మత్స్య మహా పురాణము
ఇంద్ర యయాతి సంవాదము
శౌనకుడు శతానీకునితో ఇంకను ఇట్లు చెప్పెను. రాజేంద్రుడగు యయాతి స్వర్గమును చేరి దేవభవనము నందు నివసింపసాగెను. అచట అతనిని దేవతలు సాధ్యులు మరుత్తులు వసువులు మొదలగువారు పూజించు (ఆదరించు) చుండిరి. అతడు పుణ్యమును ఆచరించిన వాడును ఇంద్రియనిగ్రహము కలవాడును (కావున తన తపోబలమున సంపాదించిన పుణ్యలోక ములలో) దేవలోక బ్రహ్మలోకములలో ఒకదానినుండి మరియొక దానికి సంచరించుచు చాలకాలము ఉండెను అని పరంపరలో వినుచున్నాము. ఇట్లు ఒకప్పుడు ఆ నృపశ్రేష్ఠుడు యయాతి ఇంద్రలోకమునకుపోయెను. మాటల సందర్భములో ఇంద్రుడు యయాతిని ఇట్లు అడిగెను: “రాజా! పూరుడు నీ రూపమును గ్రహించి వార్ధకముతో లోకమున వ్యవహరించి నందులకు సంతసించి నీవు నీరాజ్యము నతనికి ఇచ్చినప్పుడు అతనికి ఏమి ఉపదేశించితివో నిజము చెప్పుము.” యయాతి: “గంగా యమునా నదుల నడుమ నున్న ఈ దేశమంతయు నీ పరిపాలనలో ఉండు ప్రదేశము. ఈ భూభాగమున కంతటికి నీవు రాజవు. నీ అన్నలు నీరాజ్యపు అంచులందును వానికి అవతలను ఉండు దేశములను పాలింతురు.
“శిష్టులందరలో గొప్పవారును ఓర్పుగలవారును పురుషులలో అధికులు. ఎట్లన-ఓర్పు లేనివాని కంటె అధికలవాడు విశిష్టుడు. మానుష ధర్మము లేనివారికంటె అధికలవాడును వివేకము లేనివానికంటె, అదికలవాడును విశిష్టతరుడు. ఇతరులు చెడు మాటలాడినను తానట్టివి. అడరాదు. ఇట్లున్నచో కోపము నిగ్రహింపబడును. ఆ కోపము ఆక్రోశించినవానినే నిర్దహించును. తిట్టు తినినవాని పాపము తిట్టినవానికి అంటును. ఇతరుల హృదయమునకు వ్రణము కలిగించు పనులుచేయరాదు. క్రూర వచనములు పలుకరాదు. హీనుని నుండి ఎంత గొప్ప వస్తువునైన గ్రహింపరాదు. (తాను ఏది పలికిన ఇతరులు బాధ పడుదురో )ఇతరులు ఏది పలికినచో తన మదికి బాధ కలుగునో అట్టి దుర్వచనములు తానితరులను పలుకరాదు. అది పాపలోకములకు పోవుటకు కారణమగును. అరుంతుదుడు (ఇతరుల హృదయ వ్రణమును రేపెడి క్రూరపు పనులు చేయుచు అట్టిమాటలాడుచు నుండువాడు) అగు పురుషుడు తీక్ష్ణవచనములు పలుకువాడు మాటలనెడి ముండతో ఇతరుని బాధించువాడు మనుష్యులందరలో అశుభస్వరూపులని తెలియ వలెను. అట్టివాడు తన ముఖమునందు నిర్భతిని (అలక్ష్మిని) కట్టుకొని మోయువాడే. సజ్జనులు తన ఎదుటను మెచ్చుకొనునట్లును వెనుకను ప్రశంసించునట్లును నడుచుకొనవలెను. సజ్జనులు ఒకవేళ నిందించినను ఓర్చుకొనవలెను. వారి నడవడిలో మంచివానిని తాను గ్రహించి పూజ్యమగు నడువడితో మెలగవలెను. (పరుష) వచనములు నోటినుండి వెలువడు బాణములు. వాటి దెబ్బ తినినవాడు రాత్రింబవళ్ళును శోకించుచుండును. అవి ఇతరుల హృదయ మర్మములందుతప్ప గ్రుచ్చుకొనవు. కనుక వివేకియగువాడు వాటిని ఎవరిమీదను విడువరాదు. భూతముల యందు మైత్రి (సానుభూతి) దానము-మధుర వచనములు పలుకుట-ఈ మూటితో సదృశమగు సంవననము (ఇతరులను తనవైపు త్రిప్పుకొనునది) మరి ఏదియు లేదు. కనుక ఎల్లప్పుడును నెమ్మదిగా మాటలాడ వలయును. పరుషములెక్కడ నెప్పుడు నాడరాదు. పూజ్యులగు ఇతరులను పూజించుచుండవలయును. అభిశాపవచనము లెన్నడు ఆడరాదు.”