భవిష్య పురాణము

23 - ఉమామహేశ్వర వ్రతవిధి

ధర్మరాజడిగిన మీదట అనేక గుణవంతులైన పుత్రులు, పౌత్రులు, సువర్ణం, వస్త్రాలు, సౌభాగ్యం పతి వియోగం లేకపోవుట అనే అన్ని భాగ్యాలనూ ఫలంగా ప్రాప్తింపజేసే వ్రతాన్ని శ్రీకృష్ణుడీ విధంగా ఉపదేశించసాగాడు.

“ధర్మనందనా! ఉమామహేశ్వర వ్రతమని ఒకటున్నది. అప్సరసలూ, విద్యాధరీ కిన్నరీ మణులూ, ఋషి కన్యలూ, సీతా, అహల్యా, రోహిణీ, దమయంతీ, తారా, అనసూయా - ఇలా ఎందరో నారీమణులు ఈ వ్రతాన్నాచరించి తరించారు. ఇప్పటికీ ఎందరో స్త్రీలు ఈ వ్రతం ద్వారా ఆదిదంపతులనాశ్రయిస్తున్నారు. పార్వతీదేవి స్వయంగా స్త్రీలకు దారిద్ర్య అనారోగ్యాల నుండి విముక్తినీ, దరిద్ర, హీన స్త్రీలకు సర్వసుఖ భోగ ప్రాప్తిని కలిగింపజేయడానికి ఈ వ్రతాన్ని మనుష్య లోకంలో ప్రాచుర్యంలోకి తెచ్చింది.

ఈ వ్రతాన్ని చేసే స్త్రీ ధర్మపరాయణయై వుండాలి. మార్గశిర శుద్ధ తదీయ నాడు ఉపవాసముండాలి. పెందలకడనే మేలుకొని గంగ లేదా తత్సమాన పవిత్ర జలాశయంలో స్నానం చేసి శివపార్వతులనే ధ్యానంచేస్తూ ఈ మంత్రం ద్వారా శ్రీ లలితాదేవిని పూజించాలి.

నమోనమస్తే దేవేశ ఉమాదేహార్ధ ధారకః

మహాదేవీ నమస్తేఽస్తు హరకాయార్ధ వాసినీ (ఉత్తరపర్వం 23/12)

తరువాత ఇంటికి వచ్చి కాస్త పంచగవ్యాన్ని సేవించి ప్రతిమ యొక్క దక్షిణ భాగంలో శంకర భగవానునీ వామ భాగంలో భగవతి పార్వతినీ భావించుకొని గంధ, పుష్ప, గుగ్గిల, ధూప, దీప, ఘృతపక్వ నైవేద్యాలతో భక్తిపూర్వకంగా వారిని పూజించాలి. ఇలా పన్నెండు నెలల్లోనూ చేసిన తరువాత ప్రసన్న చిత్తంతో వ్రతానికి ఉద్యాపన చెప్పాలి. వెండితో శంకరదేవునిదీ బంగారంతో ఉమాదేవిదీ ప్రతిమలను చేయించి రెండిటినీ వెండినందిపై స్థాపించి వస్త్రభూషణాదులచే అలంకృతులను చేయాలి. అనంతరం చందనం, తెల్లపూలు, తెల్లవస్త్రాలు మున్నగువాటితో శంకరుని పూజించాలి. పార్వతిని కుంకుమ, ఎఱ్ఱపూలు, ఎఱ్ఱని వస్త్రాలతో పూజించాలి. తరువాత శివభక్తుడు, వేదపాఠి, శాంత చిత్తుడునైన బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణతో సంతుష్టపఱచి ఆయనకు ప్రదక్షిణ చేసి ఈ క్రింది శ్లోకాన్ని పఠించాలి.

ఉమామహేశ్వరౌదేవౌ సర్వలోకపితామహౌ

వ్రతేనానేన సుప్రీతౌ భవేతాం మమ సర్వదా (ఉత్తరపర్వం 23/21)

ఈ విధంగా ప్రార్థించి ఒక క్రోధరహిత బ్రాహ్మణునికి వ్రత సామగ్రినంతటినీ ఇచ్చివేయాలి. ఈ వ్రతాన్ని భక్తిపూర్వకంగా చేసే స్త్రీ ఒక కల్పాంతం దాకా శివలోకంలో నివసించగలదు. మరల భూలోకంలో పుట్టవలసి వచ్చినపుడు అదే భర్తతో ఉత్తమ వర్ణంలో జన్మించి అద్భుత సుఖ సౌభాగ్యాలతో చిరకాలం జీవించగలదు. ప్రతి వియోగం వుండదు.