భవిష్య పురాణము

35,36 - సరస్వతీ వ్రత విధానం - ఫలం

“పరంధామా! ఏ వ్రతం చేస్తే మాటలో మాధుర్యం వస్తుంది? ప్రాణికి సౌభాగ్యం చేకూరుతుంది? విద్యలో అతి కౌశలం ప్రాప్తిస్తుంది. పతి పత్నుల మధ్య వియోగ ముండదు? దీర్ఘాయువూ కలుగుతుంది? దయచేసి చెప్పండి.” అభ్యర్థించాడు ధర్మజుడు, అనుగ్రహ భాషణ కొనసాగించాడు శ్రీకృష్ణుడు. “ధర్మరాజా! సరస్వతీ వ్రతం వల్ల నీవు అడిగిన ఫలాలన్నీ సమకూడుతాయి. ఈ సారస్వత వ్రత విధానాన్ని వినిపిస్తాను. ఈ వ్రతి కీర్తన మాత్రముననే సరస్వతీ దేవి సంతోషిస్తుంది. దీనిని సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పంచమినాడు ప్రారంభించాలి. ముందు భక్తి పూర్వకంగా బ్రాహ్మణునిచే స్వస్తి వాచనము చేయించి గాయత్రీమాతను పూజించాలి. (గాయత్రి అనేది మంత్రము. గాయత్రీ అనునది దేవత. ఇవి ఒకటికాదు) ఈ మాత సరస్వతి ప్రతిరూపమే. గంధము, శ్వేతమాల, శుక్లాక్షతలు, శ్వేతవస్త్రాదులతో ఈ వీణా, అక్షమాలా, కమండలు, పుస్తకధారిణియైన దేవిని, సర్వాలంకారములచే అలంకృతయైన భగవతిని పూజించాలి చేతులు జోడించి ఈ మంత్రాలతో ప్రార్థించాలి.

యథాతుదేవి భగవాన్ బ్రహ్మా లోకపితామహః

త్వాం పరిత్యజ్యనో తిష్ఠేత్ తథా భవ వరప్రదా

వేదశాస్త్రాణి సర్వాణి నృత్య గీతాదికం చయత్

వాహితం యత్ త్వయాదేవి తథా మే సంతు సిద్ధయః

లక్ష్మీర్మేధా వరా రిష్టిర్గౌరీ తుష్టిః ప్రభా మతిఃః

ఏతాభిః పాహి తనుభిరిష్టాభిర్మాం సరస్వతి (ఉత్తరపర్వం 35/7-9)

సరస్వతీదేవి అష్టమూర్తిమతి. లక్ష్మి, మేధా, వరా, రిష్టి, గౌరీ, తుష్టి, ప్రభా, మతి - అనే ఈ యెనిమిది మూర్తుల ద్వారా తనను రక్షించమని ప్రతి ప్రార్థించాలి. ఇలా ప్రార్థించి మౌనంగా భోజనం చేయాలి.

ప్రతిమాసంలో శుద్ధపంచమినాడు ఇలా చేసి సువాసినీ స్త్రీలను రావించి వారిని పూజించి వారికి తిలలు, బియ్యం, గిన్నెతో పెరుగు, పాలు, సువర్ణం దానం చేస్తూ ‘గాయత్రీ ప్రీయతాం’ అని ఉచ్చరించాలి. సాయంకాలమంతా మౌనంగానే వుండాలి. ఇలా ఒక సంవత్సరం చేసి చివరి పంచమినాడు బ్రాహ్మణులకు గిన్నెనిండా అన్నమునూ, రెండు శ్వేత వస్త్రాలనూ, దూడతోడి గోవునూ, చందనమునూ దానం చెయ్యాలి. దేవికి నివేదించిన వితాన, ఘంటాది పదార్థాలను బ్రాహ్మణునికిచ్చెయ్యాలి. పూజ్య గురుదేవుల నాహ్వానించి ఆయనను పూజించి వస్త్ర, మాల్య, ధన, ధాన్యాదులను సమర్పించాలి. ఈ పద్ధతిలో సారస్వత వ్రతాన్ని చేసిన పురుషునికి విద్య, ధనము, మధుర కంఠమూ ప్రాప్తిస్తాయి. సరస్వతమ్మ దయవల్ల నతడు వేదవ్యాసుని యంత కవి కూడా కాగలడు. స్త్రీలకు ఈ వ్రతం చేస్తే వీటన్నిటితోబాటు పతి యొక్క అనుకూలత కూడా లభిస్తుంది.”