఉద్యాపన చేసుకోవాలి. తరువాత సంకల్ప పూర్వకంగా భరణి లేదా మఘ నక్షత్రంలో ఉపవాసం చేసి ఒక స్థండిలాన్నేర్పాటు చేసి దానిపై అక్షతలతో పుష్పాలతో యమరాజునూ అతని పరివారాన్నీ ఆవాహన చేసి గంధ పుష్ప నైవేద్యాలతో యమ, కాల, నీల, చిత్రగుప్త, మృత్యు, వైవస్వత - దేవతలకు వేరువేరుగా నామాలను ఉచ్చరిస్తూ పూజ చేయాలి. తరువాత అగ్నిని స్థాపించి నువ్వులతో నేతితో ఇవే నామాలను మంత్రాలుగా జపిస్తూ హవనం చేయాలి. తరువాత స్విష్టకృత్, ప్రాయశ్చిత్త హోమాలను గావించాలి. బ్రాహ్మణునికి అలంకారాలు, వస్త్రాలు, గొడుగు, చెప్పులు, నల్లకంబళి, నల్ల ఎద్దు, నల్లావు, దక్షిణలతో బాటు బంగారంతో చేయించిన వంకాయను కూడా భక్తిగా దానమివ్వాలి. ఆ తరువాత యథాశక్తిగా బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. ఇలా చేయడంవల్ల పౌండరీక యజ్ఞఫలం ప్రాప్తిస్తుంది. అలాగే ఏడుజన్మల దాకా యముని దర్శించే అవసరం రాదు. దీర్ఘకాలంపాటు స్వర్గంలో ఆదరం పొందుతూ నివసించే భాగ్యం లభిస్తుంది.

మహారాజా! ఇపుడు గ్రహనక్షత్ర వ్రత విధానాన్ని ఆలకించు. ఈ వ్రతం వల్ల క్రూర గ్రహాలన్నీ శాంతిస్తాయి. లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి ప్రాప్తిస్తాయి. ఆదివారం హస్త నక్షత్రంతో యోగించిన రోజున సూర్యభగవానుని పూజించి నక్తవ్రతం చేయాలి. ఇలా ఏడు ఆదివారాలదాకా నక్తవ్రతాన్ని పాటించాలి. చివర్లో సూర్యభగవానుని స్వర్ణ ప్రతిమను తయారుచేయించి దానిని తామ్రపాత్రలో స్థాపించాలి. తరువాత దానికి నేతితో స్నానం చేయించి రక్తచందనం, ఎఱ్ఱపూలు, ఎరుపురంగు బట్టలు, ధూపదీపాదులతో పూజించి లడ్డూల (లడ్ల) భోగాన్ని చేయించాలి. చెప్పులు, గొడుగు, రెండు రక్తవస్త్రాలు, దక్షిణలతోబాటు ఆ ప్రతిమను బ్రాహ్మణునికి దానం చేయాలి. ఈ వ్రతం చేయడంవల్ల ఆరోగ్యం సంపత్తి, సంతానవృద్ధి సమకూడుతాయి.

చిత్రా నక్షత్రయుక్త సోమవారం నాడు ప్రారంభించి ఏడు సోమవారాల దాకా నక్తవ్రతం చేసి చివర్లో చంద్రుని యొక్క వెండి ప్రతిమను తయారుచేయించి వెండి లేదా కంచుపాత్రలో స్థాపించి శ్వేత పుష్ప శ్వేతవస్త్రాదులతో దానిని పూజించాలి. దధ్యోదనంతో భోగం చేసి చెప్పులు, గొడుగు దక్షిణలతో సహా ఆ ప్రతిమను బ్రాహ్మణునకు సమర్పించాలి. తరువాత శక్తికొలది బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. ఈ వ్రతం వల్ల చంద్రుడు ప్రసన్నుడవుతాడు. ఆయన ప్రసన్నుడైతే మిగతా గ్రహాలన్నీ ప్రసన్నమౌతాయి.

ఇలాగే స్వాతి నక్షత్రయుక్త మంగళవారం భౌమ ప్రతిమకూ, విశాఖ యుక్త బుధవారం నాడు బుధునికీ, అనురాధా నక్షత్రయుక్త గురువారమునాడు బృహస్పతికీ, జ్యేష్ఠయుక్త శుక్రవారంనాడు శుక్రాచార్యునికీ, మూలయుక్త శనివారంనాడు శనికీ పూజలు చేయాలి.