మత్స్య మహా పురాణము
సామోపాయ విచారము
మహాద్యుతీ! సామము మొదలగు ఉపాయముల లక్షణములను వాని ప్రయోగ ప్రకారమును తెలుపవేడుచున్నాను; అనిన మనువుతో మత్స్యుడిట్లనెను. మనుజోత్తముడగు మను పార్థివా! సామము భేదము దానము దండము ఉపేక్ష మాయ ఇంద్రజాలము అనునవి ఏడు ఉపాయములు ప్రయోగింపదగినవి కలవు! అవి క్రమముగ నేను తెలిపెద; వినుము; సామము, తథ్యము, అతథ్యము అని రెండు విధములు; దీనిలో ఆతిథ్య సామము సాధువులపై ప్రయోగించినచో వారాక్రోశిం (కోపిం-నిందిం)తురు; కావున సరోత్తమా! సాధుజనులను సామముతోనే యత్నముతో సాధించవలెను; మహాకులీనులు ఋజు స్వభావులు ధర్మనిత్యులు (ధర్మనిరతులు) జితేంద్రియులు సామ్యముతో) సాధ్యులు; వారియందు ఆతిథ్య(కపట) సామమును ప్రయోగించరాదు; తథ్యసామమునే ప్రయోగించవలెను; అది ఏమనగా వారి కులశీలాదులను వర్ణించుట వారివిషయమున తనకుగల కృతజ్ఞతాభావమును తెలుపుట ఈ విధమగు యుక్తితో ప్రయోగించు సామము తథ్యసామము; దీనితో ధర్మ తత్పరులగు ఉత్తములను లోబరచుకొన వలయును; “సామముతో రక్షస్సులను గూడ లోబరచుకొందుర”ను శ్రుతియున్న మాట నిజమే; ఐనను దీనిని అసాధుజనులందు ప్రయోగించినచో ఉపకరించదు; తనయందు సామవచనములు పలుకు వానిని అసాధుజనులు అతి శంకితునిగా (తను జూచి చాల భయపడుచున్న వానిగా) భావన చేయుదురు; కావున వారి విషయమున అది విడువవలయును. శుద్ధ వంశ్యులు ఋజు స్వభావులు ధర్మస్థితులు సత్యపరులు వినీతులు అగు ప్రసిద్ధ సాధుజనులు సామస్యాధ్యులు: వారిని సతతము ఆనుశ్రుతముతో అనుకూల ప్రవర్తనముతో వశీకరించుకొనవలెను.