భవిష్య పురాణము

151 - సౌరధర్మ వర్ణన

“మునీంద్రా! నేను వైష్ణవ, శైవాది పౌరాణిక ధర్మాలెన్నో వినియున్నాను. సూర్యదేవుని ప్రసన్నం చేయించే సౌరధర్మం పేరు మాత్రమే విన్నాను. దయచేసి దాని వివరాలననుగ్రహించండి” అని అభ్యర్థించాడు శతానీక మహారాజు.

చెప్పసాగాడు సుమంతు మునీంద్రుడు.

“మహారాజా! ఈ సౌరధర్మం పరమ శ్రేష్ఠమైనది. దీనిని స్వయంగా భగవానుడే తన సారథి అరుణునికుపదేశించాడు. అంధకారరూపాలైన దోషాలన్నిటినీ నశింపజేసి ప్రాణులను ప్రకాశమానులను చేసి లోక కళ్యాణాన్ని కలిగించే ధర్మమిది. ఇది సాధకునికి, శాంతచిత్తంతో అవలంబించేవానికి సుఖ, ధన, ధాన్యాల పరిపూర్తిని ప్రసాదించగలదు. సాధకుడు సూర్యోపాసనను త్రికాలాలలో మూడుపూటలా గాని కనీసం ఒక పూటైనా గాని చేయాలి. ఏవ్యక్తియైతే భక్తి పూర్వకంగా సూర్యనారాయణుని అర్చన, పూజన, సమర్పణలను ధర్మ ప్రకారం చేస్తాడో వాడు గత ఏడుజన్మలుగా చేసిన అన్ని ప్రకారాల పాపాలనుండీ విముక్తి పొందుతాడు. ఎల్లపుడూ సూర్యుని స్తుతి, పూజన, ఆరాధనలనే మనసులో పెట్టుకొని జీవించేవారు దేవస్వరూపులైపోతారు. ఇక పదహారు అంగాలతోకూడిన సౌరధర్మపూజన విధిని స్వయంగా సూర్యుడే ఇలా ఉపదేశించాడు.

‘పొద్దున్నే స్నానం చేసి శుద్ధ వస్త్రాలు ధరించాలి. జప, హవన, పూజన, అర్చనాదులను ‘ ముగించుకొని భక్తిపూర్వకంగా బ్రాహ్మణునీ, ఆవునీ, రావిచెట్టునీ పూజించాలి. భక్తిగా పురాణ ఇతిహాసశ్రవణం చేసి బ్రాహ్మలచేత వేదాభ్యాసం చేయించాలి. అందరినీ ప్రేమించాలి. సాధకుడు స్వయంగా పూజచేసి జనాలకి పురాణ జ్ఞానాన్ని కలిగించాలి. సూర్యదేవుని (అంటే నన్ను) నిత్యం స్మరిస్తుండాలి. ఇది సర్వోత్తమ విధానం. అన్ని రకాల జనాలకూ ఈ ధర్మాధికారంవుంది. ఫల, పుష్ప, పత్ర, జలాదులలో ఏది నన్ను తలచుకొని అర్పించినా నన్ను చేరుతుంది. ఆ అర్పకుడికి నేను అదృశ్యుడను కాను. నాకు వారూ కనిపిస్తూనే వుంటారు. నేనున్న చోటే నా భక్తులుంటారు. వారున్నచోటే నేనూ వుంటాను.

ఎవరు అన్ని ప్రాణులలోనూ నన్నే చూడగలరో వారికోసం నేను ఎక్కడైనా వుంటాను, వారి హృదయాల్లో కూడా స్థిరంగా వెలుగొందుతుంటాను. సూర్యధర్మాన్ని పాటించేవాడికి ఎంత పెద్ద మహారాజులనైనా జయించగలిగే ఆత్మశక్తి వుంటుంది. నిరంతరం నన్నే మనసా స్మరించే వాడి బాధ్యత స్వయంగా నేనే వహిస్తాను. వాడికే చింతా, చీకటీ రానివ్వను. నా భక్తులు నాకత్యంత ప్రియులు. నాపై వారికుండెడి అనన్య నిష్ఠయే అన్ని ధర్మాలలోకి అత్యుత్తమం.’ అని సూర్యభగవానుడు అరుణునికి తెలిపాడు.”