మత్స్య మహా పురాణము
పురాణ శ్రవణ మహాత్మ్యము
ఈ మత్స మహాపురాణము పవిత్రము, ఆయుః ప్రదము, యశోవృద్ధికరము, పవిత్రతరము, శుభకరము, మహాపాపహరము, శుభస్వరూపము. ఈపురాణము వలన నరులకు సుకృత (సత్కర్మముల నాచరించినందు వలన కలుగు) ఫలములు లభించును. అనేక తీర్థ పంక్తుల యందు స్నానమాడుటచే, సమస్త ధర్మముల నాచరించుటచే కలుగు మహాఫలములు సదా లభించును. ఈ పురాణము ఉత్తమము - సర్వదోష విఘాతుకము; ఇది మత్స్యరూపుడగు హరి ఏకార్ణవమందు మనువునకు చెప్పినట్టిది. అత్యంతము ప్రాచీనమయిన ఈ పురాణము నుండి యొక శ్లోక పాదమునైన పఠించువాడు కూడ సర్వ పాపముక్తుడై నిశ్చయముగ నారాయణ స్థానము నందును; ఆ మన్మథుని వలె దివ్య సుందర శరీరుడై సుఖి అగును.
రహస్య తత్త్వ ప్రతిపాదకమగు ఈ పుణ్య పురాణమంతయు శ్రద్ధాయుక్తుడయి వినువాడు కూడ హరుని అనుగ్రహము వలన అశ్వమేధయాగ మాచరించి తత్పూర్తిగా అవభృథ మాచరించి నవాడు పొందు మహాఫలమును పొందును.
ద్విజులారా! ధర్మజ్ఞుడు (ధార్మికుడు, ధర్మము నెరిగి అనుష్ఠించువాడు) శివుని, విష్ణుని, బ్రహ్మను, సూర్యుని అర్చించిన తరువాత ప్రతిదినమందును శ్రద్ధాయుక్తుడై ఈ మహాపురాణము నుండి శ్లోకమునో, శ్లోకార్ధమునో, శ్లోకపాదమునో ఐన తాను వినునో లేదా ఇతరులకు వినిపించునో అట్టివానికి కలుగు ఫలము ఈ విధముగా ఉండును. బ్రాహ్మణుడు విద్యను, క్షత్రియుడు భూమిని, వైశ్యుడు ధనమును, శూద్రుడు సుఖమును పొందును. ఈ పురాణము అంతయు వినినచో అయుష్మంతుడును, పుత్రవంతుడును, లక్ష్మీవంతుడును, పాపరహితుడును, శత్రువులచే అరాజితుడును అగును.