శూల భేదాది తీర్థ మహిమాను వర్ణనము

మార్కండేయు డిట్లు చెప్పెను; ధర్మరాజా! అది మొదలుకొని బ్రహ్మాది దేవతలును తపోధ నులును రాగక్రోధాది దోషరహితులై నర్మదను సేవింతురు, అనగా మునిసత్తమా! ఏ ప్రదేశము నందు మహాదేవుని శూలము పడినదిగా కనబడునో ఆ ప్రదేశపు మాహాత్మ్యము ఉన్నది ఉన్నట్లు చెప్పుమని ధర్మజుడడుగగా ముని మరల ఇట్లు చెప్పెను. అది శూల భేదమను పుణ్యతమ మహాతీర్థము, అందు స్నానమాడి శివునర్చించినచో గోసహస్రదాన ఫలము లభించును, అచట త్రిరాత్ర దీక్షతో మహాదేవుని అర్చించినచో పునర్జన్మము ఉండదు. తరువాత వరుసగా భీమేశ్వర నారదేశ్వరాదిత్యేశ్వర నంది ఇశ్వర వారుణేశ్వర తీర్థములు కలవు. అందు స్నానమాడుట మహా పాతక నాశకము; తరువాత స్వతంత్రేశ్వరము; అందు స్నానమాడి అచటనున్న పంచాయతన (అది త్యాంబికా విఘ్న గణనాధ మహేశ్వర) మూర్తులు దర్శించినచో సర్వతీర్థ యాత్రా ఫల మబ్బును, తరువాత కోటి తీర్థము; అచ్చట పూర్వము దేవదానవ యుద్ధము జరిగెను, అందు బలదర్పితులగు దానవులు అనేకుల శిరస్సులను దేవతలు ఖండించి అచట శూలపాణియగు మహే(కోటీ)శ్వరుని ప్రతిష్ఠించిరి. అచట కోటి మంది దానవులువిని హతులగుటచే అది కోటి తీర్థమనబడెను. దాని దర్శన మాత్రముననే మానవులు స్వర్గమారోహించు చుండుట చూచి క్షుద్రబుద్ధిగల ఇంద్రుడు ఆ మార్గమును వజ్రముతో కీలించి ఆటంకపరచెను; నాటి నుండి మానవులకు దీనివలన లభించు స్వర్గపు మార్గము నివారింపబడెను, అచట నేయి, మారేడుపండు దానమొనర్చి పర్వతమును ప్రదక్షిణించి పర్వతముపై దీపము వెలిగించి దానితో కూడ కొండను శిరస్సునందు నిలుపుకొనవలయును, దానిచే సర్వకామ పూర్తియగును, తుదకు రుద్రలోక ప్రాప్తియగును: తరువాత స్వర్గము (రుద్రలోకము) నుండి మరలి భూలోకమున రాజై పుట్టి రాజ్యమేలి మరల స్వర్గమారోహించును. తరువాత మహాదేవ తీర్థము; అందు త్రయోదశినాడు స్నానమాడినంత మాత్రముననే సర్వయజ్ఞ ఫలము లభించును.

తరువాత పరమ శోభనమగు రాజేంద్ర తీర్థము: తరువాత నరులకు పాపనాశకమగు అగస్త్యేశ్వరము: అందు స్నానముచే బ్రహ్మహత్యా దోషనివృత్తి యగును, కార్తీక కృష్ణ చతుర్దశి నాడు అట చిత్తసమాధితో జితేంద్రియుడై శివుని నేతితో అభిషేకించినచో అతడు తన ఇరువది యొక తరముల వారిలో కూడ శివపురవాసి యగును, అట చేసిన ధేనూ (గోదానము) సానత్ (చెప్పులు), ఛత్ర (గొడుగు), ఘృత ( నెయ్యి), కంబళ (దుప్పటి), విప్రాన్న దానములన్నియు ఇతరత్రకంటె కోటి గుణము ఫలము నిచ్చును, తరువాత ఉత్తమమగు బలాకేశ్వరము, అందు స్నానముచే నరుడు సింహాసనాధిపతి యగును, ఇవియన్నియు నర్మదకు ఉత్తర తీరమందలి తీర్థములు), నర్మదా దక్షిణ తీరమున శక్రతీర్థము, అచట ఒకరాత్రి (దినమంతయు) ఉపవసించి స్నానమాడి జనార్దను నర్చించినచో గోసహస్ర దానఫలమునంది తుదకు విష్ణులోక ప్రాప్తుడగును, తరువాత నరులకు సర్వపాపహరమగు ఋషితీర్థము: అందు స్నానమాడిన మాత్రమున శివలోక ప్రాప్తి యగును, తరువాత పరమ శోధనమగు నారదతీర్థము, అందు స్నానమాడుటచే గోసహస్ర దాన ఫలమబ్బును, తరువాత దేవతీర్థము, అది పూర్వము స్వయముగా బ్రహ్మచే నిర్మితము. అందు స్నానమాడినచో బ్రహ్మలోక ప్రాప్తియగును. తరువాత అమరకంటక తీర్థము. అది దేవతలే నిర్మించినది. దానియందు స్నానముచే రుద్రలోక ప్రాప్తియగును. తరువాత తురా సంగమ తీర్థము. అందలి పంచాయతన మూర్తి దర్శనముచే బ్రహ్మ హత్యాదోష నివృత్తియగును. తరువాత వటేశ్వర తీర్థము. దాని దర్శనమాత్రమున జన్మ సాఫల్య మగును. తరువాత వటే శ్వరము. అది సర్వ వ్యాధినాశకము, అందు స్నానముచే సర్వ దుఃఖ మోచనమగును.

తరువాత రావణేశ్వర తీర్థము; అందు స్నానము సర్వపాప మోచకము; తరువాత నదీ సంగమ తీర్థము; తరువాత సోమ తీర్థము; ఇది ఉత్తమమగు చంద్ర క్షేత్రము; అందు పరమభక్తితో స్నానమాడినవారు తక్షణమే దివ్య శరీరము నంది అరువదివేల సంవత్సరములు శివుని లోకమందుండి శివుని వలెనే సుఖింతురు; తరువాత పింగళేశ్వర తీర్థము; అచ్చట ఒక అహో రాత్రము ఉపవసించినచో త్రిరాత్రోపవాస ఫలము లభించును; అచట కపిలా గోదానము చేసి నచో దాని శరీరమందు కల రోమములన్ని వేల సంవత్సరములు రుద్రలోకమున సుఖించును; అచ్చట ప్రాణత్యాగమొనర్చినచో చంద్రసూర్యులున్నంత అనంతకాలము అక్షయ సుఖము లందును; నర్మదాతీరమందు నివసించు మానవులు పుణ్య మాచరించినవారు వలెనే మరణా నంతరము స్వర్గ మందుదురు; తరువాత సురేశ్వర తీర్థము; తరువాత కర్కోటకేశ్వర తీర్థము; అందు పుణ్యదినమున గంగానది దిగివచ్చును; తరువాత నంది తీర్థము, అందు స్నానమాడిన వారు నందీశ్వరుని అనుగ్రహమున సోమలోక ప్రాప్తులగుదురు, తరువాత దీపేశ్వర తీర్థము; తరువాత వ్యాసతీర్ణము; అది తపోవనము, అచట వ్యాసుని హుంకారమునకు భయపడి ఆ మహానది దక్షిణమునకు మరలెను; దానిని ప్రదక్షిణించినచో చంద్రసూర్యులున్నంతకాలము స్వర్గమందు సుఖింతురు; వ్యాసానుగ్రహమున వాంఛితార్థ ప్రాప్తియగును; వేదికపయి దీపము నుండి దానికి దారములు చుట్టి దానమిచ్చినచో రుద్రుడువలె అక్షయకాలము సుఖించును.

తరువాత ఐరండి (ఉపనదీ) నర్మదా సంగమ తీర్థము; ఇది ఉత్తమము, ఇందు స్నాన మాడినచో సర్వపాపముక్తి యగును; త్రిలోక విఖ్యాతమును పాపనాశకమునగు ఇందు ఆశ్వయుజ శుక్లాష్టమినాడు స్నానమాడి శుచియై ఉపవాసముచేసి ఒక బ్రాహ్మణునకు భోజనము పెట్టినను కోటిమందిని భుజింప జేసినట్లగును, భక్తిభావముతో ఐరండీ నర్మదా సంగమము నందు శిరస్సున మృత్తిక ఉంచుకొని స్నానమాడి ఆ సంగమ తీర్థ ప్రదక్షిణము చేసినచో సమస్త భూ ప్రదక్షిణ ఫలము లభించును, తరువాత సువర్ణ తీర్థము, అందు స్నానమాడి సువర్న దానము చేసినచో కాంచన విమానముపై రుద్రలోకమేగును; అందు సుఖించును, తరువాత స్వర్గమునుండి జారినను వీర్యశాలియగు రాజగును; తరువాత ఇక్షునదీ నర్మదా సంగమ తీర్థము; అది త్రిలోక విఖ్యాత మగునది; శివుడచట సదా సన్నిహితుడై యుండును; అందు స్నానమాడినవారు గణాధిపతిత్వ మందుదురు, తరువాత స్కందతీర్ధము; అది సర్వపాప ప్రణాశకము; అచటికేగి అందు స్నానమాడిన మాత్రమున ఆజన్మ సంచిత పాపము నశించును, తరువాత ఆంగిరస తీర్థము, అందు స్నానమాడినచో సహస్ర గోదాన ఫలమంది రుద్రలోక ప్రాప్తుడగును; తరువాత సర్వపాప ప్రణాశనమగు గణతీర్ధము; అందు స్నానమాడినవారు సహస్ర గోదాన ఫలమంది శివలోకమున సుఖింతురు. సప్త జన్మకృత పాపములనుండి ముక్తులగుదురు; తరువాత వటేశ్వర తీర్థము, ఇందు స్నానము కూడ పైదానివలెనే ఫలప్రదము.

తరువాత సర్వదేవ నమస్కృతమగు సంగమేశ తీర్థము; అందు స్నానముచే ఇంద్రత్వము ప్రాప్తించును: తరువాత సర్వ పాపహరమును ఉత్తమమును అగు కోటి తీర్థము. అందు స్నానముచే రాజ్య ప్రాప్తియగును; అందుచేసిన దానము కోటిగుణిత ఫలము నిచ్చును; అందు స్నానమాడిన గౌరి వంటిదియగును: ఇంద్రపత్నియగును: తరువాత అంగారక తీర్థము, అందు స్నాన మాడినచో రుద్రోలోక ప్రాప్తియు అంగారక చతుర్థీ దినమున స్నానముచే అనంతకాలము సుఖమును కలుగును, అయోని (ఉపనదీ) నర్మదానదీ సంగమమున స్నానమాడిన వారికి యోని సంకటము (పునర్జన్మము) రాదు; తరువాత పాండవేశ తీర్థము. అందు స్నానముచే అక్షయకాల సుఖమును సురలచే కూడ అవధ్యత్వమును విష్ణులోక సుఖమును సుఖానంతరము మర్త్య లోక మున రాజై పుట్టుటయు కలుగును; కఠేశ్వర తీర్థమందు ఉత్తరాయణమున స్నానమాడిన వారికి సంకల్పితార్థములు సిద్ధించును. తరువాత చంద్రభాగా తీర్థము. అందు స్నానమాత్రమున చంద్ర లోక ప్రాప్తియగును. తరువాత ప్రసిద్ధమగు శక్ర తీర్థము. అది ఇంద్రుడును దేవతలును నమస్క రించునది. అందు స్నానమాడి సువర్ణ దానముచేయుట పుణ్యప్రదము. అందు నీల వృషోత్సర్గము చేసినచో ఆ వృషభమునకును దాని సంతతికిని శరీరములందుకల రోమములన్నీ సహస్ర వర్ష ములు శివపురమున వసించి భోగానంతరము వీర్యవంతుడగు రాజగును. వేయి తెల్లని గుర్ర ములకు అధిపతియగును.

తరువాత బ్రహ్మావర్త తీర్థము. రవి కన్యారాశి యందుండగా ఇందు స్నానమాడి ఒక అహోరాత్రము ఉపవసించి యథావిధిగా పితరులకు పిండదానము చేసి తర్పణ మిచ్చినచో అక్షయ ఫలము లభించును. తరువాత కపిలా తీర్థము. అందు స్నానమాడి కపిలా గోదానము చేసినచో సంపూర్ణముగా భూమి అంతయు దానము చేసినట్లగును, తరువాత నర్మదేశ తీర్థము; దానివంటిది ఇదివరకులేదు; ఇకముందు ఉండదు. అందు స్నానముచే అశ్వమేధ ఫలము లభించును. తరువాత సంగమేశ్వర తీర్థము; అందు స్నానమాడుటచే సర్వయజ్ఞ ఫలము లభిం చును. ఆ ఫల భోగానంతరము భూలోక మందు సర్వలక్షణ సంపూర్ణుడు ఏ వ్యాధియు లేని వాడునగు రాజై పుట్టును: తరువాత నర్మదోత్తర తీరమున ఆదిత్యాయతన తీర్థము; దీనికి ఈ పేరు ఈశ్వరుడే పెట్టెను. దీనియందు స్నానమాడి యథాశక్తిగ చేసిన దానమును ఆ తీర్థ ప్రభా వముచే అక్షయమగును; దరిద్రులును వ్యాధిగ్రస్తులును దుష్కృతమాచరించినవారును దీని స్నానముచే సర్వపాప ముక్తులయి రవిలోక ప్రాప్తులగుదురు. మాఘ శుక్ల సప్తమినాడు ఈ తీర్థ మున నిరాహారులును జితేంద్రియులునై యుండినవారికి ముసలితనము వ్యాధి మూగి తనము గ్రుడ్డితనము చెవుడుకలుగవు; వారు రూపసంపన్నులు స్త్రీలకు ప్రీతిపాత్రులు అగుదురు; మార్కండే యుడిట్లు వచించిన ఈ తీర్థ మహిమనెరిగి దీనిని సేవింపనివారి జీవితము వ్యర్థమయినట్లే. తరువాత గార్గేశ్వర తీర్థము. దానియందు స్నాన మాత్రమున పదునలుగురు ఇంద్రులంత కాలము స్వర్గలోక సుఖము కలుగును; దాని దగ్గరనే నాగేశ్వర తపోవనమను తీర్థము గలదు; అందు స్నానముచే నాగలోక ప్రాప్తుడై నలుగురు నాగకన్యలతో విహరించి సుఖించును కుబేరలోక ప్రాప్తుడు అగును.

తరువాత కౌబేర స్థానమగు కాళేశ్వర తీర్థము; అందు స్నానమాడినచో సర్వ సంపదలు కలుగును; తరువాత పశ్చిమమున మారుతాలయ తీర్థము; దానియందు స్నానమాడి శుచియయి సమాహిత చిత్తముతో యథాశక్తిగ సువర్ణ దానము చేసినచో పుష్పక విమానముపై వాయు లోకమున కేగును; తరువాత యమ తీర్థము, అందు మాఘ కృష్ణ చతుర్దశినాడు స్నానమాడి నక్త వ్రతము చేసినచో యోని సంకటము కలుగదు; తరువాత ఉత్తమమగు అహల్యా తీర్థము; అందు స్నానమాడినచో అప్సరసలతో సుఖము కలుగును; అహల్య అచట తపమాచరించి ముక్తినందెను; చైత్ర శుక్ల చతుర్దశి కామదేవతిథి; ఆనాడు అహల్యను పూజించినవాడు తాను పుట్టినచోటనెల్ల ఎల్లరకు ఇష్టుడగును; రెండవ మన్మథుడువలె స్త్రీలకు ప్రీతిపాత్రుడగును; అయోధ్య అను ఒక గ్రామమునకు దగ్గరగా రామతీర్థమను తీర్థము కలదు; దానియందు స్నానముచే సర్వపాప ముక్తియగును; తరువాత సోమతీర్థము; చంద్రగ్రహణ సమయమున అందు స్నానమాడి నంతనే సర్వపాప ముక్తియగును, ఇది త్రిలోక విశ్రుతమగు మహాఫలప్రద తీర్థము; ఇందు చాంద్రాయణ వ్రతమాచరించినచో సర్వ పాపముక్తుడై సోమలోక మేగును. ఇందు అగ్ని ప్రవే శముచేగాని జలప్రవేశముచేగాని అనాహార వ్రతముచేగాని ప్రాణత్యాగము ఒనర్చినచో మరల మర్త్య లోకమున జన్మించరు. తరువాత శుభతీర్థము; దానియందు స్నానముచే గోలోక ప్రాప్తి యగును, తరువాత మహోత్తమమగు విష్ణుతీర్థము; దీనికే యోధవీపురమనియు పేరు. ఇందు వాసుదేవుడు కోట్లకొలదిగా అనుచరులతో యుద్ధముచేసెను; ఇందుచే ఇది విష్ణు స్థానమగు తీర్థమయ్యెను; ఇందు ఒక అహోరాత్ర ముపవాస ముండినంతనే విష్ణువు ప్రీతుడయి బ్రహ్మహత్యా దోషమును కూడ పోగొట్టును. తరువాత తాపసేశ్వర తీర్థము; వ్యాధునివలన భయపడి ఒక ఆడులేడి ఈ తీర్థజల మందు పడి అంతరిక్షమునకు పోయెను. అది చూచి చిత్తమందా వ్యాధు డాశ్చర్యపడెను. ఇట్టి మహిమకలది ఈ తాపసేశ్వర తీర్థము; ఇట్టిది ఇదివరకులేదు. ఇకముందుండదు; తరువాత అమోహకమను ప్రఖ్యాతిగల బ్రహ్మ తీర్థము. ఇది చాల ఉత్తమము; దీని యందు పూర్ణిమ అమావాస్య లందు స్నానమాడి యథావిధిగా పితృ శ్రాద్ధమాచరించి పిండదాన తర్పణములు చేయవలయును; అచ్చట జల మధ్యమున గజరూపమగు శిల ప్రతిష్ఠితమయి యున్నది; వైశాఖ పూర్ణిమ అమావాస్యలందు ఇట పితరులకు పిండములు ఇచ్చినచో పితరులకు భూమి (సృష్టి) ఉన్నంత వరకు తృప్తి కలుగును. తరువాత సిద్ధేశ్వర తీర్థము. అది చాల ఉత్తమ మైనది; ఇందు స్నానమాడినచో గణపతి సాన్నిధ్యము లభించును. తరువాత లింగతీర్థము. అందు విష్ణువు లింగరూపుడుగా ఉన్నాడు; దానియందు స్నానమాడినవారు విష్ణులోక ప్రాప్తుల గుదురు. నర్మదా దక్షిణామగు కుసుమేశ్వరమను తీర్థము కలదు. పూర్వమొకప్పుడు కామదేవుడు (మన్మథుడు) సహస్ర దివ్య వర్షముల కాలము అచ్చట దివ్యమగు మహాతపమాచరించి శంకరుని ఉపాసించెను. కాని ఇతనిచే తనకు సమాధి భంగమయ్యెనని కోపించి మహాత్ముడగు శంకరుడు అతనినేకాక అతనితోపాటు శ్వేతపర్వన్ (వాయువు), యముడు, హుతాశుడు (అగ్ని), వీరిని కూడ శుక్లపక్షపు పర్వదినమున, పూర్ణిమనాడు దహించెను; (వీరిని తాపమందించెను. ) వారట్లు దగ్ధులయి కూడ (తాపమందుచునే) ఈ కుసుమేశ్వర తీర్థము నాశ్రయించియుండిరి.

వారు అట్లు ఉండగా సహస్ర దివ్య వర్షముల తరువాత రుద్రుడు సంతుష్టుడయి వారికి వరము నీయదలచి ఉమతో కూడి వచ్చెను, శివుడు వారినందరను తాపము నుండి విడిపించి నర్మదా తటమందు అనుగ్రహించెను. ఆ తీర్థ ప్రభావమున మరల వారందరు దేవత్వమందిరి. మహాదేవా! నీ ప్రభావమున ఈ ప్రదేశోత్తమము తీర్థమగుగాకయని వారు శివుని వేడి ఆ వర ములను కూడ పొందిరి. అది అర్ధయోజన విస్తీర్ణమయి అన్ని దిక్కులందును వ్యాపించి యున్నది; ఇందు స్నానమాడి ఉపవసించినవారు కుసుమాయుధ (మన్మథ) రూపులయి రుద్రలోక సుఖము లందుదురు, ఇట్లు మన్మథ వాయు యమాగ్నులు తపస్సిద్ధినందిన ప్రదేశము ఈ తీర్థము! దీనికి దగ్గరలో ఉన్న అంకోల వృక్షపు (ఊడుగు చెట్టు) మొదట స్నాన దానములును అచటి త్య్రంబక తీర్థజలముతో శ్రవణము (పాకము) చేసిన చరువుతో బ్రాహ్మణ భోజన పిండ ప్రదానము లును జరిపినచో పితరులకు రవిచంద్రులున్నంత వరకు తృప్తి కలుగును. ఉత్తరాయణ మందు ఇచట భగవానునకు ఘృతాభిషేకము జరిపినచో శివలోక ప్రాప్తియగును, ఇచట సిద్ధేశ్వరునకు ప్రాతఃకాల పూజ జరిపినవారు శుభగతి నంది శివలోక సుఖములందుదురు: ఆ పుణ్యము ముగిసిన తరువాత భూమికి దిగివచ్చినను రూపవంతుడును స్త్రీలకు ప్రీతిపాత్రుడును అయి సర్వ సముద్రాంతర్గతమగు భూమికధిపతియగును; ఇచటగల క్షేత్రపాలుని మహాబలుడునగు దండపాణిని కర్ణకుండలుని దర్శింపనివాని యాత్ర వ్యర్థమగును; ఈ కుసుమేశ్వర తీర్థ మాహాత్మ్య ఫలముల నెరిగి సర్వదేవతలు ఇటకు వచ్చుచుందురు, దీనిపయి పూలవాన కురియుచుందురు, దీనిని స్తుతించుచుందురు.