122 - మాఘస్నాన విధి

మహారాజా! కలియుగంలో మనుష్యులకు స్నానాలపై పెద్దగా శ్రద్ధ వుండదు. అయినా మాఘ స్నానాలు విశేష ఫలసిద్ధి దాయకాలు కాబట్టి వాటిని వర్ణిస్తాను.

కాలుసేతులు, మాట, మనస్సు చక్కగా పనిచేస్తూ, అదుపులో వుండి, విద్య, తపస్సు, కీర్తిగలవారు ఎప్పటి వ్రత ఫలాలనో భోగిస్తున్నారనుకోవాలి. వారు ఇప్పుడు కూడ శాస్త్రోక్తంగా తీర్థ, స్నాన, దానాది పుణ్యకర్మలను చేస్తేనే మరుజన్మలో కూడ సుఖజీవనం లభిస్తుంది. శ్రద్ధాహీనుడు పాపి, నాస్తికుడు, సంశయాత్మ, కుతార్కికుడు - వీరికి తీర్థ స్నానాల ఫలితం లభించదు.

ప్రయాగ, పుష్కర, కురుక్షేత్రాది సుప్రసిద్ధ తీర్థాలలోనైనా ప్రతికి దగ్గరలోనున్న అల్ప ప్రసిద్ధ, అప్రసిద్ధ తీర్థాలలోనైనా మాఘ స్నానాలు చేయవచ్చును. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసినవారికి మహాపాతకాలన్నీ నశించడమే కాక ప్రాజాపాత్య యజ్ఞఫలం కూడా దక్కుతుంది. నిత్యమూ క్షేత్రంలో (తీర్థ) ప్రాతః స్నానం చేసే బ్రాహ్మణుడు సకల పాపములూ నశింపగా దేహాంతంలో పరమాత్మను చేరుకుంటాడు. వేడినీటితో స్నానం, జ్ఞానం లేని మంత్రజపం, శ్రోత్రియ బ్రాహ్మణుడు లేని శ్రాద్ధకార్యం, సాయంకాలం చేసే భోజనం వ్యర్థాలు. స్నానాలు నాలుగురకాలు. అవి వాయవ్య, వారుణ, బ్రాహ్మ, దివ్య స్నానాలు. గోధూళితో చేసేది వాయవ్యమనీ, మంత్రాలతో చేసేది బ్రాహ్మణ మనీ, సముద్ర, నదీ, తటాకాది జలాలతో చేసేది వారుణమనీ, వర్షపు నీటితో చేసేది దివ్యస్నానమనీ చెప్పబడుతున్నాయి. వారుణ స్నానమే సర్వశ్రేష్ఠము.

బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థి, సన్యాసి ఎవరైనా ఏ వయసు వారైనా, స్త్రీలు, పురుషులు, నపుంసకులు - ఏ జాతివారైనా మాఘస్నానాలు చేస్తే ఉత్తమ ఫలితాలను పొందుతారు. అగ్రవర్ణ పురుషులు మంత్రపూర్వకంగానూ, స్త్రీలూ, శూద్రులూ మంత్రం లేకుండానూ ఈ స్నానాలు చేయాలి. సూర్యోదయాత్పూర్వం మాఘమాసంలో మహా పాపులూ, తాగుబోతులూ ఎవరైనా సరే మాలోకి వస్తే కడిగిపారేసి శుద్ధాత్ములను చేస్తాం’ అని జలాలు గర్వంగా చెప్పుకుంటాయి, ఇలా:

మాఘమాసేరటన్త్యాపః కించిదభ్యుదితే రవౌ

బ్రహ్మఘ్నంవా సురాపంవా కంకంతంతం పునీమహే (ఉత్తరపర్వం - 122/25)

మాఘస్నానాలు చేసేవారు సన్యాసులవలె ఆ మాసమంతా భోగాలకూ ఉద్రేకాలకూ దూరంగా జీవించాలి. దుష్టులతో తిరగకూడదు. అన్ని నియమాలూ పాటించి దృఢంగా నిలబడి ఏ స్ఖాలిత్యమూ లేకుండా మాఘస్నానాలు చేసేవారు సూర్య - చంద్ర సమానులై ఉత్తమ ఐశ్వర్యాన్ని పొందగలరు.

పుష్య - ఫాల్గున మాసాల మధ్య, సూర్యుడు మకరంలో నున్న ముప్పది దినాలూ మాఘస్నానాలు చేయాలి. ఈ రోజులు విశేష పుణ్యప్రదాలు. మాఘమాసం మొదటి రోజే సంకల్ప పూర్వకంగా మాఘ - స్నాన నియమ గ్రహణంచేయాలి. పైన ఏమీ కప్పుకోకుండా చలికి వణకుతూ స్నానానికి బయలుదేరినపుడు కలిగే కష్టానికి ఫలంగా భగవంతుడు అశ్వమేధ ఫలాన్నిస్తాడు. తీర్థంలోకి పోయి స్నానం చేసి, నుదుటికి మట్టిని పూసుకొని, సూర్యుని కర్ఘ్యమిచ్చి పితరులకు తర్పణాలు వదలాలి. నీటిలో నుండి బయటికి వచ్చి ఇష్ట దేవతకు ప్రణామం చేసి శంఖ చక్రధారి, పురుషోత్తముడునైన శ్రీ మాధవ స్వామిని పూజించాలి.

ప్రతిదిన హవనము, ఏకభుక్తం, బ్రహ్మచర్యం, భూశయనం అనేవి నియమాలు. సామర్థ్యంగల వారు ఈ నియమాలన్నిటినీ ఈ నెలంతటా పాటించాలి. తిలల ప్రాముఖ్య మెక్కువ. వాటితోనే అభ్యంగనం, వాటిని కలిపిన నీటితోనే స్నానం, వాటితోనే పితృ తర్పణం, వాటితోనే భోజనం, వాటినే దానం ఇలా నువ్వులతో వ్రతం చేసినవారికి కష్టాలుండవు.

తిలస్నాయీ తిలోద్వర్తీ తిలభోక్తా తిలోదకీ

తిలహోతాచదాతా చషట్ తిలోనావసీదతి (ఉత్తరపర్వం 122/27)

తీర్థంలో శీతనివారణకై ఈ సమయంలో మంట వేయడం గొప్ప పుణ్యకార్యం. నూనెనూ ఉసిరికాయలనూ దానం చేయాలి(ఎవరికి దానం చేయాలో చెప్పబడలేదు కాబట్టి ఎవరికైనా చేయవచ్చు.). ఇలా ఒక నెల్లాళ్లపాటు స్నానాలు చేసి చివర వస్త్ర, భూషణ, భోజనాదులతో బ్రాహ్మణులను పూజించి, ఇతరులకు ఎవ్వరికైనా, ఎందరికైనా, చలినితట్టుకోడానికీ కంబళ్ళు, మృగచర్మాలు, ధరించే బట్టలు, రజాయిలు, చెప్పులు దానం చేస్తూ మాధవః ప్రీయతాం అనాలి. ఈ విధిగా మాఘస్నానాలు చేయువారి ఘోర పాపాలన్నీ దగ్ధమై పోతాయి. అటు ఇరవైయొక్క తరాలూ ఇటు ఇరవై యొక్క తరాలూ ఉద్ధరింపబడతాయి. అన్ని ఆనందాలూ ప్రాప్తిస్తాయి. దేహాంతంలో విష్ణులోక ప్రాప్తి వుంటుంది.