స్త్రీ పురుషులు ఉత్తమరూపాన్ని అనగా సర్వాంగ సుందర శ్రేష్ఠ రూప ప్రాప్తిని - ఏ కర్మద్వారా పొందగలరని ధర్మజుడడుగగా శ్రీకృష్ణుడిలా చెప్పాడు.
“మహారాజా ఒకప్పుడిదే విషయాన్ని అరుంధతీ దేవి వసిష్ఠ మహర్షి నడుగగా ఆయన ఇలా అన్నాడు: ‘ప్రియా! విష్ణుభగవానుని ప్రార్థించనిదే ఎవరికీ ఉత్తమ రూపు లభింపదు. నక్షత్ర స్వరూపుడైన విష్ణుదేవుడే రూప ఐశ్వర్య సంతానాది కోరికలనీడేర్చగలడు.’ అరుంధతి అభ్యర్థనమేరకు వసిష్ఠుడామెకు చెప్పిన వ్రత విధానం ఇది:
చైత్రమాసంలో మొదలుపెట్టి భగవంతుని పాదాది అంగాలను ఉపవాస పూర్వకంగా పూజించాలి. ప్రతి, స్నానాదికములచే పవిత్రుడైన క్షత్రరూపుడైన శ్రీ విష్ణుదేవుని ప్రతిమను ఈ విధంగా పూజించాలి (నక్షత్రం - అంగం: ఇలా: మూల - పాదాలు, రోహిణి - జంఘలు, అశ్వని - మోకాళ్ళు, ఆషాఢం ఊరువులు, ఫల్గునీలు - గుహ్యస్థానం, కృత్తిక - కటి, రెండు భాద్రలు - పార్శ్వాలు, చీలమండలు, రేవతి - కుక్షి, అనురాధ - వక్షఃస్థలం, ధనిష్ఠ- పీఠం, విశాఖ - భుజాలు, హస్త - చేతులు, పునర్వసు - వ్రేళ్ళు, ఆశ్లేష - గోళ్ళు, జ్యేష్ఠ- మెడ, శ్రవణం - చెవి, పుష్యం - ముఖం, స్వాతి - దంతాలు, శతభిష - ముఖం (నోరు), మఘ - ముక్కు, మృగశిర - కన్నులు, చిత్ర - నుదురు, భరణి - తల, ఆర్ద్రా - కేశాలు ).
ఉపవాస దినాల్లో తలకి నూనె పట్టించరాదు. నక్షత్ర దేవతలకూ వాటికధిపతియైన చంద్రునికీ కూడా పూజలు చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. వ్రతంలో అశౌచమేదైనా జరిగితే రెండవ నక్షత్రంలో ఉపవాసం చేయాలి. ఈ విధంగా మాఘమాసంలో వ్రతం పూర్తయినాక ఉద్యాయపన చేయాలి. యథాశక్తి సువర్ణంతో (శక్తి లేకుంటే వెండి, రాగి అని అర్థం) నక్షత్ర పురుషుని నిర్మింపజేసి అలంకరించి, ఉత్తమశయ్యపై స్థాపించి, మరో శయ్యపై ఒక బ్రాహ్మణ దంపతుల జంటను కూర్చోబెట్టి వస్త్ర భూషణాదులతో పూజించి సప్త ధాన్యాలు, సవత్స గోవు, గొడుగు, చెప్పులు, నేయి నింపిన పాత్ర దక్షిణలతో సహా నక్షత్ర పురుష ప్రతిమను వారికి దానం చెయ్యాలి.
ఇక శైవ నక్షత్ర పురుష వ్రతం శివభక్తుల కుద్దేశింపబడింది. శంకర భగవానుల అంగపూజనం ఇందలి ముఖ్యాంశం. ఫాల్గున శుక్ల పక్షంలో హస్త నక్షత్రం పడ్డ రోజున ఉపవాసంగాని నక్తవ్రతంగాని చేసి ఈ వ్రత నియమాలను పట్టాలి, రాత్రి శివపూజను చేయాలి. హస్తాది ఇరవైయేడు నక్షత్రాలలో క్రమంగా పరమశివుని ఇరవై యేడు నామాలను చదువుతూ క్రమంగానే పాదాలనూ శిరస్సుదాకా అంగపూజనం చేయాలి. రాత్రి తైలం, లవణం లేని భోజనం చేయాలి. ప్రతి నక్షత్ర పూజనాడూ ఒక శేరు బియ్యం, ఒక శేరు నెయ్యి పాత్రలలో పోసి బ్రాహ్మణునికి దానమివ్వాలి. చివరి పారణలో బ్రాహ్మణులను భోజన దక్షిణాదులతో సంతుష్టులనుగా చేయాలి. శివపార్వతుల సువర్ణ ప్రతిమను చేయించి దానినొక ఉత్తమ శయ్యపై స్థాపించాలి. ఆ పై సర్వోపచరాలతో పూజలు చేసి ఆ ప్రతిమను నల్లావు, కుండలు, గొడుగు, అద్దం, చెప్పులు, బట్టలు, అలంకారాలు, అనులేపనాదులతో సహా బ్రాహ్మణునికి దానం చేయాలి. తరువాత ప్రదక్షిణ చేసి నియమ విసర్జనగావించి ప్రతిమను పెట్టిన శయ్యనూ పూజా సామగ్రినీ బ్రాహ్మణునింటికి పంపించి వేయాలి. మహారాజా! దుశ్శీలురకూ, దాంభికులకూ, కుతార్కికులకూ, నిందకులకూ, లోభులకూ ఈ వ్రతాన్నుపదేశింపరాదు. శాంత స్వభావులూ, సద్గుణులూ, శివభక్తులూ ఈ వ్రతాచరణకధికారులు. ఈ వ్రతం చేయడంవల్ల మహాపాతకాలు కూడా నశిస్తాయి. స్త్రీ పతి ఆజ్ఞతో ఈ వ్రతాన్ని చేస్తే ఆమె కెన్నటికీ పతివియోగముండదు. ఇష్టజనులు వియోగమూ కలగదు. ఈ వ్రతాన్ని గూర్చి విన్నవారి, చదివినవారి, పితరులు నరకం నుండి ఉద్ధరింపబడతారు”