మత్స్య మహా పురాణము
మండప లక్షణము
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను, ఇంతవరకును తెలిసికొనిన దేవాలయ నిర్మాణాదిక మునకును దేవతా పూజోత్సవాదులకును ఉపయుక్తము కావున ఇప్పుడిక మండపముల లక్షణమును తెలిపెదను, ప్రాసాద (దేవాలయ)మునకు అనురూపముగా నుండు మండప శ్రేష్ఠములను తెలిపెదను వినుడు; జ్యేష్ఠము మధ్యమము కనిష్ఠము అని మూడు విధములుగా మండప నిర్మాణము చేయవచ్చును; ఋషిసత్తములారా! వాటిని నామగ్రహణముతో మొదట తెలిపి తరువాత వాని లక్షణమును తెలిపెద వినుడు; ఇవి మొత్తము ఇరువది ఏడు విధములు; ఇవి అరువది నాలుగు స్తంభములు మొదలు పండ్రెండు స్తంభముల వరకు రెండేసి స్తంభముల వంతున తగ్గుటతో ఏర్పడును; 1. పుష్పకము-64 స్తంభములు కలది; 2. పుష్పభద్రము-62 స్తం; 3. సువ్రతము-60 స్తం; 4. అమృత మంథనము-58స్తం; 5. కౌశల్యము-56 స్తం; 6. బుద్ధి సంకీర్ణము-54 స్తం; 7. గజభద్రము-52 స్తం; 8. జయావహము-50 స్తం; 9. శ్రీవత్సము-48 స్తం; 10. విజయము - 46 స్తం; 11. వాస్తుకీర్తి - 44 స్తం; 12. శ్రుతింజయము- 42 స్తం; 13. యజ్ఞభద్రము-40 స్తం; 14. విశాలము-38 స్తం; 15. సుక్లిష్టము- 36 స్తం; 16. శత్రుమర్దనము-34 స్తం; 17. భాగపంచము - 32 స్తం; 18. నందనము-30 స్తం; 19. మానవము-28 స్తం; 20. మానభద్రకము-26 స్తం; 21. సుగ్రీవము - 24 స్తం; 22. హరితము 22 స్తం; 23. కర్ణికారము-20 స్తం; 24. శతర్థికము-18 స్తం; 25. సింహము -16 స్తం; 26. శ్యామభద్రము-14 స్తం;
ఇంతవరకును నీకు యథావత్ (శాస్త్రమునందును సంప్రదాయమునందును ఉన్నవియున్నట్లు) లక్షణములతో కూడిన మండపములను తెలిపితిని; మండప సంస్థానము (మండప నిర్మాణమునకై సిద్ధపరచు భూప్రదేశపు ఆకృతి) 1. త్రిభుజముగాగాని, 2. వృత్తముగాగాని, 3. అష్టభుజాకృతితోగాని, 4. షోడశ భుజాకృతితోగాని, 5. చతుర్భుజాకృతితో గాని యుండవచ్చును; ఇవి వరుసగా 1. రాజులకు విజయమును, 2. శత్రూచ్ఛాటనమును (భయపెట్టి పారదోలుట), 3. పుత్రలాభము, 4. స్త్రీ సమృద్ధి, 5. పుష్టి-కలిగించును; ఈ చెప్పిన విధములలో ఏదో యొక రూపమున నిర్మించిన మండపము శుభావహము, మరియొక విధముగ నిర్మించినది భయావహము.
మండప నిర్మాణ వ్యవస్థ: మండప నిర్మాణమునకై నిర్ణయించుకొనిన ప్రదేశమును (సంస్థాన భూమిపై నుండు ప్రదేశమును) చతుఃషష్టిపద రూపమున (64 సమ చతురస్రములుగా) విభజించుకొనవలయును; ఇట్టి విభాగములలో నట్టనడిమి విభాగములందుండునట్లు (465 పదములయందుండునట్లు ద్వారము నుంచవలయును, ద్వారపు వెడలుపు ఎంతయుండునో ఆ వాకిటి ఎత్తు అంతకు ద్విగుణముండవలయును; ద్వారపు కటి (గడియ) ద్వారపు వెడల్పులో మూడవవంతు పొడవు ఉండవలయును; మండపమందు మండప గర్భము ఉండును. ఇది మండవపు మొత్తము వెడల్పులో సగముండవలయును. అనగా చతుష్షష్ఠి పద విభజనానుసారము ఎటునుండి చూచినను 3-4-5-7 పదములలో ఏర్పడు చదరమున ఇదియుండవలయును; ఈ మండపమునకును నాలుగువైపులను గోడలుండును, దీనికిని ముందువైపున ద్వారము గర్భపు వెడలుపుతోనుండును; ఈ ద్వారపు పొడవు (ఎత్తు) ఈ వెడలుపునకు మూడింతలు ఉండవలయును; లేదా ఈ గర్భమండప ద్వారపు వెడల్పు ఇంతకు రెట్టింపు ఉన్నను (అనగా గర్భ మండపపు వెడల్పులో సగము) ఉండవచ్చును; ఈ ద్వారపు తలుపులు మేడి కొయ్యతో చేయవలయును, ద్వారశాఖలు (నిలువుకమ్ములు) ద్వారపు వెడల్పులో నాల్గవవంతు మందముతో (వెడల్పుతో నుండవలయును; తలుపును మూడుగాని, ఐదుగాని, ఏడుగాని చెక్కలను కలిపి చేయవచ్చును; 1. ఇది ద్వార నిర్మాణము నందు ఒక పద్ధతి; ఇట్లుకాక జ్యేష్ఠ, మధ్యమ, కనిష్ఠ భేదమున-ఒక్కొక్క భేదములో మరల మూడేసి విధములతోనైన ద్వార మేర్పరచవచ్చును: ఎట్లన 2. నూట నలువది, 3. నూట ముప్పది, 4. నూట ఇరువది అంగుళముల ఎత్తుతో నుండునవి జ్యేష్ఠ పరిమాణపు ద్వారములు; ఇవి ధన్యములును ఉత్తమములును; 5. నూట నాలుగు, 6. నూటపది, 7. నూట పదునారు అంగుళముల ఎత్తుతో నుండు ద్వారములు మధ్యమ పరిమాణక ద్వారముల వర్గము నందలివి; 8. నూరు, 9. తొంబది, 10. ఎనుబది అంగుళముల ఎత్తుతో నుండు ద్వారములు మూడును కనిష్ఠ పరిమాణక ద్వారముల వర్గము నందలివి; ఈ క్రమమున చెప్పిన పదిద్వారములును సర్వదా గ్రాహ్యములు; ఇతరవిధములగు కొలతలతోనుండు ద్వారములు వర్జించవలయును, ఏలయన అవి మానసోద్వేగకరములు.
సర్వ వాస్తులయందును ప్రయత్నముతో ద్వారవేధము లేకుండునట్లు చూడవలయును. వృక్షము, కోణము, భ్రమి (గాలిచక్రము, కుమ్మరిసారె, గానుగ లోనగునవి) ఇతరుల ఇంటి ద్వారము, స్తంభము, భావి, ధ్వజము, (జెండా), గోడ, గోయి, ఇట్టివాని వేధ పొందిన ద్వారము హాని కలిగించును; వీనిచే క్షయము, దుర్గతి, ప్రవాసము, క్షుద్భయము, దౌర్భాగ్యము, బంధనము, రోగము, దారిద్ర్యము, కలహము, విరోధము, ధననాశము ఇట్టి ఫలములు కలుగును.
ఈ మండపపు ఆవరణములో తూర్పున పండ్లచెట్లు-పాలుగల (మర్రివంటి) చెట్లు దక్షిణ మందును పశ్చిమమునను కలువలతో తామరలతో అలంకృతమయియుండు జలము (జలాశయము)ను ఉత్తరమున సరళ తాళాది వృక్షములును పుష్ప వాటికయును ఉండవలయును; ఇవికాక ఈ అన్ని దిక్కులందును అవకాశమున్న చోటులందు స్థిరమయినచో (ప్రవహించనిది) అస్థిరమయినచో (ప్రవహించునది) నీరు ఉండుట మంచిది.
ఇదే ఆవరణమునందు దక్షిణమున తపోధన (అనుష్ఠానమో జపములో తపములో పారాయణమో, యోగ సాధనమో చేసికొనువారి) స్థానమును ఉత్తరమున (సప్త) మాతృకా గృహములును ఆగ్నేయమున వంటశాలయు నైరృతమున వినాయక గృహమును పడమట విష్ణుని గృహమును వాయవ్యమున (యాత్రికుల వసతికై) గృహముల వరుసయు ఉత్తరమున యజ్ఞ శాలయు ఉత్తరముననే నిర్మాల్య స్థానమును, పడమటగాని సోమదేవతాక స్థానమునందు (ఉత్తరమున) గాని బలి నిర్వవణ స్థానమును ముందువైపున వృషభ స్థానమును (పడమట) శేష స్థానమునందు మన్మథ స్థానమును ఈశాన్యమునందు జలమునందు శయనించియుండు విష్ణుని స్థానమును ఈ విధముగ కుండముతోను మండపములతోను కూడిన ఆయతన(దేవాలయ)మును నిర్మింపజేయవలయును. ప్రక్కలందు పరివార శాలలుండవలెను.
ఘంటలు మేలుకట్టులు వివిధ తోరణములు (మహాద్వారములు) నిత్యోత్సవములు దర్శింపవచ్చి ఆనందముతో నిండియుండు జనులు వివిధ ధ్వజ విశేషములు ఉండునట్లు దేవాలయమును ఎవరు నిర్మింతురో వారిని ఇహమున లక్ష్మి ఎన్నడును విడువదు, వారు పరమున స్వర్గమునందు పూజల నందుకొనుచు సుఖములనందుదురు; ఇదేవిధముగ గృహమందును యథాశక్తిగా సకల మంత్రములతో శాస్త్రోక్త విధానములతో అర్చన విధానమును వ్యవస్థ చేసికొనవలయును; ఆయా ప్రక్రియా సందర్భములయందు గురువులకును ద్విజులకును గోవస్త్ర హిరణ్య భూదానములను చేయవలయును; ఎల్లరకును అన్నదానము చేయవలయును.