దేవదానవ యుద్ధము

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను, అనంతరము నారదుడు త్రిపుర దుర్గమునుండి దేవబలము కడకు వచ్చి సభయందు కూర్చుండెను. ఆ దేవసేనాస్థానము అద్భుతమగు ఇలావృత వర్షము. అచ్చటనే బలి యజ్ఞ మాచరించెను. అచ్చటనే అతడు వసించెడువాడు. అది దేవతల (ప్రాచీనార్యుల) యజ్ఞభూమిగా త్రిలోకప్రసిద్ధము. దేవతలు వివాహములు క్రతువులు జాత కర్మాది క్రియలు కన్యాదానములు ఇచ్చటనే జరుపుకొనిరి. శివుడిచ్చటనే తన సహాయులగు పార్షదులతో కూడ సతతము ఆనందించెను. లోకపాలురును అచ్చటనే మేరుపర్వత మందువలె కొలువుతీరెడివారు. ఇపుడు అచ్చట కూర్చుండి తేనెవలె పింగళ నేత్రములుకల దేవాదిపుడు మహేశ్వరుడు దేవతలతో ఇట్లు పలికెను: ఇదిగో! గగన సంచారియగు దానవులు త్రిపుర దుర్గము కనబడుచున్నదే! అది విమానములతో పతాకలతో ధ్వజములతో అలంకరింపడియున్నది. ఇది అందరు ఎరిగినది - ప్రసిద్ధమైనది-అగ్నివంటిది -నిరుపమానమైనది. వీరుగో! కాటుక కొండలవంటి దానవులు కుండలములు కిరీటములు ధరించి ప్రాకార గోపురాగ్రములయందు నిలిచి కనబడుచున్నారు. వీరుగో! మేఘములవలె ప్రకాశించు వికృతముఖులగు దైత్యులును, దానవులును విజయాభిలాషులై త్రిపుర దుర్గమునుండి వెలికి వచ్చుచున్నారు. ఇంద్రా! ఇట్టి స్థితిలో నీవును వాహనముల నెక్కి వరాయుధధారులైన దేవశతములతోను నా భృత్యులగు ప్రమథులతోను కూడి మహాసురులు చంపుము. మరి నేనో! రథ మారోహించి సైన్యమును వెంటగొనినిశ్చలుడనై ఈదుర్గమును గెలిచి మీకు విజయముకలిగింప అనుకూలమగు అవకాశమునకై నిరీక్షించుచుందును. పుష్యయోగమున ఈ త్రిపురదుర్గము ఒకటిగా ఐనపుడు నేను ఈ పురమును ఏకశరముతో నిర్దహింతును.

రుద్ర భగవానుడిట్లు చెప్పగా సురేంద్రుడు ఆ సైన్యముతో కూడి త్రిపుర విజయమునకై వెడలెను. అతని సైనికులెల్ల కొందరు రథారోహులు మరికొందరు పదాతులు; అందరును మేఘములను కొండలను పోలినవారు; సింహ ధ్వనులు చేయుచున్నవారు; పిడుగులు క్రక్కుచు ఉరుముచున్న మేఘములవంటి వారు.

ఆ నాదము విని రెచ్చిపోయి త్రిపుర దానవులు యుద్ధ లాలసులయి సంచరింపసాగిరి; అంతేకాదు; యుద్ధమునకై దేవతల కభిముఖులై పరుగెత్తిరి. ఆకాశమందలి గణేశ్వరులతో తలపడి యుద్ధముచేసిరి. వారిలో కొందరు మేఘములవంటి ఆకారములు కలవారు; మేఘములవలె ధ్వనులు చేయువారు నయిరి; సింహనాదములను కూడ చేసిరి; లేచి నిలిచి వాద్యములను కూడ మ్రోగించిరి. దేవతల సింహనాదమును సర్వ వాద్యముల ధ్వనియును గొప్పదిగా నయ్యెను. ఇన్ని విధములను దేవతలచేత త్రిపురదుర్గము మేఘముల చేత చంద్రబింబమువలె క్రమ్మి వేయబడెను. చంద్రోదయమున ఉద్రేకింపజేయబడి నింపబడిన సముద్రమువలె భయంకర రూపులగు సురాసురులచేత త్రిపురదుర్గము నిండిపోయి ప్రకాశించెను. వారిలో కొందరు విలాస వంతులు ప్రాకారములపై మరికొందరు గోపురములపై ఇంకను కొందరు అట్టాలకములపై (బురుజులపై మేడలపై అంతస్తులపై) నిలువబడిరి. ఆ విలాసవంతులందరును సువర్ణ హారము లను దాల్చిన వారును పదునుపెట్టి మెరుగులు తీర్చగా తళతళ మెరయు కృపాణికలను ధరించిన శూరులునుకాని సామాన్యులుకారు. వారిలో కొందరు జలపూర్ణ మేఘములవలె గర్జించు చుండిరి. మరికొందరు వస్త్రముల నెగురవేయుచు ఇటునటు పరుగెత్తుచుండిరి. ఇంకను కొందరు ఇండ్లలోనుండి బయటికి వచ్చి- ఇది యేమి జరుగుచున్నదని పరస్పర మడుగుచుండిరి. ఇది యేమో నాకు తెలియుట లేదు. నా తెలివియంతయు మరుగుపడిపోయినది. అమ్మా! నేను ఎవరివాడనో నాకు తెలియుటలేదు. ఇదుగో! ఇక్కడ చాల గొప్ప వ్యక్తి ఎవరో కనబడు చున్నాడు. ఇతడు కాలు (యము)డేమో! సింహములు లాగు రథము నారోహించి కనబడుచున్న ఈరాజెవ్వరో!

దేహమును పీడించువ్యాధివలె త్రిపురదుర్గమును పీడించుచుపైకి విజృంభించుచున్న డీతడెవరు? ఇతడెవరైన నగునుగాక! తందరలాడు ఈతడబాటు సమయములో ఈప్రశ్నములతో పనియేమి? ఇక ఆయుధములు ధరించి రండు; జరుగవలసినది జరుగును. అని ఇట్లు త్రిపుర దుర్గవాసులగు వారందరు భయాక్రాంతులయి పరస్పరమనుచు మాటలపై మాటలాడుచుండిరి. మరికొందరు ఒకరింకొకరి దగ్గరకు పోయిపోయి ఏమేమో అడుగుచుండిది.

అంతలో తారకాక్షపురమునందలి అసురులును, దైత్యులును కుపితులై బిలమునుండి మహా సర్పములవలె బయటకు వచ్చిరి. వారందరును ప్రమథనాయక సేనాపతులతో తలపడుటకై పరుగెత్తుచు సింహములచే అడ్డగించబడిన గజయూథనాయకులవలె వారిచే అడ్డగించబడిరి. సంపదలచే గర్వితులును దర్పితులును నగు ఆ అసురుల రూపములు తిత్తితో గాలి ఊదుటచే మండెడు అగ్నుల రూపములవలె ప్రజ్వలింప సాగెను. అంతట వారు భయంకర నాదములు చేయు పెద్ద చాపములను ఆకర్షించి ప్రాణము లాహారముగా గొను బాణములతో పరస్పరము కొట్టుకొనుచుండిరి. రూపసంపదలుగలిగి గర్వితులగు దానవులందరును పిల్లులవలె మృగముల వలె భయంకర వికృత ముఖములుగల ప్రమథులను చూచి బిగ్గరగా నవ్వుచుండిరి. మే మాక ర్షించెడు ధనుస్సుల నుండి వెలువడు పరిఘలను పోలు శరములు పక్షులు తటాకములలో ప్రవేశించు నట్లు ప్రవేశించును. మీరుమాకు ఎదురు నిలిచి యుద్ధము చేసితిరా-చచ్చితి రన్న మాటయే; మేము మిమ్ము చంపుదుము; వెనుకకు మరలుడు.

భయంకరరూపులు యుద్ధ దుర్మదులునగు దానవులు-దానవశ్రేష్ఠులు-శివపార్షదుల నిట్లు పరుషములు పలికి సూర్యుడు తన కిరణములతో మేఘములను చీల్చినట్లు శరములతో చీల్చిరి. సింహముల మొగములవంటి మొగములు కలవారును సింహములవలె విక్రమించు వారునగు ప్రమథులును దైత్య దానవులను గండశైలముల శిలల వానతో నలుగగొట్టిరి; చీల్చిరి, ఆకాశము మేఘములతోను, హంసలతోను కలత చెందునట్లు ఆసేనా సముదాయము దైత్య దానవులతో సంకులమయి ప్రకాశించెను. ఇంద్ర ధనువులతో మెరయు హృదయములుకల మేఘములు దుర్దినమును (మేఘాచ్ఛాదిత మయిన ఆకాశముకల దినము దుర్దిన మనబడును) సృష్టించినట్లు దైత్య దానవులును ధనువులు లాగి విడిచిన శరములతో దుర్దినమును సృష్టించిరి. బాణపు దెబ్బలు తగిలిన ప్రమథుల దేహములనుండి స్రవించు రక్తధారలు పర్వతముల నుండి వెలువడు సువర్ణ ధాతువులవలె కనబడుచుండెను. దైత్యులు వృక్షములతో శిలలతో శైలములతో గండ్రగొడ్డండ్రతో శూలములతో ప్రమథులను కొట్టి చూర్ణము చేయుచు-చచ్చితిరి-చచ్చితిరి- అని కేకలు వేయుచుండిరి. ఇదుగో! తారకాక్షుడే జయించినాడు అని దైత్య దానవు లుదోషించగా ఇంద్రరుద్రులకే జయము కలిగినదని ప్రమథులు అరచుచుండిరి. ఆ బల సముద్రమునందలి ఇరుపక్షముల యోధులును పరస్పర బాణములతో చీల్చబడి వారింపబడి వర్షాకాలమందలి సజల జలదములవలె ధ్వనులు చేయుచుండిరి. ఆ యుద్ధభూమి తెగిపడిన చేతులతో శిరములతో ధ్వజములతో కుండలములతో మాంస శోణితములతో భయంకరమయి కనబడుచుండెను. దానవులును ప్రమథులును తాటిచెట్టంత ఎత్తున ఎగిరిఎగిరి మేలగు ఆయుధములతో పరస్పరము కొట్టుకొని నిలువున లేచిపడుచుండిరి. ఇరుపక్షములవారికి తగులుచున్న గట్టి దెబ్బలు చూచి ఆకాశగతులగు సిద్ధులును అప్సరసలును హర్షముచెంది ‘బాగుబాగు!’ అని పలుకుచుండిరి. అంతరిక్షమున నిరంతరముగా మ్రోగించబడుచున్న దేవదుందుభుల ధ్వనులు మేఘ శబ్దములు విని రోషించి అంకెలువేయు వృషభధ్వనులవలె వినబడుచుండెను. కిరణములు సూర్యునియందు వలె-నదులు సముద్రము నందువలె సర్పములు వల్మీకములందువలె ప్రమథుల చేతిలో దెబ్బలు తినిన దానవులు క్రుద్దవదనులై తమ పురమున ప్రవేశించుచుండిరి. ప్రళయ కాలమందు పర్వతములు జెక్కలతో ఎగిరివచ్చి ప్రలజపై పడునట్లు నశస్త్రులై వచ్చి దేవతలపై పడుచుండిరి. ప్రమథగణ నాథులు మూడవవంతు దానవసేనతో తలపడి ఇట్లు పోరు సాగించుచుండిరి.

అంతలో విద్యున్మాలియు మయుడును తమ అనుయాయులతో కూడ అక్కడకు వచ్చిరి. వారు వచ్చి తమ మీద పడుచుండగనే ప్రమథ గణాధినాథులు వారిని చూచి భయపడిరి; వారి చేతిలో కొందరు చంపబడిరి; మరికొందరు రణరంగమున వృక్షములవలె విరిగిరి; (పారిపోయిరి) పర్వతేంద్రమువంటి పెద్ద దేహము కలవాడును బలశాలియునగు విద్యున్మాలి దానవుడు పరిఘను తీసికొని నందీశ్వరుని కొట్టెను. నందియును ఆ దెబ్బతిని పూర్వము మధురాక్షసుని చేతి దెబ్బతినిన నారాయణుడువలె గిరగిరతిరిగి భంగమందెను. ఆ మహాయుద్ధమున నందీశ్వరుడే దెబ్బ తినగానే ప్రసిద్ధ విక్రమశాలురగు ఘంటాకర్ణుడు శంకుకర్ణుడు మహాకాళుడను ప్రమథులందరును తడబాటునందుచు పారిపోసాగిరి. అంతట వదలక విద్యున్మాలి ప్రమథగణములను గణాధిపతిని గణాధిపతికంటె గొప్పవారగు పారిషద శ్రేష్టులను చీల్చిచెండాడి అంతరిక్షమున మేఘమువలె గర్జించెను. వాని గర్జన ధ్వని వినబడగానే సూర్యతేజస్కుడగు నందీశ్వరుడు మరల తెలివినొంది విద్యున్మాలిమీదకు పరువెత్తెను. అతడు వజ్ర సదృశదేహుడగు ఆ దానవుని మీదకు రుద్రుడు తనకిచ్చినది దీప్తానల సమప్రభమయి ప్రజ్వలించుచున్నది అగు వజ్రమును విసరెను. ముక్తాఫల విభూషితమగు ఆవజ్రమను భీషణాయుధము నందీశ్వరుని బాహులచే విడువబడివచ్చి ఆ దాన వుని వక్షముపైపడెను. వాడు వజ్రమువలె దృఢశరీరుడే అయినను ఆవజ్రపు దెబ్బతిని ఇంద్రుని వజ్రపుదెబ్బ తినిన పర్వతేంద్రమువలె పడిపోయెను. ప్రమథకులమునకు ఆనంద ప్రదుడగు నందిచేతిలో దైత్యేశ్వరుడగు విద్యున్మాలి దెబ్బతినగానే దానవులు ప్రమథగణాధి పతులను చూచి అరచుచు మీదకు పరువెత్తుకొని వచ్చిరి. విద్యున్మాలి పడిపోయెనే యను దుఃఖముచే కలిగిన క్రోధముతో నిండిపోయి ఆ దానవోత్తములు భూమి మీదకు పర్వత వర్షము కురిపించ నారంభించిరి. అధార్మికులగు దానవశ్రేష్ఠులు అట్లు కొండలతో వృక్షములతో చావగొట్టు చుండ ఆదెబ్బలు తినుచు ప్రమథులు ఏమిచేయుటకును తోచనివారైరి.

అంతలో శోభావంతుడును ప్రతాపవంతుడునగు తారకాక్షుడు యుద్ధరంగమునకు వచ్చి పర్వతములతో వృక్షములతో సమానమగు శరీరము కలిగి భయంకరుడై కనబడెను. అతని చేతిలో తలలుపగిలి మొగములు పగిలి కాళ్ళు విరిగి ప్రమథ గణాధిపతులు మంత్రములతో స్తంభితములయిన సర్పములవలె కనబడుచుండిరి. మాయాశక్తి శాలియగు మయుని చేతిలో దెబ్బలుతిని మిగుల కేకలువేయుచు పంజరములలోని చిలుకలవలె రొదచేయుచుండిరి. ప్రతాప వంతుడును శ్రీమంతుడునగు తారకాక్షుడు ప్రమథగణ బలమంతయు ఎండుటడవిని అగ్నులతో కాల్చినట్లు కాల్చివేసెను. తారకాక్షునిచే వారింపబడుచున్న ప్రమథ గణనాథులు బురదలో చిక్కుకొని తిరుగుడు పడుచున్న పక్షులవలె తిరుగుడు పడుచుండిరి. మయుడు మాయతో దెబ్బలు కొట్టు చుండగా దెబ్బలు తినిన ప్రమథ గణనాథులు వేళ్ళు శిథిలమయిన వృక్షములవలె నిలువచేతకాని వారైరి. అంతలో మయుడు తన మాయా బలముతో మరల మరల సముద్రమును అగ్నిని సింహములను మొదళ్ళను సర్పములను గిరీంద్రములను వ్యాఘ్రములను వృక్షములను భేరుండ పక్షులను శరభములనెడి అష్టపాద మృగములను జలములను వాయువులను సృష్టించి తన శత్రువుల నడుమ విడువసాగెను. తారకాక్షుడును మయుడును మాయతో ప్రమథ గణేశ్వరు లను సంమోహన పరచుచుండ మునిచే తన నిగ్రహశక్తిచే అదుపులో నుంచబడిన ఇంద్రియములు ఆయా విషయములయందు ప్రవర్తిల్లలేనట్లు వారును మనస్సుతో ఏమియు ఆలోచించనైన లేని వారైరి. మహాజలము అగ్నులు గిరులు ఏనుగులు సర్పములు సింహశ్రేష్ఠములు వ్యాఘ్రములు భల్లూకములు చిరుతపులులు రాక్షసులు దెబ్బలు కొట్టి బాధించుచుండ ప్రమథ గణాధిపతులెల్లరును సముద్ర మధ్యమందు చిక్కుకొని బ్రదికి బయటపడుటెట్లాయని కలతపడువారివలె అజ్ఞానముతో మోహితులయిరి. ఇట్లు ప్రమథ గణేశ్వరులు మిగుల బాధింపబడుచుండ సురలు నలుగకొట్ట బడుచుండ కొందరు సురశ్రేష్ఠులు వారిని రక్షణ సేయదలచి ఆయుధముల ధరించి శత్రుబలము నందు ప్రవేశించిరి. వజ్రము ఆయుధముగా గలవాడును సురలోక పూజితుడునగు ఇంద్రుడు వజ్రమునుచేత ధరించి ఐరావత గజమారోహించెను. నక్షత్రాధిపతియు రాత్రుల నేర్పరచువాడును మిగుల మనోహరమగు పక్షము (తన పక్షమందలిసేన - శుక్ల కృష్ణ పక్షములు) కలవాడు ప్రకాశ శీలుడునగు చంద్రుడు మహాప్రకాశము కలవాడయ్యెను. ఇట్లా ఇంద్రచంద్రులిరువురు సన్నద్ధులై శత్రుబలమున ప్రవేశించిరి. మదోద్ధతులగు ప్రమథ గణాధిపతులును శత్రు బలమును చూడదలచి దానియందు ప్రవేశించిరి.

మదపుటేనుగు వనమును వలె పెనుగాలులు జలద సహితమయిన అంతరిక్షమును వలె సింహములు విజన ప్రదేశములందలి గోవులమందను వలె దేవసేనలు రాక్షసుల బలమును కలవరపరచెను. తన బలమంతయు దేవతల చేతిలో దెబ్బలు తిని ఆతురమగుట చూచి మయుడు మాయతో అంధకారమును సృజించెను. గాఢమగు ఆ అంధకారమును ఇంద్రుడు అతితీవ్రమగు ప్రకాశముగల విద్యోతనాస్త్రముతో నశింపజేసెను. రాత్రులందు చంద్రుడును పగళ్లయందు

సూర్యుడును వలె తమ సేవను ఇంద్రుడు ఆ విద్యోతనాస్త్రముతో ప్రకాశింపజేసెను. త్రిదశాధి పతిచేత ప్రకాశింపజేయబడిన అ జ్యోతిస్సుచే మయుడు కల్పించిన చీకటి ప్రణష్టమై శీగ్రమే అతని మాయ నశించెను. ఇట్లు చీకటి తగ్గుచు ఇంద్రప్రభావమున అతని అస్త్ర ప్రభావము వృద్ధి పొందుచుండ ఒక ముహూర్తకాలము దిక్పాలురును లోకపాలురును ప్రమథగణ నాయ కులును గొప్ప సింహనాదము చేసిరి. రాక్షసశ్రేష్ఠులు కిరీటములు పగిలి విరిగి శిరస్సులు పగిలి తెగి అవయవములందంతట శరములు గ్రుచ్చుకొని ఇట్లు దేవతా శ్రేష్ఠుల చేతిలో పరాభవము నంది బురదలో చిక్కుకొనిన గజేంద్రములవలె చిక్కులలో పడిరి. ఇంద్రుడు భయంకర వజ్రముతోను మయూరధ్వజుడగు కుమారస్వామి శక్తియను ఆయుధముతోను తన శక్తి(బలము) తోను ధర్మరాజు భయంకర దండాయుధముతోను వరుణుడు పాశముతోను అమరులవలెనే సుందరరూపములతో ప్రకాశించు ప్రమథ గణేశ్వరులును పూర్ణాహుతి సమయమున అజ్య బలముతో వెలుగు అగ్నివలె ప్రకాశించుచును దానవులు అనెడి వృక్షములను పిడుగులు వృక్షము లపై పడి నశింపజేయునట్లు నశింపజేయసాగిరి. ఆ సమయములో మయుడును దేవతలను కాపాడుచున్న వాడును కృత్తికా నక్షత్ర కుమారుడగు దేవశ్రేష్ఠుడును నగు కుమారస్వామిని శరముతో భేదించి మాటిమాటికిని గర్జించెను. అంతలో మయుడు తారకాక్షునితోను రాక్షసుల తోను ఇట్లనెను: "ధీరులారా! దానవ శ్రేష్ఠులారా! దేవతలను దెబ్బతీసి మనము దానవ బలమును వెంట తీసికొని పురములందు ప్రవేశింతము. అట్లు విశ్రాంతి తీసికొనుటచే మనకు బలము వృద్ధినందును. మరల మనమందర మును కూడివచ్చి యుద్ధము చేయుదము. మనమందర మును దెబ్బలుతిని గాయములనుండి కారు నెత్తుటితో తడిసి యున్నాము. మన ఆయుధములును ధ్వజములును డాలులును విరిగినవి. పగిలినవి తెగినవి. శివసేనాపక్షము వారు జయము పొంది ప్రకాశించుచున్నారు. ఇంకను గెలువ ఉత్సాహపడుచున్నారు. మయుని మాటవిని కాలయ ముని మించి భయంకరరూపుడును రక్తమువలె ఎర్రని కన్నులు కలవాడును అగు తారకాక్షుడు యుద్ధము చేయవలెనను ఉత్సాహమదములతో నిండిన దైత్యులను వెంటగొని శీఘ్రమే త్రిపుర దుర్గమును ప్రవేశించెను. అంతట శివుని సేనలో అనేక శంఖభేరీ వాద్యములు ధ్వనులు సింహ నాదములు చెలరేగెను. మహాబలశాలియగు ఆసేన మహా సింహనాదములతో నిండినదియు భయంకరమును లోతైనదియునగు మహా పర్వత గుహవలె ప్రకాశించెను.