2 - త్రేతాయుగపు సూర్య చంద్ర రాజవంశాలు

మహామునీ! వైశాఖ శుక్ల తదియ, గురువారంనాడు సుదర్శన మహారాజు తన పరివారంతో సహా వెనక్కి వచ్చి అయోధ్యలో అడుగుపెట్టాడు. మాయాదేవీ ప్రభావంతో అయోధ్యాపురి మరల అన్ని రకాల అన్న, ధనములతో పరిపూర్ణమై సమృద్ధి సంపన్నమైంది. సుదర్శన మహారాజు పదివేల సంవత్సరాలపాటు రాజ్యపాలన చేసి నిత్యలోక ప్రాప్తిని పొందాడు. (ఇతని కథ విస్తారితంగా దేవీ భాగవత తృతీయ స్కంధంలో కనిపిస్తుంది) అతని పుత్రుడు (రెండవ) దిలీపుడు నందినీ ధేనువును సేవించి తదనుగ్రహం వల్ల రఘువు అనే శ్రేష్ఠుని పుత్రునిగా పొందాడు. పదివేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. రఘుమహారాజు ఎంత కీర్తిమంతుడై సకల సద్గుణాభిరాముడై విలసిల్లాడంటే ఆయన తరువాతి సూర్యవంశమును రఘువంశమనీ, రఘుకులమనీ వ్యవహరించారు. బ్రాహ్మణాశీర్వాదం వల్ల ఆయనకు అజుడను పుత్రుడు జన్మించాడు. తండ్రి, తాతల వలెనే పదివేల యేండ్లు పరిపాలించి పరమపదించాడు. అతని పుత్రుడు (రెండవ) దశరథుడు అరవై వేల సంవత్సరాలపాటు రాజ్యపాలన గావించాడు. ఆతని పెద్దకొడుకే విష్ణువవతారమై, రఘుకుల తిలకుడై, రఘువంశసుధాంబుధి చంద్రుడైన శ్రీరామ చంద్రుడు కరుణా పయోనిధియైన ఈ దాశరథి పదకొండు వేల సంవత్సరాలు రాజ్యం చేసి వైకుంఠ గమనం చేశాడు.

శ్రీరామ పుత్రుడైన కుశుడు పదివేల సంవత్సరాలు రాజ్యం చేశాడు. ఆ తరువాత ఈవంశంలో పైతృకంగా అతిథి, నిషధ, ‘నలుడు’ (ఈయన దమయంతి భర్తకాడు) నభ, పుండరీక, క్షేమధన్వ, దేవానీక, అహీనగ, కురు మహారాజులు రాజ్యపాలనం గావించారు. త్రేతాయుగంలోనే నూరుయోజనాల విస్తీర్ణంలో కురు క్షేత్రాన్ని ఈ మహారాజు నిర్మించాడు. ఆ తరువాత వంశపారంపర్యంగా పారియాత్ర, బలస్థల, ఉక్థ, వజ్రనాభి, పుష్పసేన, ధ్రువసంధి, అపవర్మ, శీఘ్రగంత, మరుపాల, ప్రసుశ్రుత, సుసంధి అను పేర్లుగల మహారాజులు పరిపాలించారు. సుసంధి భూమి మొత్తాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకొని పరిపాలించాడు. అతని తరువాత వంశక్రమంలో అమర్షణ, మహాశ్వ, బృహద్బల, బృహదైశాన, మురుక్షేప, వత్సపాల, వత్సవ్యూహ, ప్రతివ్యోమ, దేవకర, సహదేవ, బృహదశ్వ, భానురత్న, సుప్రతీక, మరుదేవ(మిగతా పురాణాలలో సూర్యవంశ వర్ణన ఇక్కడితో ఆగిపోతుంది. ఒక్క భవిష్యపురాణంలోనే అది కలియుగం దాకా సాగింది) సునక్షత్ర, కేశీనర, అంతరిక్ష, సువర్ణాంగ, అమిత్రజిత్తు, బృహద్రాజ, ధర్మరాజ, కృతంజయ, రణంజయ, సంజయ, శాక్యవర్ధన, క్రోధదాన, అతులవిక్రమ, ప్రసేనజిత్తు, శూద్రక, సురథ చక్రవర్తులందరూ రఘువంశానికి వన్నె తెచ్చిన వారే. దేవ్యారాధకులే. యజ్ఞయాగాది తత్పరులు, ధర్మావలంబకులు, ధర్మరక్షకులు కావడం చేత వీరంతా స్వర్గనివాసాన్నే పొందారు. (ఎందుకోగాని ఈ సందర్భంలో ఈ పురాణంలో ఒక మాట చెప్పబడింది. అదేమనగా బుద్ధవంశజులు శుద్ధక్షత్రియులు కారు)

త్రేతాయుగ తృతీయ చరణ ప్రారంభంలో కొంత నవీననత చోటుచేసుకుంది. దేవరాజైన ఇంద్రుడు రోహిణి పతియైన చంద్రుని ఒక వంశకర్తగా చరిత్రలో నిలిచిపొమ్మని చెప్పి భూలోకానికి పంపించాడు. చంద్రుడు వచ్చి, తీర్థరాజమైన ప్రయాగను రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని స్థాపించాడు. పరమ భాగవతోత్తముడైన ఈ చంద్రమహారాజు పరమశివుని, మహావిష్ణువుని అతులిత తత్పరతతో పూజించాడు. భగవతి మహామాయ ప్రసన్నతకై నూరు యజ్ఞాలు చేశాడు. పదునెనిమిది వేల సంవత్సరాల పాటు రాజ్యపాలన చేసి తనలోకానికి వెళ్ళిపోయాడు. అతని కొడుకు బుధుడు ఇలాదేవిని పెండ్లాడి పురూరవుని కన్నాడు. పురూరవ చక్రవర్తి పదునాలుగువేల సంవత్సరాలపాటు ఈ పుడమిని పాలించాడు. అతనికి ఆయువు అనే పుత్రుడు జనించాడు. ఇతడు ధర్మాత్మునిగా నారాయణారాధకునిగా ముప్పదియారువేల సంవత్సరాలు రాజ్యం చేసి దేహాంతమందు గంధర్వలోకాన్ని చేరాడు. తరువాత స్వర్గారోహణ చేసి దేవతలతో సమాన స్థాయితో నిలిచాడు. ఆయువు పుత్రుడే నహుషుడు. నహుషుడు భూలోకంలో ఒక ఆదర్శ ప్రభువుగానే జీవించి యజ్ఞయాగాదులను అద్భుతంగా అనుపమంగా నిర్వర్తించాడు గాని తన స్వశక్తితో ఇంద్రపదవినీ త్రిలోకాధిపత్యాన్నీ సాధించగలిగాక పొగరు తలకెక్కి మహర్షులనే కాలితో తాకేటంత అహంకారానికి లోనై పోయాడు. ఫలితంగా దుర్వాసముని శాపం తగిలి భూలోకంపై అరణ్యాలలో కొండచిలువై పడిపోయాడు. ద్వాపరయుగంలో భీముని వల్ల శాపవిమోచనం పొందాడు. (మహాభారతంలోనూ ఇతర గ్రంథాలలోనూ నహుషుని శపించిన మహర్షి అగస్త్యుడని చెప్పబడింది) నహుషుని పుత్రుడు యయాతికి అయిదుగురు పుత్రులుదయించారు. వారిలో ముగ్గురు మ్లేచ్ఛ దేశాలకు శాసకులైనారు. (వీరి కథ మత్స్యపురాణం తొలి అధ్యాయాలలో లభిస్తుంది) మిగిలిన ఇద్దరూ ఆర్యావర్తాన్ని పరిపాలించారు. వారిలో పెద్దవాడు యదువు చిన్నవాడు పురు. ఇద్దరూ గొప్ప తపోబల సంపన్నులే. విష్ణు ప్రసాదం వల్ల ఒక లక్ష సంవత్సరాల పాటు రాజ్యపరిపాలన చేసి వైకుంఠ వాసమును పొందగలిగారు.

యదువు కొడుకు క్రోష్టువు అరవై వేల సంవత్సరాలు రాజ్యపాలనం చేశాడు. అతని పుత్రుడు వృజినఘ్నుడు ఇరవైవేల సంవత్సరాలు రాజ్యం చేశాడు. ఆ తరువాత వంశపారంపర్యంగా స్వాహార్చనుడు, చిత్రరథుడు, అరవిందుడు, శ్రవసుడు, తామసుడు, ఉశనుడు, శీతాంశుకుడు, కమలాంశుడు, పారావతుడు, జ్యామఘుడు, విదర్భుడు, క్రథుభోజుడు, కుంతిభోజుడు రాజ్యానికి వచ్చారు. కుంతిభోజుడు పాతాళాన్ని పాలిస్తున్న పురుదైత్యుని కూతుర్ని పెండ్లాడాడు. అతని పుత్రుడు మాయావిద్యుడు గొప్ప దేవీ భక్తుడు. అతడే ప్రయాగ సమీపంలో ప్రతిష్ఠానపురాన్ని నిర్మించి పదివేల సంవత్సరాలపాటు రాజ్యం చేసి స్వర్గప్రాప్తి నందినాడు. మాయావిద్యుని కొడుకు (మొదటి) జనమేజయుడు. అక్కడినుండి వంశపారంపర్యంగా ప్రచిన్వంతుడు, ప్రవీరుడు, నభస్యుడు, భవదుడు, సుద్యుమ్నుడు, బాహుగరుడు, సంయాతి, ధనయాతి, ఇంద్రాశ్వుడు, రంతినరుడు, సుతపుడు రాజులైనారు. సుతపుని పుత్రుడైన సంవరుణుడు హిమాలయాలకు పోయినూరు సంవత్సరములు తపస్సు చేయగా సూర్యభగవానుడు ప్రసన్నుడై తన కూతురైన తపతికి ఇతనిని పతిని చేసి అనుగ్రహించాడు. సంవరణ మహారాజు సంతుష్టుడై సూర్యలోకానికి వెళ్ళాడు. తరువాత కాల ప్రభావం వల్ల త్రేతాయుగానికి చివరి రోజులు రావడంతో నాలుగు వైపుల నుండి సముద్రం పొంగి పోయి భూమిని పూర్తిగా ముంచేసింది. పర్వత సహితంగా మొత్తం భూమి అలా రెండు సంవత్సరాలు పాటు సముద్రం క్రిందనే వుండిపోయింది. తరువాత పెనుగాలులు వీచడంతో సముద్రం వెనక్కి వెళ్ళిపోయి భూమి కనబడింది. అగస్త్యమహర్షి తన తేజస్సు ద్వారా భూమిని సారవంతం చేయగా అయిదేళ్ళ కల్లా భూమి, వృక్ష, గుల్మ సంపదలతో విలసిల్లి వాస యోగ్యమయింది. సూర్యభగవానుని ఆజ్ఞతో సంవరణ మహారాజు, అంతవఱకు తనతో బాటు సూర్యలోకంలో నివసిస్తున్న రాణి తపతిని, గురువు వసిష్ఠుని, మూడు వర్ణాలకూ చెందిన కొందరు అనుచరులనూ తోడ్కొని భూమిపైకి వచ్చాడు”.