భవిష్య పురాణము

134 - సూర్యుని సూర్యదేవమయత్వము

సూర్యభగవానుడు సర్వదేవమయుడు. ఆయన, నేత్రాలలో బుధ, సోములు, లలాటమందు శంకరుడు, శిరమందు బ్రహ్మ, కపాలంలో బృహస్పతి, కంఠమందు ఏకాదశ రుద్రులు, దంతాలలో నక్షత్రాలు, గ్రహాలు, పెదవులలో ధర్మాధర్మములు, నాలుకపై సర్వశాస్త్రమయి, మహాదేవి సరస్వతి, చెవులలో దిశలు, విదిశలు, భ్రూమధ్యంలో పన్నెండుగురాదిత్యులు, తాలువునందు బ్రహ్మేంద్రులు, రోమకూపాల్లో ఋషిగణాలు, కడుపులో సముద్రాలు, హృదయమనగా వక్షఃస్థలం మాత్రమే, హృదయంలో యక్షులు, కిన్నెర, గాంధర్వ, పిశాచ, దానవ, రాక్షసగణాలు, భుజాలలో నదులు, కక్ష్యలలో వృక్షాలు, పీఠమధ్యంలో మేరువు, నాభిమండలంలో యమధర్మరాజు, కటి ప్రదేశంలో పృథ్వి, లింగమందు సృష్టి, జానువులందశ్వనీ కుమారులు, ఊరువులలో ఇతర పర్వతాలు, నఖమధ్యాలలో పాతాళలోకాలు, దంతాల చివర్లో కాలాగ్ని ఉంటారు.

ఈ విధంగా ఆయనే దేవతాత్మ, సర్వాత్మ, సూర్యవిగ్రహస్థాపనకు పాడ్యమి, విదియ, చవితి, పంచమి, దశమి, త్రయోదశి, పౌర్ణమి మంచివి. చంద్రుడు, బుధ గురు శుక్రులు ఉదితులై అనుకూలంగా వున్న సమయంలో విగ్రహప్రతిష్ట చేయాలి. మూడు ఉత్తరలు, రేవతి, అశ్వని, రోహిణి, హస్త, పునర్వసు, పుష్య, శ్రవణ, భరణి నక్షత్రాలు ప్రశస్త సమయాలు. ప్రతిష్ఠకొరకై తయారుచేసే యజ్ఞ భూమిలో బూడిద తల వెండ్రుకలు ఉండరాదు. బాగా శుద్ధి చేయాలి. యజ్ఞ భూమిలో కంకరరాళ్ళు, బొగ్గు కనిపించకుండా ఏరిపారెయ్యాలి. పది జానలు పొడుగు వెడల్పులతో మండపాన్ని తయారుచెయ్యాలి. దానికి నాలుగు వైపులా వృక్షాలు, ఉద్యానాలు, ఉపవనాలు ఉండాలి. ఆ మండలంలో నాలుగు జానల పొడవు వెడల్పులతో వేదిని ఏర్పాటుచెయ్యాలి. నదీ సంగమ స్థానం నుండి మట్టిని తెచ్చివెయ్యాలి. మండపాన్ని పేడ మున్నగు వాటితో అలకాలి. తూర్పువైపు చతురస్రాకారంలోనూ, దక్షిణదిశలో అర్ధచంద్రాకారంలోను, పశ్చిమంలో గుండ్రంగానూ, ఉత్తరంలో పద్మాకారంలోనూ, నాలుగు హోమకుండాలను నిర్మించాలి. నలువైపులా అయిదేసి జానల ఎత్తులో ప్రశస్తమైన చెక్కలతో స్తంభాలను నిర్మించి వాటిని తెల్లబట్టలతో, పుష్పమాలలతో, కుశాదులతో అలంకరించాలి.

మండప మధ్యంలో ప్రతిమను పెట్టి అంటే అలంకృత వేదిపై ప్రతిమను పెట్టి, ఎనిమిది దిక్కుల్లోనూ క్రమంగా పసుపు, ఎరుపు, నలుపు, నీలం, తెలుపు, నలుపు, ఆకుపచ్చ, చిత్రవర్ణాలలో పతాకలను దిక్పాలకుల ప్రసన్నత కోసం వేయించాలి.

‘వేద్యావేదిః’ అనే మంత్రాన్ని చదువుతూ వేదిపై కమలాకృతిని నిర్మించాలి. ‘యోగేయోగేతి’ అను మంత్రం చదువుతూ దానిపై తూర్పు, ఉత్తరాగ్రాలలో కుశదర్భలను వెయ్యాలి. (ఈ రెండూ యజుర్వేదమంత్రాలే వాటి సంఖ్యలు 19/18, 11/14) ఒక చక్కటి శయ్యను తలగడలతో నేర్పాటుచేసి వివిధ భక్ష్యపదార్ధాలను చుట్టూ చేర్చాలి. ఉత్తమ శ్వేత ఛత్రాన్ని మండపంపై స్థాపించాలి. మొత్తం మండపాన్ని విచిత్ర దీపమాలలతో అలంకరించాలి.