భవిష్య పురాణము

68 - సిద్ధార్థ సప్తమి

(ఆవాలు అనే అర్థంకూడా సిద్ధార్ధ పదానికుంది, తెల్లతెగడ చెట్టుని కూడా సిద్ధార్ధ అంటారు.)

యాజ్ఞవల్క్యమునికి బ్రహ్మ ఉపదేశం కొనసాగుతోంది. ‘మునీంద్రా! ఒకనాడు శ్రీ సూర్యనారాయణ భగవానులే తనకు నచ్చిన పూలు, పండ్ల పేర్లను చెప్తూ నాకు ఇది కూడా ఉపదేశించారు.

మాసంలో తొలిసప్తమినాడు ముందుగా గంధ, పుష్ప, ధూప, దీపాది ఉపచారాలతో సూర్యుని పూజించి నానాప్రకారాల నైవేద్యాలు పెట్టిన తరువాత పూలలో మల్లె, గన్నేరు; ధూపాలలో విజయధూపము, గంధాలలో కుంధాం, లేపనాలలో రక్తచందనం, దీపాలలో నేతిదీపం; నైవేద్యాలలో లడ్డు - ఇవ్వన్నీ ఆ స్వామికి ఇష్టమైనవి కావున వాటితోనే ఆయన పూజచేయాలి. ప్రదక్షిణ, నమస్కారాల తరువాత ఆవగింజను, నీటిని చేతిలోకి తీసుకొని సూర్యదేవునికెదురుగా నిలబడి మనసులోని కోరికను మరల మననం చేసుకుంటూ ఆ జలాన్ని గింజతోబాటు మింగేయాలి. ఆ గింజ దంతాలకు తగలకూడదు. ఇలాగే రెండవ సప్తమినాడు చేసి రెండు తెల్ల ఆవగింజలను మ్రింగాలి. ఇలా ఏడు సప్తములపాటు సప్తమికొక గింజను పెంచుకుంటూపోవాలి. (గింజను పెంచుకుంటూ ద్రవాన్ని మార్చుకుంటూ పోతే మరింత శుభప్రదం. తొలి వారం నీరు, తరువాతి వారాలు క్రమంగా నెయ్యి, తేనె, పెరుగు, పాలు, గోమయం, పంచగవ్యాలు.) ప్రతిమారు గింజనుమింగేముందు ఈ మంత్రం పఠించాలి.

సిద్ధార్థ కస్త్వంహి లోకే సర్వత్ర శ్రూయసేయథా

తథా మామపి సిద్ధార్థ మర్థతః కురుతాం రవిః (బ్రాహ్మ 68/36)

ఆ తరువాత శాస్త్రోకంగా జపాలనూ, హననాలనూ చేయించాలి. ఈ వ్రతాన్ని చేసినవారికి ఇహలోకంలో అన్ని కోరికలూ తీరుతాయి. దేహాంతంలో సూర్యలోకప్రాప్తి వుంటుంది.