మత్స్య మహా పురాణము
శ్రీ వామన మూర్త్యవతార ఘట్టము
అంతట భగవానుడగు గోవిందుడు వామనాకృతియై జనించెను, సర్వామరేశ్వరుడగు జగన్నాథుడు అవతరించగానే దేవతలును తన్మాతయగు అదితియు దుఃఖముక్తులయిరి. సుఖస్పర్శవాయువులు వీచెను. గగనము నిర్మలమయ్యెను. సర్వ భూతములకు ధర్మమందు ఆసక్తి కలిగెను; ఆసురులకును భూమ్యంతరిక్ష ద్యులోక వాసులకును తదాదిగా ఉద్వేగము తగ్గెను, అతడు జనించినంతనే లోక పితామహుడగు బ్రహ్మ అతనికి జాతకర్మాదికము జరిపి అతనిని దర్శించి ఋషులు వినుచుండ ఆ దేవదేవేశుని ఇట్లు స్తుతించెను.
జయజయ ఆద్యా! ఈశా! అజేయా! సర్వాత్మకాత్మకా! జన్మజరారహితా! అనంతా! అచ్యుతా! అజితా! అమేయా! అవ్యక్తస్థితి! పరమార్థవస్తురూపా! సర్వజ్ఞా! జ్ఞాతృజ్ఞానజ్ఞేయరూపా! స్వయంభూరూపా! అశేష జగత్సాక్షిన్! జగత్కర్తా! జగద్గురూ! జగత్పితిలయకరా! జగత్పాలకా! శేషా! అశేషా! అఖిల హృదయావాసా! ఆదిమధ్యాంత రూపా! సర్వజ్ఞానవిధీ! ముముక్షువులును ఇట్టివాడవని నిర్దేశింప అలవికాని దేవా! ఆత్మతృప్తి! జనేశ్వరా! యోగిముక్తి ఫల ప్రదా! దమాది గుణవిభూషణా! అతిసూక్ష్మా! దరుర్జీయా! స్థూలజగన్మయా! అతీంద్రియా! సేంద్రియా! మాయాయోగస్థితా! శేషభోగశయనా! అక్షరా! ఒకకోరకొనతోనే వసుంధరను పైకెత్తినవాడా! నృసింహా; శత్రువక్షఃస్థల విదారణా! విశ్వాత్మన్! వామనా! కేశవా! స్వమాయా వస్త్రాచ్ఛాదిత జగన్మూర్తీ! జనార్దనా! అనేకరూపా! ఏకరూపా! ప్రభూ! వర్ధిల్లుము; వర్ధితాశేష వికారయుత ప్రకృతీ! హరీ! జగదీశుడవగు నీయందే ధర్మ మార్గము నిలిచియున్నది; నేనుకాని రుద్రుడుకాని ఇంద్రాది దేవతలుకాని మునులును సనకాది యోగులునుకాని నిన్నెరుగ జాలరు. జగత్పతీ! నీమాయ అను వస్త్రముతో కప్పబడిన ఈ జగమందు సర్వేశా! నీయనుగ్రహము అందక ఎవడు నిన్నెరుగును? నిన్నారాధించి ప్రసాద సుముఖునిగా చేసికొనినవారు మాత్రమే కాక ఇతరులు నిన్నెరుగజాలరు. నందీశ్వరేశ్వరా! ఈశానా! ప్రభూ! వామనా! విశ్వాత్మన్! విశాల లోచనా! ఈ జగదభ్యుదయమునకై వర్ధిల్లుము.
ఇట్లు స్తుతింపబడి వామనాకృతియగు హృషీకేశుడు నవ్వి పద్మభవునితో భావ గంభీరముగ ఇట్లనెను. పూర్వము నేను నీచే ఇంద్రాదులచే కశ్యపునిచే స్తుతింపబడి ఇంద్రునకు భువనత్రయ రాజ్యమిత్తునంటిని. మరల అదితి చేతను స్తుతింపబడి ఇంద్రునకు నిష్కంటకమగు త్రైలోక్య రాజ్యము నిత్తునంటిని, నేనట్లే చేయుదును; సహస్రాక్షుడగు ఇంద్రుడు మహేంద్రుడై జగత్పతి యగును; ఇది సత్యము; అని అంతట హృషీకేశునకు బ్రహ్మ కృష్ణాజినమును, బృహస్పతి యజ్ఞోపవీతమును, బ్రహ్మసుతుడగు మరీచి ఆషాఢ దండమును, వసిష్ఠుడు కమండలువును, అంగిరుడు కుశపవిత్రమును, పులహుడక్ష సూత్రమును, పులస్త్యుడు తెల్లని వస్త్రములను ఇచ్చిరి. ప్రణవోచ్చరణ అలంకృతములగు వేదములును అనేక శాస్త్రములును సాంఖ్యము యోగము అతనిని స్వయముగవచ్చి ఆశ్రయించి సేవించెను. ఆ వామనుడును జటాదండచ్ఛత్ర కమండలు ధారియై సర్వదేవమయుడై బలి యజ్ఞమునకు పోయెను. అతడడుగిడిన ప్రతి భూమ్యంశమును అతిపీడితమయి వివరము నిచ్చుచుండెను, వామనుడును మంద మృదుగతియై పోవుచున్నను సముద్ర ద్వీపాదియుతయగు మేదిని చలించుచుండెను.