నారదుడు త్రిపురముల కేగుట

సూతుడిట్లు చెప్పసాగెను, త్రిపుర విజయార్థమైన రథము సాగిపోవుచుండెను. దానిని దేవవరులు అభినందించుచు వెంట పోవుచుండిరి. దేవవరులును ప్రమథులును సాధువాదములు చేయుచు ధ్వనులు చేయుచుండిరి. ఈశ్వరుని మహావృషభము వేదస్వర ఘోషతో అంకెలు వేయుచుండెను. విప్రులు వేదాధ్యయనము చేయుచుండిరి. అశ్వములును వేదముల పఠించుచు పోవుచుండెను. అట్టి సమయమున ప్రభుడగు నారద మహర్షి గగనాంగణమునుండి చంద్ర సదృశ దేమకాంతిలో దుమికి శీఘ్రముగా త్రిపుర దుర్గమునకు పోయెను. అప్పుడును అచట ఉత్పాతములు అధికముగ జరుగుచునే యుండెను. అదే సమయమున తపోధనుడు నారద భగవానుడు అచ్చట సాక్షాత్కరించుటచే అగ్ని ప్రకాశుడగు ఆయన రాకను చూచి దైత్య దానవులు అభివాదనములు పలుకుచు లేచి నిలువబడిరి. అసురేశ్వరుడు నారదుని అర్ఘ్యపాద్య మధుపర్కము లతో ఇంద్రుడు బ్రహ్మ నర్చించి నట్లర్చించెను. తపోధనుడు పూజార్హుడు నారదుడు మయుడు ఇచ్చిన పూజను స్వీకరించి మేలగు బంగరు పీఠముపై కూర్చుండెను. అనంతరము దానవేశ్వరు డగు మయమహాసురుడు తుష్టుడును హర్షసహిత రోమముఖ నయనములు కలవాడునై తన దానవులతో కూడ తానును కూర్చుండి నారదుని చూచి ఇట్లు పలికెను. నారదా! నీవు వర్తమానము నెరిగినవాడవు. మా పురమునందు ఇపుడు మరెప్పుడు నెక్కడనులేనంతగా ఉత్పాతములు కనబడుచున్నవి. ఏమనగా భయంకర స్వప్నములు కలుగుచున్నవి. ధ్వజములు విరుగుచున్నవి. వాయువు వీచకయే జెండాలు క్రిందపడుచున్నవి. పతాకలతో గోపురములతో కూడ అట్టాలక ములు (మేడల పై అంతస్తులు) విరిగిపడుచున్నవి. ‘బాధించుడు బాధించుడు’ అను భయంకర ధ్వనులు వినబడుచున్నవి. నారదా! స్థాణు (శాశ్వత) రూపుడు భక్తాభయకరుడు వరదుడునగు హరునకుతప్ప నేనింద్రాదిదేవతల కెవ్వరికిని భయపడను. అనఘా! భగవన్! ఉత్పాత విషయమున నీకు తెలియని దేదియులేదు. భూత భవిష్యముల వాస్తవరూపము నీవెరుగుదువు. కావున మునిశ్రేష్ఠా! నారదా! ఈ ఉత్పాతములు మాకు రానున్న ఏ భయ హేతువును సూచించుచున్నవో నీకు తెలిసినంత తెలుపుము అనగా ఏ చిత్తదోషములునులేని నారదుడు మయునితో ఇట్లు పలికెను.

మయదానవా! ఈ ఉత్పాతము లేమి సూచించునో తెలిపెదను వినుము! మహాతేజా! ధర్మ శబ్దమునందలి ‘ధా’ ధాతువునకు గల అర్థమును బట్టి ‘తను ఆశ్రయించినవారిని నిలుపునది’ ‘కంటికి కానరాని ఫలితములను తన యందు గట్టిగా నిలుపుకొనునది’ అని ధర్మ శబ్దమునకు అర్థము. ఈకారణమున ఈఉత్పాతములు మీకు అనిష్టఫలమునే సూచించుచున్నవి. విమార్గమును విడిచి సన్మార్గమున నడువ వీలుండియు దుర్మార్గము ననుసరించువానికి నాశము తప్పదని ధర్మతత్వ వేత్తలందురు. నీకు నీవు మూఢుడవై ఈ దైత్య దానవులతో కూడి ఈదుష్టుల తోడ్పాటుతో దేవతలకు ప్రతికూలము లాచరించు చున్నావు. ఈ దోషమునకు ఫలముగా మీకు నాశము కలుగుననియే ఈ ఉత్పాతములు తెలుపు చున్నవి. ఇదిగో! రుద్రుడు లోకమయరథ మారోహించి మయా! త్రిపుర దుర్గమును నిన్ను అసురులను దహించుటకై వచ్చుచున్నాడు. కావున ఇట్టి స్థితిలో నీవు నీవా దానవులతో కూడ మహేశ్వరుని శరణు చొచ్చుట మేలు. లేనిచో నీకుమారులతో నీదానవులతో కూడ నశించి పోయెదవు అని నారదుడు మయాదులగు దానవులకు రానున్న భయమును ప్రస్తుత వచనములతో తెలిపి ఆ ధీమంతుడు మరల దేవేశుని పురమునకు (స్వర్గము నకు) వచ్చెను. నారదుడు వెడలిన తరువాత దానవ నాయకుడగు మయుడు తన శూరులను ఉద్బోధించుచు ఇట్లు పలికెను, శూరులగు దానవులారా! మనమందరము పుత్రవం తులమ యితిమి. (వారును మనంతటి వారయినారు.) మనము కుటుంబములకు చేయవలసిన కృత్యము లను చేసితిమి. మనము ఎవరికిని ఎందులకును భయపడవలసిన పనిలేదు. దేవతలతో యుద్ధము చేయుదము. మనము చచ్చితిమా ఇంద్రుని సభాసదులమై స్వర్గసుఖములను అనుభవింతము. ఇంద్రాదులను చంపగలిగితిమా-మనమే సర్వలోకములను అనుభవింతము. కావున మీరెల్లరు శస్త్రపాణులై సన్నద్ధులై అట్టాలకములపై (బురుజులపై-భవనాగ్రములపై) నిలువుడు. కవచములు, ఆయుధ ములు ధరించి నిలువుడు. ఈ త్రిపురములును వీనికి అనుబద్ధములగు పురములును శత్రువులకు చేరనలవికాకుండునట్లు మీమీ స్థానములందు నిలువుడు. దేవతలును ప్రమథులును ఆకాశమున సంచరింపగలవారును శూరులును అని మీకు తెలియును. వారిని మీశక్తికొలది అడ్డగించుడు. బాణములతో చీల్చుడు.

అని ఇట్లు మయుడు దానవులకు వారు దేవతలతో పోరవలసిన హేతువును వీరు వారిని అడ్డగించవలసిన విధమును తెలిపి తన మనస్సును యుద్ధాసక్తమొనర్చి గగన సంచారి యగు త్రిపుర దుర్గమును ప్రవేశించెను. అనంతర మతడు రజోగుణ రహిత విశుద్ధ భావమును అట్టి రూపమును కలవాడయి దిగంబరుడు దేవదేవుడు యముని మదనుని అంధకుని దక్షయజ్ఞమును అంతమెందించినవాడు అగు పరమేశ్వరుని (లౌకిక వాక్కులతో స్తుతించి శరణువేడెను. ప్రకాశ మాన తృతీయ నేత్రముగల చంద్రమౌళియు మయుడు అభయమగు ముక్తిపదమును కోరి తను శరణువేడెనని గురుతించి అతని కభయ మభిమతముగా నిచ్చెను. దానవేంద్రుడగు మయుడును నిర్భయుడై యుండెను.