భవిష్య పురాణము

18 - అశ్వినీ కుమారుల అంశతో సధన, రైదాసుల ఉత్పత్తి కథ

భూలోకంలో కలియుగంలో భరతవర్షంలో జనించి ఆ భూమిని కర్మభూమిగా వేదభూమిగా పదికాలాలపాటు నిలబెట్టిన దైవాంశసంభూతులైన మహనీయుల జాడలను సూతమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు.

“మునులారా! ప్రయాగలో బృహస్పతి అశ్వినీ కుమారులవైపు చూసి వారి గాథను కూడా చెప్పాడు.”

భగవంతుడైన వివస్వంతుని అనగా సూర్యభగవానుని కథలో ఆయన రెండవ భార్యయైన ఛాయకు సావర్ణి మనువు, శని, తపతి జన్మించారనీ సంతానం విషయంలో పక్షపాతం చూపిన ఛాయను సూర్యుడు భస్మం చేశాడనీ విన్నారు కదా! ఆ విధంగా తమ తల్లిని తమకు లేకుండా చేసిన సూర్యునిపై సావర్ణి మనువు, శని దేవుడు తిరగబడ్డారు. సూర్యుడు కోపంతో వారిని కూడా భస్మం చేయబోగావారు హిమాలయ పర్వతంపైకి పోయి అక్కడ ‘తపస్సు చేశారు. మూడేళ్ళ కఠోర తపస్సు తరువాత భక్తవత్సలయైన కాళీమాత వారికి సాక్షాత్కరించి సూర్యాగ్నిలో భస్మం కాకుండా వరమిచ్చింది. వారు వెంటనే సూర్యుని పైకి దాడికి వెళ్ళారు గాని ఆయనక్కడ లేడు.

రమణీయమైన కురుఖండంలో సూర్యపత్ని సంజ్ఞ అశ్వరూపంలో తపస్సు చేయసాగింది. సూర్యుడక్కడికి వెళ్ళాడు. ఆమెపట్ల ప్రసన్నుడై తాను కూడ అశ్వరూపం ధరించి ఆమెతో కలిసిపోయాడు. ఇలా అయిదేళ్ళు వారు హాయిగా కాపురం చేశారు. వారికప్పుడు ఇద్దరు మహాపరాక్రమవంతులైన పుత్రులు పుట్టారు. వారు అన్ని విధాలా దేవతలే. తమ తండ్రియైన సూర్యుడు సాపర్ణిమనువు, శనిదేవతలకు భయపడి ఇక్కడ తలదాచుకొన్నాడనుకొని వారు పోయి ఆ యిద్దరినీ యుద్ధంలో ఓడించి త్రాళ్ళతో కట్టి తెచ్చి తండ్రి కాళ్ళపై పడేశారు. తన పుత్రులే ఐనా సాపర్ణి, శని క్రమశిక్షణ తప్పారు కాబట్టి సూర్యుడు వారిని శిక్షించాడు. దానివల్ల వారిరువురూ కుంటివారైపోయారు.

తరువాత సూర్యుడు అశ్వినీదేవతల పట్ల ప్రసన్నుడై ‘జీవుడు, ఆత్మ మరియు నర, నారాయణులు రెండుగా కనిపించినా ఒక్కరే. అలాగే మీరు కూడా ప్రసిద్ధికెక్కుతారు. సోమశక్తియగు ఇడాదేవి, సూర్యశక్తి పింగళా మీకు పత్నులై వర్ధిల్లుతారు. మనుష్యులకు రాశిక్రమంలో పన్నెండవ స్థానంలో శనైశ్చరుడుండి పీడిస్తే, ఇడాపతి ఆరాధన శని అధికారానికి విరుగుడుగా పనిచేస్తుంది. అలాగే సావర్ణి శాంతి పింగళాపతి ద్వారా జరుగుతుంది. జన్మరాశిలో తపంతి (తపతి) వుండి తాపకారకమైనపుడు ఇడా, పింగళా ఇద్దరి ద్వారా శాంతికార్యం సంపన్నమవుతుంది అని దీవించాడు. ఆ తరువాత అశ్వినీ కుమారులు దేవవైద్యులయ్యారు. సావర్ణి, శని రాహుకేతువులుగా పరిణమించారు. ఈ రాహుకేతువులీనాటికీ సూర్యుని కబళించడానికి వస్తూ పోతూనే వుంటారు. గ్రహణ సమయంలో రాహుకేతువుల పీడ తగిలినచోట శాంతికై అశ్వినీ దేవతల నారాధించాలి.

శౌనకాచార్యా! ఆ తరువాత అశ్వినీ దేవతలు తమ అంశలను భూలోకంలో శూద్ర యోనిలోకి పంపారు. ఇడాపతి మేకలను చంపుకుతినే చండాలుని ఇంట జన్మించాడు. పెరిగి పెద్దవాడై సదన్ కసాయీ అను పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. తల్లిదండ్రులను దైవాలుగా భావించి పూజించేవాడు. తరువాత కబీర్ శిష్యునిగా మారి దేశ సంచారం చేసి ప్రజలకు జ్ఞానాన్నుపదేశించాడు.

పింగళాపతి చర్మకారుల ఇంట పుట్టాడు. మానదాసను మాదిగ కొడుకుగా పుట్టి రైదాసను పేర ప్రఖ్యాతి చెందాడు. ఇతడు బాగా చదువుకొని కబీర్ తో వాదించి గెలిచాడు గానీ శంకరాచార్యులవారి చేతిలో ఓడిపోయాడు. శేషజీవితాన్ని రామానందుల శిష్యరికం చేస్తూ గడిపాడు.”