మత్స్య మహా పురాణము
అవిముక్త మాహాత్మ్యము
సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను, సర్వమునులారా! శుచియగు శ్రద్ధతో సమాహిత మనస్కులయి పాపనాశకమును పుణ్య సంపాదకమును ప్రీతికరమును నగు కథ వినుడు. భగవానుడగు సనత్కుమారుడు గణేశ్వరులకును అధిపతియు రుద్ర సమాన పరాక్రముడును దివ్యుడునగు నందికేశ్వరుని ఇట్లు ప్రశ్నించెను: సర్వభూతములకు అంతర్యామియు లోకకారణుడును అగు మహేశ్వరుడు దేవదానవులకును ధరించ సాధ్యముకాని ఘోరరూపము ధరించి స్థాణు (స్థిర-కూటస్థ) రూపుడయి సర్వభూత ప్రళయకాలము వరకును ఎచట నిరం తరము వసించునో ఆ స్థానపు రహస్యమగు మాహాత్మ్యమును తెలుపుము. అన నందికేశ్వరు డిట్లనెను, పూర్వము మహాదేవుడే చెప్పినదియు ప్రాచీనమును పుణ్యకరమును నగు ఆ విషయ మంతయు మహేశ్వరుని నమస్కరించి చెప్పుదును. ఏలయన ఉమ విషయమున తుష్టుడై శివుడు ఆమెకు ప్రీతి కలిగించగోరి భవుడు నిత్యమును ఉండు విఖ్యాత స్థానపు మాహాత్మ్యమును తానే చెప్పియుండెను. పూర్వము మేరుపర్వత శృంగమున రుద్రుని అర్ధాసనమందుండి కీర్తిశాలిని యగు దేవి మహాదేవుని నమస్కరించి ఇట్లడిగెను.
భగవన్! దేవదేవేశా! చంద్రార్ధమౌళీ! బ్రహ్మచర్యమున ఊర్ధ్వరేతస్కులగు మానవు లాచరింపదగు ధర్మమును యజ్ఞదాన హవన జపతపః ప్రభృతి కర్మానుష్ఠానములును ధ్యానాధ్యయ నములును ఎట్లు అక్షయమగును? వేయి జన్మాంతరములందు సంచితమగు పాపమయినను నశించు ఉపాయమేమి? శంకరా! నాకు తెలుపుము; ఏ స్థానమందుండినచో నీవు ఆ భక్తుల భక్తికి తుష్టుడ వగుదువు? వ్రతములు నియమములు ఆచారము ధర్మము ఎచట నాచరించినచో సర్వసిద్ధికరమయి అక్షయ పుణ్యగతి నిచ్చును? అదియంతయు తెలుప వేడుచున్నాను. నా కది విన పరమ కుతూహలముగ నున్నది. అన దేవదేవు డిట్లునెను: దేవీ! చెప్పెద వినుము, అది రహస్యములలో ఉత్తమ రహస్యము; సర్వ క్షేత్రములందును విఖ్యాతము 'అవిముక్తము' 'వారాణసి' నాకు ప్రియము; పూర్వులు చెప్పిన అరువది ఎనిమిది పుణ్య స్థానములలో ఇది ఉత్తమము; ఇచ్చట గజచర్మధారియగు రుద్రుడు తానై సాక్షాత్తుగ ఉండును. ఈ అవిముక్త మందతడు నిరంతరము సన్నిహితుడు; ఈ క్షేత్రము నాచే అవిముక్తము (విడువబడనిది) కావున దీనికీ నామ మేర్పడినది, ఇది పరమసిద్ధిని పరమగతిని ఇచ్చును, ఇచట అనుష్ఠించిన యజ్ఞ దానహవన జపతపోధ్యాన అధ్యయనములు అన్నియు అక్షయ పుణ్యప్రదము లగును; దీనిని ప్రవేశించినంతనే జన్మాంతర సహస్ర సంచితమగు పాపమును నశించును, అవిముక్త క్షేత్రాగ్నితో అవి నిప్పులో వేసిన దూదివలె బూదియగును. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులును సంకీర్ణ జాతులవారును, స్త్రీలును మ్లేచ్ఛులును, వేరగు సంకర జాతివారును పాపజన్ములును కీటపిపీలికా మృగపక్షులును తమ కాలము వచ్చి ఇందు మరణించి ఏమగుదురో తెలిపెద వినుము.
అందరును చంద్రార్ధ శిరస్కులు లలాట నేత్రులు వృషభధ్వజులు అయి శుభకరమగు నా పురమునందు జనింతురు; నిష్కాములుగాని నకాములుగాని (తెలిసికాని తెలియక కాని) మానవులే కాక తిర్యక్ (పశుపక్ష్యాది) ప్రాణులును అవిముక్తమున మరణించినచో నా లోకమున పూజితులై సుఖింతురు. అవిముక్త క్షేత్ర మేగినవారు అచటినుండి బయటికి రాక కాళ్లకురాలు కట్టుకొనియైన కదలకుండి తమ కాలము రాగా మరణించినచో వారును నా స్థాన మందుదురు; అందు సంది యము లేదు. వస్త్ర ప్రదము, రుద్రకోటి, సిద్ధేశ్వరము, మహాలయము, గోకర్ణము, భద్ర కర్ణము, సువర్ణాక్షము, అమరము, మహాకాలము, కాయాపరోహణము. ఈ క్షేత్రములందు ప్రాతః సాయంసంధ్యలందు నా సాన్నిధ్యముండును; కావున అవి పవిత్రములు; కాలంజరవనము శంకుకర్ణము స్థలేశ్వరము-ఇవియు, వరారోహా! (పరమసుందరీ!) పరమ గుహ్యములగు హరి శ్చంద్రము ఆమ్రాతకేశ్వరము ఇవియు జలేశ్వరము శ్రీపర్వతము మహాలయము యమము చండేశ్వరము గుహ్యాతి గుహ్యములగు కేదార మహాభైరవములు అవిముక్తము- ఈ ఎనిమిదియు త్రిసంధ్యములందును నాసన్నిధిచే పవిత్రములు; త్రిలోక ప్రసిద్ధములగు స్థానములన్నియు అవి ముక్త క్షేత్ర పాదములందు నిత్యమును సన్నిధానము చేసియుండును; ఈశ్వర ప్రోక్తమేయగు అవిముక్త క్షేత్రపు అనంతర కథావృత్తాంతమును దాని మాహాత్మ్యమును స్కందుడు భావితాత్ములగు ఋషులకు చెప్పినదానిని చెప్పదను - మనురాజా: వినుము అని మత్స్యుడు చెప్పెనని సూతుడు ఋషులతో చెప్పెను.