చౌర్యాది దోషదండనములు

శ్రీమత్స్య నారాయణుడు మనువుతో ఇట్లు చెప్పెను, ఇతరులు తన వద్ద దాచుట కిచ్చిన ధనమును అనుభవించినవానికి ఆ నిక్షేప మూల్యసమాన మూల్యమే దండము, వస్త్రాదిక విషయమునందును ఇంతే; ఇట్లు చేయుటచేత ధర్మమునకు హాని కలుగకుండును. ఇతరులు తనకడ దాచుట కిచ్చిన ధనమును, తిరిగి ఈయనివానిని దాచకయే దాచితినని ధనమడుగు వానిని, దొంగలనువలె దండించవలెను; నిక్షేప మూల్యమునకు రెట్టింపు ధనమయిన ఇప్పించ వలెను, మోసములతో పరద్రవ్య మపహరించిన వానిని వాని సహాయులను కూడ చిత్రహింసలతో చాలహింసించవలెను, ఇతరులకడ అడిగితీసికొనిన దానిని సొంతదారునకు తిరిగి యథా క్రమముగ ఈయనివానిని దండించి బలవంతముగ ఇప్పింపవలయును; రెట్టింపు వెలనైన ఇప్పింపవలెను; తనకడ నున్న ఇతరుల వస్తువును తెలియక అమ్మినచో తప్పుకాదు; తెలిసి అమ్మినచో చోరునికి వలె శారీరక శిక్ష ఈయవలయును; విద్యను శిల్పమును ఇత్తునని వెల తీసికొనియు అవి ఈయనివాని నుండి ధర్మజుడగు రాజు మూల్యము ఇప్పింపవలెను, తన ఇంట బ్రాహ్మణ సంతర్పణముచేయుచు, పొరుగువానిని భోజనమునకు పిలువని వానిని మాష ప్రమాణపు (ఐదుగిరి గింజల ఎత్తు బంగారు నాణెము) బంగారముతో దండించవలెను. దీనితో ఆ పిలువనివానికి ఆ దోష మంటకుండును; ఆమంత్రణము చేయబడి ఒప్పుకొనిన బ్రాహ్మణు డింటియం దుండియు నిష్కారణముగా పోనిచో వానికి ఎనిమిది వందల దమము (దుడ్డు)లు దండముగా విధించవలెను; ఇత్తునని ఒప్పుకొన్న దానిని ఈయనివానికి ఒక సువర్ణము (నవరసు- 80 గురిగింజల తూకము) దండముగా విధించవలెను, తన స్వామి ఇచ్చిన అజ్ఞను పొగరుతో చేయని సేవకునికి ఎనిమిది కృష్ణలములతో (ఒక గురిగింజ తూకపు బంగారు నాణెము) దండము విధించవలెను, వాని వేతన మీయకుండవలెను. చాలకాలము నుండి తాను చేయించు కొనిన పనికై భృత్యునకు కాలములో వేతనమీయని వానిని, అకాలములో భృత్యుని విడిచినవానిని, నూరు కార్షాపణములతో దండించవలెను.

గ్రామ విషయమునను దేశ విషయమునను సస్య పంటల విషయమునను (రాజుతో) ఒడంబడిక చేసికొనియు లోభవశుడయి మాట తప్పినవానిని రాజు దేశమునుండి వెడలగొట్ట వలెను. ఎవరైనను ఒక వస్తువును అమ్మకాని, కొనికాని, తరువాత పశ్చాత్తాపపడి అది మానుకొన దలచినచో పదినాళ్ళలోగా దానిని ఇచ్చి ధనము పుచ్చుకొనుటయో దానిని తీసికొని ధనమును తిరిగి ఇచ్చుటయో చేయవలెను. పది దినములు గడచినమీదట ఈయరాదు. పుచ్చుకొనరాదు. కాని ఆపది దినముల లోపలకూడ ఈయని వానిని పుచ్చుకొనని వానిని రాజు ఆరు వందల పణములతో దండించవలెను. తన కన్యయందున్న దోషములను బయల్పరచక దాచియుంచి కన్యాదానము చేసిన వానిని తొంబదియారు పణములతో దండించవలెను. తన కన్యయందేదైన దోషముండగా అది బయల్పరచకుండుటకై ఆమె తన కన్య కాదనిన వానిని నూరు పణములతో దండించవలయును. ఒక కన్యను చూపి మరియొక కన్యను వరునకిచ్చిన వానిని రాజు ప్రథమ శ్రేణికి చెందిన (వేయి కార్షాపణముల) మూల్యముతో దండించవలయును. తనయందున్న దోషమును కప్పియుంచి కన్యను ఇప్పించుకొనినవానికి ఆ కన్యను ఈయనట్లే; పైగా ఆ వరునకు రాజు రెండువందల కార్షాపణములు దండముగా విధించవలెను. తన కన్యను మొదట ఒకనికి దానముచేసి కాని ఇత్తునని మాట ఇచ్చికాని ఆమెనే మరల నింకొకనికిచ్చిన వానిని రాజు ప్రథమ శ్రేణి (వేయి కార్షాపణముల) దండముతో దండించవలెను. ఒక వస్తువును ఒకనికి అమ్ముటకు శపథ పూర్వకముగ మాట ఇచ్చినదానిని మరియొకనికి అమ్మువానిని ఆరువందల కార్షాపణములతో దండించవలెను. తన కుమార్తెకు ఆమె అత్త ఇంటివారుకాని ఇతర బంధువులుకాని చదివించిన కానుకలు మొదలగు వానిని అమ్మినవానిని అవి తనయొద్ద లేనేలేవని నిరాకరించినవానిని వాని వెలకు రెట్టింపు వెలతో దండించవలెను అని ధర్మవ్యవస్థ చెప్పుచున్నది.

వస్తువును కొనినవాడు దాని వెలలో కొంతమాత్రమిచ్చి మిగిలిన దానినీయక మానినచో వానిని (నూరు కార్షాపణముల నుండి ఐదు వందల కార్షాపణముల వరకు గల) మధ్యమ దండముతో దండించుటయే కాక ఆ తీసికొనిన వస్తువును తిరిగి సొంతదారునకు ఇప్పించవలెను. పశువును (అవును) కాచెదను మేపెదను అని అందులకై వేతనము తీసికొనియు దానిని కాపాడక మేపక దానిపాలు పిదుకుకొను పశుపాలుని రాజు నూరు నవరసులతో దండించవలయును. ఈ విధించిన దండమును చెల్లించిన తరువాత తన స్వామిచే తన దేహమున తన అపరాధపు గురుతు వేయించుకొని ఆమొదటి పని విడువవలెను. తరువాత తన కాలికి ఇనుప గొలుసు కట్టుకొని ఆ స్వామి చెప్పిన పనిచేయవలెను. గ్రామమునకు చుట్టును నూరు ధనువుల దూరము నందును నగరమున కయినచో రెండు మూడు వందల ధనువుల దూరమందును రాజు ఒంటె తన మెడఎత్తి చూచినను అవతలిది కనబడనంత ఎత్తున కంచె వేయించవలయును, ఈ కంచెలో నుండి పందులు, కుక్కలు మొదలగునవి దూరి పోకుండునట్లు కంచె సందులను మూయించవలయును. ఈ కంచెకులోగా ఉండు పైరు పంటలకు పశువులేమి హాని కలిగించినను రాజు పశుపాలకునకు దండము విధించవలసిన పనిలేదు; ఈని పది దినములు గడువని ఆవుగాని, ఆబోతుగాని దేవతకు అర్పించిన పశువుగాని పొలములో దూరకుండ ఛిద్రములు మూయవలెనే కాని అవి పొలములలోనికి ఒకవేళ పోయినచో వానిని కొట్టకూడదు; ఈ విధముగకాక మరియొక విధముగ పశువులు పంట పైరులు మొదలగు వానికి హాని కలిగించినచో ఆ నష్టమయిన ధాన్యాదికము క్షత్రియుని దయినచో పశుపాలకుని నియమించుకొనిన పశుస్వామికి వినష్టమయిన దానిలో పదియవ వంతు దండముగా విధించ వచ్చును; పశువు పైరు పంటలను తిని అచ్చటచే పండుకొనియున్నచో పైదానికి రెట్టింపు దండము విధించ వలయును, క్షత్రియుని ఆస్తిని వైశ్యుని పశువు ఇట్లు నష్టపరచినచో పైదానికి పదింతలు దండి “ముగా విధించవలెను; గృహము, చెరువు, తోట, పొలము, మొదలగునవి హరించినవానికి ఐదువందల కార్షాపణము దండము విధించవలయును, ఇవి తెలియక చేసినచో రెండువందల కార్షాపణము చాలును; పొలపు గట్టులు నిర్ణయించి ఏర్పరచుటలో తప్పు హద్దులను నిర్ణయిం చినను, ఏర్పరచినను అట్లు చేయుటకు అనుకూలించు సైగలు చేసినను, గుర్తులుంచినను అట్టివాని నాలుక కోయవలెను; జ్ఞాన పూర్వకముగా తెలిసి తెలిసి ఇతరుల పొలపుగట్లను వ్యత్యస్తముగా చేసిన వానికిని, చేయించిన వానికిని ఆ సంకేతములను అందుకొనిన వానికిని ఉత్తమశ్రేణికి చెందిన అనగా వేయి కర్షపణముల దండము విధించవలయును.