త్రిపురాసురోపాఖ్యానము

ఋషులు సూతునిట్లడిగిరి, భగవానుడగు మహేశ్వరుడు పురారి ఎట్లయ్యెను? (పుర+ అరి=పురములకు శత్రుడు.) ఆ దేవుడు పురముల నెట్లు దహించెను? మాకదివిస్తరించి చెప్పుము. ఆకథయందును అది చెప్పగల వాడవని నీయందును గల ఆదరముతో మేము నిన్ను మరలమరల (బ్రతిమాలి) అడుగుచున్నాము. మయమాయా వినిర్మితమగు త్రైపుర దుర్గమును మహాదేవుడొకే బాణముతో నెట్లు దహించెను. ఆవిధము ఆదరణీయుడవగు సూతా! మాకు తెలుపుము. అనగా సూతుడు ఇట్లు చెప్ప నారంభించెను; దేవుడగు భవుడు త్రిపుర దుర్గముల నెట్లు దహించెనో తెలిపెద వినుడు. మహామాయాశాలియు మాయలకు జనకుడునగు మయుడను అసురుడుండెను. వాడు దేవతలతో సంగ్రామమున ఓడి పరమ తపమాచరించెను. ఆతడు తపమాచరించు చుండగా ఆమయ తేజస్సునకు లోబడినవారు బలవంతుడగు విద్యున్మాలి వీర్యశాలియగు తారకాక్షుడునను అసురులును మయుని యందలి అనుగ్రహబుద్ధితో అతని సంకల్పమునే తామును ఉద్దేశించి మయుని సమీపముననే ఉండి పరమతపమాచరించిరి. రూపొందిన లోక త్రయమువలె (బ్రహ్మ విష్ణు రుద్రులను) దేవత్రయమువలె అగ్నిత్రయమువలె కనబడుచు లోక త్రయమును సంతాపింపజేయుచు ఆ దానవులు తపమాచరించుచుచుందిరి. వారు తపః ప్రియులై హేమంతమున జలశయ్యలపై నుండి గ్రీష్మమున పంచాగ్ని మధ్యమందుండి వర్షర్తువు నందు నిరావరణమగు ఆకాశము క్రింద నిలిచి గడపుచుండిరి. వారు క్రమముగా వనమునుండి సంపాదించుకొనిన రుచ్యములు మృదువులునగు ఫలములు మూలములు పిమ్మట మరియొక విధమగు (కఠినమగు) ఆహారములు తీసికొనుచుండిరి. నమలములును అమలములును నగు జలములందు నాచు త్రాళ్ళయందు నిలిచియు తమ వల్కలములు బురదతో కప్పువడియు ఉండుచు శరీరములు చిక్కిపోయి ధమనులతో వ్యాప్తముకాగా మాంసమే లేక తపమాచరించ సాగిరి. వారి తపోగ్ని ప్రభావమున పగడమేదియో గుర్తింపరాకపోయెను. సర్వ జగత్తును కాంతి హీనమయ్యెను. అగ్ని సూర్యులు మందతేజస్కులయిరి. దానవు లనెడు ఆమూడు అగ్నులచే ఇట్లు లోకములు దహింపబడుచుండ జగద్బంధుడగు బ్రహ్మ వారి నడుమ సాక్షాత్కరించెను.

అంతట ఆకస్మికముగ స్వయముగవచ్చిన లోకకర్తయగు పితామహునిచూచి దైత్యులు నమస్కరించి స్తుతించిరి. తపస్సుచే రవివలె వెలుగుచు తనుగాంచి హర్ష పూర్ణముఖ నేత్రులగు ఆ దానవులతో హర్ష పూర్ణముఖ నేత్రుడగుచు బ్రహ్మ ఇట్లు పలికెను: నాయనలారా! నేను మీ తపమునకు తుష్టుడనై వరమీయవచ్చితిని. మీకోరిక ఏమియో సంకోచింపక తెలుపుడు.

ప్రసన్నుడయి ఇట్లు పలికిన బ్రహ్మతో విశ్వకర్మయగు మయుడు ప్రహర్షమున కనులు విప్పార ఇట్లనెను. దేవా! పూర్వము తారకయుద్ధమున దైత్యులు దేవతలచేతిలో ఓడిరి. ఖడ్గములతో ఆయుధములతో కొట్టి చంపబడిరి. ఎడతెగక మావారి దేహములు దెబ్బతినెను. వారు బాధితులు భయకంపితులునైరి. వారు శరణార్థులైరికాని తమకు శరణమేదియో వారెరుగరైరి. ఇట్టి స్థితిలో నేను తపఃప్రభావముచేతను నీ సేవకుఫలముగాను దేవతలకును చొరరాని దుర్గము నిర్మింపదలచు చున్నాను. నిర్మాతలలో శ్రేష్ఠుడవగు ప్రజాపతీ! నేను నిర్మించు ఆ త్రిపురమను దివ్య దుర్గము ఎట్టి కృత్యములకును కృత్య అనెడు అభిచారిక శక్తులకును జలదోషములకును అగ్ని తేజస్సు లకును దేవతల ఆయుధములకును దేవతలకును కూడ చేరరానిది కావలయును.

ఈమాట విని విశ్వ సృష్టికర్తయగు బ్రహ్మ నవ్వుచు విశ్వకర్మయగు మయునితో ఇట్లు పలికెను: ‘దైత్యగణాధిపా! మయా! సద్వర్తనములేని వాని కెవ్వనికిని సర్వామరత్వము లభింపదు. కనుక (అమరత్వము కోరక) క్షణకాలములో దుర్గ నిర్మాణమే చేసికొనుము. బ్రహ్మ మాట విని మయుడు ప్రాంజలియై పద్మసంభవుడగు బ్రహ్మతో మరల ఇట్లనెను: “ఒకేసారి విడిచిన ఒకే బాణముతో మాత్రమే నేను నిర్మించు దుర్గమును కాలవలయును, మేమును చావవలయును. మరియొక విధమున మాకు వధ్యత్వ ముండరాదు.

‘అట్లే యగుగాక!’ అని మయునితో పలికి బ్రహ్మదేవుడు స్వప్నమందు లభించిన ధనము వలె అదృశ్యుడయ్యెను. పితామహుడు ఏగిన తరువాత అగ్ని భాస్కరతేజులగు ఆ రాక్షసులును అటనుండి వెడలిరి. నాటినుండి వారు తపముచే మహాబలులగుటతోపాటు వరముచే మదించిరి.

ఋషిసత్తములారా! పిమ్మట మహాబుద్ధిశాలియగు ఆ మయుడు దుర్గము నిర్మింప సంకల్పించి ఇటు లాలోచింపసాగెను: నేను తప్ప మరి ఎవరును నివసింప అలవి కాని త్రిపుర దుర్గమును నేను ఎట్లు నిర్మింతును! నేను నామతి విచారణ శక్తిని ఉపయోగించి దేవతలు ఏక బాణపాతముతో దానిని విహతము చేయజాలకుండునట్లు ఆ దుర్గమును నిర్మింపవలయును. ప్రతియొక పురమునకు పొడవు వెడల్పులు ఏకశత యోజనము లుండునట్లు నిర్మింతును. పుష్య యోగము నందు ఆ పురముల నిర్మించి పుష్యయోగముననే అవి పరస్పరము కలియునట్లు చేయుదును. పుష్యయోగమున వానిని సమీపించి చేరినవాడు మాత్రమే వానిని ఏకశర ప్రహా రముతో కొట్టివేయగలుగును. వానిలో అయోదుర్గము క్షితితలమున రజత దుర్గ మంతరిక్షమున సౌవర్ణదుర్గ మంతకును మీదఉండునట్లు ఆ త్రిపురదుర్గము నిర్మితమగును. శతయోజన విస్తరము

గల అంతరములతో అట్టాలకములతో యంత్ర శతఘ్నులతో శక్తులు శూలములు ఉపల కంపన ములు (తాలను కదలించు యంత్రములు) మహాద్వారములతో మేరు మందర సదృశమహా ప్రాకారములతో విరాజమానమగుచు ఏరికిని చేరరానిదయి తారకాక్ష మయ విద్యున్మాలులు కాపాడుచుండు ఆ త్రిపుర దుర్గమును భగవానుడగు త్రిణేత్రుడు కాక అన్యుడెవ్వడు నశింపజేయ గలుగును?