యుగానుగత పరిమాణము

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను, ప్రతి కల్పమునందును వచ్చు పదునాలుగు మన్వంతరము లందును ఆయా యుగములందు దేవాది జాతుల జన్మము వారి శరీర ప్రమాణము వారి జీవితకాలము అనుపూర్వితో విస్తరముగ చెప్పెదను.

పదునాలుగు మన్వంతరములందును కృతాదియుగములందు ఆ యుగ ప్రమాణము - సంధ్యా సంధ్యాంశములు కాక-దివ్యమానమున ఎన్ని సంవత్సరములో ఆ యుగపు మానవులు మానవ మానమున అన్ని సంవత్సరములు జీవింతురు (సంధ్యా సంధ్యాంశములు కాక కృతయుగ ప్రమాణము నాలుగు వేల దివ్య వర్షములు కావున ఆ యుగపు మానవులు మానవ మానమున నాలుగువేలఏండ్లు జీవింతురు అని ఇట్లు అన్నియుగముల విషయము గ్రహించవలెను. ) యుగ ధర్మము ననుసరించియే ఆయా యుగములందలి మానవ పశుపక్షి వృక్షాదుల ఆయుః పరిమా ణాదికము ఏర్పడినది. వాటి శరీర పరిమాణము ఎత్తుసరి కూడ అంతే. కాని కలియుగమున మాత్రము ప్రాణుల దౌర్బల్యము అస్థిరత చూచి మానవుల పరమాయువు నూరు సంవత్సరము లేయని స్వయంభూ బ్రహ్మ నిర్ణయించెను.

ఇక కృతాది యుగములలో దేవతాది ప్రాణుల శరీరపు ఎత్తునరి మొదలగునవి: కృత యుగమున దేవాసుర మానవ యక్ష గంధర్వ రాక్షసులు దేహపు చుట్టు కొలతలో కాని ఎత్తునరిలో కాని సమానులై యుందురు. విద్యాధరాదులగు ఎనిమిది దేవజాతులవారును మానవులును కూడ కృతయుగమున తొంబది యారు (కృతయుగపు) అంగుళముల ఎత్తు కలిగియుందురు. ఆయుగ సంధ్యాంశములయందు వీరి శరీరముల ఎత్తుసరి డెబ్బదిరెండంగు ళములే ఉండును. కలి యుగమున దేవతల ఎత్తుసరి నలువది తొమ్మిది-రాక్షసుల శరీరపు ఎత్తు ఎనుబది నాలుగు- కలియుగపు అంగుళములు ఉండును. కలియుగమున కాలి దిగువనుండి మస్తకాంతము వరకు తొమ్మిది తాలముల ఎత్తుకలిగి మోకాళ్ళ వరకు బాహువులుగల మానవులను దేవతలును ప్రశంసింతురు - (తాలము + కుడిచేతి బొటన వ్రేలిని ఎడమకు చూపుడు వ్రేలిని కుడికి బాగుగా చాపగా ఈ రెండి నడుమ అగు పొడవు; దీనిని తెలుగులో (‘లుడితి’ అందురు.)

ఈచెప్పిన కొలతల ననుసరించియే ఆయా యుగములందలి గోవుల గజములు మహిష ముల తదితర పశుమృగాదులు వృక్షజాతుల పరిమాణము కూడ తగ్గుచు పెరుగుచు నుండునని ఎరుగవలెను. పశువు (బహుశః వృషభము) కాలి కొన నుండి మూపురము పైవరకు డెబ్బది అరంగు ళముల ఎత్తుండును. ఏనుగులు ఎనిమిది వందల అంగుళముల ఎత్తుండును. వృక్షముల ఎత్తు ఒక వేయి తొంబదిరెండు అంగుళము లుండును. ఆయా యుగముల యందు మానవుల దేహపు ఎత్తుసరియే దేవతలకును ఉండును. కాని బుద్ధి శక్తి విషయములో మానవులకంటె దేవతలు గొప్పవారు.

ఆయా యుగములందలి దేవతలయు-మానవులయు పరిమాణాదికము ఇట్లుండునని తెలుపుటయైనది. పశు పక్షి వృక్షాదుల పరిమాణమును తెలిపితిని. గోవులు, గోర్రెలు, మేకలు, గుర్రములు, ఏనుగులు, పక్షులు, మృగములు, వృక్షాదికము ఆయా ప్రాణులకును మానవులకు ఆయా పనులయందును ఉపయుక్తములగుచున్నవి. దేవతలనుద్దేశించి చేయు యాగములందు వీనిలో కొన్ని యాగ పశువులయి దేవతలకుప భోగ సాధనములగు చున్నవి. కాగా ఇవి ఇట్లు యాగాదుల యందు దేవతలకై ఉపయోగపడిన పుణ్య విశేషమున అవి తమ దేహమును వదలిన తరువాత పరలోకమున స్వర్గముచేరి సుఖమును పొందును.

ఇకమీదట శిష్టులు-సాధులు- ‘సత్’ శబ్దముతో చెప్పబడువారు ఎవరో తెలిపెదను. ‘సత్’ అనునది పర బ్రహ్మమునకు పేరు. బ్రాహ్మణులును వేద వచనములును యాగ పశువులును యజ్ఞాదులకై దేవతలకు పయోగపడి తుదకు బ్రహ్మత్వమును పొందును. ఈ సామ్యముతో మూడిటిని ‘సత్’ అందురు.

అయా వర్ణముల వారియందును ఆయా బ్రహ్మచర్యాద్యాశ్రమము లందును (ఉప) యుక్తము అయి స్వర్గమునకు పోయిన తరువాత అధిక సుఖముకలిగించు శ్రౌతస్మార్త ధర్మమును జ్ఞాన ధర్మమందురు. ఇవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యు లాచరించదగిన వారు. ఇవి సామాన్య ధర్మములు. అవి రెండు విధములు; ‘ఇవి ఆచరించవలెను’ అని ఈ త్రైవర్ణికులును (ని)యుక్తులు- నియోగింప-శాసింప బడినవారు. శాసింపబడుటచే వీరు శిష్టులు; (వాటిని ఆచరించువారు.)

బ్రహ్మచారి గృహస్థవానప్రస్థ సంన్యాసులు నలుగురును సాధువులని చెప్పబడుదురు. ఎట్లనగా-బ్రహ్మచారి తన గురువునకు హితకరుడై విద్యలను సాధించుకొనును. గృహస్థుడు ప్రజాభివృద్ధికి కారణభూతుడై తనకును లోకమునకును దేవతలకును సుఖమును సాధించును. అరణ్యమందు నివసించుచు వానప్రస్థుడు తపస్సును సాధించును. పరతత్త్వ ప్రాప్తికై యత్నించుచు (ప్రయత్నము చేయుచు యతియగు సంన్యాసి యోగమును సాధించును. ఇట్లుసాధనము చేయు వీరందరును సాధువులగుచున్నారు.

ఇక ధర్మాధర్మ విషయము, ధర్మము అనునది ఒక వస్తువు అనుకొనరాదు. ధర్మగతిని (ధర్మపు నడకను-ధర్మమును ఆచరించుటను) ధర్మమని ఇచ్చట భగవానుడు చెప్పెను. కావున ఈవిధముగా ధర్మశబ్దము క్రియారూపము కాని వస్తురూపము కాదు. సర్వలోకముల క్షేమమునకు ఉపయోగించు కర్మమును ధర్మమని స్వయంభూ బ్రహ్మ నిర్ణయించెను.

ఇక-దేవతలును పితరులును ఋషులును మానవులును ఇది ధర్మము అని వ్యవహ రించుచుందురు కదా! ఇట్లది నిర్ణయించుట మౌనమూర్తితో మాత్రమే-మునియై తపోబలమున విషయ తత్త్వ విచారణము చేసినవారికి మాత్రమే-శక్యమగును. ‘ధర్మ’ శబ్దమునకు మూలమగు ‘ధృ(ణ్)’ ధాతువునకు ధారణము (తన యందు ఇతరములను నిలుపుకొనుట-తాను ఇతరము లకు ఆశ్రయమగుట) అనియు గొప్పదనము అనియు అర్థములు. కావున ధర్మము అనగా లోకస్థితికి ఆధారము-అన్నిటికి మహత్త్వమును కలిగించుచు తాను గొప్పదై యుండునది అని అర్థములు. ఇష్టములను పొందునట్లు చేయునది ధర్మము; కావున అది ఆచరించుడని ఆచార్యులు ఉపదేశింతురు. అనిష్ట ఫలప్రదము అధర్మము; కావుననే దాని నాచరించుడని ఆచార్యులుప దేశింపరు. మరి ఆచార్యు లనగా ఎవరు? అనిన – విద్యావయోఽ నుభవములందు వృద్ధులు (పెరిగిన వారు) ధన సుఖాదులందు ఆసలేనివారు - హృదయదారుఢ్యము కలవారు-దంభము లేనివారు-పెద్దలవలన చాలతిన్నగా శిక్షణము నొందినవారు ఎవరో వారిని ఆచార్యులు అందురు.

ధర్మజ్ఞులగు ద్విజులు ధర్మమును శ్రౌతధర్మము స్మార్తధర్మము అని రెండుగా విభజించిరి. దారలతో కూడినవారు (గృహస్థులు)అనుష్ఠించు అగ్నిహోత్రాది కర్మలును యజ్ఞ ప్రభేదములును శ్రౌతధర్మము. యమ నియమ సహితమగు వర్ణాశ్రమాచారము స్మార్త ధర్మము; పూర్వులనుండి తామెరిగిన శ్రౌతధర్మమును సప్తర్షులు లోకమున ప్రవచించిరి. గడచిన మన్వంతరము నందలి ఋగ్యజుః సామములను వేదాంగములను సాధు (సముచితము యతాతథమునగు) రూపములతో స్మరించి (తాము పూర్వమన్వంతరములలో ఎరిగియున్నందున చిత్తమున నిలిచిన సంస్కార బలమున వానినే యథార్థరూపములో ఇపుడు చిత్తమున గోచరింప జేసికొని) మనువు ప్రవచించి నది కావున దీనికి స్మార్త (స్మృతిచే లభించిన) ధర్మమని వ్యవహారము. ఇది వర్ణాశ్రమ విభాగమున విభక్తమై యున్నది.

ఈ రెండు విధములగు ధర్మమునకును శిష్టాచారమని వ్యవహారము. ‘శిషి’ ధాతువు (శాసు-అనుశిష్టౌ) ఉండి పరమయి’క్త’ అను’నిష్ఠా’ ప్రత్యయము చేరగా శిష్టశబ్దము (ఏర్పడును) సిద్ధించును-ఆయా మన్వంతరములయందు ఈరెండు విధములగు ధర్మములను ఎరిగి ఆచరించు టచే శిష్టులనబడు ధర్మానుష్ఠాతులును లోక సంతానకారులగు (లోక వ్యవస్థా ప్రవృత్తులను నిరంతరముగా కొనసాగించుటయే పరమ ప్రయోజనమని భావించు) మను సప్తర్షి ప్రభృతులును ఇహలోక మందిప్పుడు ధర్మానుష్ఠానము పరమ ప్రయోజనముగా నెంచి దానినెరిగి అనుష్ఠించు ధార్మికులును శిష్టులు అనబడుదురు.

ఇట్టి శిష్టులు ప్రజలయందు వర్ణాశ్రమ ధర్మములను నిలువగోరి తాము శ్రౌతస్మార్త ధర్మములను అనుష్ఠించి యుగయుగము నందును వార్త (జీవన మార్గములు) దండనీతి మొదలగు వానిని లోకము నందు నిలుపుదురు. పునఃపునః మనువుల తరువాత మనువులుగా నడచు మన్వంతరములందు శిష్టులచే ఆచరింప బడుటచేతను అంతకంటే పూర్వులును పూర్వ తరులును నగు శిష్టులకు సమ్మత మగుటచేతను ఈ విధమగు ఆచరణీయ ధర్మమునకు శిష్టాచార మని పేరు. ఇది శాశ్వతము (సార్వకాలికము సార్వదైశికము) అయినది.

దానము సత్యము తపస్సు లోకము (లోక వ్యవస్థాకర్తలగు పెద్దల నడువడి) విద్య ఇజ్యా (యాగాది దేవతా-లోకోపకారక-కర్మలు) పూజనము దమము (ఇంద్రియనిగ్రమము) అను ఈ ఎనిమిది విధములగు చరిత్రములు (నడువడులు)శిష్టాచార సమగ్రస్వరూపము. సర్వ మన్వంతరము లందును మను సప్తర్షి ప్రభృతులగు శిష్టులు ఆచరించునది కావున దీనికి శిష్టా చారమని వ్యవహారము. శ్రవణము వలన (వేద శాస్త్రముల నుండి గ్రహించగా) సిద్ధించినది శ్రౌతము; స్మృతివలన సిద్ధించినది స్మార్తము. యజనము-వేదములు-అను రూపముతో నున్నది. శ్రౌతము -వర్ణాశ్రమాత్మకమయినది స్మార్తము అని వీని స్వరూపకథనము. అహేతు లక్షణమగు (హేతువాదము చేయక శ్రద్ధతో అస్తిక్య భావముతో-గ్రహించవలసిన) ధర్మ ప్రత్యంగములను (ధర్మమునకు పుష్టి కలిగించు ప్రవృత్తులను) తెలిపెదను వినుడు.

1. మీరుచూచియు అనుభవించియు ఎరిగిన విషయమును మాకు తెలుపుడని ఎవరైన అడిగినపుడు అనిష్టము చూపక దాచుకొనక యథార్థ వస్తు తత్త్వమును తెలుపుట సత్యము.

2. బ్రహ్మచర్యము తపస్సు (శరీరమును కఠిన నియమములకు పాలుపరచి శ్రమపెట్టుట) మౌనము (విషయ తత్త్వ విచారణ చేయుట) నిరాహారత్వము అను ఇవి తపస్స్వ రూపములు. ఇది ఘోరమును సామాన్యులకు చేరరానిదియు;

3. యజ్ఞేయములగు పశువులు ద్రవ్యములు హవిస్సులు ఋక్సామ యజుర్మంత్రములు ఋత్విజులు దక్షిణలు-వీని కూడికయే యజ్ఞము (ఇజ్యా) అనబడును.

4. ఏ చిత్తవృత్తి విశేషము ఉండుటచేత సర్వ భూతముల విషయమునను పురుషుడు తన విషయమునందువలెనే చూపుకలిగి హృష్ణుడై వానికి శుభము హితమును కలిగింప గోరునో- అది దయ యనబడును.

5. ఇతరులు తిట్టినను తిట్టక కొట్టినను కొట్టక మనోవాక్కాయములందు ప్రతీకార దోషములేక ఓర్పుతో నుండుట క్షమయనబడును.

6. ధనపు సొంతదారుడు కాపాడుకొనుచున్న దానినే కాని తొందరలలో విడిచిన దానినేకాని పరధనమును తీసికొన (దలచ) కుండుట అలోభమనబడును.

7. శారీరకముగా మైథునము చేయకుండుట నోటితో ఆ మాటలాడుకుండుట మనస్సుతో అది తలచకుండుట అచ్ఛిద్ర (ఏదోషమును లేని) బ్రహ్మ చర్యమనబడును.

8. తనకై కాని ఇతరులకై కాని విషయానుభవములందు ఇంద్రియములు ప్రవర్తిల్ల కుండుట దమమనబడును. (బహిరింద్రియ నిగ్రహము);

9. ఐదు విధములగు (శబ్ద స్పర్శరూప రస గంధములను) విషయముల విషయమునను ధనకనక వస్తు వాహనాది (సుక) కారణ (సాధన)ములెనిమిదింటి విషయమునను ఎవరైన తన కడ్డము వచ్చినను కోపించకుండుట జితాత్మత్వము (శమము) అనబడును.

10. తాను న్యాయమున ఆర్జించినదియు తనకు మిగుల ఇష్టమును అగు వస్తువును కూడ గుణవంతులగువారికి (ఇష్టముతో) ఇచ్చుట దానమనబడును. శ్రుతి స్మృతులు విధించిన వర్ణాశ్రమాత్మక ధర్మమును-శిష్టాచారబలముచే వృద్ధిపొందిన ధర్మమును సాధుజనులగు పెద్దలకు నమ్మతమగు ధర్మము.

11. ఇష్టములగు వానిని మెచ్చక-అనిష్టములగు వానిపై అధిక ద్వేషము చూపక ప్రీతి తాపవిషాదములను పొందకుండుటయే వైరాగ్యమనబడును.

12. ఇదివరకు చేసిన-ఇకముందు చేయనున్న-కర్మల ఫలసంగమును విడుచుట సంన్యాసమనబడును.

13. తనకు ఇహముననైన క్షేమము కలిగించు కర్మములను కీడు కలిగించు కర్మములను సమభావముతో విడుచుట వ్యాసమనబడును.

14. అవ్యక్త (నామ రూప విభాగము లేని జగదాది స్థితి) దశ మొదలుగా అయా-సకల నామరూప విశేషములవరకు గల వికారజాతమునుండి బుద్దిని మరలించి చేతనమునకును అచేతన తత్త్వమునకును గల భేదమును తెలిసికొని అట్టి జ్ఞానమందే యుండు వాడు జ్ఞాని యనబడును. పూర్వపు స్వాయంభువ మన్వంతరము నందు ధర్మతత్త్వజ్ఞులగు ఋషులు ధర్మ ప్రత్యంగముల స్వరూపము ఇదియని తెలిపియుండిరి.

ఇక ఇక్కడ మీకు ప్రతి మన్వంతరము నందును సమానరూపములో నడుచు ధర్మపు నడకను చాతుర్హోత్ర (బ్రహ్మ అధ్వర్యుడు కాక హోతతో కూడ నలుగురు ఋత్విక్కులతో నిర్వర్తించు) యాగమును దాని విధానమును చాతుర్వర్ణ్య ధర్మవ్యవస్థను వర్ణింతును.

ప్రతి మన్వంతరము నందును శ్రుతి వేరువేరుగా నుండును. (ఏ మన్వంతరమునకు ఆ మన్వంతరము నందు శ్రుతి మారును.) అప్పుడును ఋగ్ యజుః సామవేదములుండును. ప్రతి దేవతను ఉద్దేశించిన మంత్రములు నుండును. విధి స్తోత్రము హౌత్రస్తోత్రము, ద్రవ్య స్తోత్రము, గుణస్తోత్రము, కర్మస్తోత్రము, అభిజనస్తోత్రము అనునవియును ఉండును. కాని అవియును ప్రతి మన్వంతరమునందును వేరువేరుగా నుండును. బ్రహ్మ ఆయా వేదములకు సంబంధించిన స్తోత్రములను ప్రతి మన్వంతరమునందును వేరువేరుగా మరల మరల ప్రవర్తిల్ల చేయుచుండును. ఇది ఒక వేదమునకే కాదు; ఋగ్ యజుః సామాథర్వణ వేదములకు నాలుగిం టికి సంబంధించిన స్తోత్రముల విషయమునందును మన్వంతర భేదమును బట్టి భేదము ఏర్పడును.

అయా మన్వంతరము లందు మిగుల దుశ్చరమగు తపస్సాచరించిన ఋషులకు అతః పూర్వపు మన్వంతరము నందు వలెనే వేదమంత్రములు ప్రాదుర్భవించును.

ఆయా ఋషులకు ఆయా వేద-వేదాంశ (‘వేదాంగ’ అనికాదు.) మంత్రములు ప్రాదుర్భ వించుటకు (వారికి తమ యుగపు ప్రాపంచిక స్థితుల విషయమున కలిగిన) ఆసంతోషము (వాటివలన కలిగిన) భయము, దుఃఖము (ఈపరిస్థితుల నుండి జనుల కెట్లు విడుదల కలిగించ వలెనో తెలియని స్థితి అనెడు) మోహము (ప్రజల క్లేశములు చూచి కలిగిన) శోకము అను ఈ ఐదు స్థితులును హేతువులగును.

ఋషులకు ఈ వేదవేదాంశములు సాక్షాత్కరించుట యాదృచ్ఛికముగ (అదృష్ట విశేష మున)ను తారకము అను (యోగ) లక్షణముచేతను సిద్ధించును.

ఋషులకు (మంత్ర ద్రష్టలకు) ఋషిత్వమును కలిగించు లక్షణము తెలిపెదను. ఇదివరకు గడచిన మన్వంతరములందు కాని రాబోవు వానియందు కాని ఆర్షకము (ఋషిత్వము నందలి ప్రభేదములు) ఐదు విధములుగా నుండును. ఋషులకు ఈ ఋషిత్వము ఏర్పడు విధముతో పాటు ఆ ఐదు ఋషిత్వ ప్రభేదములను మీకు తెలిపెదను.

ప్రళయకాలమునందు సర్వ(త్రి) గుణములును సమతావస్థతో నుండును. వేదములును శబ్దార్థ ప్రవిభాగములేక వాని అవాంతర ప్రవిభాగములును లేక ఏకైకా ఖండ శబ్దరూపము కూడ అవ్యక్త తత్త్వమున లయమంది యుండును. సర్వమును తమోమయమయి యుండును. (ఈ దృశ్య ప్రపంచపు స్థూల రూపాంశములే కాదు సరియే కదా దీనికి మూలములగు సూక్ష్మ తత్త్వములును అవ్యక్త దశయందుండును.)ఇది మూలప్రకృతి జడతావస్థ. అదికొంత కాలమునకు తరువాత మరల అబుద్ధి పూర్వకముగానే (తన సంకల్పము లేకయే తాను జడము కావున తనకు సంకల్పించు శక్తియే లేదు పరమాత్ముని చితిరూప శక్తి ప్రేరణచే తన యందు చైతన్యమును వ్యాప్త మొనరించు కొనుటకును తాను చైతన్యమునకు ఆశ్రయ మగుటకును ఉన్ముఖమయి) ప్రవర్తిల్లును.

ఇదియే ఆర్షతాస్థితి. అందుచేతనే ఆర్షత్వము అనునది చిదాత్మక (విశుద్ధ జ్ఞానాత్మక) తత్త్వపు శక్తిచే ప్రేరితము కావున బుద్ధిపూర్వకము అనియు చేతనతత్త్వముచేత అధిష్ఠించబడినది (అనగా ఈ ఆర్షత్వమునందు చిదాత్మక లక్షణము వ్యాపించియున్నది) అనియు చెప్పబడుచున్నది. ఇట్లు చేతనాచేతనములు చిదాత్మక పరమాత్ముడును మూలప్రకృతియు-మత్స్యమును ఉదకమును వలె పరస్పరము విడదీయరాక ప్రవృత్తి నందుంచుడును. ఇట్లీ ప్రకృతి (జడ) పురుష (చేతన) తత్త్వములు రెండును పరస్పరము కార్యకారణ భావమును పొంది చేతనవ్యాప్తితో (తనయందు చేతనతత్త్వము వ్యాపించగా) త్రిగుణమయ జడ ప్రకృతి సృష్టికి ప్రవర్తిల్లును.

ఈ విధముగ ప్రవర్తిల్లు సృష్టిలో శబ్దార్థ సృష్టియు వ్యక్తరూపము నందసాగును. అందు అర్థము విషయము-పదము (శబ్దము) విషయ- యగును. శబ్దమును వినగా తత్ప్రభావమున చిత్తమున ఆశబ్దముచే ఉద్దేశించ బడిన అర్థము (వస్తువుల సన్నివేశము) గోచరమగును. ఇదియే శబ్దార్థముల విషయ విషయభావ సంబంధము.

ఇట్లు అస్పష్ట రూపమున నైన శబ్దార్థవ్యక్తి (స్పష్టీభావము ప్రవర్తిల్లుట) ఆరంభముకాగా కాలక్రమమున ప్రపంచ సృష్టికి మూల కారణ తత్త్వములగు మహదాది తత్త్వములు అవ్యక్త తత్త్వము నుండి వికాస క్రమమున వ్యక్తము కానారంభించును. మహతత్త్వము నుండి అహంకార తత్త్వము దాని నుండి సూక్ష్మ భూతములు ఇంద్రియ తత్త్వములు వ్యక్తములగును.

భూతతన్మాత్రలు అనెడు సూక్ష్మభూతములనుండి భూతభేదములు (స్థూల భూతములు) మొదలగునవి ఒకదాని నుండి మరియొకటి అనుక్రమమున ఉత్పన్నములగును. స్వాభావికముగా స్వయంసిద్ధమగు కారణతత్త్వమగు దానినుండి ఏర్పడిన కార్యతత్త్వము మరియొకదానికి కారణ మగుచు ఈ క్రమమున వెంట వెంటనే సృష్టిక్రమములో పరమాత్ముడు ఈ ప్రపంచ రూపమున రూపొందును. ఒక కొరవి నుండి ఒకే సమయమున అనేకములగు చిన్నచిన్న నిప్పు రవ్వలు చెదరి బయటికి వచ్చినట్లు ఒకే చైతన్యము నుండి ఒకే క్షణమున జీవులనేకులు పరమాత్మనుండి వివృతమైన భూతములతో ఏర్పడిన దేహములందు నానా దేహధారులుగా కనబడుదురు. ఇందరు క్షేత్రజ్ఞులకును (జీవులకును) కారణమగు చేతనముల తత్త్వము ఒక్కటియే.

చీకటిలో అకస్మాత్తుగా మొరపు తళుక్కున మెరసినట్లు అవ్యక్త తత్త్వమునుండి వివృతమయిన జీవ సమూహము కూడ దేహధారులయి ప్రకాశించుచు కనబడును. మహాతమస్సునకు ఆవల పరమాత్ముడు ఈ సమస్త సృష్టికిని అతీతమయి త్రిపాత్తత్త్వముగా అంతర్యామి కంటే విలక్షణమయి ప్రకాశించు చుండును.

ఇట్లా పరమాత్ముడు అక్కడనే-ఆయా దేహధారులు దేహములనెడు క్షేత్రములందే ఉండును- అదే సమయమున-తమస్సునకు ఆవలనుండును-అని శ్రుతుల యందు వినబడు చున్నది. ఇట్లతడు ప్రకృతికి అధిష్ఠాతయై వివర్తము పొందుచుండ (రూపవంతుడై భాసించుచున్న-కొలదిని) అతని బుద్ధిలో 1. జ్ఞానము; 2. వైరాగ్యము; 3. ఐశ్వర్యము; 14. ధర్మము అనునవి కలిగెను. (2. ఇది మనవంటి వారి విరక్తి వంటిదికాదు; నేను పొందవలసిన దేదియు లేదు; నేను అవాప్తనకల కాముడను; నావారు అనదగు వారెవ్వరును లేరు; మమకారముతో నాకు పనిలేదు- అను బుద్ధి; 3. నేను సర్వేశ్వరుడను; నేనే ఎల్ల జగములకును దిక్కు అనుబుద్ధి; 4. లోకప్రవృత్తికి మూలమగు సత్కర్మానుష్ఠానము నేనే అనుభావన). ఇవి అతనికి స్వతస్సిద్ధములే కాని కావలెనని సంపాదించుకొన్నవి కావు.

ఇతడు ‘పూర్’ అనబడు ఆయా ప్రాణుల శరీరములయందు సాక్షి రూపుడై యుండును; ‘పురి-శ>పురుష’-అని వ్యవహరింపబడును. ఆయా దేహములందు (క్షేత్రములందు) ఉండి వాని తత్త్వమును ఎరుగును కావున క్షేత్రజ్ఞుడు-జ్ఞుడు-అనబడును. ధర్మమును అవలంబించి లోకములను సృజించి పాలించును కావున అతడు ధార్మికుడనబడును. ఇట్లు తనకు అనపాయిని అగు (ఎన్నడును విడిపోని) మాయాశక్తిచే సిద్ధించినదై స్వాభావికముగ లభించిన శరీరమునందు ఈ చెప్పిన బుద్ధి లక్షణముచే చేతనుడయి పరమాత్ముడు మూల ప్రకృతికి కలిగిన సృష్ట్యభిముఖ ప్రవృత్తిని సఫలము చేయును.

ఇట్లు పరమాత్మ క్షేత్రజ్ఞుడుగా వివర్తము పొందియు క్షేత్రము విషయమునను అందలి జీవుని ప్రవృత్తుల విషయమునను వాటివలన కలుగు విషయమునను ఎట్టి అభిసంధియు (అహంకార మమకారములు)ను లేకుండును. ఈ పరమాత్ముడిట్లు వివర్తము పొందుటకు సమకాలముననే పురాణము (అనాది) అగు ఆ అచేతన (జడ) ప్రకృతి క్షేత్రరూపమునను భోగ్యవస్తు జాత రూపమునను రూపొంది ఆ క్షేత్రజ్ఞుని చేత ‘ఇది నాకు ఆశ్రయము’ అనియు ‘ఇది నాకు భోగ్యము’ అనియు ఎంచబడుచున్నది.