భవిష్య పురాణము

56 - రథయాత్ర - ఫలము

బ్రహ్మ శివునితో ఇంకా ఇలా చెప్పసాగాడు. సూర్యరథయాత్రను తాను శ్రద్ధాభక్తులతో యేర్పాటు చేసి ఇతరులచేత కూడా చేయించేవాడు పరార్ధవర్షాలపాటు అంటే బ్రహ్మదేవుని ఆయువులో సగంకాలం, సూర్యలోకంలో నివసించగలడు. అతని కుటుంబంలో రోగులుగాని దరిద్రులుగాని వుండరు. సూర్యదేవుని అభ్యంగనానికి నేతిని, అనేకరకాల తిలకాలని సరఫరా చేసే వానికి సూర్యలోకప్రాప్తి లభిస్తుంది. గంగాది పుణ్యనదీజలాలతో సూర్యప్రతిమకు స్నానం చేయించిన వరుణలోకం ప్రాప్తిస్తుంది. ఎర్రటి చిత్రాన్నము, బెల్లము నైవేద్యం పెట్టి సూర్యునారాధించిన వానికి ప్రజాపతి లోకం ప్రాప్తిస్తుంది. భక్తిపూర్వకంగా సూర్యదేవునికి స్నానం చేయించి పూజగావించిన వారు సూర్యలోకంలో నివసిస్తారు. సూర్యుని ఆయన రథంపై పెట్టి రథంవెళ్ళే మార్గాన్ని పవిత్రం చేసి, పుష్ప, తోరణ, పతాకాదులతో అలంకరించువారికి వాయులోక నివాసప్రాప్తి వుంటుంది. నృత్యగీతాదులతో బృహదుత్సవం చేయించిన వానికి సూర్యలోక నివాసప్రాప్తి వుంటుంది. సూర్యుని రథంపైకి వచ్చాక జాగరం చేసి కీర్తించే పుణ్యవ్యక్తికి నిరంతరా నందానుభవం కలుగును. సూర్యభగవానునికి ఉత్సవసేవాదులకు మనుష్యులను ఏర్పాటు చేసిన వానికి ‘ఇక్కడ’ అన్ని కోరికలూ తీరగా అక్కడ సూర్యలోక ప్రాప్తి కలుగును. ఒకమారు సూర్యరథ యాత్రను చేయించిన మరుసటి సంవత్సరం అవే తిథుల్లో చేయించాలి. ఏ కారణంగానైనా ఆ ప్రాంతంలో ఆ యాత్ర జరగకపోతే మళ్ళా పన్నెండేళ్ళదాకా అక్కడ మాత్రం చేయరాదు.

యాత్రవేర్పాటు చేసినవాడు స్వర్గంలో ఇంద్ర సాయుజ్యాన్ని పొందుతాడు. రథయాత్రకి విఘ్నం కలిగించినవాడు మందేహ రాక్షసజాతిలో పుడతాడు. ఆషాఢ, కార్తిక, సూఘపున్నమిలనాడు ఉపవసించి సూర్యుని పూజించిన వారికి సద్గతులు కలుగుతాయి. ప్రపంచానికి స్వయంగా కనబడి, అనుగ్రహించడానికే సూర్యదేవుడు రథయాత్ర బయలు దేరతాడు. ఆ సమయంలో మనం చేసే పూజలను ఆయనే స్వయంగా అందుకుంటాడని బ్రహ్మ శివునితో చెప్పాడు.