భవిష్య పురాణము

57 - మాసిక కృష్ణాషష్ఠములు

            (మాసిక కృష్ణాష్టమీ వ్రతమొకటుంది. అది శివారాధన పరమైన అద్భుత వ్రతము. అంగభూత వ్రతం. మత్స్య (56) నారద, సౌర (14/1 - 36) పురాణాలలో విస్తారంగా ఇది కనబడుతున్నది. జ్యోతిష గ్రంథాలలో అష్టమి, చతుర్దశిలకు స్వామి శివుడేనని చెప్పబడింది.)

మహారాజా! బహుళ అనగా చీకటి రాత్రుల్లో వచ్చే అష్టమి మాసిక కృష్ణాష్టమి. ఈరోజు పరమశివునికి పరమ ప్రీతికారకమై సర్వపాప, భయనాశకమై, ధర్మప్రదమై విరాజిల్లు వ్రతమొకటుంది. ఇది పన్నెండు భాగాలుగా విభజితమైవుంది.

మార్గశిర కృష్ణ అష్టమినాడు ఉపవాస నియమాన్ని గ్రహించి జితేంద్రియులై క్రోధరహితులై గురువుగారి ఆజ్ఞానుసారం ఉపవాసం చేయాలి. మధ్యాహ్నం దాటాక నదిలోగాని చెఱువులోగాని స్నానం చేసి గంధ, ఉత్తమ, పుష్ప, గుగ్గిల, ధూప, దీప, అనేక ప్రకారముల నైవేద్య, తాంబూలాదులతో శివలింగానికి పూజలు చేసి నల్ల నువ్వులను హవనం చేయాలి. ఏ మాసంలో ఏ నామంతో ఏ పదార్థ ప్రాశ్న చేసి శంకరుని పూజిస్తే ఏ ఫలం వస్తుందో క్రింద చెప్పబడింది. ప్రాశ్న (నోటిలో వేసుకొనుట) తరువాత నేలపై శయనించాలి.

మార్గశిర         శంకర             గోమూత్ర        అతిరాత్రయజ్ఞ           

పుష్య               శంభు             నేయి               వాజపేయ

మాఘ మహేశ్వర       ఆవుపాలు       అనేక యజ్ఞ

ఫాల్గున           మహాదేవ        తిలలు             8 రాజసూయాలు

చైత్ర                 స్థాణు              యవలు          అశ్వమేధ

వైశాఖ శివ                  కుశోదకం      పురుషమేధ

జ్యేష్ఠ                పశుపతి          అశ్వమేధ        లక్ష గోదానం

ఆషాఢ            ఉగ్ర                  గోమయ         దశలక్ష వర్షాలు

                                                                        రుద్రలోక నివాసం

శ్రావణ             శర్వ                 అర్క                సువర్ణ దానఫలం

భాద్రపద         త్ర్యంబక           బిల్వపత్ర          అన్నదానఫలం

ఆశ్వయుజ     భవ                 తండులోదకం 100 పుండరీక యజ్ఞ

కార్తిక              రుద్ర                పెరుగు           అగ్నిష్టోమయజ్ఞ

ఈవిధంగా పన్నెండు నెలలపాటు శివపూజ చేసి చివర్లో నొక శివభక్తుడైన బ్రాహ్మణునికి నెయ్యి, చక్కెర, పాయసాలతో భోజనం పెట్టి యథాశక్తి సువర్ణం, వస్త్రాలు ఇచ్చి సంతృప్తి పఱచాలి. నల్లనువ్వులతో నింపిన పన్నెండు కలశలను, గొడుగులు, చెప్పులు, వస్త్రాలను బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఒక కపిల గోవును శివదేవునికి నివేదనం చేయాలి. ఈ మాసిక కృష్ణాష్టమి ఒక సంవత్సరం నిరంతరాయంగా చేయువారికి అన్ని పాపాలూ నశించి ఉత్తమ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. వారు నూరేళ్ళు ఇక్కడ సుఖంగా జీవించి ఉత్తమ విమానంలో దేవతలచే స్తుతింపబడుతూ శివలోకం చేరుకుంటారు. ఈ వ్రతాన్ని ఇంద్ర, చంద్ర, విష్ణు, బ్రహ్మాదులు కూడా అనుష్టించారు. ఈ వ్రత మాహాత్మ్యాన్ని విన్నవారు సర్వపాప విముక్తులౌతారు.