హిమవత్పర్వతము-ఓషధులు

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను, ఈ హిమవత్పర్వతమునందే అతి మనోహరమగు ప్రదేశము ఒకటి కలదు. అది సామాన్య మానవులకు చేర నలవికానిదేయైనను అదృష్టవశమున మద్రరాజగు పురూరవుడు చేరెను. అచటి నుండియే నదీ శ్రేష్ఠయగు ఇరావతి ప్రభవించి బయలు వెడలును. అనేకములగు వృక్షముల గుబురులతో ఆ ప్రదేశము మేఘములవలె నల్లనై కానవచ్చుచుండును.

(అచటి వృక్షములలో కొన్ని కలపను లక్క మొదలగు పదార్థములను అగురు మొదలగు సుగంధ ధూప ద్రవ్యములను అలంకరణ సామగ్రిని ఓషధులను ఉత్పన్నము చేయు మహావృక్షములు. అవి ఏవన): సాలతాల (తాటి); తమాల-కర్ణికార-శాల్మల (బూరుగు) న్యగ్రోధా (మర్రి); శ్వత్థ (రావి); శిరీష (దిరిసెన); శింశుపా (అగురు), శ్లేష్మాతకామలక (ఉసిరిక); హరీతక (కరక); విభీతక (తాడి) భూర్జముంజక బాణ (ఈ రెండును ఏళ్ళయొడ్డున మొలచు ముంజగడ్డి ఱెల్లు) సప్తచ్ఛద (ప్రతి రెమ్మయందును ఎప్పుడును ఏడాకులే ఉండెడి అరణ్య వృక్షము) మహానింబ (పెద్దవేప); నిబనిర్గుండీ హరిద్రుమ దేవదారు కాలేయక పద్మక వందన బిల్వ కపిత్థ (వెలగ); రక్తచందన వాతామ రిష్టకా-క్షీరా- శ్వకర్ణార్జున (మద్ది); హస్తికర్ణ-సువనస కోవిదార ప్రాచీనామలక మధూక (ఇప్ప); వరాటక ఖర్జూర నాళికేర ప్రియాళ్వామ్రాతక తంతు మాలధవ భవ్య కాశ్మీర-పర్ణిజాతీఫల (జాజికాయ) పూగఫల (పోక); కట్ఫల సల్లకీఫల మందార కింశుక కుసుమాంశుక పలాశ (మరియొక విధమగు మోదుగు), శాల్మలీభేద (మరొక విధమగు బూరుగు); వేతస (మెట్ట ప్రబ్బలి); జలవేతన (నీటి ప్రబ్బలి), రక్తాంగ సారంగహింగు (ఇంగువ); ప్రియంగు రక్తాశోకాశోక కురుక భువి రూఢకముచుకుంద కుందకోట రూషక-రూషక కింకరాత కిరాతకేతక (నీటి మొగలి) వనకేతక (అడవి మొగలి) శోభాంజనాంజన కుశలింగ నిచోళక పర్ణాక శయనా సన వృక్షములును.

(మరికొన్ని అందమగు పూలను ఔషధములుగా పనికివచ్చు ఫలములను ఇచ్చునవి-అవి ఏవన) అసన మన్మథ శరాకార మనోరమ సహకార (రసాలమను మామిడి) పీతయూథికా- వల్మీక-శ్వేతయూథికా-జాతీ ‘జాజి); చంపక తీగ (సంపెగ), తుంబక మోచచోచలికుడ తిల- బిల్వ-కుసుంభక (నూనెనిచ్చు కుసుమపంట); శుష్మచరణ వరుణ కామవల్లభ పుష్పాంకుశ వకుళపారి భద్రహరిద్రక ధారా కదంబ (ఒక కడిమి), కుటజ (కొడిసె) కదంబ (నాటుకడిమి) గిరి కుటజ (కొండ గోగు), సమాక్రాంత దిగంత కమనీయ కకుభ (మద్ది); కర్కంధుబదరీ మదగజ సమాన నీవరక్త (ఎర్రని); పాలీవన దాడిమ (దానిమ్మ), ద్రమ చంపక (చెట్టు సంపెంగ), బంధూక సబంధూక కుంజక జాతిభేద (వేరువేరు జాతుల కుంజక వృక్షములు) పాటల కరవీర (ఎర్ర గన్నేరు-అదేవిధమగు తెల్లని పూలచెట్టును) కురువక (పచ్చని ములుగోరింట) హిమ వంజీరములును. మరికొన్ని ఓషధులుగానే విశేషముగా పనికివచ్చు చెట్లు అవి ఏవన, జంబూ (నేరేడు); మృదు జంబూ బీజపూర కర్పూరాగురు బింబ (దొడ); సంతానక వితానక (పందిళ్లు); ములును-ఔషధజాతి (మరికొన్ని పండ్లచెట్లు: అవి ఏవన): హింతాల ధన్విక తృణశూన్య కరీషశాక (చాగ); మదన (ఉమ్మెత్త); పీలు ధాతకీ (ఆరె); చిరిబిల్వవాలుక తింత్రిణీ (చింత); లోధ్ర విడంగ క్షీరికాశ్మాతకాంఽకోల (ఊడుగ) మధుక భల్లాతకేంద్రవన వల్మీక సిందువార సుకేసర (మనోరమ) నాగకేసర కరమర్దకాసమర్దారిష్టక వరిష్టక రుద్రాక్ష ద్రాక్ష నింబ పుత్రజీవక (గారకాయ) తక్కోలలావకత్వక్ ద్రుమ పారివేతనములును.

 (మరికొన్ని వివిధోపయోగములుకల తీగల గుబురు పొదల జాతులు. అవి ఏవన): పిప్పలీ నాగవల్లీ (తమలపాకు); మరీచ (మిరియపు), పద్మ-వనమాలికా మృద్వీకా (ద్రాక్ష); అతిముక్తక వకుల (పొగడ); సఫల (పండ్లుగల); వక్రకీకూశ్మాండ (బూడిదగుమ్మడి), పటో (పొట్ల) లాలాబు (సొర) చిరంట కారవేల్ల (కాకర) కార్కోటక వార్తాక (పందిలి వంగ) బృహతీ ఫల రాజమాషాతనీ (బొబ్బర -అవిసె) త్యాది వివిధ శాకలతా ప్రతానములును రుచిమంతము లును కంద విదారీ కరోట బిడారీ విష్ణుసారజతువత్ త్వగ్వివర్ధిత నిష్పావక గవిక్షువక వాస్తుక సువర్చలా సర్షపములును (ఆవాలు) కాకోలీక్షీరకాకోలీకా సమర్దసాల కట్ఫల చక్రక వృక్షములును క్షీరిక శాక కాలశాకములును శింబి ధాన్య ప్రభృతి సర్వ ధాన్యములును విచిత్రములును ప్రకాశించునవియు దీర్ఘాయువు కలవియు సస్యయుతములును అగు వన్యములగు ఓషధులును జరామృత్యు క్షుద్భయ నాశకములును సౌభాగ్య వర్ధనములును నగు అనేక లతలును తీగె వెదుళ్ళు బొంగు వెదుళ్ళును చంద్రునివలె మెరయు పూలుగల రెల్లు పొదలును రమ్యములగు దర్భల చెరకుల గుబురులును దుర్లభములును శుభకరములునగు తెగకు చెందిన ప్రత్తి చెట్లను మనోహరములును ఉత్తమములునగు అరటి గుబురులును పచ్చిక బయళ్ళతో నిండిన గరుడ పచ్చమణుల నెత్తములును పచ్చని పూవులతో వెలయు కుంకుమ పొదలును భృంగరాజ జటా మాంసీ గ్రంథికతుమురాంగదములను ఓషధి వృక్షకము (మొక్క)లును భూమి బంగారు పూవులు డాల్చెనేమోయని తోపజేయు మరి ఇతరములగు పూవులును సరసములగు జంబీరికా భూతృణక కకుభ వృక్షములును శృంగిబేరాజ మోదా (వాము) కుహక ప్రియాళుక వృక్షలతాదికమును ఏ వన్నెయు లేనివి పలువన్నెలు కలవియగు సుగంధ వంతములునగు తామరలును ఉదయ సూర్యునివలె పూర్ణచంద్రునివలె కాచిన బంగారు వలె అవిసె పూలవలె చిలుక ఱెక్కలవలె మెరయు మెట్టయందు పూచు పూలును ఐదు వన్నెలు ఇంకను ఎక్కువ వన్నెలు కలిగి చూపు కంటికింపు కలిగించు మరి ఇతర పుష్పములును చంద్రునివలె వహ్నిజ్వాలలవలె మెరయు శుభములగు గజ వక్త్రోత్పలములును (కలువ) నీలోత్పలములును కర్పూర పుష్పములును గుంజాతకములును కశేరుకములును శృంగాట కములును సృగాలములును భరటములును స్థలోత్పలములును (మెట్ట కలువలు) మరికొన్ని నీటియందు మెట్టయందు మొలచి పెరుగు కందమూలఫల పుష్ప విశేషములును మునుల కాహారములగు వివిధ నీవార ధాన్యములును ఆ ప్రదేశమునందు ఆ రాజునకు కనవచ్చెను.

స్వర్గమందో నరలోకమందో జలప్రాయ ప్రదేశములందు గాని మెట్టపై గాని వనములందుగాని లభించు ఆయా జాతులలో అచట లేని ధాన్యము కాని, పుష్పము కాని, శాకముకాని, ఫలము కాని, కందము కాని, మూలము కాని ఏదియు నుండదు. అవి అన్నియు ఎల్లప్పుడు ఫల పుష్పములను కందమూలాదికమును ఇచ్చునదే కాని ఋతు లక్షణ వశమున నశించునవి కావు.

ఇవికాక ఆరాజు చూడ ఇంపుగొలుపు వివిధ పక్షులను-పలువన్నెల వెలయు ఱెక్కలీకలుకల నెమళ్ళు కాక వంక కోకిల బక కాదంబక హంసకోయష్టిబంజరీట కుక్కుట కాష్ఠకూట ఖట్వాంగ లుబ్ధకి గౌక్షేడక కుంభ ధార్త రాష్ట్ర శుక ధాతుక చక్రవాక కటుక టిట్టిభ పుత్ర ప్రియాలో హపృష్ఠ గోచర్య గిరివర్తక పారావత కమల శారికా జీవంజీవకాలావ-వర్తక-వర్త రక్తవత్స ప్రభద్రక త్రామచూడకుక్కుట స్వర్ణ చూడకుక్కుట కాష్ఠకుబ్జక కపింజల కలవింక కుంకుమ చూడక భృంగరాజ సారపాద భుల్లింగ పిండమానవ మంజుళీతక దాత్యూహ వ్యాధసపక్షక యాత్ర భారద్వాజచాష సుపార్ణాంఽజలీయక భౌమ పుత్ర సదాజ్వాల భాజనాంతి కములు అనెడి వానిని చూచెను. మనోహరములగు వేరువేరు పక్షులమందలును ఆ మద్రరాజు పురూరవసునకు అట కననయ్యెను.

మరియు వివిధాకారములగు వన్య క్రూర మృగములు మహామృగములు వ్యాఘ్రములు కేసరయుత సింహములు ద్వీపి శరభ వృక ఋక్షతరక్షు మృగగోలాంగూల వానర శశకమశక దంశ (వాయువేగి) మార్జాల మూషికనకుల శివనోడవకాలక మత్తగజ గోమహిప్యశన వృక చమర సృమర గౌరముఖోర భ్రమేష మేష సారంగ కుక్కుట) ఇది ఒక మృగము-కోడికాదు) తరక్షు ఋక్షుక ఋక్షక్షపక్వకుకుర మృగ మర్కటక (చిరుకోతులు) మహానీలరావకశ్వ దంష్ట్ర రామశరభ కోరకారక సంచర కరాళకృతమాలకాలపుచ్చ తోరణోష్ట్ర ఖడ్గవరాహ తురగ గర్దభములును ఆ రాజున కచట కాననయ్యెను.

మద్రరాజునకు కనబడిన ఈ మృగములలో పరస్పర సహజ విరోధము కలవియు కలవు. ఐనను నవి విరోధము లేక మెలగుటచూచి అతడు మిగుల ఆనందము చెందెను. ఈ ఆశ్రమము మిగుల పుణ్యకరము. అది ఎవరిదో ఆ మహనీయుని ప్రభావమున అచటి స్థిర (వృక్షాది); చర (పక్షిమృగాది) ప్రాణులన్నియు కాంతిమంతములయి వెలుగొందుచుండెను. అచటి పక్షి మృగములలో పరస్పర హింసకములును ఆ లక్షణము లేక శాంతితో నుండెను. అచట మాంసాహారి ప్రాణులన్నియు పాలు పండ్లు త్రాగి తిని జీవించును. మహాత్ముడగు అత్రిముని దానిని ఇట్టి దానినిగా నొనర్చెను. (అచటి ఈ ప్రశాంతతకు ఆ మహాత్ముని ప్రభావము హేతువు.)

ఆ రాజు తానచట ఒకపల్లమున శిలపై కూర్చుండెను. అచటి గ్రామ్య (ఆరణ్యములు, కాని) గేదెలును ఆవులు అమృతమువంటి రుచికల పాలు స్రవించుచుండెను. అచటి తావులన్నియు ఆవుపాలతో పెరుగుతో మిక్కిలిగా నిండి ఉండుట చూచి యారాజు మిగుల అనంద మందెను. అచటి సరస్సులు దివ్యములు-నదులు నిర్మలోదకములు-ఊటలన్నియు ఎండనివి చల్లనివి; అడుగడుగున గుహలు తమ్ము చేరిన వారికానందప్రదములు. ఆ చుట్టుపట్టుల ఐదు యోజనములమేర పర్వత సమీప భూములందుకాని పర్వత శిఖరములందు కాని హిమపాతము లేదు.

అచట మంచును త్రావి ఘనీభవించి తెల్లనై వెలుగొందు మేఘములతో నిండి ప్రకాశించు హిమాలయపు శిఖరము ఒకటి కలదు. అచటి పరిసరములందే ఎల్లవేళల సజలములగు జలదములతో నిండి కనులపండువు సేయు శిఖరమింకొకటి కలదు. ఆ మేఘములా శిఖరమును తమ వాననీటితో నెల్లవేళల తడుపుచుండును. కామహరుడగు హరుడే కోరి సదా ఆట నివసించునన ఆప్రదేశము మిగుల మనోహరమని మరి చెప్పవలెనా?

దేవ ముఖ్యులు అచట నెల్లవేళలసుఖము లనుభవించుచు ఆనందించుచుందురు. అందులకు అనుకూలముగానే ఆ శిఖరమందలి ఫల వృక్షములన్నియు నిరంతరము సఫలములు; అచటి పూల-పండ్ల సుగంధములచే నాకర్షింపబడు తుమ్మెదలు సదా రొద సేయుచుండును. అచట తమ అంగనల సేవలందుకొనుచు దేవతలానంద విహారములు సేయుచుందురు. ఆ పర్వత శిఖరము ఇట్లు సుమనోహరమగుటతోపాటు సర్వపాప క్షయకరమయి యుండెను. ఆయా ప్రదేశములందు క్రీడించుచుండు వానరములు చూపఱకు కుతూహల వినోదములు కలిగించుచుండును. అచటనచట కనవచ్చు హిమరాశి ఘనములు పూర్ణ చంద్ర బింబమువలె ప్రకాశించుచుండును.

ఇట్టి ఆ ఆశ్రమమునకు అన్నివైపులను మంచుతో మూతపడిన గుహలును చిరుకొండల వరుసలును ఉండి మనుజులకు ఎన్నడును అగమ్యములయి యుండెను. అయినను పూర్వపుణ్య కర్మానుష్ఠానమున అదృష్టమును సంపాదించినవాడగుటచేతను దేవదేవుడగు శివుని యనుగ్రహమునను మద్రమహారాజా పురూరవుడు అటకు చేరి ఆ అత్రిమున్యాశ్రమమును చేరగలిగెను. అత్రి మహాముని తనకై ఏర్పరచుకొనినదియు ఆ మహనీయుని తపోబలముచే వర్ధిత మహిమమును శ్రమ హరమును సుగంధయుతమును మనోహరమును చక్కగా పూచి వికసించిన నూరులకొలది పూలతో అలంకృతమును యోగసిద్ధి ప్రదమగుటచే ముని శ్రేష్ఠులకును ఆశ్రయమును శుభావహమును అగు ఆ ఆశ్రమమును మద్ర భూపాలుడు సంతసముతో కాంచెను.